"ఏంలేదు బాబూ! అన్నయ్యకు తెలీకుండా రేపు మనూర్లో కట్టే ఆస్పత్రి కాంట్రాక్టు బినామి పేరుమీద నాకు ఇప్పిస్తే...." అన్నాడు నసుగుతూ.
సుందరం కాసేపు మౌనంగా వున్నాడు. గ్లాసులో వున్న బ్రాందిని రెండు గుక్కల్లో తాగేశాడు.
* * * *
సురేంద్ర కులిలందరికి డబ్బులు పంచాడు. కులిలంతా పొలంగట్టు మీద పాటలు పాడుకుంటూ బారులుతీరి వెళుతున్నారు.
"బాబాయ్! నేను ఇంటికెళుతున్నా....వస్తానన్నావుగా మామయ్యని చూడటానికి" అన్నాడు సురేంద్ర.
"వస్తున్నా బాబు. రెండు నిమిషాలు" అంటూ తన పొలంలో ఎవరితోనో మాట్లాడుతూ వున్నాడు.
సురేంద్ర ఎడ్లను బండికి కట్టి, తోటలో కోసిన జామకాయల్ని గంపల్లో ఎత్తి బండిలో పెట్టాడు.
ఇంతలో బసవయ్య అక్కడికి వచ్చి.....
"పోదామా సురేంద్ర" అన్నాడు.
"పద బాబాయ్! బండెక్కు" అన్నాడు.
ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ బండిలో బయల్దేరారు.
"ఎలా వుందిరా అబ్బాయ్ నీ కాపురం?" అన్నాడు బసవయ్య.
"ఎలా వుంటుంది బాబాయ్! కాపురం లాగానే వుంది" అన్నాడు.
"అదేంట్రా! అప్పుడే అంత వైరాగ్యమా? ఏంది, మా అమ్మాయి నెల తప్పిందా?' అన్నాడు.
"నెలేమో తెలిదు గానీ బాబాయ్, మాట తప్పింది...." అన్నాడు సురేంద్ర.
"మాట తప్పిందా? అదేంట్రా విచిత్రంగా మాట్లాడుతున్నవే......నీయన్ని మీ నాన్న బుద్దులే....ఆయనా ఇంతే. ఏది తిన్నగా చెప్పేవాడు కాదు, ప్రతిదానికి చమత్కారమే.
"పసుపుకొమ్ము ధర ఎట్టా వుంది బాబాయ్ ఈ ఏడాది? నీ పొలంలో పసుపు వేశావుగా" అన్నాడు సురేంద్ర.
"అదే ధర.....పొద్దుటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకుంటూ పని చేత్తాం. పడ్డ శ్రమకు తగిన ఫలితం దక్కట్లేదు...." అన్నాడు బసవయ్య.
"ఏం చేస్తాం బాబాయ్! మట్టిని నమ్ముకున్నాం. ఆ భూదేవి కనికరిస్తేనే కదా మన బతుకులు చల్లగా వుండేది" అన్నాడు సురేంద్ర.
"భూదేవి కనికరిత్తానే వుందిరా! లక్ష్మిదేవి కనికరించటంలేదు...." అన్నాడు చుట్ట తీసి వెలిగించుకుంటు.
"లక్షి దేవి కనికరిచాలంటే ఒక్కటే మార్గం బాబాయ్" అన్నాడు సురేంద్ర.
"ఏంటో అది?" అడిగాడు బసవయ్య ఆత్రుతగా.
"ఏం లేదు బాబాయ్! పొలం అమ్మేసి, ఆ డబ్బును బ్యాంకులో జయ చేసుకోవడమే. ఇక అప్పుడు లక్షి దేవి నీ దగ్గరే వుండిపోద్ది" అన్నాడు సురేంద్ర నవ్వుతూ.
"ఓరినీదుంపతెగ....అంటే నా పొలం కూడా కొనాలనే! ఇప్పటికే అటుపక్క, ఇటుపక్క పొలాలు మీరే కొన్నారు. ఇక నా పొలం మీద పడిందా నీ చూపు?" అన్నాడు నవ్వుతూ బసవయ్య.
"ఛా....అలా అని నేనన్నానా బాబాయ్! నువ్వు శ్రమపడకుండా లక్ష్మిదేవి నీ దగ్గరే వుండే మార్గం చెప్పాను అంతే" అన్నాడు సురేంద్ర నవ్వుతూ.
"నేను చెప్పానుకదరా నివన్ని నీ అయ్య బుద్దులే అని" అన్నాడు బసవయ్య నవ్వుతూ.
26
కరణం సుందరం వేపు ఆశగా చూస్తున్నాడు ఏం చెపుతాడా అని.
వరాలు కూడా ఆశ్చర్యంగా చూస్తోంది. కరణం ఆశకు అంతుండదనే విషయం వరాలుకు తెలుసు. ఇప్పుడు సుందరం బాబుని సర్వనాశనం చేయటానికే పూనుకున్నట్లున్నాడు. ఈ బాబు ఏం సేపుతాడో....అని ఆమె మనసు పరిపరివిధాల ఆలోచిస్తోంది.
సుందరం జేబులోనుంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. కరణం గబగబా అగ్గిపెట్టెతీసి వెలిగించాడు. సుందరం అతనివేపు నిశితంగా చూసి అన్నాడు.
"ఏమన్నారు?"
కరణం మళ్ళీ చెప్పాడు.
క్"ఆ ఆస్పత్రి భవనం కాంట్రాక్టు అన్నయ్యకు తెలీకుండా నాకిపిస్తే....."
అంతే ....క్షణాల్లో అతనికి నక్షత్రాలు కనిపించాయి. ఏం జరిగిందో అర్ధంకాలేదు, సుందరం అతని చెంప పగిలేలా కొట్టాడు.
"రాస్కెల్! నువ్వింత దుర్మార్గుడివని తెలిదురా. అన్నయ్య నీకు ఏం ద్రోహం చేశాడని ఆ విధంగా ఆలోచిస్తున్నావు? అసలు ఆ పనికి నేను ఎలా ఒప్పుకుంటానని అనుకున్నవురా? లే ఇక్కడ్నుంచి .....అసలు నేను ఇక్కడ వున్నానని తెలిసి నువ్వు రావటమే నీచం. నేనే నీచమైన పని చేస్తున్నాను. నేను చేస్తుంది తప్పని నాకు తెలుసు. కానీ ఏం చేయను. దీనిని చూడకుండా వుండలేకపోతున్నాను. నేను ఒక వ్యక్తిని ప్రేమించానంటే , దానికోసం ఏమైనా చేయటానికి సిద్దపడతాను. అలాగే ద్వేషించానంటే వాడి అంతు చూస్తాను" అన్నాడు సీరియస్ గా.
"ఓహో....మేమేనా గాజులు తొడుక్కుంది. నీ బండారం అంతా బయటపెడతాను. నువ్వు దీని దగ్గరకు వస్తూ ఎంతెంత తగలేస్తుంది నీ అన్నయ్యకు చెపుతాను" అన్నాడు.
"ఏమండీ....వద్దండి, ఇక్కడ అల్లరి చేయకండి కరణంగారూ మీకు దణ్ణం పెడతాను. ఆయన్ని అల్లరి చేయకండి" అని ప్రాధేయపడింది వరాలు.
"ఏంటే అయన?! ఓహో వ్యవహారం అంతదూరం వచ్చిందన్నమాట...." అన్నాడు.
"అరేయ్ కరణం ....నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపోరా. నీ ప్రాణం తీస్తాను......ఇంకా ఎక్కువ మాట్లాడితే....." అన్నాడు ఆవేశంతో ఉగిపోతూ సుందరం.
