అతడనుకున్నట్టే ఈ కిటుకు ఎవరూ కనిబెట్టలేదు. దిగ్విజయంగా సాగిపోతూంది!.... గాని...
ఒకనాడు ఉదయాన్నే దాసుగారు గిరిని సిలినాడు. గిరి మళ్ళీ ఏం కొంప ములిగిందా? అని అనుకుంటూనే-వెళుతూ వెండి పళ్ళెంలా వున్న ఆ యింటి గుమ్మం త్రొక్కుకుంటూ పోయాడు అద్దంలా అలిక వున్న ఆ గుమ్మం ముందు ముగ్ధులు ముత్యాల్లా వేసి వున్నాయి....అని చెరిగిపోకుండా జాగ్రత్త పడుతూనే వెళ్ళాడు గిరి...
"చూడబ్బాయీ! మనం చేసే పనులే మన స్వభావాన్నీ, సంస్కారాన్నీ చెబుతాయి...మన గుణాలూ, అలవాట్లూ కూడా మన ప్రవర్తనబట్టి తెలుస్తుంది. నీభార్య ఎవరితోనూ మాట్లాడకపోతే మానె. ఇవతలకి రాకపోతే నూనె.....సొసైటీ అక్కర్లేకపోతే అంతకన్నా నూనె. కాని చూడు....ఆ గుమ్మం చూడు. కోడి కెలికినట్టు ఎలా వుందో! సంస్కారం, నాగరికతా కలవాళ్ళ కొంపలా వుందా? వచ్చిన దగ్గర్నుండి ఒక్క సారి అయినా తుడిచిన పాపాన్న పోలేదు...కాస్త కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టుగొనును. లేదా పనిమనిషిచేత చేయించమను.... ఇది లోకం కోసం కాదు; మన గురించే- లోకం కోసమని తోచిన కొన్ని పనులు మన మంచి కోసమే మనకు తెలియకుండా చేసేది!
గుమ్మం ముందు పేడ కళ్ళాపు జల్లి అలికించడం వల్ల- ఇంటి దగ్గరగా వున్న సూక్ష్మ జీవులు చస్తాయి.... పేడలో ఆ మహత్తు వున్నది. వీధుల్లో తిరిగి యింటికొచ్చేవారి జోళ్ళ మీదా కాళ్ళమీదా వున్న ధూళి ఆ అలికిన జాగా మీదపడి, ప్రమాదకరమయిన క్రిములు నశించే అవకాశం వుంది! ఇంక ముగ్గు అదొక అలంకారమూ, అందమే కాకుండా, బియ్యం పిండితో పెట్టినట్టయితే, చీమలు, పిచ్చుకలు- యిలాటి నాటికి ఆహారం కూడాను. యీ విధంగా భూత దయ ఇలాటి ఆచారాలు మనసాంప్రదాయాలలో ఎన్నో వున్నాయి, వాటిల్లో అర్ధం మాత్రం గూఢంగా వుంటుంది. కాని నవనాగరికులమని యిప్పుడందరూ కొన్ని మూఢాచారాలతోపాటు యిలాటి వాటిని కూడా త్రోసి రాజనేస్తున్నారు; అన్య అనాచారాల వ్యామోహంలోపడి అనుకరించడానికి అవస్థలు పడుతున్నారు. అంతకన్నా మన సంప్రదాయాలోని మంచిని తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తే మంచిదేమో!...ఇలాగన్నానని ఏమీ అనుకోకు, అందుకే పిలిచాను" అని చెప్పి, "ఏమిటి సమాధానం?" అన్నట్టు చూసి వూరుకున్నాడు.
ఏదయినా అంటించి వదిలేయడం అతని తర్వాతే అతనెలా మాట్లాడినా నిజం చెబుతాడు కాబట్టి గిరి ఏమీ పట్టించుకోడు కాని- అతని దృష్టిలో - గిరి ఒక సంఘ ద్రోహిలాగా నవనాగరికతా వ్యామోహంలో పడి పాడయి పోతున్నవాడిలా కనబడడం కేవలం దురదృష్టమే కానీ ఏంచేస్తాడు? ఎంత ప్రయత్నించినా అతని ప్రవర్తనలో పొరపాట్లు అలా అనిపిస్తున్నాయి! అంచేత, యింక జవాబు చెప్పేది ఏంలేక సిగ్గుపడ్డట్టు నటిస్తూ తల వంచుకుని-
"అవునండి! ఆ విషయమే ఆలోచించలేదు. చెబుతాను!" అని చెప్పి వచ్చేశాడు! తర్వాత తన యింటి గుమ్మంముందు చూసుకునే సరికి నిజంగా ఏడుపే వచ్చేసింది? ఆకులూ, చెత్తా చెదారం అసహ్యంగా వుంది. కాని గిరి ఏం చేస్తాడు! పనిమనిషితో ఎన్నిసార్లు చెప్పినా తుదవదు! ఆడవాళ్ళుంటే దగ్గరుండి చేయించుకుంటారు! అయినా యిలాటివన్నీ ఎవరికీ జ్ఞాపకం వుంటాయి! ... కాని-వాళ్ళ దృష్టిలో తనకు భార్య వున్నది కాబట్టి యివన్నీ చూచుకో వలసిందే! - ఆ పనిమనిషికి ఎంతచెప్పినా చెయ్యదు! పట్నంలో పనిమనుషుల సంగతి వేరే చెప్పాలా? ఎంతో అవస్థపడి తేగాని కుదరదు. వాళ్ళు చేసినట్టు యిష్టమయితే చేయించుకోడం లేకపోతే మానుకోవడం - అంతేగాని మన యిష్టం వచ్చినట్టు వాళ్ళు చెయ్యరు!
అంచేత ఆ మర్నాటినుండి పనిమనిషి ఆ పని చెయ్యకపోతే తనయినా చేసితీరాలి లేకపోతే, ఆ యింటితో ఋణం తీరిపోతుంది!
కొన్నాళ్ళు పనిమనిషి చేసింది. తనకాబాధ లేకపోయింది. ఓ శుభోదయాన్నే తాను ఒక వారం పదిరోజులు పనిలోకి రాలేనని పనిమనిషి చెప్పేసింది! కాని ... తనకా పని తప్పదుగా! పనిమనిషి రాలేదు. గుమ్మం తుడవడం మానేసేం అని చెప్పడానికి వీల్లేదాయె! ఇంట్లో ఆడది ఆ మాత్రం చేసుకోలేదా అంటారు!
ఆ రాత్రి నాలుగ్గంటలకే అలారం పెట్టుకుని దేముడా అని లేచాడు గిరి! ఎవరికంటా పడకుండా దాసుగారి ఆవులపాకలోకి వెళ్ళి యింతపేడముద్ద పట్టుకునివచ్చి - బాల్చీలో కలిపేడు. ఎందుకయినా మంచిదని ఓ చీర వంటికిచుట్టబెట్టుకుని ముసుగు వేసుకున్నాడు! ప్రారబ్దానికి ఏడుస్తూ చీపురూ చెంబూ పట్టుకుని ఏదో వచ్చినట్టు సరసరా చెత్త పూడ్చేసి నీళ్ళు జల్లేడు. ఇక ముగ్గుబుట్ట చేతబుచ్చు కుని ముగ్గు పెట్టడానికి ఉపక్రమించాడు. చిన్నప్పుడు సరదాకి అమ్మావాళ్ళతో కూడా ముగ్గులు పెట్టడం కొంచెం జ్ఞాపకం వుంది అంచేత ఫరవాలేదన్నట్టు పెట్టేశాడు. గబగబా ఎవరికంటా పడకుండా లోపలికి పోయి ఘడియ పెట్టుకున్నాడు- ఇక పనిమనిషి వచ్చే వరకూ రోజూ యిదొక కార్యక్రమం అయిపోయింది! గిరి కి గీతకి
మామగారింటయితే తెలతెల వారుతూండగానే గిరిజ స్వయంగా, కళ్ళాపి జల్లి ముగ్గు పెడుతూ వుంటుంది? - గిరిజ తక్కువదే కాదు! ఆవులిస్తే పేగులు లెక్కడుతుంది! అంతా చూస్తూంటే గిరి సంగతంతా వెనకనించి కనిపెడుతూ తండ్రితో చెబుతున్నది! ..... అందుకే సాధ్యమయినంత చుట్టుకు ఆ పిల్లకన్నా ముందే లేచి గిరి గుమ్మం కడిగేసు కుంటున్నాడు!
ఒకనాడు లేవడం ఆలస్యం అయింది అలారం కొట్టలేదేమో అనుకుంటే వాచీయే పోయి వుండి? అప్పటికింకా తెల్లారలేదు బ్రతుకు జీవుడా అనుకుని గబగబాలేచి - చీర చుట్టబెట్టుకుని యధాప్రకారం పేడనీళ్ళబాల్చీ పట్టుకు యివతలకి వచ్చేసరికి గిరిజకూడా అప్పుడే నీళ్ళు జల్లుతోంది! ఆమె ఎంత చలాకీసిల్లోగాని, గిరిమళ్ళీ లోపలికి వెళ్ళడానిక్కూడా టయిములే నంత వేగిరం చూసింది! కాని ఆ మసక చీకట్లో పోల్చుకోడం మాత్రం సుళువుకాదు! యింక తప్పదని గిరి ఏమీ ఎరగనట్టు తొందర తొందరగా నీళ్ళు జల్లి తన పని చేస్తున్నాడు....అప్పటికప్పుడే నాలుగయిదు రోజుల ప్రాక్టీసు వుందికాబట్టి తడుపుకోకుండా జరిగిపోతోంది!...
"ఏఁవండీ అక్కయ్యగారూ! రోజూ నాకన్నా ముందే కడిగేసేవారే! యివాళేం ఆలస్యమయింది?" అని అడిగింది - గిరిజ-
గిరిగాడు గిజగిజలాడి పోయాడు. ఏం జవాబు చెపుతాడు? ఊ... అన్నాడా! కొంప మునిగిపోతుంది! మరింత ఆలస్యం చెయ్యకుండా వినీ వినిపించుకోనట్టు నటించి కిక్కురు మనకుండా ఇంటిలోకి దూరి గడియ వేసుకున్నాడు.
గిరిజ ఆశ్చర్యపోయింది. ఎంత గర్వం? అనుకుంది-
గిరిజను ఎలా పలకరించడమా! అని అన్నాళ్ళు తహతహలాడుతున్న గిరి ఈ నాడు గిరిజే స్వయంగా పలకరించినా మంచి అవకాశం దొరికినా పలకలేని స్థితిలో వుండిపోయాడు...
ఆ మర్నాడుదయమే.... గిరి పరుగెట్టి మణి కాళ్ళమీద పడ్డాడు. జరిగినదంతా వాడికి చెప్పినాలుగయిదు రోజులపాటు తనతో యింటో పడుకుని సరిగ్గా గిరిజ వచ్చే సమయానికే - గుమ్మం కడిగి ఆమెతో సమయస్ఫూర్తిగా మాట్లాడి ఇంట్లో భార్య వుందనే నమ్మకం కలిగించాలని వేడుకున్నాడు.
గడ్డిపోచని కూడా నీ అవసరం అంటే నిలబడి టిక్కు చేస్తుందట.....అలాగ్గా ఆ అడారి మణిగాడు కూడా మరిపించి మురిపించి ఒకంతకి గాని ఒప్పుకోలేదు. తన డబ్బులు ఇచ్చి తినలేని వన్నీ హోటలులో తిని. సరసగా రెండు మూడు సినిమాలు చూపించుకుని బ్రతిమాలించుకుని మరీ ఒప్పుకున్నాడు.
ఆ తెల్లవారుజామున మణి చీర గట్టుకుని వయ్యారంగా సరిగ్గా గిరిజ వచ్చే వేళకి గుమ్మం కడుగుతున్నాడు.
"ఏమండీ అక్కయ్యగారూ! నిన్న పలకరిస్తే పలక్కుండా అలా పారిపోయారు? మాటాడితే ముత్యాలొలికిపోతయ్యా?- ఇష్టం లేకపోతే...మరి మాటాడను లెండి." అని గిరిజ నిలదీసి అడిగేసింది. గిరికి తెలుసు అలా అడిగేస్తుందని జవాబు ఇవ్వకపోతే మర్యాదదక్కదని అందుకే ఆ ప్లాను వేశాడు.
మణిగాడికేం అంచక్కా మాటాడేస్తున్నాడు.
"ఏమిటో మోమాటం వేసింది. మాటాడ్డానికేం?....ఏమీ అనుకోకు." అని అన్నాడు. వాడేం అదృష్టం చేసుకున్నాడో!
"నా పేరు గిరిజ....అట్లా పిలవండి!...అయితే ఏమండీ! నాకు తెలియకడుగుతాను మీరు వచ్చి వారం పదిరోజులయింది....ఎక్కడికీ రాలేదు! పైగా గుమ్మంలోనయినా నిలుచోరేమండి? .... అలా ఒక్కరికి తోస్తుందా? ... యిలా న్నానని ఏమీ అనుకోకండి?.... నా కలా తోచదు సుమండీ !..."
"ఏం లేదమ్మాయీ నాకదేమిటో తెలియని వాళ్ళింటికి వెళ్ళడానికి అదోలా వుంటుంది? ఏదో చదువుతూనో, పను చేసుకుంటూంటేనో కాలక్షేపం అయిపోతుంది!"
"మంచి పుస్తకాలున్నాయా ఏమిటండి!" అని అడిగింది -
అది విని తెమ్మంటుంది కాబోలు అని గిరిగాడి గొంతులో వెలక్కాయపడింది -
"అబ్బే! యింట్లో ఏఁవీ లేవండి! ఆయన తెచ్చివెంటనే - యిచ్చేస్తూంటారు" అని తప్పించాడు మణిగాడు..నీదు మాత్రం ఏ తక్కువా?
ఆ మాటలకి గిరిజకి కొంత నమ్మకం కలిగింది -
"వస్తాను గిరిజా! "అని మణిగాడు లోపలికి వచ్చేశాడు!
అప్పటికి గిరి హృదయంలోంచి కొండంత బరువు తీసినట్టయింది, ఆమాంతం మణిగాడిని కౌగలించుకున్నాడు ... ....
'ఒరే .... ఒరే ... నేనురా! మణిగాన్ని .... గిరిజని కాదురా!" అని విదిలించుకున్నాడు - నవ్వుతూ మణి.
"పోన్లేరా! నిన్నే పెళ్ళాడేస్తా!" అని హాస్య మాడేడు - గిరి, ఇలా స్నేహితులిద్దరూ పరిహాసాలాడుకున్నారు .... ఆ తర్వాత రెండు మూడు రోజులపాటు మణి. ఈ కార్యక్రమం చేస్తూనే వున్నాడు. గిరిజకి కూడా నమ్మకం కొంచెం కుదిరింది, తర్వాత నాలురోజులూ అట్టే మాటాడకపోయినా, ఏవో" జవాబులు పొడిపొడిగా చెబుతూ గడిపేవాడు .... ఆ తర్వాత - గిరి కో నమస్కారంపెట్టి -
"నా కేమిటీ రోజూ ఈ సేవ! యిహ నావల్ల కాదుబాబూ" అని చెప్పేసి మణి వెళ్ళిపోయాడు.
గిరికి మళ్ళీ సమస్య అయింది -
పోనీ పని మనిషితో చెబుదామంటే అది తెల్లవారివచ్చి కడగడం వీలుపడదని చెప్పేసింది. పోనీ ఆ తరువాతయినా చేస్తుందా అంటే అలాగే అని వూరుకుంటుంది. ఆడవాళ్ళుంటే దగ్గరుండి చెప్పి చేయించుకుంటారు లేకపోతే వింటారా?... మళ్ళీ ఎలాగో గిరిజ కంట పడకుండా తప్పించుకుంటూ తంటాలు పడుతున్నాడు.
ఒకనాటి సాయంత్రం గిరి.... సరదాపుట్టి అలా.... అలా సముద్రపు టొడ్డుకు పోయి ఆనందంలో మునిగిపోయి ఏదో ఆలోచించు కుంటూ కూచ్చున్నాడు!.... అలా దూరంగా సముద్రం, ఆకాశం కలిసేచోట అందాన్ని, గిరిజ తనూ కలిస్తే కలిగే ఆనందాన్ని పోల్చుకుంటూ తన్మయం చెంది పోతున్నాడు.
ఆ యింతలో చేతికర్ర వూపుకుంటూ మీసాలు అందంగా మెలివేసుకుంటూ.....వచ్చి-
"ఏం అబ్బాయి! తీరుబాటుగా కూర్చున్నావు? ఒంటరిగా కూచ్చోపోతే అమ్మాయిని కూడా తీసుకు రాలేకపోయావ్!" అవి ప్రక్కనే కూచున్నారు దాసుగారు!
సడన్ గా అలా వచ్చిన అతన్ని చూసి అన్ డన్ అయిపోయి సిగరెట్టు అవతల విసిరేసి లేచి నుంచున్నాడు. "గిరి "-" "ఇహిహి" అని ఒక సినిమా నవ్వునవ్వేశాడు.
"స్వర్గానికి వచ్చినా సవితిపోరేనా? ఇక్కడికి వచ్చినా నాబాధ తప్పలేదని అనుకుంటున్నావా?" అని నవ్వుతూ అన్నాడు.
గిరి నిజానికి అట్లానే అనుకున్నాడు. అయినా పైకి "అబ్బే లేదండీ తండ్రి లాంటివారు అలా ఎందుకనుకుంటాను!" అని బాగానే అన్నాడు.
"నాకు తెలుసులే! .... అనవసరంగా అసలు పలుకరించే వాడిని కాను- కాని పలకరించవలసి వచ్చింది?.... నువ్వేమనుకున్నా- ఒక విషయం చెప్పిపోతాను!" అని అనేసరికి-
