"అదేమిటమ్మా! ఇలాగే వెళ్ళిపోతావా ఏమిటి స్కూలుకి! యూనిఫాం వేసుకోవూ?"
చేతిని నోటికడ్డం పెట్టుకుని దుఃఖాన్ని ఆపుకుంది సీత. "సందడి నాన్నగారూ?"
అయన అనుమానంగా అన్నాడు.
"ఇవాళ స్కూలుకెళ్ళవా? డుమ్మానా?"
"ఇవాళ హాలిడే నాన్నగారూ!" అంది సీత వినీవినబడకుండా.
అది వినగానే తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు రమణమూర్తి. "ఓ! అలా చెప్పు! అయితే ఇవాళ స్కూలు లేదన్నమాట! అదా సంగతి!"
"రండి వెళ్దాం! అని ఆయన చెయ్యి పట్టుకుని టాక్సీ ఎక్కించింది సీత.
టాక్సీ డ్రైవరుకి ఇదంతా చిత్రంగా కనబడుతోంది.
"ఇక్కడనుంచి ఎక్కడికి వెళ్ళాలి అమ్మా?" అన్నాడతను సందేహంగా.
కొద్దిక్షణాలు ఆలోచించి చెప్పింది సీత.
"డాక్టర్ కర్ణి నర్సింగ్ హోం తెలుసా?"
"తెలుసు మేం సాబ్!"
"అక్కడికి పోనియ్!"
టాక్సీ కదులుతుంటే దిగులుగా అనుకుంది సీత.
ఎక్కడుంది అమ్మ! ఎక్కడున్నాడు తమ్ముడు! ఎక్కడుంది చెల్లెలు?!
ఏమైంది నాన్నగారికి?
12
అరవై ఏళ్ళకి పైనే ఉంటుంది డాక్టర్ నడ్కర్ణి వయసు. శాంతంగా చాలా ప్రశ్నలువేశాడు రమణమూర్తిని ఆయన. కొన్ని రకాల టెస్టులు చేశాడు.
తర్వాత సీతని పక్క గదిలోకితీసుకెళ్ళి చెప్పాడు.
"లుక్ యంగ్ లేడీ! సైకోసిస్ కేసు ఇది! చాలా జాగ్రత్తగా ట్రీట్ చెయ్యాలి. అశ్రద్ద చెయ్యకూడదు తెలిసిందా?"
సైకోసిస్....అంటే అది సీత ఆదుర్దాగా.
"మామూలు పరిభాషలో చెప్పాలంటే పిచ్చి అన్నమాట! మెంటల్ షాక్ తగిలింది ఆయనకు"
తలవంచుకొని కాసేపు మౌనంగా ఉండిపోయింది సీత. తర్వాత నిదానంగా అంది.
"డాక్టర్! ఫ్రాంక్ గా చెప్పండి! వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ రికవరీ?"
"టుటెల్ యూ ఫ్రాంక్ లీ, ది ఛాన్సెస్ ఆర్ ఫిఫ్టీ----ఫిఫ్టీ" అన్నాడు డాక్టర్ నడ్కర్ణీ.
"ప్లీజ్ డాక్టర్! ఆయనకీ బెస్ట్ ట్రీట్ మెంట్ అరేంజ్ చెయ్యండి. మనీ నో ప్రాబ్లెం! ఐ రిపీట్? నో ప్రాబ్లెం!" అంది సీత స్థిరంగా.
డాక్టర్ ఆదరంగా చిరునవ్వు నవ్వాడు.
"ఫిఫ్టీ పర్సెంట్ నా ప్రయత్నం ఉంటుంది. మిగతా ఫిఫ్టీ పర్సెంట్--వెల్--గాడ్ ఈజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ దట్"
"థాంక్స్ డాక్టర్!"
"యూ ఆర్ వెల్ కమ్!"
కదలబోతూ మళ్ళీ ఆగింది సీత.
"డాక్టర్!"
"చెప్పమ్మా!"
"నేను ఈ ఊరికి ఇవాళే వచ్చాను. ఇంకా ఎక్కడా సెటిల్ కాలేదు. మీరేమనుకోకపోతే...."
"సందేహించకు చెప్పు!"
"ఒకటి రెండు రోజులు ఆయన్ని ఇక్కడే నర్సింగ్ హోంలో ఉండనివ్వండి. నేను అరేంజ్ మెంట్స్ చేసుకున్నాక వచ్చి తీసుకువెళతాను" అంది సీత.
"నో ప్రాబ్లెం! అలాగే చెయ్యి!"
"థాంక్స్ వన్స్ ఎగెయిన్!" అని చెప్పి!, తండ్రి కంటబడకుండా, ద్వారంలోనుంచి బయటకువచ్చేసింది సీత.
టాక్సీ ఎక్కి మళ్ళీ అహల్య ఇంటికి వచ్చింది సీత.
కానీ అప్పటికే అంతా అయిపోయింది.
అక్కడ ఉన్నవాళ్ళు జరిగింది అంతా చెప్పారు. కరెంటు తీగలు అహల్యని తాకాయి. క్షణాల్లో పోయాయి ఆమె ప్రాణాలు. పోలీసులు వచ్చారు. శవాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.
స్థాణువులానిలబడిపోయి వింది సీత.
చాలా విచిత్రంగా ఉంది ఇది.
ఒక్కసారి తనని చూడాలని కలవరించిపోయింది అహల్య. చాలారోజులు ఆలోచించి చివరకు వెళ్ళాలని నిశ్చయించుకుంది తను.
ఆ నిశ్చయానికి వచ్చీరాకముందే బాంబేలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
దానితో తన ప్రయాణం ఆగిపోయింది.
మళ్ళీ కొద్దిరోజుల తర్వాత, అహల్యని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఫోన్ చేసి ఆమెకు అంతిమ దినాలని చెబితే, తనుబయలుదేరి వచ్చింది.
సరిగ్గా అహల్య గుమ్మంముందుకి రాగానే తనతండ్రి అడ్డం వచ్చి తన టాక్సీ కిందపడటం తను ఆయనతో వెళ్ళిపోవడం....
మళ్ళీ తను తిరిగి వచ్చేసరికి అహల్య మరణించడం!
అంటే, ఆమె తనని చూడకుండా, ఆ అసంతృప్తితో కళ్ళుమూయాలనే విధినిర్ణయమా? సాలోచనగా వెనుదిరిగింది సీత.
"ఎక్కడికి మేడం?" అన్నాడు టాక్సీ డ్రైవరు.
ఆలోచనల్లోంచి ఒక్కసారిగా బయటపడింది సీత. తర్వాత మెల్లిగా ఒక హోటల్ పేరు చెప్పింది.
చాలా పెద్ద హోటలు అది. దానిలో తనపేరు మీద ఒక రూము బుక్ చేసి ఉంటుందని తెలుసు సీతకి.
అది ఎవరు చేసి ఉంటారో కూడా తెలుసు ఆమెకు.
ఫైలట్ నారంగ్!
తను బాంబేనుంచి వచ్చిన ఫ్లయిట్ కి ఫైలట్ అతను.
అహల్యని ట్రీట్ చేస్తున్న డాక్టర్ తనకి ఫోన్ చేసి చెప్పేసరికి హైదరబాద్ ఫ్లయిట్ కి టైం అయిపోయింది. కానీ అర్జెంటుగా హైదరాబాద్ చేరుకోదలచుకుంది తను.
అందుకని రెండు మూడు ఫోన్ కాల్స్ చేసింది. ఆ ఫ్లయిట్ ని నడుపుతున్నది నారంగ్ అని తెలిసింది.
