"శారద -ఒక్కమాట విను. నేనొక నిర్ణయానికొచ్చాను - నాకు అన్నయ్యలు, అక్కయ్యలు ఇచ్చే సలహాలతో పనిలేదు - నా యిష్టంనాది - ఒకడి డబ్బు నేను ఆశించనపుడు, నేను ఎవడిని చూసి భయపడాలీ - శ్రద్దగావిను. నీ అక్కలకీ, అన్నలకీ అందరికీ కూడా చెప్పు - నన్నెవరూ దగ్గర పెట్టుకోవద్దు - నేను ఈ ఇంట్లోనేవుంటా. ఇక్కడే పోతా - నన్ను, నన్ను ఈ వెంకడు చూస్తాడు. ఈ వెంకడే నన్ను దహనం చేస్తాడూ. ఈ ఇల్లు వాడికే రాస్తాను. కన్నవాళ్ళే పిల్లలను కొని ఇంతకాలం భ్రమపడ్డాను. కాదు, ఎవరు ప్రేమగా చూస్తే వాళ్ళే పిల్లలు -నా విల్లులో ఈ ఇల్లు, నాకున్న కొద్ది బాంక్ డబ్బు వెంకడికి చెల్లాలని, నా కొడుకులు కూతుళ్ళు ఎవరూ నా శవాన్ని చూడటానికి రావద్దనీ, నన్ను వెంకడే దహనం చేయాలనీ ఇవాళే, ప్లీడరు దగ్గర కెళ్ళి విల్లురాయించి రిజిస్టర్ చేస్తా. ఇంకెన్నేళ్ళు బతుకుతానో - లేక రేపే వెళ్ళిపోతానో ఎవరికీ తెలుసు. రాయి చిన్నన్నయ్యకి, పెద్దన్నయ్యకి, అక్కలకీ అందరికీ" - రాజారావు గొంతుపూడిపోయింది బాధతో 'మీ అమ్మ అదృష్టవంతురాలు - ఆమె కూడా బతికుంటే, ఇద్దరినీ వృద్దాశ్రమంలో పడేసి పారిపోయేవారేమీరంతా" రాజారావు ఆయాస పడుతున్నాడు.
'మీరు విశ్రాంతి తీసుకోండి నాన్నగారూ. వెంకడూ, నాన్నకి హార్లిక్సు కలిపి పట్టుకురా' శారద కేకపెట్టింది. దొడ్లో బట్టలు ఉతుకుతున్న వెంకడు పరిగెత్తి వచ్చాడు.
ఇక్కడ కొచ్చినా మనశ్శాంతి లేదే అనుకుంది శారద. తండ్రిది తనది ఒకేరకమైన పరిస్థితి - ఎవరి దగ్గరుండాలి, ఎక్కడుండాలి అనేది సుబ్బలక్ష్మిగారు ఏమనుకుంటోందో తనని గురించి - ఎవడితోనోలేచి పోయాననుకుంటుంది ఖచ్చితంగా. వారం రోజులు చూసి తాళం బద్దలు కొట్టించగలదూ, ఎందుకూ - తను రేపే వెడుతుందిగా. బొంబాయి ప్రయాణం - దినేష్ రావటం - అన్నీ విఘ్నాలు లేకుండా జరగాలిగా - శారద బ్రెడ్, జాము కలుపుతింటోంది. ఆకలి, ఈ ఆకలి చిత్రమైంది - ఏ పరిస్థితిలోనైనా, మనసు ఎలావున్నా ఆకలి మాత్రం తప్పదెందుకో !! గబగబా బ్రెడ్ తినేసింది. స్నానం చేసింది. ఆ పంతులుగారి అమ్మాయి వచ్చి వంటవండేవరకూ ఊరికే కూచోటమెందుకని శారద వంటపని పూర్తి చేసింది. ఏం తోచటం లేదు - రాజారావుకి ఇంకా కోపంగానే వుంది - ఆయనతో ఇప్పుడు మాట్లాడటానికి వీల్లేదు. వెంకడు, వాడితో ఏం కబుర్లు చెప్తుందీ -
"ఒరేయ్ వెంకడూ -ఇలారా"
చేతులు లాగుకుతుడుచుకుంటూ వచ్చాడు వెంకడు.
'పేపర్లు దొరుకుతాయా యిప్పుడూ. అంది శారద 'ఏవైనా ఒక ఇంగ్లీషు పేపరూ ఒక తెలుగు పేపరూ తీసుకురా' - వెంకడి చేతులో డబ్బులు పెట్టింది.
'ఒక సినిమా పేపరు కూడా కొనుక్కుంటానండీ' అన్నాడు నెమ్మదిగా వెంకడు.
'సరే' - శారద లోపల కెళ్ళబోతోంది. పెద్దమీసాల వీరాసామి - 'ఏం తల్లీ - ఇంత మోసమా - మేమేదో ఇలా బతికుంటే మమ్మల్ని సర్వనాశనం చేసేశారే" - అరుస్తూ వచ్చి వీధి అరుగుమీదకూచున్నాడు. - ఎందుకు అరుస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అర్ధంకాలేదు శారదకి.
'ఏంటి అలా చూస్తూనుంచుంటావ్ - చూడు, ఇదిగో' - పేపరు కిందపడేశాడు. శారద తీసుకుంది చేత్తో. మొదటి పేజీలోనే పెద్ద అక్షరాలతో బొమ్మలతో సహా - జాగ్రత్తగా చదివింది శారద.
పెద్ద పారిశ్రామిక వేత్తనని చెప్పి, కంపెనీల పేర్లతో అమాయిక ప్రజల్ని మోసం చెసిఉ పారిపోతున్న అవినాష్ అనే మోసగాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎందరి చేతనో షేర్స్ కొనిపించి, లాభాలు వస్తాయని ఆశ పెట్టి లక్షల లక్షల ధనం వసూలు చేసి, ఆ ధనంతో పారిపోతున్న మోసగాన్ని పట్టుకుని నిర్భంధంలో వుంచారు. అతనితో బాటు అతని ప్రియురాలు అని చెప్పబడుతున్నా రంజనిని కూడా నిర్భంధంలోకి తీసుకున్నారు. ఇంతకు ముందే ఎన్నో నేరాలలో చిక్కుకుని, తప్పించుకు తిరుగుతున్న అతను ప్రస్తుతం బొంబాయిలో నిర్భంధంలో వున్నాడు. మద్రాసు, కలకత్తా, బెంగుళూరు, హైదరాబాదు విజయవాడ, నగరాలలోను, చుట్టుపక్కల చిన్న ఊళ్ళలోనూ ఎందరినో మోసగించినట్టు సమాచారం అందింది. ఎక్కడికక్కడ అందమైన చదువుకున్న మహిళలతో ఈ ఇద్దరూ స్నేహం మొదలుపెట్టి, వారిని రకరకాలుగా ప్రలోభపెట్టి మోసం చేసి డబ్బుకాజేయడం జరిగింది. ఇలా ఇలా మూడుకాలమ్స్ లో ఇదే వార్త. శారద ఫోటోలకేసి మళ్ళీ మళ్ళీ చూసింది. అవినాష్ రంజని. ఆ. రాజు, దీప్తి. ఆ, నీరజ దినేష్ - రామన్ కళ్ళు గట్టిగామూసుకుంది. శ్వాస ఆడుతోన్నట్టు లేదు. 'వాడు పేరు మార్చు తున్నంత మాత్రం మనం గుర్తుపట్టమా అమ్మ, ఎంత మోసం !!, "ఎంత మోసం - మన ఊరు ఊరంతా షేర్స్ కొన్నారు కదా వాణ్ణి నమ్మి కంపెనీలలో పెట్టండి. మీకంతా లాభమేనని అందర్నీ ఆశపెట్టి ఎంత డబ్బుకాజేశాడూ. ఎంత డబ్బుకాజేశాడూ - వీరసామి ఇలా అంటూనే వున్నాడు. రాజారావు వాకిలినిండి పోయింది జనంతో. అందరూ శారదపై బడిపోయి రకరకాలుగా ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో తెలియక గుండెదడదడ కొట్టుకుంది "ఆడికి నీకూ ఏం సబంధం - ఆడిని మన ఊరు ఎందుకుతెచ్చావ్" - గట్టిగా అడిగాడొకడు.
'ఆడుకొట్టేసిన డబ్బుల్లో నీకూ భాగం వుండివుంటుంది - అవన్నీ మా ముఖానపడేయ్' - అరుస్తున్నాడు ఇంకొకడు.
"ఆడితోకారులో ఈమెగారు వచ్చినపుడే అనుకున్నా ఇదేదో అట్టాంటి వ్యవహారమేనని" - అంది మరో ఆమె.
'ఏం చేయమంటావో చెప్పుమమ్మల్ని - ఇక్కడ నుంచి మేం వెళ్ళం" వీరాసామి అనగానే'అవునవును' అన్నారంతా. శారద ఏం చేస్తుందీ - ఆ నేలమీద అంతా కూర్చున్నారు. పేపర్లకోసం వెళ్ళిన వెంకడు అన్ని పేపర్లూ అయిపోయాయని వెనక్కి తిరిగొచ్చి ఈ గొడవేంటో అర్ధంకాక వాళ్ళతో బాటు తనూ చతికిలబడ్డాడు.
ఇంతకుమించిన ఎదురు దెబ్బమరేదీ లేదు. నమ్మక ద్రోహం ఇదే - దినేషా - రాజా - అవినాషా - ఓహో - ఎంతమోసం - లక్షల లక్షలు నష్టపోయింది - పరువు పోయింది - బ్రతుకుపోయింది - ఇంక మిగిలిందేమిటీ - వీరాసామి వాళ్ళు ఎంతసేపు కూచుంటారు అలా - తండ్రికి తెలిస్తే ఇప్పుడే గుండె ఆగిపోతుంది - శారద ఊపిరి పీల్చుకుంది.
'వీరాసామిగారూ - మీరు నా తండ్రితో సమానం పెద్దవారు ఒక్క నిముషం నామాటవినండి, ఆయనతో ఏం మాట్లాడారో - నాకు నిజంగా తెలియదు - మిమ్మల్ని ఎంతవరకు మోసం చేశాడోనాకు తెలియదు - నేను, నాకుటుంబం మొత్తం ఆరు లక్షలపైగా నష్టపోయాము - నాన్నఫ్లాట్ కొనమని యిచ్చిన మూడు లక్షలూ షేర్స్ కోసం యిచ్చేశాను - అతను నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు - మీ ఎవ్వరికీ నేనేమీ ఈయలేను - అతన్ని మన ఊరు తీసుకురావటం నాపొరబాటయితే, అతన్ని నమ్మి మీరంతా ఎంతోడబ్బు ఆయన చేతిలో పెట్టడం మీపొరబాటుకాదా - ఒక్కసారి ఆలోచించండి. దయుంచి ఆలోచించండి" - శారద కన్నీళ్ళు తుడుచుకుంది. అందరూ గుసగుసలు చెప్పుకున్నారు. వీరాసామితో ఏదో సంప్రదించారు.
వీరాసామికి అర్ధమయింది పరిస్థితి. వాడు ఈ పిల్లని మోసం చేశాడు. అంతేకాదు ఎంతో ఆశపెట్టి, ఆ మొదటి భర్తతో కాపురం కూడా చెడగొట్టించాడు. పెళ్ళాడుతానని వాగ్దానం కూడా చేసాడేమో - ఆడపిల్ల అన్నివిధాల నష్టపోయింది - ఇవాళ ఆమె ఇక్కడ వుండబట్టి మనమంతా ఆమె మీద ఎగబడుతున్నాం. ఆమె హైదరాబాదులో వుంటే మనమేం చేసేవాళ్ళం !! -వీరాసామి శారదకేసి చూసాడు. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలదు - తరువాత చూద్దాం అనుకున్నాడు మనసులో - ఆడపిల్ల ఆమె ఏం చేస్తుంది. ఎన్ని విధాల మోసపోయిందో పిల్ల పాపం - వీరాసామి శారదవైపే చూస్తున్నాడు - వీరాసామికి ఐదుగురు ఆడపిల్లలు. ఒక్క అల్లుడు మాత్రం వీరాసామిని ఎప్పుడూ బాధిస్తూనే వుంటాడు - పిల్లనెప్పుడూ కొట్టి కొట్టి నానాహింసలూ పెడుతూవుంటాడు ఏం చేయలేక తనూ చూస్తూవూరుకున్నాడు. ఆ పిల్ల అలాగే కష్టాలు పడుతూ కాపురం చేసుకుంటోంది - ఆడపిల్లలు - ఏం చేస్తారు పాపం !! శారదను చూస్తే జాలేసింది వీరాసామికి అందరినీ పంపించేశాడు వీరాసామి. వీరాసామిలోని తండ్రి మేల్కొన్నాడు ఆ క్షణం !!
