Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 50

 

    "అమ్మా....." అంటూ కిందపడ్డ శ్రీచంద్ర నడ్డి పట్టుకున్నాడు పెద్ద కేకేసి.


    యమధర్మరాజు నుదురు కొట్టుకున్నాడు.


    ఈలోగా గరుడాచలం కొడుకు కేక విని ఆ గదివైపు పరుగెత్తుకొచ్చాడు.


    యమధర్మరాజు కోపంగా అక్కడనుంచి మాయమయ్యాడు.

 


                                                            * * *


    "ఏంట్రా.....అడ్డగాడిదా.....రాత్రే అనుకున్నా ...పొద్దున కూడా కలలు కంటూ కలవరిస్తున్న అక్కు పక్షి వెధవా....." కోపంగా అన్నాడు తండ్రి.


    శ్రీచంద్ర అంతకన్నా కోపంగా తండ్రివైపు చూసి ఆహా! ఇందాక చావు.....చావు....అన్నావు. ఇప్పుడేమో ఇలా మ్ట్లాడుతున్నావు. అయినా నా గురించి అసలేమనుకుంటున్నావు? నన్ను చావమంటవా? నేను బ్రతికితే దేశానికే నష్టమన్నంత బిల్డప్ ఇస్తావా? అసలు నువ్వు నా తండ్రివేనా? హవ్వ....హవ్వ.....కన్నకొడుకును చావమని చెప్పే తండ్రిని నిన్నే చూస్తున్నా......" కసిదీరా దులిపేశాడు తండ్రిని.


    "నిన్ను చావమని నేను అనడమేమిట్రా అపశకున పక్షి. పొద్దున్నే సారా, సాయంత్రం విస్కీ పుచ్చుకున్నావా పుచ్చువంకాయల మొహం నువ్వునూ...." మరింత కోపంగా అన్నాడు తండ్రి.


    "ఏంటి.....ఇందాక నువ్వు నా గదిలోకి వచ్చి చావు....చావు....అని నన్ను చంపుకు తిన్లేదు."


    "నేనా....జామచెట్టు కింద నా పీలూతో డ్యుయెట్లు పాడుకుంటుంటే" అని నాలుక్కర్చుకున్నాడు గరుడాచలం.


    "ఆ...ఆ....దొరికావు అమ్మ నా శృంగార తండ్రి......హవ్వ....హవ్వవ్వ.....ఈ వయసులో నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా? అది మిడ్డిలేసుకునే ఆంగ్లో-ఇండియన్...చెబుతా, ఇంటింటికి వెళ్లి చెబుతా.....కోడల్ని చూసి పెట్తి, నా పెళ్ళి చేసిపెట్టి, మనవల్ని ఎత్తుకుని పెట్టాల్సిన ఈ వయసులో నాకు 'బుల్లి అమ్మ' ను తెస్తావా? ఒసేయ్ అమ్మా...రావే...." గట్టిగా పిలిచాడు శ్రీచంద్ర.


    డంగయిపోయాడు గరుడాచలం.


    "ఒరే...అరవకురా.....మీ అమ్మ నోరు అసలే మొబైల్ మైక్. ఎక్కడ పడితే అక్కడ వాగి నా పరువు తీస్తుంది. నన్ను సాధించి చంపుకు తింటుందిరా.....అసలు నేను నీ గదిలోకి రాలేదురా....మీ అమ్మమీదొట్టు......మా అమ్మ మీదొట్టు" మొత్తుకున్నాడు గరుడాచలం.


    "మరి నా గదిలోకి వచ్చి నన్ను "చచ్చుము....చచ్చుము" అన్నదేవరబ్బా?"


    "నేను కాదంటే వినవేంట్రా....." మొత్తుకున్నాడు మరోసారి గరుడాచలం.


    "ఆఫ్ కోర్స్ కాకపోను వచ్చు. కానీ, నన్నేమిటి రోజు తిడతావు. నాకు ఉద్యోగం లేదు, నేను ఉద్యోగం సంపాదించుకోలేను, మరి నన్నేం చేయమంటావు? అడ్డమైన చోటల్లా నేను తిరిగితూనే వున్నాగా, నన్ను తిట్టి, తిట్టి నీ నోరు బావురు కప్పలా మారిపోయింది. అసలు కన్నకొడుకును నాన్ స్టాప్ గా ఇన్నేళ్ళుగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినందుకు నీ పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కించాలి....." కోపం చల్లారాక అన్నాడు.


    "అది సరేరా.....ఇప్పుడెం తిట్టలేదుగా.'


    "కానీ....ఆ ఆంగ్లో ఇండియన్ తో స్కూటర్ ఎక్కి వూరేగుతున్నావుగా,.....థూ.....నా యబ్బ....నా జీవితం.....నేను ఒక్క రోజయినా నా సమ్మీతో స్కూటరెక్కానా.....ఎట్ లిస్ట్ సైకిలేక్కానా? నువ్వు మాత్రం.....'


    "అబ్బ.....వదిలేయరా.....మీ అమ్మ వచ్చి విన్నా, మా అమ్మ వచ్చి విన్నా ....నన్ను 'రేవు' పెట్టి నా బతుకును బస్టాండ్ చేస్తారు."


    "ఓకె.....ఆ ఎర్ర ఆంగ్లో ఇండియన్ దొరసాని గురించి నేను చెప్పను.....మరి నాకేంటి?"


    బిత్తరపోయాడు గరుడాచలం.


    "రేపట్నుంచి నన్ను తిట్టకూడదు.....అంతేకాదు, వీధిలో పోయేవారిని కూడా.....'


    "అలాగే" అన్నాడు నీరసంగా.


    "నాకు నెలకు పాకెట్ మని కింద ఎట్ లిస్ట్ ఓ నూట యాభై అయినా ఇవ్వాలి. నాకు ఉద్యోగం దొరికే వరకే అనుకో."


    "ఆ...." అని నోరు తెరచి విధిలేక 'అలాగే'అన్నాడు.


    "నన్ను ఒక్క మాటన్నా....నేను ఏమి అనను, ఆ ఆంగ్లో ఇండియన్ పిన్నిని తీసుకొచ్చి అమ్మకు, బామ్మకు పరిచయం చేస్తాను."


    "అంతపని చేయోద్దురా....." అన్నాడు నీరసంగా గరుడాచలం.


    అలా గరుడాచలం తిట్ల పురాణానికి ఆ ఇంట్లో బ్రేక్ పడింది.


    
                                                           * * *


    
    లోకల్ టివీ స్టూడియోలో 'తలతిక్కల సమయం' అనే కార్యక్రమం షూటింగ్ మొదలయింది.


    సమీర వాళ్ళిచ్చిన కాస్టుమ్స్ వేసుకుని సెట్ లోకి వచ్చింది. అదిరిపోయేలా ఉందా డ్రెస్. తనలో తను అనుకుంది ఇలా.


    "అబ్బ! పుట్టినరోజులకి, పండుగలకి తప్ప కొత్త డ్రెస్ లు వేసుకొని తను, ఈ యాంకరింగ్ పుణ్యమా అని రోజుకో డ్రెస్ వేసుకునే ఛాన్స్ దొరుకుతోంది. అదొక్కటే రిలీఫ్. అతి ఖరీదైన కాస్టుమ్స్ రోజుకొకటి కొత్తది వేసుకోవచ్చు. నచ్చిన డిజైన్ నగలు పెట్టుకోవచ్చు. యాంకరింగ్ అందుకే మానలేకపోతోంది. పైగా ఎపిసోడ్ వైజ్ గా డబ్బులూ బాగానే వస్తున్నాయి. గ్లామర్ కి గ్లామరూ, ఎలాగూ చందూతో పెళ్లయ్యాక మానేయ్యక తప్పదు. ఈలోగా విలయినన్ని కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేసి పారేయాలి....." అనుకుంది తన్మయంగా.


    షాట్ రెడి అని పిలిచారు. ఇంతలో అదో వెరైటి ప్రోగ్రామ్. థిల్లింగ్ గా ఉంది సమీరకు.

 

                                                                 * * *


    "గురూ....." గట్టిగా అరిచాడు సత్తిపండు.


    వీపు మీద చరచుకుని "ఒరే పోట్టిలాగూ....నీకెన్ని సార్లు చెప్పాలి....అలా గట్టిగా అరిస్తే పీకపిసికి చంపేస్తా" అన్నాడు వార్నింగ్ యిష్యు చేస్తూ శ్రీచంద్ర.


    "రెండు చేతుల్తోనా? ఒంటిచేత్తోనా? గురూ" డౌట్ గా అడిగాడు సత్తిపండు.


    సీరియస్ గా సత్తిపండు వైపు చూసి, "నేను నీకేం ద్రోహం చేశానని నన్నిలా చంపుకు తింటున్నావ్రా...." అన్నడు ఏడుపు గొంతుతో శ్రీచంద్ర.


    "అది కాదు గురూ.....ఎదురుగా టెలిఫోన్ బూత్ దగ్గర క్యూ' చేంతాడంత వుంది.....నీకా విషయం చెబుదామని అరిచానంతే....."


    ఎదురుగా వున్న టెలిఫోన్ బూత్ వైపు చూసాడు శ్రీచంద్ర. సత్తిపండు చెప్పిందాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు.


    వెంటనే ఆ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్లి క్యూ' లో ఉన్న ఓ శాల్తిని "బాబూ....ఈ క్యూ ఏంటి?" అని అడిగాడు.


    ఎగాదిగా శ్రీచంద్ర వైపోసారి లుక్కేసి "అంత అవసరమా?" అన్నట్టు చూసి, 'ఆ' టీవిలో తలతిక్కల సమయం అనే ప్రోగ్రామ్ వస్తుంది ఇప్పుడు డైరెక్టుగా యాంకర్ తో మాట్లాడొచ్చు...భలే కసక్కు ప్రోగ్రామ్ అట......"అన్నాడు శాల్తి.


    గుండెలో కత్తి గుచ్చుకున్న సెన్సేషన్ కలిగింది శ్రీచంద్రకు. ఎందుకంటె ఆ ప్రోగ్రామ్ కి యాంకర్

 సమీర.


    "తప్పు బాబూ....అలా అనకూడదు. ఆ యాంకర్ నీకు చెల్లెలులాంటిది" శ్రీచంద్ర అన్నాడు ఆ శాల్తితో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS