2
పంచాయితీ ఆఫీసుకి బయలుదేరాడు రామం. ఆ ఊరివారంతా లక్ష్మయ్యగారిని ప్రసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనుకున్నారు. ఆ విషయం ఒకరోజు వారివద్ద కదిపి చూశారు. వారు గ్రామస్తుల ప్రతిపాదనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ 'అరవై ఏండ్లు నిండినవాడిని ఆలోచన అడగకూడదట! ఇరవై
ఏండ్లు నిండని వారికీపెత్తన మీయకూడదట.....! అరవైఏండ్లు పైబడి అన్ని జంజాట నలను వదులుకొని నిశ్చింతగా గడుపుతున్న నాకు ఈ వయసులో పెత్తనం ఎందుకు?' అని నిష్కర్షగా చెప్పి తప్పించుకున్నారు లక్ష్మయ్యగారు. కనీసం రామాన్నైనా అందుకు ఒప్పించమని కోరారు లక్ష్మయ్యగారిని. రామం యిష్ట పడితే తనకు ఏ అభ్యంతరమూ లేదనీ, తనకు యిష్టమేననీ అన్నారు. కొన్ని షరతులపై రామం ప్రశిడెంటుగా ఉండడానికి ఒప్పుకున్నాడు. ఎటువంటి పరిస్థితులలో కూడా గ్రామంలో చీలికలు ఏర్పడ కూడదు. అంతా ఒకమాట పైన నడుచుకోవాలి. ఒకరు ఎక్కువ మరొక్కరు తక్కువ అనే భేదాభిప్రాయాలు రాకుండా చూసుకొనే బాధ్యత ఊరిలోగల పెద్ద లందరిదీ! ప్రతి చిన్నవిషయానికీ ఆవేశాలు పెంచుకోకూడదు. ఇటువంటి షరతుల కన్నింటికీ ఊరిపెద్దలను ఒప్పించి, నామ మాత్రంగా తను ప్రెసిడెంటుగా ఉండబోతున్నట్లు బరువు బాధ్యతలు అందరూ కలిసి పంచుకోవాలని వారికి నచ్చజెప్పి ఒప్పించి ప్రశిడెంటుపదవి స్వీకరించాడు రామం. అప్పటినుండి యిప్పటివరకు ఎటువంటి కలతలు లేకుండా గ్రామం మొత్తం రామం సలహాలపై నడుస్తూ ఆదర్శ గ్రామంగా పేరు సంపాదించుకుంది. ఎంతో కృషిచేసి గ్రామానికి విద్యుచ్చక్తి తెప్పించాడు, లైబ్రరీసదుపాయం కల్పించాడు. చుట్టు ప్రక్కల ఉన్న గూడెం ప్రజలకు వయోజనవిద్య ఆరోగ్య సూత్రాలను గురించిన బోధ ఏర్పాటు చేయించాడు. ఆస్పత్రి భవనానికి పునాదులు వేయించే ప్రయత్నంలో ఉన్నాడు. అతని కృషి, సహృదయత పల్లెలోని ప్రతివ్యక్తిని ఆకర్షించింది. అందరూ అతనిని తమ కుటుంబవ్యక్తిలా చూస్తున్నారు. ఏసమస్య వచ్చినా అతని ద్వారా పరిష్కరించబడవలసిందే! పేదవారికి చేయూతనిచ్చి ఎంతో సహాయం చేస్తున్నాడు. బంజరు భూములకు దరఖాస్తులు పెట్టించి, వాటిని మంజూరు చేయించి వ్యవసాయపు పెట్టుబడులను ప్రభుత్వం నుండి శాంక్షను చేయించి వారికి ఉపాధులు కల్పించాడు. ఆవిధంగా పేదలపాలిటి పెన్నిధిగా పేరు సంపాదించుకున్నాడు.
రామం చూపరులను యిట్టే ఆకర్షించ గల అవయవ సౌష్ఠవంగలవ్యక్తి. చక్కని శరీరచ్చాయతో, ఎత్తుకు తగిన లావుతో, కళకళలాడే ముఖవర్చస్సు కలిగి ఉంటాడు. అందరినీ చిరునవ్వుతో సంతోషంగా పలుకరిస్తాడు. అతని శత్రువులు కూడా అతనిని గురించిన చెడు మాట్లాడుకోరు. ప్రచారం చేయరు. ఇన్ని సలక్షణాలమధ్య ఒక్కదుర్గుణం ఉంది. అతను ముక్కోపి. అయినా కోపం అంత త్వరగా రాదు. ఒక వేళవస్తే ఆ కోపంతో ఆవేశంతో తనను తానే మరిచిపోతాడు. అందువల్ల అతనిని అందరూ ఎంత గౌరవిస్తారో అతని కోపానికి అంత భయపడతారు.
* * *
భర్త చనిపోవడంతో సర్వస్వాన్ని కోల్పోయిన స్త్రీ ధరించిన నల్లచీరెతో పోటీ పడుతోంది ఆ నిశిరాత్రి. ఏదైనా అఘాయిత్యం చేయబోయేముందు వెలుగు నంతం చేసే చోరులలా మేఘాలు నక్షత్రాల కాంతిని కప్పివేస్తున్నాయి. ఆగి ఆగి వినవస్తూన్న ఉరుములు. అక్కడక్కడ పడుతూన్న చినుకులు విజ్రుంభించిన వాయుదేవుడు. రాబోతూన్న భీభత్సానికి నాందీ ప్రస్తావనగా కనబడుతూన్న ప్రకృతిలో ఉస్మానియా యూనివర్శిటీ గర్ల్స్ హాస్టలు లోని ఒక గది కిటికీ తలుపులు ఆగకుండా శబ్దం చేసున్నాయి. ఆ శబ్దానికి ఉలికిపడి లేచిన శారదకి కిటికీ తలుపులు మూయడానికి మంచం దిగి నాలుగడుగులు వేసింది, తెరుచుకుంటూ మూత పడుతూన్న ఆ తలుపుల మధ్య నుండి కనుపిస్తూన్న ప్రకృతి విజ్రుంభణ ఆమెను భయంతో ముంచెత్తింది. గుండె దిటవు పరచుకొని ఆ కిటికీ తలుపులను ఎలాగో మూసింది.
ఆమె జీవితానికీ యిటువంటి భయం కర నిశిరాత్రులకు ఏదో అవినాభావ సంబంధము ఉండి ఉంటుంది. ఈవిధంగా ప్రకృతి విజ్రుంబించినప్పుడల్లా ఆమెకు గతస్మృతులు గుర్తుకు రావడం పరిపాటి. ఈరోజు కూడా అదే జరిగింది. గతం గుర్తుకు రావడంతో, భయంవల్ల ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. ఆ భయాన్ని దూరంచేసుకోవాలనే ఉద్దేశంతో తలగడలో తల దూర్చి నిద్రపోవడానికి ప్రయత్నించింది. ఆ నిద్రాదేవిని ఆశ్రయించే వారికి ఉండవలసిన అర్హతలులేని కారణంగా ఆ దేవి శారదను తనలో యిముడ్చుకొనడానికి నిరాకరించడం జరిగింది ఎటూ పాలుపోక కాటుక కళ్ళనుండి చారలుకట్టిన కన్నీటితో విలవిలలాడిపోతూంది ఆమె పిశాచాలు వికటాట్టహాసం చేసినట్లు గతం ఆమె కళ్ళముందు స్ఫురణకు రాసాగింది. గతం....ఆ గతంలో తనకు జరిగిన ఘోర మైన అన్యాయాలు స్మృతిపధంలో మెదలడంతో ఆమె తన ధైర్యాన్ని కోల్పోయి, గుండె జల్లెడై నీరు కారిపోగా బెదురు చూపులతో ఒక్కసారి కెవ్వున కేకవేసింది.
ప్రశాంత వాతావరణంలోనైతే ఆ కేక హాస్టలు వారందరికీ నిద్రాభంగం కలిగించి ఉండేది. కాని ఉరుములు మెరుపుల మధ్య గది తలుపులు కిటికీలు బంధించి ఉన్న కారణంవల్ల ఆ గదిలోనే నిద్రిస్తూ ఉన్న ఒక్క శాంత నిద్రనుమాత్రం భంగపరచగలిగింది.
ఉలికిపాటుతో లేచిన శాంతకు శారద పరిస్థితి కొన్ని క్షణాలవరకు అర్ధంకాలేదు. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత ఆమె పరిస్థితి అర్ధంచేసుకొని శాంత శారదను తన ఒడిలోనికి తీసుకొని భయంతో వణికిపోతున్న ఆమె హృదయానికి ఊరట కలిగించింది.
'శారదా! ఇలా అప్పుడప్పుడు నిద్ర నుండి అకస్మాత్తుగా లేచి భయంతో కేకలు వేస్తూ ఉండడం ఒకటి రెండుసార్లు జరిగింది. ఎంత గ్రుచ్చి గ్రుచ్చి అడిగినా కారణం చెప్పడంలేదు.'
'................................'
సమాధానం చెప్పకుండా వెక్కివెక్కి ఏడవసాగింది శారద.
'శారదా సమాధానం చెప్పకుండ ఏడుస్తే నన్ను చంపుక తిన్నట్లే!'
'శాంతా.....అం.....త......మా....ట....నకు ఈ.....నిర్భాగ్యురాలి,.... కోసం.....అంత పెద్ద.... ఒట్టు... వే.... సు..... కోవద్దు' వెక్కిళ్ళ మధ్య, తడబడుతూ అంది శారద.
'శారూ! ఏ ముహూర్తంలో మన మిద్దరం స్నేహితులమయ్యామో? మన స్నేహలత పెరిగి, పుష్పించి, ఫలించింది. నీ కోసం నేనేమైనా చేయగలను. నీ కష్ట సుఖాలలో భాగం పంచుకొనే అవకాశం నాకివ్వు. ఈ సంగతి నీకెన్నిసార్లో చెప్పాను. నీవు నన్ను పరాయిదానివిగా చూస్తున్నావు. ఇది నీకు న్యాయమా...?' తన హృదయంలో శారదపై నిండిన జాలినంతా కళ్ళల్లో నింపుకుంటూ ప్రశ్నించింది.
'శాంతా! నీవు జీవితంలో తటస్థపడి ఉండకపోతే నేను ఏమైపోయి ఉండే దాన్నో...? నాపైన నీకింత జాలి గలగ డానికి నేను ఎన్ని జన్మల పుణ్యాన్ని మూటగట్టుకొని ఈ జన్మ ఎత్తానో...? అంధకారంలో కాంతి కిరణంలా, గ్రుడ్డి వాడికి చేతి కర్రలా, నీ ఆసరాయే నాకు లేకపోతే నేను ఏనాడో చరిత్ర హీనురాలనై పోయేదాన్ని'
'ఊరికే జరిగిపోయినదాన్ని గురించి అలా బాధపడతావెందుకు? అమావాస్య తరువాత పౌర్ణిమ, చీకటి తర్వాత వెన్నెల సహజమే కదా....! ఎప్పుడూ నీలో నీవే కుమిలిపోతూ ఉంటావు. పోనీ ... నీ గత చరిత్రంతా నాతో చెప్పి నీ హృదయభారాన్ని కొంత తగ్గించుకోకూడదూ...? ఇలా ఎంతకాలమని నీలో నీవు బాధపడు తూ ఉంటావు....? నన్నూ నీ బాధలో పాలు పంచుకోనీ'

శాంత కళ్ళలా మంచి ముత్యాలలా మెరిసిపోతున్న కన్నీటిని చూసి బావురుమంది శారద.
'భగవంతుడు నాకీ జన్మ ఎందుకు ప్రసాదించాడో అర్ధం కావడం లేదు. ఎప్పటికప్పుడు నాపై తను క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ, నన్ను నలిపివేయాలని చూసేవారికి జయమూ. నన్ను ఆదుకొని నాకు సహాయపడదామనుకొనే వారికి అపజయమూ కలుగుతూ ఉంది. అది నాదురదృష్టం....! నాకోసం ఎంతో శ్రమ పడ్డావు. నా బాధల్లో పాలుపంచుకున్నావు. నన్ను పోషిస్తూ, నీ చదువు కోసం నీ పెద్దలు పంపిస్తూన్న డబ్బు రెండు భాగాలుగా చీల్చి నీ కనీస అవసరాలను కూడా తప్పించుకొని నా కోసం త్యాగం చేస్తున్నావు. అందుకు నేను అర్హురాలినా? ఏ విధంగా కూడా నీ ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి యిలా ఎంతకాలం నీ నుండి ఉపకారాలను పొందుతూ ఉండగలను....? దానికీ ఒక హద్దంటూ ఉండొద్దా.....? నీ సహచర్యంతో 'మంచి' అనే పదానికి అర్ధం తెలుసుకో గలిగాను. నీతో పరిచయానికి ముందు ఆపదానికి ఎక్కడా నిర్వచనం లభించలేదు. భగవంతుడు నాకు ప్రసాదించిన బాధామయ జీవితానికి నిరంతరం వగచి, వగచి, గుండెలు బ్రద్దలయ్యేలా విలపిస్తూన్న నాకు జీవితం పై ఆశలు చిగురింప జేశాయి నీ అమృత మృదు వాక్కులు. కనుకనే గతాన్ని మరిచి పోగలుగుతున్నాను కొంతవరకు. కాని పూర్తిగా అది సాధ్యపడడం లేదు. ఏ ఘడియలోనో నాకు తెలియకుండానే నేను గతస్మృతులలో ప్రవేశిస్తున్నాను. బాధతో విలవిలలాడి పోతున్నాను. దీనికి అంతమెప్పుడో అర్ధం కావడంలేదు. ఎడారిలో దారితప్పిన ప్రయాణీకునిలా గమ్యం తెలియని బ్రతుకైంది నాది,' అని హృదయ విదారకంగా విలపిస్తూన్న శారదను ఎలా వోదార్చాలో తోచక కొన్ని క్షణాలు నిర్విన్నురాలై గడిపింది శాంత. ఆ తరవాత మెల్లిగా తేరుకొని 'శారదా....! నీవు ఏడుస్తూ నన్నుకూడా ఏడిపిస్తావా...?' దీనంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.
ఆ మాటతో శారద కళ్ళుతుడుచుకొని ఏడుపు మానింది. ఆ ముఖంలో దైన్యం, నిస్సహాయత, జీవితంపై విసుగు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడుస్తూ, 'శారూ... నిన్ను ఎంతగానో బ్రతిమాలుకుంటున్నాను. ఇది వరకు కూడా బ్రతిమాలను. ధైర్యంగా నిలబడి కష్టాలను ఎదుర్కోవాలి. నీవు భరించలేని కష్టాలకే గురై ఉండవచ్చు.... కాదనను. కాని యికముందు నీకు ఎటువంటి యిబ్బందులూ కలుగకుండా చూసే బాధ్యత నాది. ఇంకా నీవలా బాధపడుతూ ఉండే నామీద నీకు నమ్మకం కలుగ లేదేమోనని అనుమానం కలుగుతూ ఉంది. మనసును దిటవు పరచుకోవాలి. పడిన కష్టాలకు యెంతకాలమని బాధపడతావు....?'
'శాంతా...! నీ ఋణం ఎలా తీర్చుకో గలనో చెప్పు....? యెన్నోవిధాల నాకు ధైర్యాన్ని కలుగజేస్తున్నావు. నీకు నేను ఆ జన్మాంతం కృతజ్ఞత చూపించినా తక్కువే....! ఈ రోజుల్లో తల్లిదండ్రు లకు అప్పచెల్లెళ్ళకు, అన్నదమ్ములకే ఒకరిపై మరొకరికి ప్రేమలు కరువయ్యాయి - అలాంటప్పుడు ముక్కూ, ముఖం తెలియని నాపైన ఎంతో ఆదరణ చూపుతున్న నిన్ను దేవతగా నామనసులో ప్రతిష్టించుకున్నాను' మనసును కుదుట పరచుకుని అంది.
'అంత పెద్ద మాట లెందుకు? ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చేయతగిన దానికన్న ఎక్కువ నేనేం చేస్తున్నాను? నీవలా మాట్లాడి నన్ను చిన్నబుచ్చకు.'
'మీ పెద్దలకు తెలుస్తే నిన్నే మంటారో నని నాకు చాలా భయంగా ఉందే....! అదీగాక మీనాన్నగారి అభిప్రాయానికి విరుద్ధంగా నీ చదువు సాగుతూ ఉందని చెప్పావు....'
'ఆ అనుమానం నీకేమాత్రం అవసరం లేదు. మా బావ సంగతి నీకు తెలియదు. గొప్ప విశాలహృదయం గలవాడు. ఆయనకు పేదవారంటే పంచప్రాణాలు నీ విషయం తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. ఉత్సాహంతో నన్ను అభినందిస్తాడు. ఎక్స్ కర్షన్ కు వెళ్ళి వచ్చాక మనమిద్దరమూ మా ఊరు వెడదాం. బావదగ్గరినుండి మనియార్డరూ ఉత్తరమూ వచ్చాయి. నేను వ్రాసినదానికన్న ఎక్కువ డబ్బే పంపించాడు, మనయిద్దరికీ పుష్కలంగా సరిపోతుంది' సంతోషంతో అంది.
'ఇద్దరికీ సరిపోవడమేమిటి? వద్దు శాంతా...! నా అవసరాలను ఎలాగో తీరుస్తూనే ఉన్నావు. ఈలాంటి విలాసాలకు నిన్ను డబ్బు ఖర్చుచేయనివ్వను. ఈ డబ్బే ఉంటే వచ్చే సంవత్సరం ఫీజుకు ఉపయోగపడుతుంది. ఉండడానికి స్థలమిస్తే పడుకోను మంచమడిగినట్లుంటుంది నీతో నేను బయలుదేరడం. అయినా నాకెందుకు శాంతా....ఈ ప్రయాణాలు? అటువంటివి నోచుకొని పుట్టలేదు నేను.'
