38
పారిజాతానికి ఈ మధ్యకాలంలో వెంకట్రామయ్య మీదా అతని అసమర్థత మీదా కసి పెరిగి పోయింది. అందుకే అతనంటే అసహ్యం కూడా పెంచుకుంది. కూతురి పెళ్ళి విషయంలో అతనేమీ శ్రద్ధ తీసుకోవటం లేదని ఆమె బాధపడుతున్నది. దానికి తోడు అతను మోహన్ పెళ్ళి విషయంలో చేసిన కుతంత్రం ఆమె మనస్సుని గాయపరిచింది. అందుకే వాళ్లకి తెలియకుండా వాళ్ళ ఊహల్ని చిత్తు చేసింది. కానయితే ఆ విషయం వాళ్ళు తెలుసుకోలేకపోయారు.
ఎత్తు వేయటంలో, ఎదుటి వారిని చిత్తు చేయటంలో అఖండుడుగా పేరు తెచ్చుకున్న వెంకట్రామయ్య కూడా ఆమె ముందు ఓడిపోయాడు. అందుకే ఆమెకి సంతోషంగా వుంది. కానీ ఒకరిని దెబ్బతీయటం తన విజయం కాదు కదా! అది త్రుప్తిని ఇవ్వొచేమో కాని శాంతిని యివ్వలేదు.
వెంకట్రామయ్యకి ఈ మధ్య మనస్సు మనస్సులో వుండటం లేదు. కృష్ణవేణమ్మ చావు అతని చావుకి వచ్చినట్టుగా వుంది. ఉద్యోగం నుంచి ఉద్వాసన, కొడుక్కి జైలు శిక్ష, ఎలాగయినా కోడలవుతుందనుకున్న స్వప్న దాయాదుల కుర్రాడికి దత్తం కావటం అతనికి భరింపరాని అవమానంగా తయారైంది.
అయినా ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వుండిపోయాడు. అవకాశం కోసం కాచుకుని వున్నాడు.
ఓ రోజు హఠాత్తుగా రాత్రిపూట వచ్చాడు మోహన్. అధాటుగా చూస్తే ఎవరూ గుర్తించలేరతన్ని. జుత్తు పెంచేశాడు. వెనక్కి దువ్వేడు. గడ్డం పెంచాడు. నుదుటి మధ్య కానీ అంత బొట్టు పెట్టేడు, కాషాయ వస్త్రాలు కట్టేడు.
అర్దరాత్రిపూట తలుపుతట్టి, తలుపు తీయగానే లోపలికి దూసుకుంటూ వచ్చిన అతన్ని చూసి ఎవరో కాపాలికుడనుకున్నాడు. వెంటనే భయపడ్డాడు.
"భయపడకు!" గంభీరంగా అన్నాడు.
కానీ వెంకట్రామయ్య వణుకుతూనే వున్నాడు.
"నువ్వు దీనావస్థలో వున్నావు కదూ?"
"ఉహూఁ"
"నీ కొడుకు నీకు దూరమయ్యాడు కదూ?"
"లేదు!"
పకపక నవ్వేడు "మాకు చెప్పొద్దు. మాకు అన్నీ తెలుసు. ఓ కన్యని ఎత్తుకెళ్ళి బలవంతంగా పెళ్ళి చేసుకోబోతే అతన్ని జైలుకి పంపారు. అతనక్కడ నుంచి తప్పించుకున్నాడు. అది నీకు బాధగా వుంది. నీకూ ఆశ్రయం పోయింది కదూ?"
నివ్వెరపోయాడు వెంకట్రామయ్య "స్వామీ!" అంటూ సాష్టాంగ పడబోయాడు.
తడబడ్డాడు "ఆగాగు!" అన్నాడు. అతను __ మోహన్.
"లేదు బాలయోగీ! నువ్వు సామాన్యుడివి కావు. దైవాంశ సంభూతుడివి. భూత భవిష్యత్తులు తెలిసినవాడివి. నీకు అన్నీ కరతాలమలకం. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి కాస్త!" పూర్తిగా విధేయుడై పోయాడు వెంకట్రామయ్య.
గంభీరంగా తలూపేడు. "మేం చెప్పినట్లు చేస్తావా?"
"అయ్యో! అంతకంటేనా స్వామీ! మీ ఆజ్ఞ!"
"నాన్నా!"
ఈ హఠాత్సంభోదనకి ఆశ్చర్యపోయాడు వెంకట్రామయ్య.
"బాగా చూడు నాన్నా! నేను మోహన్ ని."
ఆనందపడ్డాడు. "నువ్వా!" గద్గదికంగా అన్నాడు.
"అవును! నేనే! జైలు నుంచి తప్పించుకున్న తర్వాత ఈ వేషంలో తిరుగుతున్నాను. ఇప్పుడు యింతకంటే సేఫ్టీ లేదు. నువ్వే నన్ను కనుక్కోలేకపోయావు చూడు!"
"అవున్రా! నిజమే!"
"నాన్నా! మనం స్వప్నని సాధించాలంటే యిదే మార్గం."
"ఎలారా? ఆ యిద్దరికీ పెళ్ళయి పోయింది!"
"బోడి పెళ్ళి! అయితే కానీ. స్వప్నతో వాడికి విడాకులు యిప్పిస్తా."
"దాని వలన లాభమేమిటో?"
"మళ్ళీ నేను పెళ్ళి చేసుకుంటాను."
"మళ్ళీ పెళ్ళినా?"
"అవును. తప్పేం? నేను చేసుకునేది దాని ఆస్తిని కానీ దాన్ని కాదు. ఆ విషయం గుర్తుంచుకుంటే నీకేం బాధగా వుండదు!"
వెంకట్రామయ్య మాటాళ్ళేదు.
"దానికి నేనో పద్ధతి ఆలోచించాను."
"ఏమిటది? నీ ఆలోచనలన్నీ మనల్ని దెబ్బతీసేవే!"
"ఉహూఁ ఇది మంచి ఆలోచన. నూటికి నూటిఇరవై పాళ్ళు ఫలిస్తుంది. స్వప్న పిరికిగా ప్రవర్తిస్తే ఆస్తి మనదవుతుంది!"
"అసంభవం. స్వప్న చాలా గట్టిది. ఆమె జంకు ఎరుగదు!"
"భయపెడితే తప్పక భయపడుతుంది."
"అదే ఎలాగా అని?"
"ఈ వేషంలో వెళతాను. జోస్యం చెబుతాను. ఫోన్ ద్వారా రవిపై గిట్టనివన్నీ చెబుతాను. చెప్పిస్తాను!"
"ప్చ్!" పెదవి విరిచాడు వెంకట్రామయ్య.
"ఏమొచ్చింది మళ్ళీ?" కరుగ్గా అన్నాడు మోహన్.
"ఆ అమ్మాయి యీ బెదిరింపులకి జంకదు!"
"జంకదా? అయితే నేరుగా షేర్ ఖాన్ వ్యవహారం.
