'ఇంతకీ అసలు విషయం ఏమిటంటే! పిల్ల వాళ్ళకి వచ్చిందట! కట్నం బొత్తుగా తక్కువట! కాని పిల్లవాడికి, మనక్కావుడు చాలా నచ్చటం నించి, కట్నం, మూడువేలు రూపాయిలు ఇచ్చి, పిల్లకి పది నవర్సుల బంగారం పెట్తే, మనం ఎప్పుడు ముహూర్తం పెట్టించమంటే, అప్పుడే ముహూర్తం పెట్టిస్తారని, తాతయ్య వ్రాయించేడు! చూడొస్తే! పిల్ల నచ్చిందంటూ, ఈ బేరసారాలే మిటంట వీళ్ళూ!' అన్నాడు నరసయ్య ఆలోచనగా!
నయం కాదు తమ్ముడూ! మరీ అయిదువేలూ, పదివేలూ ఆనకుండా మూడువేలకి దిగివచ్చారు! పిల్లకూడా వచ్చింది అంటూ వ్రాసేరు. ఇంతవరకూ పిల్ల నలుపు, అనకుండా వున్నవాళ్ళు వున్నారా! ఏదో ఇంతవరకూ వచ్చిందంటూ వున్నారు. 'నీకు ఆ మాత్రం, ఖర్చు కాకుండా వుంటుందా! ఆ మాత్రం లేకుండా, పెళ్ళి ఎల్లా జరుగుతుంది? మళ్ళీ ఇంకో సుందరం ఈ మాత్రం ఒప్పుకున్నవాళ్ళు దొరకొద్దా! శుభం అన్పించేసుకో!' పెద్ద మనిషిగా చెప్పింది సుందరమ్మ.
అంతేనండి! వదిన చెప్పినట్లు, మళ్ళీ ఎంతకని, వెతుకులాడగలం! ఏదో క్రిందా మీదా పడి సర్దుకుందాం వెంటనే వూఁ అని వ్రాసెయ్యండి!' అని తొందరపడింది జగదాంబ.
'నువ్వూరుకోవే! వెధవ బుడబుడ నువ్వూనూ!' అని గదమాయించేడు నరసయ్య జగదాంబని.
'అది కాదు సుందరమ్మక్కా! కావుడు పెళ్ళికని దాచిన డబ్బు మూడువేలే వుంది. అది కాస్తా కట్నం ఇస్తామనుకో! మరి, పది నవర్సుల బంగారం, పెళ్ళి ఖర్చులూ ఎవరు ఇస్తారు? అంచేత రెండువేలు కట్నం ఇచ్చి, మిగిలిన వెయ్యిరూపాయిల్లో ఖర్చు కరామత్తులు చేద్దామనుకుని, కుని, రెండువేలు కట్నం ఇస్తామంటే ఎవళ్ళూ ఒప్పుకుండా వున్నారు. ఇంకా సుబ్బక్కకి పెళ్ళి చేయాలి! దాన్ని, కట్నం లేకుండా, చేసుకుందుకు చాలామంది ముందుకు వచ్చినా, పెళ్ళి ఖర్చులన్నీ ఒక వెయ్యిరూపాయలన్నా వుండాలి! ఎటు లేదన్నా, ఇద్దరాడపిల్లలూ అత్తవారిళ్ళకి వెళ్ళేసరికి, అయిదారువెలు రూపాయలు ఖర్చు అవుతాయి. పోనీ సుబ్బక్కకి కూడా ఈ పెళ్ళిలోనే పెళ్ళి చేసేద్దాం, అనుకుంటే, ఒక పెళ్ళికొడుక్కి మూడు వేలరూపాయలు పళ్ళెంలో పోసి ఇచ్చి, రెండో పెళ్ళి కొడుక్కు, పళ్ళెం బోర్లగిస్తే బాగుంటుందా! అంచేత ఖర్చు కలిసి వస్తుందన్నా అల్లా చేయటం బాగుండదు. వీళ్ళు రెండువేలు కట్నం కి ఒప్పేలా వుంటే బాగుండును!' అన్నాడు నరసయ్య.
'ఇల్లు మీద అప్పుతెండి! మునుపు 'సుబ్బక్క'నిస్తే చేసుకుంటానన్న వాళ్ళకి వుత్తరం వ్రాయండి. మూడువేలు కట్నం తీసుకుంటూ, బంగారం కూడా ఎక్కడ పెట్టగల మనుకుంటారు! వూరికే మొగ మాటానికి వ్రాసి వుంటారు.' అంది జగదాంబ.
'అప్పుకేం! నిక్షేపంలా తేవొచ్చును అప్పు! ఇంటిమీద, నాలుగువేలు కాదు. ఎనిమిదివేలన్నా తేవొచ్చును. కాని ఎల్లా తీర్చేది! నెలకి నలభయ్, ఏభయ్ రూపాయల దాకా, వడ్డీలు పొయ్యాలి. నేను తెచ్చే నాలుగు డబ్బులూ మనం నలుగురం తింటానికే చాలవు! ఇంక అప్పు ఎల్లా తీర్చేది! ఇల్లు వేలం వేసుకపోతోంటే నువ్వూ నేనూ మగపిల్లలూ చెట్టు క్రింద చేరాల్సిందే కదా! ఇల్లంటూ నిలబెట్టుకోగలిగితే, ఆడపిల్లలు అత్తవారిళ్ళకు వెళ్ళిపోయాక, సగం పోర్షను ఏ కాలేజీలో చదివే కుర్రవాళ్ళకో అద్దెల కిస్తే, ఓ యాభయ్ రూపాయలు ఆదాయం వస్తూంటుంది. అదీ ఇదీ పెట్టుకుని నిశ్చింతగా కాలం గడపొచ్చును.' అన్నాడు నరసయ్య.
'అయితే ఏం చేద్దామంటారు?' తార్కికంగా చూస్తే నరసయ్య చెప్పినదే నిజమనిపించింది జగదాంబ కు.
'మేము రెండువేలకన్నా ఎక్కువ కట్నం ఇచ్చుకోలేమనీ, బంగారం అసలు కొనే తాహతులో లేమనీ, కాస్త దయగా ఆలోచించి, మా పిల్లని చేసుకోవాలసిందనీ, వ్రాస్తాను' అన్నాడు నరసయ్య.
'నల్లపిల్ల వచ్చిందన్నందుకు లోకువ కట్టామనుకుంటారేమోనండీ! నా మాట వినండి! ఎల్లాగో అల్లా మూడువేలూ, ఇచ్చేస్తామని వ్రాయండి! బంగారం కొనే తాహతు మనకు ఎలానూ లేదు! జాలి గొలిపే రీతిలో వ్రాయండి వుత్తరాన్ని! మీ ధన్వంతరీ దర్పాన్ని చూపెట్టకండి! అనవసరంగా ఇంతవరకు వచ్చినదాన్ని చెడగొట్టినట్లు అయిపోతుంది. ఎల్లానో దీనికి ముడిపడితే, సుభద్రకి నెమ్మది మీద చేయొచ్చును!' అంది గాభరాగా జగదాంబ.
'మరి పెళ్ళి ఖర్చులు ఎల్లా వెళ్ళతీయటం?' అన్నాడు నరసయ్య.
'ఎల్లానో అల్లా తిప్పలు పడదాం!' అంది జగదాంబ.
'వెర్రిదానా! నోటితో అన్నంత తేలికటే తిప్పలు పడటం అంటే!'
ఏదో ఇంతవరకూ వున్న దాంట్లో ఆడపిల్లల్ని సవ్యంగా వాళ్ళ ఇళ్ళకి పంపించేస్తేనే నువ్వూ నేనూ, ఒకేపూటనే తినాల్సి వస్తుంది. ఇంక ఇల్లు కడిగిపెట్టి వాళ్ళకి దోచిపెట్తే, మనకి మిగిలేది చిప్పా కర్రాయె! ఈ అల్లుళ్ళు మన్ని నెత్తిన పెట్టుకుని పోషిస్తారా! నీకేం తెలీదు. ఏదో పెళ్ళి అయిపోతే చాలన్న ఆరాటమేకాని, మన ఆర్ధిక పరిస్థితులు ఎల్లాంటివో ఆలోచించవు!' అంటూ కండువా దులిపి భుజంమీద వేసుకుని, బయటకు వెళ్ళిపోయాడు నరసయ్య. జగదాంబ ఆలోచనగా వంటింటికేసి వెళ్ళింది. వసుంధర, సుందరమ్మ దగ్గర కొచ్చింది.
'అయితే చాలా ఇబ్బందుల్లో వున్నారన్నమాట వీళ్ళు' సానుభూతిగా అంది వసుంధర.
'అవును పాపం! ఆడపిల్లలు ఎదిగి కూర్చున్నారు. మగపిల్లలు చేతికందిన వాళ్ళుంటే అదొకదారిగా వుండేది. వాళ్ళూ కసుగాయలైపోయె! ఈ నాలుగయిదేళ్ళు కాస్త గడ్డుగానే వుంటాయి వీళ్ళ రోజులు!' నిర్లిప్తంగా అన్నది సుందరమ్మ.
'అయితే ఇప్పుడింత ప్రయాసపడి ఈ పెళ్ళిళ్ళు చేయకపోతేనేం పిన్నీ! ఇల్లంతా ఆర్ధిక బాధలతో అల్లల్లాడుతూంటే కూతుళ్ళని అత్తవారిళ్ళకి పంపగలిగితే మాత్రమేం లాభం? పెళ్ళిచేసి పంపగానే సరా! చీరెలనీ, సారెలనీ, ఖర్మం చాలక నెల తప్పేరంటే సూడిదలనీ, సీమంత మనీ, బాలసారె అనీ ఏవో ఖర్చులు తగుల్తూనే వుంటాయి! ఆడపిల్లలు వూరు కున్నా అత్తవారు వూరుకోరు కదా! వాళ్ళ సాధింపులు పడలేక, ఈ ఆడపిల్లలు ఏవో అఘాయిత్యాలు చేసుకోవటం కూడా జరుగుతోంటుంది అక్కడక్కడ! పెద్ద పిల్లలయ్యాక పెళ్ళిళ్ళు చేయటంనించి, వెంటనే వచ్చే పురిటి ఖర్చుకి కూడా రెడీగా వుండాలి ఆడపెళ్ళివాళ్ళు! అంచేత ఈ పిల్లల్ని కూడా చదివించి, వాళ్ళకి తగ్గ ఉద్యోగాల్లో ప్రవేశ పెట్టిస్తే, కాస్త రెక్కకి ఆసరాగా వుంటారు. మగపిల్లలు చేతికి అందిరాగానే అప్పుడే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయొచ్చును!' అంది వసుంధర.
'అల్లా చేయాలంటే, చాలా ఇబ్బందులున్నాయి. ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుందుకు, మన యువ కులు ముందుకు రావటంలేదు. పెద్ద వాళ్ళు కూడా, వుద్యోగం చేస్తోందికా, దానికి పెళ్ళెందుకూ! అనే ధోరణిలో వుంటున్నారు. పోనీ తోటి వుద్యోగస్థుల్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు అనుకుంటే, దానికీ కొన్ని తెలివితేటలుండాలి. ఇంట్లో తల్లితండ్రుల చాటున, ఆకు మాటున పిండెలా పెరిగే ఆడపిల్ల వక్కసారిగా విశాలప్రపంచంలో ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని చివరికంటా తీర్చిదిద్దగల యువకుడ్ని ఎన్నుకుందుకు తగిన ఆత్మస్థయిర్యం కలదెలా అవుతుంది? ప్రేమ ప్రేమ అనుకుంటూ, ఏ కామోప జీవికో తన సర్వస్వం అర్పించి భంగ పడితే ఇంక ఆ ఆడదాని జీవితానికి వెలుగు బాట ఎక్కడుంది? పోనీ తల్లి తండ్రులే, తమ మగపిల్లలు చేతికి అందివచ్చేదాకా ఆడపిల్లల్ని వుంచి అప్పుడే సంబంధాలు వెతికి పెళ్ళిళ్ళు చేయాలి అనుకుంటే, అప్పటికి ఈ ఆడపిల్లలకి పాతికేసి ఏళ్ళువచ్చి నెత్తి కెక్కుతాయి! ఇప్పుడు ఈ స్థితిలో పిల్ల, కట్నం నచ్చటమే బ్రహ్మప్రళయమౌతూంటే అప్పుడు పిల్ల దాని వయసు కూడా నచ్చటం బ్రహ్మయత్నంగానే వుంటుంది. ఇరవయి ఏళ్ల యువకుడూ పదహారేళ్ళ బాలాకుమారినే పెళ్ళాడటానికి సహజంగా ఆశపడ్తాడు. ముఫ్ఫయ్ ఏళ్ల ముదిమి యువకుడూ పదహారేళ్ళ పసిదానివే చేపట్టటానికి ఎగిరి గంతేస్తాడు. కాని, అయ్యో! నా నెత్తికి ముఫ్ఫయ్ఏళ్ళు వచ్చాయి! ఈ చిన్నపిల్లని పెళ్ళాడడమేమిటి? నా వయసుకి తగ్గట్టు ఏ పాతికేళ్ళ పిల్లనో చేసుకోవాలి. ఈ పదహారేళ్ళ పసిదాన్ని నేను చేసుకోను, అనుకోడు. ఇంక ఆడపిల్లల తల్లి తండ్రులా! వాళ్ళకి పెళ్ళికొడుకు వయసుతో కాని, ఈడూ జోడూ తో కానీ, రూపముతో కాని, పనే వుండదు. ఎల్లాగో అల్లా ఆడపిల్లకు పెళ్ళి చేయాలి! పిల్లని అత్తవారింటికి పెళ్ళిచేసి పంపేదాకా, ఆడపిల్లల తల్లితండ్రులకి ఇదే తపన! వాళ్ళకి వయసూ, సొగసూ, చూసిచేద్దామన్న తలంపు అసలు వుండనే వుండదు! ఇంక ఇచ్చేవాళ్ళకి లేని అభ్యంతరం చేసుకునే వాళ్ళ కెందుకుంటుంది? ఎందుకుండాలి?' అంది సుందరమ్మ.
'నిజమే పిన్ని! కొంతమంది ఆడపిల్లలకి ప్రేమించామని మగవాళ్ళని, ఆకట్టుకోవటం కూడా చాతకాదు. చదువుల్లో పెట్తే మటుకు ఠకీ ఠకీమని ప్రతీ క్లాసూ ప్యాసయిపోతూ వుంటారు. వాళ్ళకి తగ్గ పై చదువులు చదివిన యువకులని తేవటం కూడా కష్టమౌతుంది. పోనీ ఉద్యోగస్థురాళ్ళల్లా వదిలేద్దామంటే సంసారం అంటూ లేకుండా నిర్జీవుల్లా వుంచటానికి నీ తల్లితండ్రులకి మనసొప్పుతుంది?' అంది వసుంధర.
'అమ్మాయీ! ఇందుకు కారణం నేటి యువతీయువకుల్లో నైర్మల్యత స్థిర చిత్తం లేకపోవటమే! ఏ యువకుడైనా నిజంగా తన కంటికీ, మనస్సుకీ నచ్చిన పిల్ల దాన్ని కట్నాపేక్ష లేకుండగా వర్ణవివక్షత లేకుండగా, చేపట్టటానికి సిద్దుడై వున్నాడా? ఏ ఆడపిల్లల తల్లి తంద్రులైనా, తమ కూతుళ్ళని, కట్నం లేకుండా పెళ్ళి చేసుకుందుకు ముందుకు వచ్చిన యువకులకి, వర్ణ విచక్షణ పెట్టుకో కుండా ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారా? అవ్వా కావాలి బువ్వా కావాలి! అంటున్నారు. చేసుకుంటానన్నవాళ్ళకి ఇయ్యబుద్ధి పుట్టదు. ఇయ్య బుద్ధి పుట్టిన వాళ్ళకి చేసుకో బుద్ధి పుట్టదు. అయినా, ప్రేమలకి తక్కువ ఏమన్నావుందా! సహ విద్యార్ధుల మధ్య, సహ ఉద్యోగస్థుల మధ్య ప్రేమకబుర్లు దొర్లి పోతూ వుంటాయి. ఈ ప్రేమికుల్లో పెళ్ళి చేసుకుని, 'నా భార్య' అని నిలబడి గృహస్థ విధులని నిరతిగా నిర్వర్తించే యువకులు మచ్చుకైనా ఉంటారా! ఉండరు. ప్రేమంటే వాళ్ళ దృష్టిలో వెన్నెల షికార్లూ, రూఫ్ గార్డెన్ డిన్నర్లూనూ! అంతకుమించి పవిత్ర దాం పత్య బంధం అనేది వకటి మనల్ని అన్ని దేశాల ప్రజలకన్న నైతికోన్నతంగా నిలబెట్టుతోందన్న జీవనీతిని నేటి యువతీ యువకులు గ్రహించుతున్నారా?' అన్నది సుందరమ్మ. అక్కడికొచ్చి నించున్న కామేశ్వరినీ చూసింది వసుంధర. కామేశ్వరి ముఖం చిన్నబోయి తెలతెలబోతూ, వెలిసిపోయిన పాతచీర పేలికల్లె అయింది. వసుంధరకి కామేశ్వరిని చూసేసరికి చెప్పలేని జాలి వేసింది. 'కామేశ్వరి, సంసారపు జరుగుబాటు గురించి, తలుచుకుంటూనే ఆంద్రదేశపు మధ్యతరగతి కుటుంబాల జీవితాల్ని చర్చించేసారు. ముందు కామేశ్వరి వాళ్ళ ఇంట్లో కామేశ్వరి కున్న స్థాన మెలాంటిది? అది ఆలోచించనైనా లేదు తామిద్దరూ! నిజానికి కామేశ్వరి తల్లి తండ్రుల కొక సమస్యగా వుందిప్పుడు. కామేశ్వరిని రూపాయలతో తూస్తే, అందరు పెళ్ళికొడుకులూ నేనంటే నేనని ముందుకు వద్దురు. అంత తాహతు నరసయ్యకు లేదు. కామేశ్వరికి పెళ్ళి చేయకుండా వుండలేరు చేస్తే వచ్చే ఆర్ధికబాధలకు తిట్టుకోలేరు. ఆర్ధిక బాధలు లేకుండా కామేశ్వరికి పెళ్ళి అయిపోతే, ఆ సంసారం ఒక గాడిలో పడినట్లే తిరుగుతుంది.
'నీ చీకటిగదిలో చిన్న దివ్వెను వెలిగించు! ఆ కాంతి నీ ముంగిటని ప్రకాశవంతం చేస్తుంది!' అనుకొంది వసుంధర!
* * *
