అతని కళ్ళల్లో అంతులేని ఆవేదన. దాన్ని బయటికి రానీయకుండా బిగబట్టినట్లు గొంతు క్రింద పడుతున్న గుటక సూచిస్తోంది.
ఆమె వెంటనే తగ్గి "నవీన్.... ఎలా వుంది?" అనడిగింది.
అతను పెదవి విరిచి ఏమీ చెప్పలేనట్లు చూశాడు.
ఆమె అయోమయంగా అతని భుజంమీద చెయ్యివేసి "భయపడకు. భగవంతుని నమ్ముకో, మంచే జరుగుతుంది" అంది.
"నో.....! భగవంతుడు ఏమీ చేయలేడు!" ఆవేశంగా అన్నాడు నవీన్. "డబ్బు... డబ్బు ఒకటే మనుషుల ప్రాణాలు తీయగలదూ, పొయ్యగలదూ."
ఆమె చాలా ఆశ్చర్యంగా నవీన్ ని చూడసాగింది. ఆమె యీ మధ్యలో అతన్ని అంత ఆవేశంగా చూడలేదు.
"నా దగ్గరే ఓ పాతికవేలున్నట్లయితే అమ్మ ప్రాణం నిలబడుతుంది. భగవంతుడు తన దయ ప్రసరించడానికి సిద్దమవుతాడు. కానీ లేవు....అందుకే ఆవిడ క్షణం క్షణం నరకం అనుభావిస్తూ కూడా మౌనంగానే ఆ బాధని భరిస్తూ నా నుండి వీడ్కోలు తీసుకుంటుంటే చేతులు కట్టుకుని నిలబడ్డాను. ఎంత చేతకాని కొడుకుని ధృతీ! డబ్బులేనివాళ్ళకి పాశాలూ, బంధాలూ, అనుబంధాలూ ఎందుకూ? ప్రేమ ప్రాణం పొయ్యలేదు. ఆప్యాయత అన్నం పెట్టలేదు. డబ్బు వాటిని చేయగలదు కాబట్టి డబ్బున్నవాళ్ళకే దేవుడు ప్రేమలూ, పాశాలూ పెట్టాలి. లేనివాడిని బండరాయిలా సృష్టించాలి."
"నవీన్..."
"ధృతీ! విను డబ్బుకంటే ఆప్యాయతలే ఎక్కువని నువ్వు నమ్మిన సిద్దాంతంలో అర్ధం లేదు. డబ్బులేనినాడు ఎందుకు ఆ పనికిరాని ఆప్యాయతలు? నీ దగ్గర డబ్బు లేదని తెలిసిననాడు కేవలం ఆప్యాయత, అనురాగాల కోసం ఎవరూ నీ దగ్గరికి రారు. అది దొరికే చోటికే పోతారు. అందులో వారి తప్పు లేదు. ఎందుకంటే ప్రతివాడూ బ్రతకాలిగా! బ్రతకాలంటే డబ్బు కావాలిగా?"
ఆమె అతని పరిస్థితి అర్ధం చేసుకుంటున్నట్లు నిశ్శబ్దంగా అతనికేసి చూస్తూ నిలబడింది.
దయామణికి ఆపరేషన్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని డాక్టరు చెప్పినట్లు ఆమెకి అర్ధమైంది. ఏం చేస్తే అంత డబ్బు సమకూరుతుంది? నవీన్ ఎక్కడినుండి తేగలడు?
* * *
"బుద్ది బూరెలు తినమంటే, రాత గాడిదలు కాస్తానందట."
సుభద్ర గొంతు హెచ్చుస్థాయిలో మార్మోగుతోంది. "అంతటి శ్రీమంతులు తమంతట తాము వచ్చి అందలం ఎక్కమంటుంటే అందిపుచ్చుకోలేక బొక్కబోర్లా పడ్డట్టూ..."
ఆమె ధోరణి అవిశ్రాంతిగా సాగుతూనే వుంది.
"పిల్లవాడు యిష్టపడ్డాడు కాబట్టి కానీ, లేకపోతే ఆవిడకేం ఖర్మ మనబోటి వాళ్ళ యిళ్ళకి రావడానికి? ఆ రోజు పార్టీలో అందరి ముందు వాడి భుజం పట్టుకుని నలుగురిలో నవ్వులపాలు చేశావు. ఈ రోజు ఆవిడ ముందే వాడి పేరు వినగానే నాగస్వరం విన్న నాగుపాములా పరుగుతీశావు. అవ్వ! ఎవరైనా వింటే నవ్విపోతారు. మన కులమా? మతమా? కనీసం ఓ మంచి ఉద్యోగమా? ఏం చూసి వెంటపడుతున్నావే?"
వాదనాపటిమా లేనిచోట నుండే హేళన ప్రారంభమవుతుంది.
ధృతికి కొంతవరకూ పరిస్థితి అర్ధమైంది. గాయత్రీదేవి వూరికే రాలేదు. తన తల్లిదండ్రులతో పెళ్ళి విషయం మాట్లాడటానికే వచ్చింది. ఆమెకి అర్ధంకానిదల్లా ఇందులో తన ప్రమేయం ఏమీ లేనట్లు వాళ్ళల్లో వాళ్ళే నిర్ణయాలు తీసుకోవడమేమిటి? ఒక్కరు కూడా "నీకిష్టమేనా" అని అడగరేం?
ఆమెకి ధర్మానందరావుగారు జ్ఞాపకం వచ్చారు. దీని వెనక ఆయన హస్తం వున్నట్లు ఆమెకి అనిపించింది. తనవారు తనని తన ఆశయాల మార్గం నుండి తప్పించేసి, ఆయన బాటలోకి నడిపించేటట్లు ఆయన అద్భుతంగా పథకం వేశారు. డబ్బుయొక్క మహిమ చూపించి, తనని మత్తులో పడెయ్యలేక తన వాళ్ళని ఈ జాలంలోకి లాగేశాడు. ప్రేమ్ ని తను పెళ్ళి చేసుకుంటే ఆయనకేమీ ఒరిగేది లేదు. కానీ అలా కానిపక్షంలో తను తన వాళ్ళకి దూరమవుతుంది. అది చాలు ఆయనకీ తన విజయం చాటుకోవడానికి.
ఆమె ఆ రాత్రి చాలాసేపు ఆలోచించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది.
* * *
"హలో! ఏమిటి ఇంత ప్రొద్దుటే దయ కలిగిందీ?" నవ్వుతూ అడిగాడు ప్రేమ్.
ధృతి అతనికేసి కాస్త తీవ్రంగా చూస్తూ "మీతో మాట్లాడాలి, ఓసారి ఔట్ హౌస్ లోకి రండి" అని చెప్పి వచ్చేసింది.
ప్రేమ్ తో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ఆమె ఒకటి రెండుసార్లు మననం చేసుకుని సిద్దమైంది.
కాస్సేపట్లో ప్రేమ్ వచ్చాడు. చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. "ఊ! చెప్పు!" అన్నాఉ స్టూల్ మీద కూర్చుంటూ.
ఆమె గొంతు సవరించుకుని "నవీన్ కీ, నాకూ వున్న అనుబంధం మీకు తెలుసనుకుంటాను" అంది.
అతను చాలా మామూలుగా "ఆ...నువ్వు మొదటిసారి పరిచయం చేసినప్పుడే చాలా ఆప్తుడని చెప్పావుగా! ఔనూ అతను ఆరోజు పార్టీలోంచి వెళ్ళిపోయాక మళ్ళీ కనిపించలేదు. ఉద్యోగం మానుకున్నాడా?" అన్నాడు.
అతని ప్రశ్నకి జవాబుగా "లేదు, అతని తల్లికి సీరియస్ గా వుంది పాపం! ఆపరేషన్ అవసరం కానీ...." ఆగిపోయింది.
"కానీ?"
"పాతికవేలదాకా ఖర్చవుతుంది. మాబోటివాళ్ళం ఎక్కడినుండి తేగలము..." నిరాశగా అంది.
"ఆపరేషన్ చెయ్యకపోతే ప్రాణానికే ప్రమాదం కాదా?"
"ఔను! అయితే ఏం చేయగలం?"
"మరి నవీన్ ఏమంటున్నాడు?"
ఆమె కాస్త చిరాగ్గా "ఏమంటాడూ....బాధపడుతున్నాడు..." అంది.
