చివుక్కు మంది ప్రనూష మనస్సు.
విసురుగా లాక్కుని గదిలోకి వెళ్లిపోయింది.
"అందులో చీర, మ్యాచింగ్ బ్లౌజూ ఉన్నాయ్. తమరు కొత్త చీర కట్టుకుని వస్తే, చూసి తరిస్తాం మేం..." అన్నాడు నాటకీయంగా,
"నేనేం కట్టుకోను..." అంది లోపల్నుండే ప్రనూష.
"పోనీ కట్టి పెట్టాలా...?" రొటీన్ గా కామెడీ జోక్స్ వెయ్యడం అలవాటైన శ్రీచరణ్ కొంటెగా అడిగాడు.
"మళ్ళీ మొదలా బూతు జోకులు...."
"రామ రామ ఈ మాత్రం జోకులో బూతుందా? నువ్వు నాకర్ధంకావే పల్నాటి ప్రనూషాంబా...."
"పేరు మార్చకు మండుద్ది నాకు..."
"ఎక్కడ మండుద్ది, అయినా ఇవాళ పుట్టిన బేబీకి పేరు వద్దా....పోనీచిన్నీ, పాన్నీ, చిట్టి, పొట్టి అని పలకనా....?" అన్నాడు వెక్కిరిస్తూ.
టేబుల్ మీదున్న అలారం పీసు చేతిలోకి తీసుకుని గురి చూపింది శ్రీచరణ్ వైపు పెట్టి.
"బాప్ రే....సారీ త్వరగా కట్టుకుని రా. టిఫిన్ తిందాం" అన్నాడు అక్కడినుండి వెళ్ళిపోతూ. అబ్బ! మళ్ళీ ఎప్పటి లా వుంది ఇల్లు.....అనుకుంటూ చీర మార్చుకోడానికి డోర్ మూసింది ప్రనూష.
* * *
ప్యాకెట్ విప్పడంతోనే ప్రనూష మనస్సు దోచేసుకుంది ఆ చీర. తెల్లని మైసూర్ సిల్క్ చీర మీద అక్కడక్కడ బుటాలుండి, ఆరెంజ్ కలర్ బోర్డర్ తో మెత్తగా, మృదువుగా ఉంది అందులోని చీర దానికి మ్యాచ్ అయ్యే రెడీమేడ్ బ్లౌజ్.
చీర కట్టుకోకుండా మరో ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయింది ప్రనూష.
ఆ చీర కట్టుకుని బ్లౌజ్ వేసుకుంది. కరెక్ట్ ఫిట్టింగ్ ఏమాత్రం లూజుగా లేకుండా!\
దేవుని పటం ముందుకు వెళ్ళి రెండు చేతులూ జోడించి దండంపెట్టుకుంది ప్రనూష.
ఎదురుగా వున్న పంచపాలులో వుండి అక్షింతలు చేతిలోకి తీసుకుంది.
శ్రీచరణ్ రూమ్ లోకి వెళ్ళింది.
అతని చేతిలో అక్షింతలు పెట్టి అనుకోకుండానే కాళ్ళకు నమస్కరించింది దీవించమన్నట్టు.
ముద్దుగా, బొద్దుగా కొత్త చీరలో మెరిసిపోతున్న ప్రనూషని అలాగే దగ్గరికి లాక్కుని నలిపెయ్యాలనిపించింది శ్రీచరణ్ కు.
కానీ దూరం..... తాళి కట్టిన భార్యే అయినా ముట్టుకోలేని దూరపుతనం.
ఏమని దీవించాలి ఈమెను.
భర్తగానా?
స్నేహితుడిగానా?
ఎలా? ఏమని?
అప్రయత్నంగా అనేశాడు "శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని.
చేతిలోని అక్షింతలు జారి పడ్డాయి ఆమె నెత్తిన. వాటితోపాటు అనుకోకుండా కళ్ళలోకి వచ్చిన రెండు కన్నీటి బొట్లు కూడా జారిపడ్డాయి.
బహుశా ఏ భర్తా తన భార్యనిలా దీవించి ఉండడేమో!
* * *
కృష్ణమూర్తి తన జాబ్ కు రిజైన్ చేస్తున్నట్టు చెప్పాడు. ఆఫీసుల్లోని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు.
శ్రీచరణ్ కృష్ణమూర్తిని పక్కకు పిలిచి అడిగాడు.
"జీతం బాగానే ఉందిగా....ఎందుకు రిజైన్ చేస్తున్నట్టు"
"ఎప్పుడూ ఒకే దగ్గర బేతాళుడు చెట్టును పట్టుకుని వేలాడితే ఏంటి లాభం.... నేనే స్వంతంగా ట్రావెలర్స్ ఓపెన్ చేద్దామనుకుంటున్నాను" చెప్పాడు తాపీగా కృష్ణమూర్తి.
"వాట్... స్వంతంగానా?" షాక్ తో అడిగాడు.
"అవును....చాలామంది కస్టమర్లతో పరిచయాలు పెంచుకున్నాను. అందరి అడ్రస్ లు నా దగ్గర ఉన్నాయి. ఇక్కడికి వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ లో ఓ పాతిక శాతం అట్రాక్ట్ చేయగలిగినా చాలు....నా బిజినెస్ బ్రహ్మాండంగా వుంటుంది. ఓ ఐడియా చెప్పమంటే చెబుతా....నువ్వు మరోలా అనుకోనంటే..."
"ఏంటది?"
"నువ్వూ నాతోపాటు వచ్చేయ్...ఇక్కడిచ్చేజీతం కన్నా....ఓ వెయ్యి ఎక్కువే ఇస్తావు. నీలో మంచి వర్త్ వుంది. కస్టమర్స్ ను ఆకర్షించగలవు. ఏమంటావు?" అడిగాడు కృష్ణమూర్తి.
"నేనా... రాను ఒకప్పుడు నాలో ఉన్న కొద్దిపాటి టాలెంట్ ని చూసి, ఎన్ని రికమెండేషన్ లు వచ్చినా, ఈ జాబ్ నాకే ఇచ్చాడు ఎం.డి. ఇప్పుడు నా టాలెంట్ పెరిగిపోవచ్చు. కానీ ఒకప్పుడు నన్ను గుర్తించి, నాకీ హోదా కల్పించిన ఈ ఆఫీసును వదిలి రాలేను. సారీ..." చెప్పాడు శ్రీచరణ్.
"బాగా ఆలోచించుకో (ఫ్రెండ్....అదృష్టం ఒకేసారి వస్తుంది. మళ్ళీ మళ్ళీరాదు."
"తెలివైనవాడు ఎప్పుడు పిలిచినా, అదృష్టం వచ్చినా, రాకపోయినా, అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎనీ హౌ కంగ్రాట్స్..." అన్నాడు మనస్పూర్తిగా శ్రీచరణ్.
* * *
మధ్యాహ్నం లంచ్ టైంలో క్యాంటీన్లో కలుసుకున్నారు శశికళ, శ్రీచరణ్.
"హలో బాసూ.....ఏమిటీ నీ చెన్నయ్ ట్రిప్ బాగా జరిగిందట. నీ వర్క్ కి మెచ్చి ఎం.డి పెల్ ఫోన్ (ప్రెజంట్ చేశాడట. కంగ్రాట్స్ పెల్ ఫోన్ కి ఎదిగావ్! మరికాస్త ఎదిగితే నాకు సూటవుతావు..." అంది శశికళ.
శ్రీచరణ్ కి వళ్ళు మండింది.
అయిన తమాయించుకున్నాడు.
"అన్నట్టు కృష్ణమూర్తి నీకు మంచి ఆఫర్ ఇస్తే కాదన్నమాట..."
"అది కమర్షియల్ గా మంచి ఆఫరే కావచ్చు. మోరల్ గా నా దృష్టిలో బ్యాడ్ ఆఫర్..."
"వాడ్డూ యూ మీన్."
"ఐ మీన్ వాట్ ఐసే."
"అంటే ఆ అవకాశాన్ని చేజేతులా వదిలివేసుకుంటావా?"
"వదిలేసుకోక....ఒకప్పుడు నువ్వు ఆదరించిన యం.డి.వి కాదని, ఇప్పుడు నాకు అవకాశాలు వచ్చాయని వెళ్ళిపోనా?" అడిగాడు శ్రీచరణ్ కోపంగా.
