"అయితే ఏదో కొంప ములిగింది" అనుకున్నాడు.
"ఇందాకటినుండి - కనిబెడుతూనే వున్నాను! ఇన్ని సిగరెట్లు త్రాగటం మంచిపని కాదు!"
గిరికి మొట్టికాయ పెట్టినట్టయింది. ఏమనడానికి పాలుపోక పెదిమలు కొరుక్కుంటూ.
"అబ్బే.....లేదండీ..ఏం తోచక.....వుత్తినే" అని ఒక్కేడు.
"అవునవును! ... అయినా...బీచి షికారుకు వచ్చి - సిగరెట్లు కాల్చే నాగరికుల్ని చూస్తే నా కేమనాలో అర్ధంకాదోయ్! అసలు వాళ్ళెందుకొచ్చినట్లు బీచికి! చల్లని. మంచి గాలి పీల్చుకుందామనే కదా! ఆటువంటప్పుడు వాళ్ళు సీలుస్తున్నదేమిటి?....సిగరెట్టు పొగ! .... మంచి గాలి లోపలకు పోయే అవకాశం వుందా? యిహ బీచికి వచ్చి ప్రయోజనం ఏమిటి? చెప్పు? అని అన్నాడు.
గిరికి గొంతుకలో వెలక్కాయ పడింది? ఏం చెప్పాలి? ప్రతి చిన్న విషయాన్ని ఈయన ఎందుకింత ఆలోచించి చూస్తాడు అని! లేకపోతే యెవడయినా యిలా అడుగుతాడా?...."బీచికి ఎందుకు వస్తారు? అతను చెప్పినవన్నీ ఎవడు ఆలోచిస్తాడు?... బీచికి రావడం-అంటే తమ ప్రియులను కలుసుకుందికి - లేదా ఆడ పిల్లలముందు కూచునో నిలుచునో పోజులు కొట్టడానికి! కొత్త కొత్త పరిచయాలు చేసుకుందికి! స్నేహితులతో కలసి జల్సాగా గడపటానికి! ఏ మూలో కూర్చుని దొంగతనంగా - ఎవరికంటా పడకుండా అలవాట్లను తీర్చుకుందికి.....ఇంక మా విశాఖపట్టణం బీచికయితే - కాలకృత్యాలు తీర్చుకుందికీని ఈ మాత్రం ఇతనికి తెలియదేం కర్మ!" అని అనుకున్నాడు గిరి! అతడి కలలన్నీ పాడయినాయి, ఇహ నావేళకి ఎలాగూ వదలడని - నిశ్చయించుకున్నాడు.
"నీ ఆనందాన్ని పాడుచేస్తున్నా - యివాళ నాతో రావాలి! పద!" అని అన్నాడంటే సరిపోదు ఆజ్ఞాపించాడు తప్పకుండా వచ్చితీరుతాడు అని తెలిసినట్టు -
అలాగే అతని మాటకి అడ్డు చెప్పే దైర్యం లేక అతని వెంటే - మంత్రముగ్దుడిలా, బుద్ధిగా నడచి వెళ్ళేడు గిరి.
అతడు తిన్నగా యింటికే తీసుకుపోయాడు. మధ్యలో అట్టే ఏం మాట్లాడలేదు! సోఫాలో కూర్చోమన్నాడు. గిరిజ కూడా చూసింది. ? ... డ్రాయరు లోంచి ఓ పెద్ద కవరుతీసి చూపెట్టేడు. అది గుండె తాలూకూ ఎక్స్ రే! -
"ఇది చూడు!" అని అన్నాడు?
గిరికి అందులో గుండెకాయ ఎక్కడుందో అంతుదొరకలేదు సరికదా ఎముకలన్నీ చెదకొట్టేసినట్టున్నాయి!
"ఏఁవిటిది?" అని అడిగాడు-
"ఇది నా స్నేహితుడిది! వాడు సిగరెట్లు తాగడంలో ఘనాపాటి. ఎంత చెప్పినా వినలేదు. ఆఖరికి టి.వి వచ్చింది. నేనే ఆస్పత్రిలో జాయిన చేయించాను....... కాని లాభం లేక పోయింది. కొద్దిరోజుల క్రిందటే పోయాడు !... విన్నావా?"
గిరికి భయం వేసింది- గుండెకాయ వుందో లేదో అని గుండెని చేత్తో తడిని చూసుకున్నాడు. గుండె అద్ధట్టు స్పష్టంగా - వినిపిస్తూంటే స్థిమిత పడ్డాడు.... కాని సిగరెట్లు త్రాగినంతమాత్రంలో యింత ఘోర పరిణామం వస్తుందని ఎక్కడా వినలేదు. గుండెకు మంచిది కాదని మాత్రం విన్నాడు.... అంచేత-
"సిగరెట్లు కాల్చడం వల్లే....యింత అనర్ధం వస్తుందని అనుకోను!" అని అనుమానాస్పదంగా అన్నాడు.
"ఎందుకు రాకూడదు?" ..... "అయితే నా స్నేహితుడికి మాత్రం యిదొక్కటే కారణం అని చెప్పలేను- కాని అదీ ఒక కారణమే- అయినప్పుడు- కొంచెం పాడుచేయ గలిగింది పూర్తిగా కూడా పాడుచేయగలదు! .... ఎలా గంటే, ఈ రోజుల్లో మనం తిరిగే పరిసరాలు, వాతావరణం, అలవాట్లూ అలాంటివి, వాటివల్ల లోపల కొంచెం అనారోగ్యం ప్రవేశించిందంటే దానిని ఎక్కువ చేయడానికే దోహదం అవుతాయి గాని, తగ్గించడానికి కాదు.
"మీరు చెప్పింది కొంతవరకూ నిజమే!" అన్నాడు గిరి చచ్చినట్టు-
"ఇదొక్కటేకాదు! కాఫీ హోటళ్ళు చూడూ!- మనం తినే కప్పుల్లో, ప్లేటుల్లో గిన్నెల్లో ఎంత మంది తింటున్నారో! ఎటువంటివాళ్ళ ఎంగిలి కలుస్తూందో? పైకి బాగా కనిపించినా, లోపల రోగాలున్నవాళ్ళుకూడా నోళ్ళు పెడుతున్నారు!...ఈ రోజుల్లో నువ్వు తిన్న గిన్నె కడుక్కుందికి నీకే బద్ధకం అయినపుడు- ఎవడో బంట్రోత్తు నువ్వు తిన్నగిన్నెలు శుభం చేయడానికి ఎందుకుజాగ్రత్త తీసుకుంటాడు ఏదో కడిగినట్టు నీళ్ళలో ముంచి, తీసేస్తాడు ఏమంటావు?"
"కాదు మరీ?....నిజమేనండి!..."
-"మనిళ్ళలోనే చూడూ..... ఇవాళ చేసి నవి......మిగిలిపోతే పారవేయడానికి మనసొప్పక ఆ మర్నాటికి కూడా వుంచి పెడుతుంటారు!... లేదా పనివాళ్ళకి పడేస్తుంటారు. అలాంటిది వ్యాపారం చేస్తున్న హోటల్ వాడు మనమంచికోరి ఎప్పటికప్పుడు తాజావి యిస్తాడంటావా? వచ్చే పోయేవాళ్ళు పరిమితి అంటూ లేకపోయాక సరిగ్గా ఆ వేళకి సరిపడ్డట్టే చేయడం వాడి తరమా? మిగిలిపోతే-వాటిని పారేసి నష్టపోతాడా? ....లేదు, అవన్నీ మనకే మరో రూపంలో వడ్డిస్తాడు!.....నిజమేనంటావా?...ఇంతకీ క్లబులకి వెళ్ళకూడదనీ కాదు. వెళ్ళిన వాళ్ళందరికీ జబ్బులొస్తాయనీ కాదు!....దేనికయినా అతి మిక్కిలి కూడదు! యిలాటివి చిన్న విషయాలయినా ..... జాగ్రత్తగా వుండాలి!... ముఖ్యంగా తిండిలోనూ, అలవాట్లలోనూ....చాలా జాగ్రత్తగా వుండాలి!" అని ఒక్క ఉపన్యాసం యిచ్చి వూరుకున్నాడు దాసుగారు!-
అంతావిని, అన్నిటికీ ఊఁ కొట్టడం తప్పిస్తే మరేం అడ్డుప్రశ్న వేయకూడదని గిరికి తెలుసు. లేకపోతే యింక ఆ రోజుకు అతని దగ్గర్నుండి విముక్తి దుర్లభం-
అప్పటికేదో సర్దిచెప్పేసి-తలవంచుకు-ఒక్క నమస్కారంచేసి బయటపడ్డాడు.
ఇంటికి తీసుకువెళ్ళి ఒక కాఫీ చుక్కయినా పోసేడుకాదు. ఏంమనిషి! ఎటికసి అయినా తెలీదు మళ్ళీ పెద్దకబుర్లు చెబుతాడు. అని అనుకున్నాడు!

4
కొత్తసినిమా వస్తే ఒకనాడు గిరి వెళ్ళేడు - ఇంట్రవల్ వరకూ ఏ బాధా లేకపోయింది. అవతలకువెళ్ళి టీ త్రాగి లోపలకు వస్తూంటే పైక్లాసులో గిరిజ. మరో నలుగురయిదుగురు అమ్మాయిలూ కూర్చుని నవ్వుకుంటున్నారు-దృష్టి మరల్చుకుందామనుకొనేసరికి -గిరిజ చూడనే చూసింది! ....గిరి హతోస్మి! అనుకున్నాడు స్వర్గానికి వెళ్ళినా సవతిపొరు తప్పదంటారు. ఇలాటివాటినే - దర్శనం అయితే చాలని తపించిన గిరి ఈనాడు గిరిజ కనబడితే- బెదిరిపోవలసిన కర్మ దాపురించింది.... గిరికి ఏమీ పాలుపోలేదు ఆమె ఎలాగూ తండ్రితో చెబుతూంది! రేపుదయం ఆయన కోర్టుకెక్కిస్తాడు
సినీమాకు వెళ్ళినందువల్ల అడుగుతాడని భయపడడం లేదు! వచ్చిన చిక్కేమిటంటే- భార్యని కూడా తీసుకు వెళ్ళకుండా వంటరిగా ఎందుకు వెళ్ళేవని అడుగుతాడని! అయినా "నా యిష్టం!" అని ఒక్కమాటలో కొట్టిపారేయ వచ్చుకాని....అలా అనడం గిరికి యిష్టంలేదు.....అంచేత యింక మిగిలినదారి ఒక్కటే- భార్యతో నే తను వచ్చినట్టు గిరిజ భావించాలి! అలా నటించాలి కాని ఎలాగ?
ఇప్పుడు తనప్రక్క ఒక స్త్రీ లేక తనే ఒక స్త్రీ ప్రక్కన కూచుని వుండగా గిరిజ చూస్తేచాలు, ఆమె తక్కువదా! తననిచూసిన దగ్గర్నుండి, స్నేహితులతో నవ్వులూ కబుర్లూ తగ్గించేసి డిటెక్టివ్ లాగ తననే పరీక్షిస్తూంది? .... అతనెటు వెడతాడా? ఎక్కడ కూర్చుంటాడా అని! అయితే- ఇద్దరూ కలిసి వచ్చినట్టు - తన భార్యని. ఆడవాళ్ళ వయిపు పంపించేసినట్టు చెప్పుకోవచ్చు గాని.... ఈ యిరవయ్యో శతాబ్దంలో నవనాగ రీకుడయినవాడు - పెళ్ళాం వుండగా, సినీమాకి కలిసి వెళ్ళలేదన్నా. వెళ్ళి జంటగా కూర్చోలేదన్నా (వీలయితే ఒకే సీటులో) సంఘం బహిష్కారం చేసెయ్యరూ?.... అంచేత ఆ ఆలోచనలు పనికిరావు.
గిరికి మరి వెనకాముందూ తోచలేదు, ఎలా గయినా గిరిజకి తాను భార్యతోనే సినిమాకి వచ్చి పట్టున నమ్మకం కలగజెయ్యాలని నిర్ణయించుకున్నాడు, అయితే అదెంత కష్టసాధ్యమో? పరిణామమేమిటో ఆలోచించలేదు ఎప్పుడూయింతే గిరికి ఒక ఆలోచన తడుతుంది- దానిని వెంటనే ఆచరణలో పెట్టిస్తాడు, వెనకాముందూ దాని ప్రభావం ఫలితం ఏమీ ఆలోచించకుండా అందుకే ఆ తర్వాత పశ్చాత్తాపపడడం జరుగుతూ వుంటుంది.
ముందు గిరి కూర్చున్నచోటు అతను నటించవల్లన కార్యక్రమానికి అనువుగాలేదు, అయితే అతను వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాడు. ఒకామె.... వచ్చి. ఒంటరిగా ఒక మూలని కూర్చుని వుండడం- ఎవరూ ఆమె ప్రక్కగా కూర్చోలేదు. నాలుగయిదు కుర్చీలు ఖాళీగా పడి వున్నాయి! అదృష్టవశాత్తు ఆమె ముసుగుకూడా వేసుకుంది - ఏ జాతో ఏ భాషో ఆమెది! లేక ఒకరి వేషభాషలు మన సంప్రదాయానికి విరుద్ధ మయినవే అయినా, వాటిని అనుకరించక పోతేనేగాని నాగరికత కాదనుకునే ఆంద్రనారీ రత్నమో! తెలియదు! ఎవరయితేనేం అతనికి కొంచెంసేపు వరకూ ఉపయోగిస్తేచాలు! మరేమీ ఆలోచించకుండా గిరిజ చూస్తుండగానే గబగబా వెళ్ళి ఆమె ప్రక్కగా ఒక కుర్చీ వదిలేసి కూర్చున్నాడు....అప్పుడే లైట్లు ఆరిపోడం సినిమా మొదలెట్టడం జరిగింది...
గిరి బితుకు బితుకుగానే అక్కడ కూచున్నాడు! ....ఒక అయిదు నిమిషాలు గడిచే సరికి.... ఆమెలేచి... గిరి వదిలేసినా ఖాళీకుర్చీలో వచ్చి పక్కనే కూర్చుంది..... గిరిని దాదాపూ రాసుకుంటూ! గిరికి ముచ్చెమట్లూ పోశాయి అంతదూరంగా కూర్చుంటేనే ఏమౌతుందో అనుకున్నాడు! పరాయి స్త్రీకి దగ్గరగా ధైర్యంగా ఎలా కూర్చోడమా అని భయపడ్డాడు.... కాని.....యిలా జరుగుతుందేమిటో గిరికి బోధపడలేదు.
యిక ఆట అవుతున్నంతసేపూ .....గిరి అవస్థ ఆ గిరిజా...... తెలియాలి! గిరిని పట్టుకు ఆమె వదలలేదు! అతను ఆమెను ప్రక్కను పెట్టు కోని భార్యలా నటిద్దామనుకుంటే ఆమె అతనిని- ఆ పబ్లిక్ సినిమాహాల్లోనే ప్రేమించేట్టు వుంది!....ఏమిటేమిటో గుసగుసలు మొదలెట్టింది! యించు మించు అతని ఒడిలోనే కూచుందనుకోవచ్చు గిరికి యమబాధ అయింది. ఇదేమి స్త్రీయా? లేక పిశాచమా? అని అనుకున్నాడు. వదుల్చుకు బయటికి పోదామా అన్నంత అసహ్యం. కోపం వచ్చింది? కానేం చేయగలడు? వదల లేడు? .....తన నాటకానికి యింత అనుకూలంగా వున్నా గిరికి ముళ్ళమీద కూచున్నట్లు వుంది!
ఆమెను అర్ధం చేసుకోలేకపోయినాడు! ఈమెను తనతో రమ్మన్నా వచ్చేసేట్టే వుంది! అయితే సమస్యే తీరిపోతుంది! ...కాని....అతని మనస్సు అంగీకరించలేదు. ఆమె ఎవరయి వుంటుంది? ఎందుకలా ప్రవర్తిస్తూంది? ఆమెకు ఎవరూ లేరా? ఈ ఊళ్ళో ఎరిగిన వాళ్ళుంటే - చూస్తే ఏమవుతుంది?....తనతోనే ఇలా వుంటుందా? ఎవరితోనయినా యిలాగే ప్రవర్తించి ఉండేదా?....యివేవీ అర్ధంకాక పోయినా అతని పనికి అనుకూలంగా వుంది కదా అని ఊరుకున్నాడు! ఆమె ఎంత ముందడుగు వేస్తున్నా అంటీ అంటనట్టు యిష్టం ఉండీ లేనట్టు నటిస్తూ గడిపేయడానికి నిర్ణయించుకున్నాడు.
ఇంతట్లో ఆట అయిపోయింది! లైటు వెలిగించారు. ఆమెకు ముసుగు ఉండడం రక్షించింది. ఏమంటే మణిగాణ్ణి చూసిన గిరిజ ఈమెను దూరంనుంచి చూసినా పసికట్టేస్తుంది. గిరిజ వయపు చూశాను ఆమె...మా వయిపు చూసి నమ్మకంతోనే వెళ్ళిపోయింది? నేనూ లేవగానే ఆమె లేచింది. భార్యకన్నా పదిరెట్లు వినయం తోనూ? నూటికి నూరుపాళ్ళూ భార్యగానూ....ఆమె మొఖం చూడ్డానికి అట్టే అవకాశం లేక పోయింది. అయినా.... ఆ కాస్త సేపట్లోనూ...ఆమె.....చిన్నది కాకపోయిన....వయస్సులో వున్నట్టే వుంది.....మొఖానికి బాగా కోటింగ్ కొట్టి మేకప్ చేసుకొన్నట్టే ఉంది. నోట్లో తాంబూలం వున్నట్టుంది....ఆమె ఎలా వున్నా గిరికి అనవసరం కాబట్టి అంతలో పరీక్షించలేదు....అతని అడుగు జాడల్లో నడిచి బయటకు వెళ్ళింది....అదే చాలు గిరికి! అయితే ఆమె చేష్టలకి విసుగెత్తి అసహ్యంవేసి ఎంత వేగిరం వదల్చుకు బయట పడదామా అని అనుకుంటున్నాడు.
