Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 49

 

    "ఓహొ....తమరి ఆఖరి కోరిక ఏమిటో సెలవిస్తే....తలతిక్కగా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామనా?"


    "అదేం కాదులే"


    'అయితే చెప్పు"


    "ప్యారడైజ్ హొటల్ లో ఆఖరిసారి చికెన్ బిర్యాని తినాలని ఉంది.' అన్నాడు పెదవులు తడుపుకుంటూ.


    "మా నాయనే. అక్కడనుంచి తెచ్చేలోగా తమరు ఏదో ఒక పధకం వేసి చెక్కేయ్యారు. అదేం కుదర్దు. చావాల్సిందే."


    "చీ....కొడుకు ఆఖరి కోరిక కూడా తీర్చలేని నువ్వు ఓ తండ్రివేనా? సరే ఏం చేస్తాం. తమరిక దయచేస్తే ఉరేసుకునే ప్రోగ్రాం పెట్టుకుంటాను" అంటూ తాడును తన మెడలో చుట్టబెట్టుకోసాగాడు.


    తండ్రి రూపంలో ఉన్న యమధర్మరాజు గర్వంగా నవ్వుకుంటూ బయటకు నడిచాడు. తలుపులు వాటంతటవే ముసుకున్నాయి.


    యమధర్మరాజు తన ఒరిజినల్ రూపంలోకి వచ్చేశాడు.


    అదే సమయంలో గరుడాచలం పెరట్లో చెట్టు కింద మంచం మీద పడుకుని పీలూ గురించి ఆలోచిస్తూ రకరకాల కలలు గ్రాఫిక్స్ లో కంటున్నాడు విత్ డిటి.ఎస్ తో.


                                                            * * *


    "అమ్మ నీ తియ్యని దెబ్బ" అని పీలూ శ్రీదేవి స్టెప్పులు వేస్తున్నట్టు......తను చిరంజీవి గెటప్ లో వున్నట్టు.


    సీన్ మారి....


    "పాలపిట్టరో పైట పట్టరో" అని పీలూ పాటందుకుంటే తను నాగార్జున అయినట్టు.


    ఇలా తన కిష్టమైన హిట్ సాంగ్స్ లోని హీరోలను తనుగా, హీరోయిన్లను పీలుగా ఉహించుకుంటున్నాడు.


                                                            * * *


    శ్రీచంద్రకు ఉక్రోషంగా వుంది.


    చీ...చీ....తండ్రి తననన్ని మాటలన్నాక బ్రతకడమెందుకు? చస్తే పీడ విరగడవుతుంది" అనుకున్నాడు తనలో తను.


    యమధర్మరాజు కిటికీలోంచి లోపలికి తొంగి చూస్తున్నాడు. తాడును తన మెడకు చుట్టుకున్నాడు శ్రీచంద్ర.


    గది మూలనున్న స్టూలును గది మధ్యకు లాగాడు. స్టూలు పైకి ఎక్కాడు శ్రీచంద్ర.


    తాడు కొనని సీలింగ్ ప్యాన్ వైపు విసిరి బిగించాడు.


    కళ్ళు మూసుకున్నాడు.


    "సమ్మీ....ఊర్కే గన్నాయ్ గాడిని చేసుకుంటా. గొట్టం గాడ్ని చేసుకుంటా అనేదానివి. ఎక్కడ వున్నా ఏమైనా నీ సుఖమే నేను కోరుకునేది. హాయిగా ఏ గన్నాయ్ గాడినో, గొట్టం గాడినో చేసుకో" మనసులో అనుకున్నాడు.


    తర్వాత సత్తిపండు గుర్తొచ్చాడు.


    "ఒరే పోట్టిలాగూ.....జాగ్రత్తరా అసలే అమాయక ప్రాణివి. రామేశ్వారిని పెళ్ళి చేసుకుని హాయిగా వుండు" స్టులును తన్నేయాడానికి సిద్దంగా ఉన్నాడు.


    తల్లి గుర్తొచ్చింది.


    అవును. తల్లికి తను చనిపోతానన్న విషయం చెప్పాలి. 'నీ మొగుడు నన్ను ఎన్ని మాటలన్నాడనుకున్నావు అని వున్నవి లేనివి అమ్మకు చెప్పాలి. అప్పుడు గానీ తండ్రిని తల్లి సాధించదు. దేవుడా ఇలాంటి నీచ నికృష్ట తండ్రి నాకొద్దు' అనుకున్నాడు.


    బామ్మ గుర్తొచ్చింది.


    "ఒసే ముసలి. జాగ్రత్తే. సెక్స్ నవలలు ఎక్కువగా చదవకే. అసలే వయసులో ఎమోషన్స్ తట్టుకోలేక గుండాగి చస్తావే" అనుకున్నాడు.


    యమధర్మరాజు అసహనంగా చూస్తున్నాడు.


    "వన్....టూ....త్రీ....తను కుర్చీ తన్నాలి......తన్నాలి...."


    "కుర్చీని తన్నేస్తావా కుమారా" ఎక్కడినుంచో మాటలు వచ్చి శ్రీచంద్ర చెవిని చెరాయి.


    "ఏంటి ......చచ్చేముందు ఏవో మాటలు వినిపిస్తున్నాయి. పైగా నన్ను 'కుమారా' అని అంటున్నారు నా 'అబ్బ' అయితే 'గాడిద కొడకా' అనాలే....' ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు శ్రీచంద్ర.


    'కుమారా.....కుర్సిని తన్నేస్తావా?" మళ్ళీ వినిపించాయి మాటలు.


    "ఏంటో ...ఆడియో తప్ప , విడియో కనబడటం లేదు. తనకు చావు ఘడియలు దగ్గరపడ్డాయా?" అనుకున్నాడు.


    "నా మాటలు వినపడుతున్నాయా కుమారా?"


    "వినపడుతున్నాయి కానీ తమరే కనపడుట లేదు తండ్రి.....తమరెవరు? కొంపదీసి స్టూలు తన్నకుండానే నేను బాల్చి తన్నేశానా? నేను స్వర్గంలో వున్నానా? ఇదేంటి ఈ గది నా 'గది' లానే వుంది.


    "నువ్వు మరణించలేదు కుమారా.....నిండు నూరేళ్ళు నవ్వుతూ బ్రతుకుతావు."


    'అలాగా....మరి మా 'అబ్బే' మిటి....ఎప్పుడూ లేనిది 'చావు....చావు' అని వెంటపడ్డాడు.


    "నిన్ను చావమని ఎవరో అన్నారని చస్తావా? అయినా , నీ తండ్రి ఎవరో ప్రౌడతో చిన్నెలు, వన్నెలు పోవుచున్నడుగా....."


    "అవునవును, నన్ను చావమంటాడా? మరిచేపోయాను కొత్త తండ్రి......చచ్చేలోగా నా తండ్రి పీచమడిచి మరీ చస్తాను. హమ్మా....నన్ను....ఎన్ని మాటలన్నాడు కొత్త తండ్రి. "హమ్మయ్యా...చావు.....చావు....చావమని హిప్నటైజ్ చేశాడు నా దొంగ తండ్రి" కోపంగా అన్నాడు శ్రీచంద్ర.


    "అవునవును. సత్యంగా అతడు నీ దొంగ తండ్రే"


    "నిజమా?"


    "నిజమో...అబద్దమో.....ముందు నీ తండ్రిని నిలదియుడు."


    "థాంక్యూ.....కొత్త తండ్రి...." అన్నాడు శ్రీచంద్ర.


    ఆ తర్వాత మాటలు వినిపించడం ఆగిపోయాయి.


    "తండ్రి.....నా మేలుకోరే కొత్త తండ్రి.....పలకవేమయ్యా.'


    నో రెస్పాన్స్.


    కళ్ళు తెరిచాడు శ్రీచంద్ర. "ఇదేమిటి ఇప్పటిదాకా నేను బాగానే మాట్లాడను, ఇంతలో.....మాటలు వినిపించడం లేదేంటి?" అనుకున్నాడు.


    యమధర్మారాజుకు అసహనం క్షణక్షణనికి పెరిగిపోతోంది. ఇక ఆగలేక, తీక్షణంగా స్టూలు వైపు చూశాడు. పెద్దగాలి వీచింది. స్టూలు అటు,ఇటూ వూగుతోంది. శ్రీచంద్ర భయపడిపోయాడు.


    స్టూలు కిందపడిపోయింది.


    శ్రీచంద్ర 'చచ్చాన్రో" అనుకున్నాడు.


    కానీ--


    అదే సమయంలో సేలింగ్ ప్యాన్ కు వున్న తాడు 'ఫట్' మని....ఎవరో కోసినట్టు తెగిపడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS