Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 4


    
    ఎప్పుడూ పది మందిని వెంటేసుకోని తిరిగేవాడు. ఎవ్వరికి ఎంత ఇచ్చాడో, ఎంత తిరిగి వచ్చిందో తెలియదు. అతని క్రింది పనివాళ్ళు బాగా లాభం చేసుకోసాగారు.
    ఎప్పటిలా ఆ రాత్రి ఓంకారితో తమాషా పట్టించాడు. తెల్లవారు ఝామున అబ్బాయితో ఆడుకొన్నాడు. అమ్మ ఇచ్చిన పాలు తాగి అరుగుమీద కూర్చున్న తండ్రిని పలకరించి బజార్లోకి వెళ్ళాడు వెంకట్రావు.
    అలా నడిచి వెళ్ళిన వెంకట్రావుని బండిలో వేసుకొని వచ్చారు మిత్రులు.
    నలుగురి మధ్య కూర్చుని కబుర్లాడుతూ, నవ్వుతూ నవ్వుతూనే ఒరిగిపోయాడు వెంకట్రావు.
    ఇక వెంకట్రావు లేడు. కాని, సూర్యుడు ఆ దిక్కు నుండి ఈ దిక్కుకి మారుతూ కాలాన్ని ముందుకు తోస్తున్నాడు.
    నిన్న, మొన్న, అటుమొన్న....అలా కాలాన్ని జరజరా వెనక్కి లాగి ప్రాణాలతో ఉన్న వెంకట్రావుని చూడాలని, అతని మంచి స్వరం, నవ్వు వినాలని, అతనితో తమాషా చేయించుకోవాలనే బలవత్తరమైన కోరికను అణుచుకొనే లోపల జరిగిపోయిన కాలంలో పూజనీయులైన అత్తమామలు కలిసి పోగా తన కొడుకు లక్ష్మణ రామారావు స్త్రీ వ్యామోహంలో పడిపోయేటంతటివా డైనాడు. పోయింది పోగా, మిగిలింది చేత పట్టుకొని గ్రామంలో తమ స్వంత గృహానికి తిరిగి వచ్చారు. వసారాలో ముందున్న ఆ గది వెంకట్రావుది. ఊహా గానాలతోనే ఆ గదిలో గడప సాగింది ఓంకారి.
    అబ్బాయికి పూర్తిగా తండ్రి పోలిక వచ్చింది కాని, అతని మంచితనం ఎంతవరకు వచ్చిందో తెలియదు.
    ఒడ్డు, పొడవు ఉన్న రామారావుతో చక్కటి సంతానాన్ని పొందానన్న ఆశతో వివాహిత అయిన ఒక స్త్రీ స్నేహం చేసి, ఆమె తల్లి మద్దత్తుతోనే అబ్బాయిని ఇంటికి రప్పించుకోసాగింది.
    తప్పొప్పులు తెలుసుకోగల అబ్బాయి అది తప్పు అని తెలిసే చేస్తున్నాడు. వారించి లాభం లేదని గ్రహించిన ఓంకారి అబ్బాయి అయిన చి. రామారావుకి చి. సౌ. నాగలక్ష్మి ని తెచ్చి వివాహం జరిపించివేసింది.
    నాగలక్ష్మి ఒంటిరంగు నలుపైనా, కనుముక్కు తీరైనవి. మనస్సు మెత్తన.
    వివాహానికి ముందే నాగలక్ష్మికి తన కొడుకు వ్యవహారాన్నంతటిని చెప్పి, "కాగల భర్తను సరిదిద్దుకో గలవా!?" అని ప్రాధేయపడింది.
    పల్లె వాతావరణంలో పెరిగిన నాగలక్ష్మికి పెళ్ళి, మొగుడు, శోభనం, ఉంచుకోవటం లాంటి మాటలు కొత్తవి కావు. పెళ్ళి కళతో మెరిసిపోతున్న నాగలక్ష్మి సిగ్గుతో తల మోకాళ్ళ వరకు దించింది.
    ఇంకా ఇందులో రహస్యం లేదన్నట్లుగా తృప్తిగా గాలి పీల్చుకొంది ఓంకారి.
    రామారావు పొడుగరి. ఎర్రటి ఛాయ. అందమైన వాడు. జమీందారు బాబులా సుకుమారంగా ఉంటాడు.
    బంగారు కుచ్చుల జడ ముందుకేసుకొని తల పంచుకొన్న నాగలక్ష్మి శోభనం గదిలోకి రాగానే-"నల్లపిల్లా!" అంటూ సరసమాడి దగ్గరకు చేర్చుకొన్నాడు. భర్తకు అనుగుణంగా మెలిగి తృప్తి నిచ్చింది!    
    కొత్త పెళ్ళికొడుకు ఇంటిపట్టునే ఉంటున్నాడు. షికారుగా వెళ్ళినట్లు వెళ్ళి పొలం పనూ చేయించి వస్తున్నాడు.
    కొడుకులోని మార్పుకు ఓంకారి సంహోషించింది.
    'అమ్మకంటే మంచిది అత్తమ్మ' అనుకొంది నాగలక్ష్మి.
    పుట్టింటినుంచి పిలుపు వచ్చినా, అత్తమ్మ ఒంటరిగా ఉంటుందని వెళ్ళేది కాదు. నాగలక్ష్మి ఆప్యాయతకు ఓంకారి కళ్ళు చెమ్మగిల్లేవి.
    వెంకట్రావు చేయించిన నగలన్నీ తీసీ నాగలక్ష్మికి అలంకరించింది. ఆమె కడుపు పండాలని దీవించింది.
    కొత్త అలంకరణలో నాగలక్ష్మి మంచి వంటలు చేసి భర్త కొరకు ఎదురు చూసింది. భోజనం వేళ మించి పోయి వచ్చిన రామారావు పాలు మాత్రమే తాగి పడుకొన్నాడు.
    "ఏరా, భోజనం చేయలేదు! ?" అని కేకేసి అడిగింది ఓంకారి.
    "భాగ్యమ్మ ఇంటిలో విందు చేశారు" అంటూ ముసుగు పెట్టేసుకొన్నాడు.
    నేరుగా కోడలి ముఖంలోకి చూడలేకపోయింది. మౌనంగా ఇద్దరే భోజనం చేశామనిపించారు.
    
                               *    *    *

    భాగ్యమ్మది ఆ గ్రామంలో ఉన్నత కుటుంబాలలో ఒకటి. ఆమెకు ఒక కూతురు, రత్నావతి. ఇద్దరు కొడుకులు. పెత్తనం అంతా ఆమెనే. రత్నావతిని పొరుగు గ్రామంలో ఇచ్చారు. పెళ్ళయి అయిదేళ్ళయినా పిల్లలు కలగలేదు. పట్టణంలో పెద్ద డాక్టరుతో పరీక్షలు చేయించుకొన్నది. ఏ మిస్టేక్ లేదన్నారు. అయినా చిన్న ఆపరేషనుకూడా చేయించుకొంది. కానీ, లాభం లేదు. "నీ భర్తనుకోడా పరీక్ష చేయాలి. తీసుకురమ్మ"న్నారు ఆస్పత్రివాళ్ళు.
    "మొగాణ్ణి. నా కేటి పరీక్షలు. రానుపో!" అన్నాడు రత్నావతి భర్త!
    మిస్టేక్ అంతా మొగుడిదే నన్న నమ్మకం కుదిరింది. తల్లి కావాలనే కోరిక కంటే మనస్సు బలహీనమైంది. ఆచార్లవారి పురాణ కాలక్షేపంలో - "విచిత్రవీర్యుడు సంతానము లేక చనిపోయెను. వంశ క్షీణత కలుగునని విచిత్రవీర్యుని తల్లి కోడళ్ళను అంబ, అంబాలికలను వేదవ్యాసుని వలన పుత్రులను బడయుమని నియోగించెను. అలా దేవత న్యాయమున అంబ, అంబాలికలు సంతానవతులయ్యారు. వాళ్ళకు భర్త లేడని సరిపెట్టు కొన్నా విచిత్రవీర్యుని క్షేత్రజ కుమారుడు పాండురాజు శరహతమై చనిపోతూ గింద ముడిచ్చిన శాపము వలన, సతీసంగమము మాని, తన భార్యను సంతానవతి కమ్మని కోరెను..." అంటూ చెప్పిన మాటలు బాగా మనస్సున నాటాయి.
    "పాండురాజు ఎంత చల్లని మాట చెప్పాడు! అలా పురాణపురుషులకు లేని తప్పు మన కేమిటి?" అని తల్లీకూతుళ్ళు ఒక నిశ్చయానికి వచ్చారు.
    కులరాతి వజ్రాల్లాంటి కొడుకుల్నీ ఈ కాలంలో కనలేకపోయినా, మాద్రిలా సహదేవుడులాంటి అందమైన వాడికి తల్లి కావాలనుకొంది రత్నావతి!
    వంశము మంచిదై రంగేళికాజాలో ఉన్న రామారావు మీద మనస్సు ఉంచినవారై ఇంటి ముందుగా పోతున్న రామారావును లోనికి ఆహ్వానించింది భాగ్యమ్మ.    
    అంతకు మునుపే స్త్రీలను అంచనా వేయటం నేర్చిన రామారావు రత్నావతి మనస్సు ఇట్టే గ్రహించాడు. వనిత తానై వలచి వస్తుంటే వద్దనే ప్రవరాఖ్యుడు కాదు రామారావు.
    పండు తిన్నవాడికి దోరపండు సహించదన్నట్లు ఉంది ఇప్పుడు రామారావు స్థితి!
    గ్రామంలో ఏదీ ఎక్కువ రోజులు రహస్యంగా ఉంచలేరు! దేవరన్యాయం తొందరగా జరిగిపోవాలి! పది మందికి అన్నదానం చేసి తల్లీకూతుళ్ళు తీర్ధయాత్రలకై బయలుదేరారు.
    వారినిఎక్కడ కలుసుకోవాలో రామారావుకు చెప్పి డబ్బు చేతిలో ఉంచింది భాగ్యమ్మ! తాను చాలా అదృష్ట వంతుడని తలచాడు రామారావు!    
    రెండు మూడు రోజులైనాక రామారావు పట్నం వెళ్ళి వస్తానని ఏవో మాయమాటలు నాగలక్ష్మికి, తల్లికి చెప్పి మెల్లిగా జారుకొన్నాడు.
    వెళ్ళినవాడు తిరిగి వారంరోజులకు వచ్చాడు. కొడుకు తీరుతెన్నులు చూసి బాధపడసాగింది ఓంకారి.
    ఇంట్లో డబ్బులు తీసుకొని పోలేదు!కొత్త తరహాగా ఉంది. నాగలక్ష్మితో ఆ ఒక్క రోజు కులాసాగానే ఉన్నాడు.
    "పట్టణంలో వ్యాపారం చేయాలి" అన్నాడు.
    "పట్టణంవాసం మనకు పరిపడదు" అంది ఓంకారి.
    "మనం పెట్టుబడి ఏమీ పెట్టనక్కరలేదు. ఒక వ్యాపారికి తోడు ఉండటమే" అన్నాడు.
    తల్లి చెప్పవలసిన బుద్ది మాటలు చెప్పింది. బంగారం లాంటి కోడలికి అన్యాయం చేయవద్దని బ్రతిమాలింది.
    వాళ్ళకేం అన్యాయం చేస్తున్నాడో రామారావుకి బోధపడలేదు. అమ్మ మాటలు మరీ చాదస్తంగా తోచాయి. ఆ మరునాడే పట్నం పోతున్నానని బస్సు స్టాండు నుంచే ఇంటికి కబురు పెట్టాడు.
    రామారావు ఎవరో గొప్పింటి ఆవిడను పట్నంలో ఉంచుకొన్నాడని అందరూ చెప్పుకోసాగారు.
    ఏడుస్తున్న నాగలక్ష్మిని ఓదార్చింది ఓంకారి.    
    "నాగలక్ష్మీ! శ్రీరామచంద్రుడి వంటి భర్తను పొందిన సీతమ్మకేకష్టాలు తప్పలేదు! మన మెంతటి వారం! ఏ స్త్రీ పాత్ర సుఖపడినట్లు భారతంలో లేదు. మనం చేయగలిగింది ఏమీ లేదు. పైవాడు నవ్విస్తే నవ్వాలి. ఏడవమంటే ఏడవాలి!" ఎడారిలా ఉన్న ఆమె కళ్ళు ఎండమావుల్లా కనిపించాయి నాగలక్ష్మికి!
    వారి మాటల్లో చాకలి వెంకాయి కూతురు హంస బట్టలు తెచ్చింది.
    "నీవు ఇంకా పోలేదా నీ మొగుడి దగ్గరికి?" అంది ఓంకారి.
    "నేను పోను, తల్లీ!" వాణ్ణి వదిలేసినా! వాడి బుద్ధి మంచిదికాదులే, అమ్మా!" ఎంతో సులువుగా చెప్పింది ఆమె.
    నాగలక్ష్మి ఎందుకో అత్తమ్మ ముఖంలోకి చూడలేక పోయింది.    
    అది తిరిగిపోతూ వెనక్కి వచ్చి, "మీ అబ్బాయిగారు కాళహస్తిలో కనిపించారట. భాగ్యమ్మ, ఆమె కూతురు అంతా కలిసి తిరుపతికి పోతన్నారట. మా అయ్య అమ్మతో చెప్పుతూ ఉంటే విన్నా" అని చెప్పింది.
    ఆ మాట విన్నాక ఊపిరి తీసుకోవటం మరిచి పోయారు. అర్ధం చేసుకోవటానికి భయపడ్డారు.
    తమ తీర్ధయాత్రలకి ఫలితం దక్కిందన్న అనుమానం కలగగానే తిరుగుప్రయాణం కట్టి రత్నావతి నేరుగా తన భర్త దగ్గరకు వెళ్ళి చేరింది.
    "ఆ వ్యాపారం చేస్తానన్నవాడు చేయడం లేదని, తాను ఇక పట్నం పో"నని తిరిగి వచ్చిన రామారావు అన్నాడు.    
    నాగలక్ష్మి మనస్సును ఎంత సరిపెట్టుకొన్నా కెలుకుతూనే ఉంది. భర్త మీద పూర్వపు కాంక్ష, నమ్మకం తగ్గిపోయాయి. పెళ్ళికి కట్టిన తోరణాలు తీయక మునుపే భర్త తనను విడిచి వెళ్ళిపోయాడు.
    కాలం ఎవరి కోసం ఆగదు.
    రత్నావతి పురుటికి ఇంటికి వచ్చిందని తెలియగానే రామారావు భాగ్యమ్మ ఇంటికి వెళ్ళాడు. సాధారణంగా మాట్లాడి పంపివేసింది!
    గర్భవతి రత్నావతిని చూస్తూ ఉంటే గర్వం కలిగింది రామారావుకు.
    'ఆ శిశువు నాది' అనుకోసాగాడు పలుమార్లు.
    పట్నం నించి చిన్న కారులో డాక్టరమ్మ, మంత్రసాని వచ్చారు!
    రత్నావతి ఆశించినట్లే కన్ను, ముక్కు తీరుగా ఉన్న ఎర్రటి బాబును ప్రసవించింది!
    మొదటి కాన్పుకు మూడు కుట్లు వేసి, "అనవసరంగా కదలకు. కుట్లు ఊడిపోతాయి. ఏదో రోజున వచ్చి విప్పుతాను"అని డాక్టరమ్మ వెళ్ళిపోయింది.    
    రత్నావతికి పుట్టిన కొడుకుని చూద్దామని ఉబలాట పడి తన కున్న చనువును పరిష్కరించుకొని పిలవని పేరంటానికి వెళ్ళినట్లు పరాయి ఇంటికి నేరుగా పడకగదిలోకి వెళ్ళాడు.
    అతిహసితం చేస్తూ అబ్బాయిని ఎత్తుకోబోయాడు.
    "పడేస్తావు, రామారావూ" అంటూ భాగ్యమ్మ వారించింది.
    కన్నార్పకుండా పొత్తిళ్ళలోని బాబును చూడసాగాడు. స్త్రీవ్యామోహం తప్పితే ఇతర చెడ్డగుణాలేమీ రామారావులో కనపడలేదు! ఆజానుబాహువైన రామారావులో అమాయకత్వం చూసి అప్పుడు నవ్వుకొన్నా, ఇప్పుడు జాలి కలిగింది రత్నావతికి.
    "రామారావూ! మమ్మల్ని మరిచిపో! నాగలక్ష్మి అదృష్టవంతురాలు! నీకు ఎంతమందినైనా కంటుంది" అంది రత్నావతి.
    రత్నావతిని, పిల్లాడిని చూసి, "ఏం పేరు పెడతారు? 'వెంకట్రావు' అని పెట్టు! మా నాన్నపేరు" అని చెప్పి అక్కడినుండి వచ్చేశాడు.
    వెళ్ళిపోతున్న రామారావును అప్పుడే సావిట్లోకి వచ్చిన రత్నావతి సోదరులు కళ్ళు చిట్లించి చూసి, రామారావు కనుమరుగైనాక అన్నదమ్ములిద్దరు ఒకరి నొకరు మౌనంగా చూసుకొన్నారు!
    సంధ్యవేళకే పక్షులు తమ తమ గూటికి చేరుకొని రెక్కల విసుర్లతో శ్రమను పారదోలి కిచకిచలతో సంభాషణలు చేసి సూర్యాస్తమయానికి విశ్రమించినట్లే, సూర్యోదయానికి ముందే లేచిన గ్రామ వాసులు పక్షుల్లా తొందరగానే మంచాలు ఎక్కేస్తారు!
    పొద్దుననగా వెళ్ళిన రామారావు ఇంకా ఇంటికి చేరుకోలేదు. అంటే, రాత్రి సినిమా చూసుకొని పదకొండు గంటల పాసెంజరు బండిలో వస్తాడు.
    నాగలక్ష్మి అత్తమ్మకి పాలు ఇచ్చి వంటగదిలో పీట వాల్చి, కంచంలో భోజనం పెట్టి, కూరగిన్నెలు సర్ది, చెంబులో నీళ్ళు పెట్టి వంటగదికి గడియ పెట్టి వచ్చి పడుకొంది.
    నడిరేయి ప్రకృతి మత్తునిదురలో ఉంది!
    తలుపు చప్పుడవుతుందేమోనని మెలకువ మెలకువగా ఉన్న నాగలక్ష్మి కన్నులు గట్టిగా మూతలు పడ్డాయి.'            ఓంకారి గడిచిన జ్ఞాపకాలను నెమరువేసుకోదు. ఆ గుండెబరువు భరించలేదు. ఆమె చిన్నతనం, పెళ్ళి గుర్తేలేదు. వెంకట్రావు ముఖం లీలగా, చెదిరి అస్తమిస్తున్న చతుర్దశి చంద్రునిలా గుర్తు ఉంది. గడిచిన జీవితం ఎలా గడిచిందో తెలియదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS