Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 49


    అది అలా జరగాలని వుంటే జరుగుతుంది. ఎవరూ ఆపలేరు. విధి నిర్ణయం అంటారు. సరీగా ఇప్పుడు అదే జరుగుతోంది.
    రావుగారు వెళ్ళేసరికి అంతపెద్దయింట్లో దామోదరం ఒక్కడే వున్నాడు.
    "పాతికవేలు తెచ్చావా?" ఏక వచనంలొ సంబోధిస్తూ అన్నాడు దామోదరం.
    ఆ విషయం గ్రహించాడు రావుగారు.
    "మర్యాద మరచిపోయినట్టున్నానే! చూడబోతే ఏరా! అని పిలిచేటట్టుకూడా వున్నావు దామోదరం!" అంటూ  వచ్చి అతని ఎదురుగుండా సోఫాలోవచ్చి కూర్చున్నాడు రావుగారు.
    "త్వరలో నీ అంతటివాడిని కాబోతున్నాను. పేరు పెట్టి పిలవటంలో తప్పేమివుంది." అన్నాడు దామోదరం.
    డైరెక్ట్ గా విషయంలోకివచ్చి సూటిగా అడిగాడు "ఆ ఫోటోలేవి?"
    "పాతికవేలూ తెచ్చావా?" దామోదరం అడిగాడు.
    "ఆడినమాట తప్పడం ఈ రావుకిలేవు. ఇవిగో పాతిక వేలు" అంటూ పేర్చిన నోట్ల కట్టలను చూపించాడు రావుగారు.
    "నువ్వేమీఅనుకోకు. ఒక్క ఫోటోనే తీసుకువచ్చాను. ఒకటి ఇవ్వాళ ఇస్తాను. రెండోది రేపు ఇస్తాను."
    "అలా ఎందుకు?" రావుగారు అడిగారు.
    "ఒకేసారి నీకు 50వేలు తీసుకురావటం కష్టమవుతుందని అన్నాడు దామోదరం.
    "ఇది చాలా మోసం, అన్యాయం" అన్నాడు రావుగారు.
    "హత్యచేసినదానికన్నా పెద్ద నేరమా!"
    కోపం పట్టలేక రావుగారు "నిన్నూ....నిన్నూ...." అని మిగతా మాట మింగేశారు.
    దామోదరం గలగలమంటూ నవ్వాడు. "నీలాంటి పెద్దవాళ్ళు అవసరం వచ్చినంతవరకే మాబోటివాళ్ళని వాడుకుని, ఆపై చంపిపారేస్తారు మీ అవసరం తీరాక అని తెలుసు నాకు. ఒకవేళ నువ్వే చంపే వుద్దేశ్యం పెట్టుకుని వచ్చావేమో! తొందరపడి అంతపనిచేయకు. లేనిపోనిది నీ కొడుకుతో పాటు నీకూ చావు వచ్చిపడుతుంది. నీకొడుకు ఏ జాగ్రత్తలూ తీసుకోక ఇరుక్కుపోయాడు. నీవు జాగ్రత్తలు తీసుకునే వచ్చి వుంటావు. అయినా లాభం లేదు. నేను ఎవరి చేతనన్నా చంపబడితే మరుక్షణం పోలీసులు తెలుసుకుని వచ్చేలా ఏర్పాటు చేసుకుని వచ్చాను." అని చెప్పాడు దామోదరం.
    "వీడి మొహానికితోడు పోలీసులుకూడానా! వెధవ బుకాయింపులు కూడానా మొహం చూస్తూంటే తెలిసిపోతూనే వుంది. నమ్మినట్లు నటించాలికాని, బయటపడిపోకూడదు." అని అనుకున్నారు రావుగారు.
    ఎవరి జాగ్రత్తలో వాళ్ళురావటం మంచిదే దామోదరం!" చాలా తేలికగా అన్నాడు.
    "ఫోటో తీసుకుని పాతిక వేలూ యిచ్చి వెళ్ళిపోవచ్చు." జేబులోంచి ఫోటోవున్న కవరు తీస్తూ అన్నాడు దామోదరం.
    రావుగారు బ్రీఫ్ కేస్ ను దామోదరం ముందుకు జరిపి కవరు అందుకున్నాడు. కవరులోంచి ఫోటోతీసి చూశాడు. ఆ ఫోటోలో వున్నది కిరణ్. కత్తితో ఒక అమ్మాయి డొక్కలో పొడుస్తూవుండగా తీసిన ఫోటో. కత్తితో పొడుస్తున్నది కిరణ్ అని చాలా చక్కగా తెలిసిపోతున్నది. ఫోటో చూపిన  తరువాత కిరణ్ ఇలా హత్యానేరంలో ఇరుక్కున్నందుకు తను ఎంత బాధపడుతున్నది కధలాగా చెబుతూ కూర్చున్నారు రావుగారు.
    అసలు విషయం కిరణ్ రాకకోసం చేస్తున్న ఆలస్యం ఇది.
    పది నిముషాలతరువాత కిరణ్ వచ్చాడు. సరాసరి లోపలికివచ్చి కూర్చున్నాడు.
    "ఇదేమిటి? నీ కొడుకువస్తాడని నాకు చెప్పలేదు కదా! అన్నాడు దామోదరం.
    "చెప్పలేదు లే! నా జాగ్రత్తలో నేను వచ్చాను. నీ జాగ్రత్తలొ నువ్వురాలేదూ! అలాగే ఇదికూడా. మా కిరణ్ ఫోటోలు చూసిన తరువాత మనం మాట్లాడుకుందాం!"
    "చూపించు, చూపించు. చాలా చక్కగా పడ్డాడులే ఈ ఫోటోల్లో" చాలా వ్యంగ్యంగా అన్నాడు దామోదరం.
    రావుగారు కవరులోనుండి ఫోటోతీసి కిరణ్ కి చూపించాడు.
    ఆ ఫోటోను చూసి కిరణ్ తెల్లబోయాడు. "ఇదేమిటి?" అన్నాడు.
    "బావుంది నాయనా! చాలా బాగుంది. ఇదేమిటో తెలియకుండానే చేశావా! ఆ చేతులో కత్తి, ఆ కోపంగా పొడుస్తున్నతీరు, ఆ పిల్లని కదలకుండా మరో చేత్తో నొక్కి పట్టి మరీ పొడుస్తున్నావ్. కలర్ ఫోటో అయినట్టయితే రక్తం రంగు ఇంకా బాగా కనపడేది." వెకిలిగా, వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు దామోదరం.
    "ఇది మోసం!" కిరణ్ అరిచినట్టే అన్నాడు.
    "అలా అనే నేనూ గ్రహించాను. "రావుగారు తాపీగా అన్నారు.
    తండ్రీ కొడుకులను చూస్తూంటే ఒళ్ళు మండింది దామోదరానికి. "నన్ను వెర్రివెధవని చేసి ఆడిద్దామనుకుంటున్నారా! ఏదీ ఆ ఫోటో ఇటివ్వు." కోపంగా అన్నాడు.
    "ఆ ఫోటో ఇవ్వకు!" గాంభీర్యంగా అన్నాడు రావుగారు.
    "అమ్మ నీ తెలివి తెల్లారా. అబ్బా కొడుకులు కలిసి మంచి తెలివిగా వ్యవహరిస్తున్నారే! ఈ హత్య ఫోటోలు కాదా మీరడిగింది! ఇంకో హత్య ఫోటోలా? ఇప్పటికి ఎన్ని హత్యలు చేశావు నాయనా? ఎన్నిచేస్తే ఏంలే, డబ్బులిచ్చి నిన్ను రక్షించే నీ తండ్రి వుండగా." దామోదరం వెకిలిగా నవ్వుతూ అన్నాడు.
    "నువ్వు చెప్పినట్టుగా నేనేమీ బోలెడు హత్యలుచేసిన హంతకుడిని కాదు." అన్నాడు కిరణ్ కోపంగా.
    "అవునులే! మూడు నాలుగుచేస్తే బోలెడు ఎట్లా అవుతాయి?"
    రావుగారు ఆ సంభాషణ వినిపించుకోవటంలేదు. మరో కొత్త ప్లాన్ ఆలోచిస్తున్నాడు చకచకా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS