Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 49

 

    "థాంక్యూ సర్.......కనీసం అనాలోచితంగా నయినా మీ ప్రియురాలికి మీ ఒడిలో కొన్ని క్షణాల పాటయినా చోటిచ్చారు.' సర్దుకుని కూర్చుంటూ అన్నదామె.
    అసలే విష్ణు మనసు కల్లోల సాగరంగా వుంటే డానికి తోడు కిరణ్మయి ప్రవర్తన మరింత విసుగేత్తిస్తున్నది.
    ప్రేమంటే ఏమిటో తనకు తెలుసు...
    ప్రేమ హృదయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేదీ తనకు తెలియనిది కాదు......ఆశించింది దక్కనప్పుడు ఏం చేయడానికయినా వెనుకాడని స్థిరమైన పట్టుదల వల్లవిస్తుంటుంది.
    తెలిసి తెలియని వయసులోనో, అమాయకత్యంలోనో కిరణ్మయి మనసు మునిగి వున్నది అనుకోవడానికి వీల్లేని పరిస్థితి మొండిపట్టుదల చూపించే ఆ పిల్ల నిజంగానే ప్రాణాలు తీసుకున్నా తీసుకోవచ్చు.......
    ఆమెను ఆ ప్రమాదం నుంచి కాపాడాలంటే తను ఒక్క మాట అంటే చాలు.....
    కానీ, ఎలా అనగలడు?
    మనస్పూర్తిగా ఎలా అనగలడు?
    ఇప్పటికే ఒకరిని ప్రేమించి , ఇంకొకరికి వలపులు రేపి.......చివరకు మరొకరి మెడలో తాళి కట్టి వాళ్ళకు మానసిక క్షోభను కలిగించడమే కాక తన జీవితాన్ని అశాంతి నిలయంగ చేసుకున్నాడు.
    తిరిగి మళ్ళీ అలాంటి పొరపాటు చేయడానికి అతని మనసాక్షి అంగీకరించలేదు!
    అలా అని ఊరుకుంటే కిరణ్మయి నిజంగా అన్నంత పని చేసినా చేస్తుంది.
    అందుకే ఒక నిర్ణయానికి వచ్చాడు విష్ణు.
    'కిరణ్మయి......నాకూ ఆలోచించుకోవడానికి వ్యవధి కావాలి.'
    అలాగయినా ఆమెను తాత్కాలికంగా ఆ ప్రయత్నం నుంచి ఆపాలని అతని ఉద్దేశం.....
    "చాలు మాస్టారూ......ఆ మాట చాలు....మీ పిలుపుకోసం రోజులే కాదు ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తుంటాను" ఆమె కళ్ళల్లో ఆనంద భాష్పాలు ముప్పిరిగొంటుండగా హటాత్తుగా విష్ణు చేతిని అందుకుని ముద్దు పెట్టుకుకుంది.
    విష్ణు శరీరం జల్లుమన్నది...
    హృదయం బాధతో విలవిల్లాడింది.
    చిరునవ్వుతో టాటా చెబుతున్నట్టు వెళ్లిపోయిందామె.
    అక్కడ నుంచయితే కిరణ్మయి వెళ్ళి పోగలిగింది కానీ విష్ణు ఆలోచనల నుంచి మాత్రం ఇంకా వెళ్ళిపోలేదు.
    ఆమె ప్రవర్తన అతనిని అమితంగా క్షోభకు గురిచేస్తున్నది.
    అలోచించి చివరకు, ఒక నిర్ణయానికికొచ్చాడతను.
    కానీ, ఆ క్షణంలో తను తీసుకున్న నిర్ణయమే తన జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నదని ఏ మాత్రం ఊహించగలిగినా అతను అలాంటి నిర్ణయం తీసుకునేవాడు కాదేమో?

                                                        *    *    *    *

    విష్ణు మనసు సంక్షుభితకాసారంలా వుండడం వల్లనేమో ఆరోజు రాత్రి అసలు నిద్రకు దూరమైపోయాడు.
    ఆ క్షణంలో కన్నతల్లె వుంటే అక్కున చేర్చుకుని ఊరడించేది.
    అత్మీయులయిన అక్కలు దగ్గర వుంటే సానుభూతితో స్పందించి హృదయ భారాన్ని తీర్చేవారు.....
    తనకు జన్మనిచ్చిన తల్లి వుండి కూడా లేనట్టు దూరమై పోయింది. రక్తం పంచుకు పుట్టిన అక్కలు ఇంతకాలం తాము పంచి ఇచ్చిన మమతానుబంధాలను మరచిపోయారు.
    చాలా కాలం తరువాత విష్ణు మనసులో పదే పదే తల్లి, అక్కలు మెదలడంతో వుండబట్టలేక తెలతెలవారుతుండగానే ఆగ్రహారానికి బయలుదేరాడు.
    అక్కడకు వెళ్ళిన తరువాత అసలు విషయం తెలుసుకుని తెల్లబోయాడు.'
    అతని తల్లి కానీ, అక్కలు కానీ అగ్రహారంలో అడుగు పెట్టనే లేదు.......వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు?
    వెళ్ళే ముందు తనతో ఆగ్రహారానికి వెళుతున్నామని చెప్పారు. మామ గోవిందయ్య కూడా అదే మాట చెప్పాడు.
    మరి అగ్రహారం చేరుకోలేదంటే ఏమనుకోవాలి? వాళ్ళు ఏమయినట్టు?
    ఊరికి ఎంత ఆత్రంగా వెళ్ళాడో అంత నిరాశగా తిరిగి వచ్చాడు విష్ణు.
    "షికార్లు తిరగడం అయిపోయిందా?"
    విష్ణు ఇంటిలో అడుగు పెట్టీ పెట్టడంతోనే గుమ్మంలోనే ఎదురయిన నందిని నోరు పారేసుకుంది.
    ఏమిటి నువ్వంటున్నది?" చిరాకు పడ్డాడు విష్ణు.
    "ఓహో.....దొరగారికి వివరంగా చెప్పలన్నమాట. విహరించి రావడం అయిందా అని అడుగుతున్నాను....." కోపంతో ఊగిపోతున్నదామె.
    "కన్నతల్లిని, రక్తం పంచుకు పుట్టిన అక్కలను చూడాలని వెళ్ళడం కూడా నేరమేనా?"
    నందిని అతని మాటలను మధ్యలోనే అడ్డుకున్నది.
    "ఆ విషయం వెళ్ళే ముందు చెప్పవచ్చుగా. చెబితే ఏం దోచిపెడతున్నారోనని అనుమానిస్తాననేగా?" ఎత్తిపొడిచిందామే.
    "నీ ఇష్టం వచ్చినట్టు అనుకో......"
    "అవునులే ......పాత పరిచయాలు వదులుకోలేక వెళ్ళానని చెప్పేటంత ధైర్యం వుంటే కదా?" ఆమె గొంతులో వ్యంగ్యం స్పష్టంగా ధ్వనిస్తున్నది.
    అతని కళ్ళలో ఎర్ర జీర ఏర్పడింది.
    "నా మనసు బాగోక బాధపడుతుంటే మధ్యలో నీ నస ఎంటి?" విసుక్కున్నాడు.
    'అవును, మనసు ఎందుకు బాగుంటుంది? బాగుండదు.....అందుకే మనశ్శాంతి కోసం మరొక వగలాడితో షికార్లు తిరిగి వస్తున్నారన్న మాట.'
    "ఏమిటి నువ్వు అంటున్నది?" కోపంతో అతని గొంతు స్థాయి పెరిగింది.
    "ఎందుకలా గొంతు చించుకుంటావు? ప్రియురాలితో తిరిగి వచ్చి తల్లిని చూసి వస్తున్నావని బొంకడానికి సిగ్గులేదూ....."
    ఆ మాటలతో విష్ణు సహనం పూర్తిగా నశించింది.
    "నందినీ......సిగ్గులేకుండా మట్టాడుతున్నది నువ్వు అసలు ఇప్పుడు ఏమయిందని ఇలా రాద్దాంతం చేస్తున్నావు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నా తల్లిని చూడడానికే వెళ్ళాను. ఛీ ఛీ ..రాను రాను సంస్కారం లేకుండా మాట్టాడుతున్నావు......"
    "మిస్టర్ విష్ణు.....సంస్కారాన్ని గురించి వల్లించేముందు తమరి శృంగార లీలలను గురించి తెలుసుకోండి........ఇంతకూ కిరణ్మయి అంటే ఎవరు?"
    వినకూడని మాట ........నందిని నోట రావడంతో విష్ణుకు క్షణ కాలం ఏమీ అర్ధం కాలేదు.
    "నాకు తెలుసు మిస్టర్....మీ స్టూడెంట్ అట కదా.......ఫరవాలేదు. గురుశిష్యులు కలిసి నాటకమాడుతున్నారన్నమాట. భేష్ .......ఇంట్లో కట్టుకున్న పెళ్ళాం వున్నా మరొకరు కావలసి వచ్చారన్న మాట.
    "షటప్...యూ బ్లడీ"
    "ఊ....అపెశావెం.....పూర్తీ చేయడానికి ధైర్యం చాలడం లేదా? మిస్టర్ నాకూ వచ్చు ఇంగ్లీషు.... ఇంగ్లీషులో నేనూ తిట్టగలను. తమ ఇద్దరి రాచలీలలను గురించి కాలేజీలో కోడై కూస్తున్న విషయం నా చెవి దాకా రాదని అనుకోవడం మీ భ్రమ. ఐ హెట్ దిస్ బ్లడీ నాన్సెన్స్......అందుకే నన్నమాట కాలేజీకి తమరు అంత శ్రద్ధగా వెళ్ళేది.'
    "స్టాపిట్ నందినీ.....అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మట్టాడుతున్నావు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS