హైస్కూల్లో నాటకాల కమిటీ మెంబరు గా ఆడపిల్లల తరపున వసుంధర ఎన్నికయింది.
హైస్కూల్లో పై తరగతుల్లో విద్యార్చినులు పాతిక మందికి పైగా ఉన్నారు. అంతా కలిసి చందా వేసుకుని, వసుంధర కు టీ పార్టీ చేయాలని నిశ్చయించు కుని, ఒక పెద్ద హోటల్లో రూఫ్ గార్డెన్ టీ పార్టీకి అర్దరిచ్చారు. వసుందర వద్దని చెప్పినా ఎవ్వరూ వినలేదు.
ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు టీ పార్టీ . విద్యార్ధి నులంతా ముస్తాబై కిలకిల లాడుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక్కసారి హోటల్లోకి వచ్చేసరికి అందరికీ ఆశ్చర్య మనిపించింది. అందరి కళ్ళూ వీళ్ళందరి మీదనే ఉన్నాయి. అందరు ఎదురుబదురుగా కుర్చీల్లో కూర్చున్నారు.
రమేష్, సురేంద్ర అప్పటికే ఆ హోటల్లో కాఫీ తాగుతున్నారు. వాళ్ళు వస్తారని రమేష్ కు తెలీదు. వాళ్ళంతా మేడమీదికి వెళ్ళేటప్పుడు వసుంధర ను రమేష్ చూశాడు. సురేంద్ర ఇదేమీ పట్టించు కోలేదు.
టీ పార్టీ అయి అంతా మేడ దిగి వస్తున్న సమయంలో రమేష్ కొంచెం హెచ్చు స్థాయిలోనే అందరికీ వినబడేటట్లుగా , "ఈ ఆడపిల్ల లంతా ఇట్లా కాఫీ హోటళ్ళ వెంట బడుతుంటే, ఇంక కొన్నాళ్ళు పొతే కాఫీ హోటళ్ళ లో అసలు మగవాళ్ళ కి సీట్లే దొరక వేమో!" అన్నాడు.
వసుంధర తో బాటు విద్యార్ధి నులంతా ఈ మాట విని వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.
"వాళ్ళని చూస్తె నాకు జాలి వేస్తున్నదిరా" అన్నాడు సురేంద్ర.
"ఏం?" అన్నాడు రమేష్.
"పెళ్ళిళ్ళయి కాపరాలకి వెళితే ఆ వచ్చిన మొగుళ్ళు హోటళ్ళ కు తీసుకు వెళ్ళే వారుంటారు, తీసుకు వెళ్ళని వారుంటారు. అత్తగారి అదు పాజ్ఞాల్లో ఉండవలసి వస్తుంది. అందుకని ఆడపిల్లలు పెళ్లి కాక మునుపే ఇలాంటి చిట్టి చిట్టి పొట్టి సరదాలన్నీ తీర్చేసుకోవాలి,." అన్నాడు సురేంద్ర.
"బావుందిరా! ఇంత ఆలోచన నీ బుర్రలో కలుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వూ కాస్త ప్రపంచంలో పడుతున్నావ్!"
ఇద్దరూ కాఫీ త్రాగి వచ్చేశాక పిక్చరు కు వెళ్లారు.
మనవ జీవితాల్లో మేధా సంపత్తి, విజ్ఞానము, చదువు సంధ్యలె గాక ఒక్కోరకమైన అపూరూపమైన కళా విశిష్టత ఇమిడి ఉంటుంది. సంగీతసాహిత్యాలు, భారత నాట్యమూ, తపస్సం పన్నులకు మాత్రమే అబ్బుతాయి. సామాన్యంగా ఎవ్వరి లోనూ లేని విశిష్టత రమేష్ దస్తూరి లో ఉంది. ఎట్లా అబ్బిందో గాని అతను మూడు రకాల దస్తూరీ లో వ్రాయగలడు. కాలేజీ లో మామూలుగా వ్రాసే దస్తూరి ఒకటి. పత్రికల్లో కధలూ, గేయాలూ మ్ వ్యాసాలూ వ్రాసే దస్తూరి ఒకటి. అచ్చంగా ఆడవాళ్ళు వ్రాసినట్లుగా వ్రాయగల దస్తూరి ఒకటి. ఇట్లా మూడు రకాలుగా వాయగలడు.
మర్నాడే ఎవరో ఆడపిల్ల వ్రాసినట్లుగా వసుంధర కు ఉత్తరం వ్రాశాడు.
"వసుంధరా దేవి,
'శుభాకాంక్షలు . మీరు హైస్కూలు నాటకాల కమిటీ మెంబరాయి నారనీ స్నేహితులంతా మీకు హోటల్లో చక్కగా టీ పార్టీ ఇచ్చారనీ విని ఎంతో సంతోషించాను. నేను మీ హైస్కూల్లో పూర్వ విద్యార్ధినిని. నాకు నాటకాల్లో అంతగా ప్రవేశం లేకపోయినా చక్కని ప్రదర్శన యోగ్యమైన నాటకాలూ, నాటికలూ వ్రాసి యివ్వగలను. రాబోయే జనవరి ఇరవై అరుకు ఏదయినా నాటకం వెయ్యాలను కుంటున్నారు కదా? అంటే ఇంకా మూడు నెలల వ్యవధి ఉన్నది. మీకు ఒక గంట పరిమితి లో ప్రదర్శన యోగ్యమైన నాటిక వ్రాసి ఇవ్వగలను. ఏ విషయం మీద నాటిక కావాలో తెలిపితే పది రోజుల్లో నాటిక వ్రాసి పంపగలను. తప్పక జాబు రాస్తారుగా!
'ఒక చిన్న విషయం . వీలయినంత వరకూ మీరు నన్ను కలవవద్దు. ఎందుకంటె మావారికి ఇలాంటి నాటకాలూ, నాటికలూ అంటే గిట్టవు. వారు చూస్తుండగా ఇలాంటి విషయాలు మాట్లాడు కుంటుంటే నన్ను కేకలేస్తారు. అందుకనే ఉత్తరాల ద్వారా కలం స్నేహితులుగా ఉందాం. వెంటనే జాబు -- వ్రాస్తారు కదూ!
నూతన స్నేహితురాలు,
సరోజ.'
అడ్రసు సరోజ, కేరాఫ్ బి . రమేష్ అని వ్రాశాడు. ఉత్తర మంతా అచ్చంగా ఆడవాళ్ళు వ్రాసినట్లుగానే ఉంది. కవరు పోస్టు చేశాడు. ఈ విషయం సురేంద్రతో చెప్పలేదు.
నాలుగో రోజునే వసుంధర నుంచి ఉత్తరం వచ్చింది. కాలేజీ నుంచి రాగానే గదిలో పడి ఉన్న కవరు చూశాడు రమేష్. ఎంతో సంతోషంతో కవరు చించి ఉత్తరం చదివాడు. వాళ్ళ నాన్న వ్రాసిందేమో నని ఆ ఉత్తరం సంగతే అడుగలేదు సురేంద్ర.
"నమస్కారములు. మీ ఉత్తరం చేరింది.
