Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 4

 

    అబ్బాయిని సాగనంపే ఉపాయం తోచక కళ తల పట్టుకున్నది.
    "అది సరేగాని అబ్బాయిని సాగనంపే ఉపాయం చెప్పిన వారికీ...."
    "ఎమిస్తావ్?' అని రెట్టించింది గీత.
    "స్వయంగా వళ్లోంచి నా చేత్తో మంచి టిఫిన్ చేసి పెడతాను!" అని బ్రతిమాలింది కళ.
    "మైగాడ్! మాకెందుకంత శిక్ష?.... భలే మంచి ఐడియా! ఇదే అబ్బాయి మీద ప్రయోగిస్తే?"
    "ఏమిటేమిటి?" అనడిగింది చిత్ర వివరంగా బోధపడక.
    "మరేం లేదు! కళ రెండు రోజుల పాటు అతిధికి వంట చేసి పెడితేనో?' అంది గీత.
    "అక్కడికి నా వంట ఏం బాగోనట్టు! చిన్నా లేదు, పెద్దా లేదు అస్తమానం నాకు తాటాకులు కడతావ్?' అంటూ కళ మూతి ముడుచుకుంది.
    "పెద్ద దానివంటే అమ్మ మీద విరుచుక పడ్డావు గా? ఇప్పుడు నువ్వే పెద్దదాని వైనట్టు మాట్లాడతావెం?" అని దెబ్బతీసింది గీత.
    "నేను చేస్తే ఆ అబ్బాయికి వాంతులు పట్టుకుని మనింట్లో నించి కదలడుగా?"
    ఉక్రోషం చూపిస్తూ అంది కళ.
    "కవల పిల్లలు ఎంతో అన్యోన్యంగా ఉంటారట! వీళ్ళెమిటో ఇంత అన్యాయం?' అనుకుంది ఉష.
    గీత తన ధోరణి మార్చింది.
    "నీ వంట బాగుండదని కాదే కళా? వంట బాగా చెయ్యటంమే కాదు పూర్తిగా తగలబెట్టటం కూడా ఒక కళే! అలా పాడుచేయ్యటం ఎవరి కొస్తే వాళ్ళు వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చుంటే సరి!.... శారదా! నువ్వు ఆ చేసే వంటేదో కమ్మగా చెయ్యకపోతే అబ్బాయిని పోమ్మనేట్టు చెయ్యలేవే?"
    "ఏమోనే! బాగో, వొగో నాకు మరోలా చేత కాదు!" అని నిక్కచ్చిగా చెప్పింది శారద.
    "పోనీలే! ఒకరిని బ్రతిమాలు కునేదేమిటి? నేనే చేస్తాను." అంది కళ బింకంగా.
    మర్నాడు కళ పొయ్యి దగ్గరికి వెళ్ళటం చూసి జానకమ్మ సంతోషించింది. " దానికి బుద్ది కుదరాలే కాని అన్ని పనులూ బద్ధకం లేకుండా చేస్తుంది. నా తల్లి!" అనుకుని మురిసిపోయింది.
    వంటంతా ఒకెత్తు, అన్నం వండటం ఒక్కటి ఒకెత్తు... అన్నం కుత కుతలాడుతూ ఉంటె కళ గరిటె తో కలియబెడుతూ మధ్య మధ్యలో అన్నం ఉడికిందో లేదోనని మెతుకు పట్టి చూస్తున్నది. మెత్తగా ఉండక పొతే తీరా మేకుల్లా ఉంటుందేమో నానుకుని బాగా ఉండకనిచ్చి గిన్నె క్రిందకు దించి వార్చింది. కస్సేపయ్యాక వార్పు ఎత్తి చూస్తె అన్నం నీరు నీరుగా లడ్డులా అతుక్కుని పోయి వున్నది. కళ కంగారు పడింది. బొత్తిగా ఇలా ఉంటె ఎలా? అతని మాటెలా ఉన్నా తన మాటేమిటి? తనకు అన్నం పొడి పొడిగా ఉంటేనే గాని సహించదే? అన్నం ముద్ద కాకుండా ఉంటుందని ఒక పళ్ళెం తీసుకొచ్చి అందులో  వంపింది. అయినా ఆ ఎత్తు యెంత మాత్రం పనిచేయలేదు. అన్నం లో వెతికినా విడి మెతుకనేది కనబడలేదు. రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు దిగబడే అబ్బాయి ఆరోజసలు ఇంట్లో నుంచి కదల్లేదు. షాపుకు ఆదివారం సెలవైనా నాన్నగారు పదింటికే భోజనం పెట్టమని తొందర చేశారు. మరో గంటకు కాని కళ వంట పూర్తీ కాలేదు. వంట పూర్తయ్యే సరికి కళ నడుం పట్టేసింది. కాని పైకి అంటే అందరికీ అలుసై పోతానని మాట్లాడకుండా వూరుకున్నది.
    ఇద్దరికీ విస్తర్లేసి వడ్డించింది.
    రామయ్య గారు మిగతా ఆదరువుల మాట అటుంచి ముందు అన్నం చూసి అదురుకున్నారు.
    "ఇదేమమ్మా! అన్నం చిమిడి నట్లు ఉన్నది!"
    కళకు సుధాకర్ మీద గొంతు దాకా ఉన్నది.
    'ఆయనకి అన్నం ఇలా ఉండకపోతే నచ్చదట!" అంది కళ తొణక్కుండా.
    సుధాకర్ చటుక్కున అందుకుని "మరేనండి అన్నం ఎంత మెత్తబడితే నాకు అంత ఇష్టం! అన్నాడు.
    ఎంత ఇష్టమో తెలియదు కాని విస్తట్లో అన్నం మాత్రం ఏమాత్రం కదల్లేదు. అలా ఆ విస్తరి తీసుకెళ్ళి వీధిలో పారేస్తున్నప్పుడు కళ మనస్సెందుకో బాధపడింది. ఇంట్లో ఉన్న అందర్లోకి అన్నం ఏమాత్రం చిమిడినా తినలేనిది తనే! అన్నం కేసి చూసేసరికి ఆకలంతా చచ్చిపోయింది. ఏమీ తినక వంట్లో నీరసం గానూ ఉన్నది. శారదను వండి పెట్టమనటానికి నామోషి వేసింది వళ్ళంతా వేడిగా  ఉన్నట్టు, జ్వరం వచ్చినట్టు అనిపించింది. మంచం మీది కెళ్ళి పడుకుంది. సుధాకర్ విస్తరి ముందు అవస్థ పడిన దృశ్యం జ్ఞాపకం వచ్చి కళ్ళంట నీళ్ళు తిరిగాయి.

                            *    *    *    *
    "నీళ్ళు పెట్టాను పోసుకోండి!' అని పిలిచి వెళ్ళింది కళ. సుధాకర్ బాత్ రూం కు వెళ్ళి క్రిందకు వంగి బాల్చీ లో చెయ్యి పెట్టాడు. కెవ్వుమంటూ చెయ్యి యివతలకు తీసుకున్నాడు. చెయ్యి కాని బాల్చీ లో ఊడి పడిందేమోనని చూసుకుని ఉన్నదని తెలుసుకున్నాక ఊదుకున్నాడు. తనకోసం ప్రత్యేకంగా సలసలా మరగబెట్టి తెచ్చింది కాబోలు కళ! ప్రక్కనే చిన్న చన్నీళ్ళ బాల్చీ కూడా ఉన్నది . కాని ఆ చన్నీళ్ళన్నీ దిమ్మరించినా అ వేడి చల్లారుతుందా! అని సుధాకర్ కు అనుమానం వేసింది.
    సుధాకర్ తిన్నగా రూం కొచ్చి సిగరెట్టూ పెట్టె తీశాడు. పెట్టె ఖాళీగా ఉన్నది. విసుక్కుంటూ దాన్ని విసిరేసి వీధిలో కెళ్ళాడు. కిళ్ళీ కొట్టువాడు గంటసేపు బాతాఖానీ వేసి సిగరెట్టూ పెట్టె చేతిలో పెట్టాడు. అది తీసుకుని ఇంటి కొచ్చి దాన్ని బల్ల మీద పడేసి గబగబా స్నానాల గదికి దారి తీశాడు. లేకపోతె ఈసారి జివ్వుమనే మంచి నీళ్ళను తీసుకొచ్చి వంటి మీద గుమ్మరించగల సమర్ధురాలు కళ!
    బాత్ రూం లో బాల్చీ అయితే ఉన్నది కాని అందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు! కళ్ళు నులుముకుని మరీ చూశాడు. ఇందాకేగా చూశాడు బాల్చీడు నీళ్ళు? ఇంతలో ఏమైనట్టు అని ఆశ్చర్యపోతూ గదిలోకి వచ్చి కూలబడ్డాడు. కొత్తగా కొన్న సిగరెట్టు పెట్టెను తెరిచి చూసేసరికి అందులో ఒక్క సిగరెట్టు కూడా లేదు.  సుధాకర్ విస్మయానికి అంతులేదు. పోనీ ఇంట్లో మరొక అబ్బాయి ఉంటె సిగరెట్ల కోసం కక్కుర్తి పడ్డాడేమోనని అనుమానించవచ్చు. కాని ఇంటి నిండా అమ్మాయిలే కదా అని తల పట్టుకున్నాడు. తల కూడా ఖాళీ గానే ఉన్నది. ఆలోచనేదీ స్పురించలేదు. యాదాలాపంగా గుమ్మం కేసి చూసేసరికి కళ అక్కడ నిలబడి ఉన్నది.
    "మీ ఇల్లు మయసభా!.... లేక గాన సభా..?" అనడిగాడు సుధాకర్ మధ్యలో సంగీతం వినవచ్చిన దిక్కుకు విస్మయంగా చూపులు సారిస్తూ.
    "మాది మయసభా, కాదు, గాన సభా కాదు -- మామూలు అద్దె కొంప!"
    "మయసభేమోనని అనుమానం వేసింది లెండి! ఇందాక బాత్ రూమ్ కు వెళ్ళి చూస్తె బాల్చీ నిండా నీళ్ళున్నట్లే కన్పించాయి. చెయ్యి పెడితే చుర్రు మన్నది కూడా. ఇప్పుడు ఒక్క చుక్క కనపడితే వట్టు!"
    "మీరెంతకీ రాకపోతే చూసి చూసి యిప్పుడే ఉష ఆ నీళ్ళు కాస్తా ఖాళీ చేసింది!" అంది కళ.
    "మరి నా సిగరెట్ల మాటేమిటి? కొత్త పెట్టె తీసుకొచ్చి బల్ల మీద పెట్టాను. ఇప్పుడు పెట్టె పెట్టేలాగే ఉన్నది. పెట్లో సిగరెట్లు మాత్రం మటుమాయం!"
    "నేనే పారేశాను!" అంది కళ తొణక్కుండా.
    "వాట్?" అని సుధాకర్ నోరు తెరచుకుని ఉండిపోయాడు.
    "లేకపోతె మీరేమిటి నిమిషానికో పెట్టె వూదేస్తున్నారు. ఇల్లంతా ఒకటే పొగ! ఎవరైనా ఇల్లు కాలి పోతున్నదేమో ననుకుని పరుగెత్తుకు రాగలరు!" అని మందలించింది కళ.
    "మరి పెట్టె మాత్రం ఉంచారేం. అదీ పారెయ్యలేకపోయారు?" అని కోపగించుకున్నాడు సుధాకర్.
    ఆడవాళ్ళ కు డబ్బు విలువ ఏం తెలుసు మరి? ఎంత ఖరీదైన సిగరెట్లు! వాటిని ఖాతరు చేయకుండా పారెయ్యటానికి మనస్సేలా వప్పిందో?
    "నా జిరాఫీ కోసం ఉంచాను."
    సుధాకర్ ఎగిరి గంతేశాడు.
    "జిరాఫీ....?? జీరాఫీలు సిగరెట్టు పెట్టెలు తింటాయండి?"
    "ఏమో! నాకు జాగ్రఫీ రాదు!" అని కళ లోపలికి వెళ్ళిపోయింది.
    నిప్పుకోడి నిప్పు తింటుంది. జిరాఫీ కాఫీ తాగితే తాగొచ్చు కాని సిగరెట్టు పెట్టె తింటుందా? ఇంతకీ జిరాఫీ ని గురించి జాగ్రఫీ లో ఉంటుందా, జువాలజీ లో ఉంటుందా?
    కళ లోపలికెళ్ళి తిరిగొచ్చింది.
    "ఇదే నా జిరాఫీ!"
    సిగరెట్టు పెట్టేలతో సగం తయారైన బొమ్మ అది.
    "ముందే చెప్పారు కాదు! ఇంతసేపు జిరాఫీ ఏం తింటుందా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాను." అన్నాడు సుధాకర్ తేలికగా శ్వాస విడుస్తూ.
    "పాపం! ఎంత పని చేశారు? ఈ బొమ్మ కోసమే లెండి మీ పెట్టె వీధిలోకి గిరావాటేయ్యకుండా ఉంచాను."
    సుధాకర్ కాస్సేపు వూరుకుని , "నేను సిగరెట్లు కాల్చటం మీ కిష్టం లేదా?' అనడిగాడు.
    "ఉహూ!" అంది కళ తల అడ్డంగా తిప్పుతూ.
    "సిగరెట్లు కాల్చకపోతే నా గుండె బద్దలవుతుంది!"
    కళ కిలకిల నవ్వింది.
    "మీ వళ్ళు గాజులతో చేశారా ఏమిటి? ఇందాక బుర్ర, ఇప్పుడు గుండె తేలిగ్గా బద్దలు కొట్టుకుంటున్నారు?"
    "మీరు కిలకిల లాడుతున్నారే కాని నే నెంత గిలగిలలాడుతున్నారో ఆలోచించారుకాదూ?"
    "ఎందుకు?"
    "అదే....! నేను సిగరెట్లు మానేస్తే మీ జీరాఫీ కేలా?" అన్నాడు సుధాకర్ జాలిగా.
    "ఆ బెంగ మీకేం వద్దు! ఇన్నాళ్ళు మీ పెట్టెల తోనే చేసుకున్నట్టు!" అంటూ కళ తీక్షణంగా చూసింది.
    "నేను తప్ప మరెవ్వరైనా కాల్చోచ్చన్న మాట!"
    "నిరభ్యంతరంగా!"
    "మరి నేనంటే మీకు....మీకు...."
    పొడుగ్గా , నాజూగ్గా , పచ్చని పసిమితో మిసమిస లాడుతున్న కళ ! చక్కని కోల ముఖంతో చారడేసి కాటుక కళ్ళు, సంపంగి లాంటి నాసిక, లక్కపిడత లాంటి చిన్న నోరు, ముత్యాల కోవలాంటి పలువరస కొనదేలిన గడ్డం, విడివైన నల్లని కేశాలు! అందమైన ఆకారానికి అపురూపమైన సింగారం!
    కళా? అందమైన కలా?
    మాటలు ఆగిపోవటం తో ఇందాక నుంచి సాగుతున్న సంగీతం మరీ గట్టిగా వినిపిస్తున్నది.
    "ఇందాక మీ యిల్లు గాన సభా అని అడిగారుగా? ఇలా రండి!" అని కళ గుమ్మం ముందు నుంచి కదిలింది.
    గానసభ గురించి మర్చిపోయి గంటసేపయింది.మాట్లాడరు! మనస్సు విప్పి మాట్లాడనీయరు! అనుకుంటూ సుధాకర్ కళ వెంట కాళ్ళను నడిపించాడు.
    "గీత సంగీత సాధన చేస్తున్నది... ఇప్పుడెం విన్నారు లెండి? పరీక్షల ముందు మీరిక్కడ కు వచ్చి ఉంటె మరో క్షణం లో పారిపోయే ఉండేవారు. మా ఇరుగు పొరుగువాళ్ళు మంచివాళ్ళు కాబట్టి దాని పాటను వోర్పుతో భరించారు!" అంది దారిలో కళ.
    గీత తదేక ధ్యానంతో పాడుకుంటున్నది. అడుగుల సవ్వడి వినపడటం తో తలెత్తి చూసి పాట ఆపేసింది సిగ్గుపడుతూ.
    "అపెశారేం? పాడండి!" అన్నాడు సుధాకర్ , పాట విందామని కాదు మాటవరసకు.
    "ఏం పాటలెండి?" అని సిగ్గుపడుతూ , నమ్రతగా జవాబిచ్చింది గీత.
    "ఇప్పటికైనా వప్పుకున్నావా?" అన్నట్టు కళ మాట్లాడకుండా మందహాసం చిందించింది.
    గీతకు కోపం వచ్చినా సుధాకర్ ను చూసి తమాయించుకున్నది.
    "లోపలి కొచ్చి కూర్చోండి!" అని ఆహ్వానించింది, గీత ప్రపుల్లవదనంతో.
    "ఫర్వాలేదు!" అంటూనే సుధాకర్ గది లోపలి కెళ్ళి క్రింద పరచి వున్న చాప మీద చతికిల బడ్డాడు. కళ మరో క్షణం అక్కడ నిలబడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS