Previous Page Next Page 
పధ విహీన పేజి 4


    చిట్టికి బహిరమైన ఈ జ్ఞానం నశించిందా అనిపించింది అతనికి. ఆమెకు భయంకరమైన ఆ చీకటి గాని, తను ఉన్నది శ్మశానం మధ్య అనే స్పృహ గాని ఏమాత్రం లేదు. ఆమె అంతులేని నిరీక్షణ తో ఎటో చూస్తున్నది. ఆ చూపు, ఆ ప్రేమ, ఆ ఆరాధన పొందగలిగిన మురళీ -- ఎటువంటి వాడయినా ఔగాక-- అదృష్టవంతుడు మాత్రం అవును అనుకున్నాడు జగన్నాధం . చివరికి విసిగి--
    "ఎంతసేపు ఈ నిలబడడం " అన్నాడు. అతని వాక్యం లోని విసుగును గమనించిన చిట్టి ఎందుకో భయపడి "వస్తానన్నాడు జగ్గూ...ఒక వేళ....రాకపోయినా రాకపోవచ్చు....నాకోసం ఎక్కడో ఇల్లు కూడా చూశానన్నాడు " అన్నది .
    కొన్ని క్షణాలాగి--
    "పోనీ రాకపోతే -- అతను రావటం రాకపోవటం నన్ను బాధ పెట్టవు. అతను నావాడు అన్నది. ఆమె పెదవులు త్యాగ భారంతో అదురుతున్న విషయం ఆ చీకట్లో కూడా స్పష్టంగా చూడగలిగాడు జగన్నాధం. మళ్ళీ తనలో తను అనుకుంటున్నట్లుగా గొణిగింది చిట్టి.
    "ఇంకొంచెం సేపు చూద్దాం. ఒకవేళ వచ్చి తిరిగి వెళ్ళిపోతే రేపు నింద నామీదే వేస్తాడు" అన్నది.
    కాని అతడు రాకుండా ఉండలేదు. రాకుండా ఉండాలని జగననాధం ప్రార్ధించిన ప్రార్ధనలన్నీ విఫల మైనాయి. అతన్ని ఆ చీకటి లో కూడా స్పష్టంగా  గుర్తించిన చిట్టి గబగబా పరుగెత్త బోయి గోరీ ముందుకు పడిపోయింది. అది చూసి చాలా అత్ర పడ్డాడు అతను. చిట్టి ని లేవదీసి -----
    "అంత కంగారెందుకు చెప్పు -- పిచ్చి పిల్లా! నేను రా ననుకున్నావు గదూ" అంటూ అక్కడ జగన్నాధం ఉన్నాడన్న సంగతే విస్మరించి అర్ధ చంద్రుడి లాటి చిట్టి నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు అతను. యుగాయిగాల వియోగానంతరం కలుసుకున్న ఊర్వశి లా అతని చేతుల్లో వాలిపోయింది చిట్టి.
    జగన్నాధం కొద్దిగా సకిలించి తన ఉనికిని రిజువు పరచు కున్నాడు. బహుశా ఈ నిర్లక్ష్య గుణాన్నే చిట్టి ఆరాధిస్తూ ఉండవచ్చు ను.
    
     జగన్నాధం అ చీకట్లో కూడా మురళీ ని పరీక్ష చెయ్యటం ప్రారంభించాడు. ఇతనిలోని ఏ ప్రత్యేకత తన చిట్టిని పాదా క్రాంతురాల్ని చేసుకుందో అతనికి అర్ధం కాలేదు. సమాజాన్ని, కుల గౌరవాన్ని , తల్లి తండ్రుల్ని కూడా తృణ ప్రాయంగా వదిలి పెట్టించిన ఆ ఔన్నత్యం అతనిలో ఏమీ కనిపించలేదు.
    అప్పుడే జగన్నాధాన్ని చూసిన మురళీ గబగబా అతని దగ్గరికి వచ్చి రెండు చేతులూ పట్టుకుని
    "మిమ్మల్ని గురించి చిట్టి చెపుతూ ఉంటుంది. మీ సహృదయత కు ధన్యవాదాలు" అన్నాడు స్పష్టమైన చక్కని ఇంగ్లీషులో. అతను సన్నగా సమానంగా ఉన్నాడు. రక్తగతమైన ఠీవీ, ఉదాత్తతా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పసివాడి కన్నులలో కనిపించే స్వచ్చతా, మహా యోగి కళ్ళల్లో కనిపించే నిర్లిప్తతా అతని కళ్ళల్లో కనిపిస్తాయి. అతను ఎవరి వంకయినా చూసి నవ్వితే ఎలాటి దుఖితుడూ తిరిగి నవ్వకుండా ఉండలేడు. ఇదంతా ఎంతో సహజంగా అతనిలో కనిపిస్తుంది. బహుశా ఈ గుణాలే చిట్టినీ ఆకర్షించి ఉండవచ్చును. చిట్టి స్త్రీ అవటం వలన ఈ ఆకర్షణ మరింత అధికమయి ఉండవచ్చును. అంతే కాదు. తన బలహీనతలు తను అర్ధం చేసుకో గలడు. జీవితం అంటే ఏమిటో అతనికి బహుశా తెలిసి ఉండదు. జీవితంలో ఏదయినా దాచుకోవాలని, దాచుకోవటం అనేది అవసరం అని కూడా అతనింకా గుర్తించలేదు.
    
    ఆ చీకట్లో అలాగే అరగంట పాటు అతన్ని పరిశీలించిన జగన్నాధం ఇతడిని ప్రేమించకుండా ఉండటం కష్టసాధ్యమే అనే నిర్ణయానికి వచ్చాడు. ఈ అరగంటసేపూ చిట్టి, మురళి కూడా ఒకరి కళ్ళల్లో కి ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.
    విజయసూచకంగా జగన్నాధం వంక చూసి "మరి వెళ్లి రానా?' అంది చిట్టి . ఇందాకటి నుంచీ ఆమెను ఆవరించిన దైన్యం ఇప్పుడు మచ్చుకయినా లేదు. ఈ విశాల విశ్వం తాలుకూ స్మృతి కూడా ఆమెలో లేదనే చెప్పాలి.
    జగన్నాధం మెదలకుండా తల ఊపాడు.
    "మురళీ ని అనవసరంగా అనుమానించాం జగ్గూ....అందుకు నిష్కృతి లేదు" అన్నది చిట్టి.
    "నేను చిట్టి కి అన్యాయం చేస్తున్నానని తెలుసును, జగననాధం గారూ. అందుకు మీరు నన్ను క్షమించాలి" అన్నాడు మురళి.
    అతని కంఠం లో ధ్వనించిన నిజాయితీకి చలించి పోయినాడు జగన్నాధం.
    వెంటనే చిట్టి అందుకుని "అతను తప్పక క్షమిస్తాడు మురళీ! అతని కన్నా శ్రేయోభిలాశులేవరూ లేరు నాకు" అని జగన్నాధం వంక తిరిగి--
    "ఇక వెళ్ళు జగ్గూ . అమ్మకూ, నాన్నకూ జరిగినదంతా చెప్పు. నేను తప్పే చేసి ఉండవచ్చును. అవి తల్లి తండ్రుల హృదయాలు కనుక తప్పక క్షమిస్తాయి. నీవు నన్ను ఒడ్డున పడేయాలి. నాన్న క్షమిస్తే వెంకట్రాయుడు గారి సంగతి తరువాత చూసుకుందాం. నీవు లేకపోతె ఇంత సాహసం చేసి ఉండేదాన్ని కాదేమో బహుశా. అయినా ఇది పాపమే అవుతుందా అనిపిస్తున్నది. అలా అయితే ఆ జగన్నాధుడు కూడా నీలాగానే నన్ను అర్ధం చేసుకుని క్షమిస్తాడు" అన్నది.
    చిట్టి ఏడవటం ప్రారంభించింది. మురళీ ఆమెను దగ్గరగా తీసుకుని ఒడార్చటం ప్రారంభిస్తూ--
    "నేను నీ కెంత ద్రోహం దేస్తున్నాను?" అన్నాడు.
    "తెలిసీ ఎందుకు చేశారు?" విసుగ్గా ప్రశ్నించాడు జగన్నాధం.
    "తెలియదు సార్. పెద్ద వాళ్ళ మధ్య ఉండే కలతలకు చిట్టి బలై పోవటం తో అర్ధం లేదు. మేం రిజిష్టర్ పెళ్లి చేసుకున్నాక ఈ వెంకట్రాయుడు వెంకట్రామయ్య లు ఏకమావుతారని పిస్తున్నది" అన్నాడు మురళి.
    అంత దుఃఖం లోనూ పకపకా నవ్వింది చిట్టి. ఆ మాటల్లో అంత హాస్యం ఏముందో జగన్నాధానికి అర్ధం కాలేదు.
    "ఇంతకూ పెళ్ళేప్పుడు?" అన్నాడు. మురళీ మాట్లాడిన ఇన్ని మాటల్లో నూ అతనికి సంతృప్తి కలిగించిన మాట అదొక్కటే.
    "నాలుగయిదు రోజుల్లో."
    "ఆ తరవాత ఏం తింటారు?"
    "జగ్గూ....ఏమిటా ప్రశ్నలు?' కోపంగా అడిగింది చిట్టి.
    "ఏదో ఉంది లెండి. పోనీ ఉద్యోగం చేస్తాను."
    "మరి మీ నాన్న వూరు కుంటాడా?"
    "ఊరుకుంటాడు. లేకపోతె అప్పుడు ఆలోచించు కుందాం. అయినా చిట్టి నీడలో ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం నాకేం లేదు. అన్నీ తనే ఆలోచిస్తుంది."
    మురళీ మాట పూర్తీ కాకుండానే ఒక రిక్షాను కేకేసి తను ఎక్కి కూర్చుని చిట్టి ని పిలిచాడు. చిట్టి నిశ్శబ్దంగా జగన్నాధం పాదాలకు నమస్కరించి రిక్షా ఎక్కి కూర్చుంది.
    జగననాధం ఏమని ఆశీర్వదించాడో -- అతని కనుల నుంచి ఆమె తల మీద పడిన కన్నీటి కీ, ఆమె కన్నుల నుండి అతని పాదాల మీద పడిన కన్నీటి కీ మాత్రమె అర్ధం అవుతుంది.

               

                                   3
    "తమ్ముడూ?" "కొత్త ఆవకాయ ఆకులో పెట్టుకొచ్చి విజయలక్ష్మీ పిలిచినా పిలుపు కు చాప మీద బోర్ల పడుకుని ఏడుస్తున్న జగన్నాధం తలఎత్తి చూసి, బోలెడు ఖంగారు పడిపోయి ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు.
    "కూర్చోండి అక్కగారూ" అని అతి మన్నన కూడా చేశాడు.
    విజయ పెదవుల మీదకు వచ్చే నవ్వును ఆపుకుంటూ అతని వంక చూసింది. మరుక్షణ మె ఆమె నవ్వు అదృశ్య మై పోయింది. అతని చెక్కిళ్ళ మీద కన్నీటి చారికలు.
    "తమ్ముడూ ఏడుస్తున్నావా?"
    జగన్నాధం అపరిమితంగా సిగ్గు పడిపోయాడు. తన యీ అజ్ఞాత దుఃఖం ఎవరి కంటా పడరాదని అతను మనస్పూర్తిగా సంకల్పించాడు. అయినా అక్కగారు చూడనే చూసింది. అంతేకాదు , ప్రశ్న కూడా వేసింది.
    "లేదు.": అనుకోకుండా అతని నోటి వెంట అసత్యం సమాధానంగా వచ్చింది.
    "లేదా?....మరి నువ్వు చేస్తున్న దేమిటి?"
    ఎవరు మాత్రం ఏం సమాధానం ఇవ్వగలరు ఈ ప్రశ్నకు. జగన్నాధం మాట్లాడలేదు.
    "నువ్వు కూడా దుఃఖ పడతా వన్న మాట. విజయ తిరిగి అన్నది.
    జగన్నాధం ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. అంటే ఆమె దుఖిస్తున్నదనా అర్ధం? విజయ ఈ మధ్య చాలా చిక్కిపోయింది. ఇదివరకటి సౌందర్యం తగ్గలేదు గాని ఆనైగా నిగ్యం చెరిగింది. ఆమె తొడుక్కున రవికకు ఒకరటి రెండు చోట్ల కందికాయ కుట్లుండడం కూడా గమనించాడు అతను. జుత్తు దుబ్బు కట్టింది. అంటే కొబ్బరి నూనె లేదన్న మాట. ఈ సంసారం ఇంత హీన స్థితికి ఎప్పుడు ఎలా దిగజారిందో ఈ పదిహేను రోజులుగా తన గోలలో తనుండి గమనించనే లేదు. ఒక్కసారిగా ఇప్పుడు విజయ రూపం చూస్తుంటే ఏదో అనిష్టం కరిగినట్లే అనిపిస్తున్నది. ఇప్పుడు కూడా విజయ పెదవుల మీద చిరునవ్వు అలాగే ఉంది. ఇప్పుడు కూడా ఇతరులను ఆదరించే శక్తి ఆమె పోగొట్టు కోలేదు.
    ఇప్పుడు కూడా తన బీద సోదరుడు తిన్నాడో తినలేదో కనుక్కుంటూనే ఉంది. జగన్నాధం కళ్ళలో తిరిగి మరొక కన్నీటి పొర కమ్మింది. అర్ధరహితమైన ఆవేదన ఏదో అతని అంతర్యాన్ని పిడిచి వేస్తున్నది.
    "ఏం జరిగింది అక్కగారూ?"
    "ఏమీ లేదు తమ్ముడూ. ఈ ఆవకాయ ఎలా ఉందొ నువ్వు రుచి చూసి చెప్పాలి. వ్యాపారం గదా మరి? బాగుంటేనే నలుగురూ కొంటారు."
    "అదేమిటి ? బావగారు ఆవకాయ వ్యాపారం పెట్టారా ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు జగన్నాధం.
    "వారి కిష్టం లేదు. నేనే పెట్టాను. తప్పేమిటి తమ్ముడూ? చేసేది దొంగతనం కానప్పుడు పొట్ట కోసం ఏ వృత్తి అయినా చెయ్యవచ్చును ....ఏమంటావు?"
    జగన్నాధం నోటి వెంట అయిదారు క్షణాల వరకూ మాట రాలేదు.
    "బాగానే ఉంది. పొట్ట కోసమే అయితే బావ గారు చేస్తున్న ఉద్యోగం ...."
    "పదిహేను రోజుల నుంచి వారు పనిలోకి వెళ్ళటం లేదు." చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది విజయ.
    ఇహ ఎందుకు ? ఏమిటి ? అని అడగలేక పోయినాడు జగననాధం. అతనికి అర్ధం అవనే అయింది-- ఏవో అనివార్య కారణాల వల్ల జయప్రద రావు ఉద్యోగం పోయి ఉంటుందని! కాని ఆశ్చర్యం అందుకు కాదు. ఈ స్థితిలో కూడా ఈమె నవ్వుతూ ఎలా ఉండ గలిగిందని?
    తిరిగి ఒకసారి విజయ వంక చూశాడు అతను. ఇదివరకున్న రెండు జతల బంగారు గాజుల స్థానం లోనూ ఆప్పుడు మట్టి గాజులున్నాయ్. ఇదివరకున్న చిరుహాసం మాటున ఇప్పుడు ఉన్నది సంతోషం కాదు విషాదం. ఆ పవిత్రమూర్తి ఇన్ని కష్టాలలోనూ పైకి నవ్వుతూనే ఉంది. తనో ? చిట్టి తనది కానేలేదు. అయినా తనది కానిదాని కోసం తను దుఖిస్తూనే ఉన్నాడు. జగననాధం. ఈమె తనదనుకున్నవన్నీ ఈమధ్యనే పోగొట్టుకుంది. అయినా కొంచెం కూడా బాధపడటం లేదు.
    "సరేగాని , తమ్ముడూ, ఎందుకు ఎడుస్తున్నావో చెప్పనే లేదు"అని ఆ చింకి చాప మీద చతికిల బడింది విజయ.జగన్నాధంనవ్వి ఊరుకున్నాడు.
    "నాతొ కూడా చెప్పరానిదా?' రెట్టించింది విజయ.
    "అలా అని కాదు గాని, మీరు ఇలాటివి క్షమించలేరు."
    "అంటే నువ్వు కధల్లో వ్రాసిన లాటిదా?'
    "అవును."    
    "అలా అయితే చెప్పద్దు లే. కాని దానికోసం ఏడ్చి మతి పోగొట్టుకోడం దేనికి?"
    "జాలి చేత."
    "జాలి దేనికి? తప్పు అనేది నిప్పు లాటిది తమ్ముడూ. తెలిసి చేసినా తెలియక చేసినా వాత మాత్రం తప్పదు. కాలక్రమాన వాత మానినా మచ్చ మానదు" అని పేలవంగా నవ్వింది విజయ.
    జగననాధం సమాధానం ఇవ్వలేదు. తప్పు అనేది నిప్పు లాటిదే! చిట్టి చేసిన తప్పు చండ్ర నిప్పులాటిది. జీవితంలో వాత మానినా, ఇక మచ్చ మానదు. విజయ మాటలు అతని చెవుల్లో గింగురు మంటున్నాయి.
    "ఏమిటి, తమ్ముడూ. ఆలోచిస్తున్నాను?"
    "ఏమీ లేదు. తప్పు అనేది నిప్పు లాటిదే కావచ్చును. కాని క్షమా సహనాల నీటి జల్లులో దాన్ని చల్ల పరచ వచ్చు గదా అని ఆలోచిస్తున్నాను."
    "తప్పుకు శిక్షించటమే ధర్మం. క్షమించటం ధర్మం కాదు. పైగా అసమర్ధత అనిపించు కుంటుంది."
    "అయితే తప్పుకు శిక్ష పడే తీరాలంటారా?"
    "తప్పకుండాను లేకపోతె ఆ సర్వేశ్వరుడి దర్బారు లో తలకాయ ఎత్తుకునే అర్హత మనకు ఉండదు."
    "సర్వేశ్వరుడు దయామయుడు గదా,తప్పుల్ని క్షమించడంటారా?"
    'అంత దూరం నాకు అర్ధం కాదు తమ్ముడూ. అయినా ఒకటి మాత్రం చెప్పగలను. అవినీతి, అపవిత్రత అంటే నాకు అసహ్యం. ఈ రెండూ ఉన్న మనిషి భగవంతుడి ని చేరుకోలేదు. కుళ్ళిన పళ్ళు నైవేద్యానికి పనికి రావు తమ్ముడూ" అన్నది విజయ.
    "నీతి అనీ, అవినీతి అనీ మనం ఎలా నిర్ణయించగలం?"
    "నేను నమ్మినది నా నీతి తమ్ముడూ. డానికి భిన్నంగా నేను నడుచుకుంటే అది అవినీతి. అప్పుడు బ్రతకటమే అనవసరం."
    'అలాగ ఎవరి నీతి ప్రకారం వారు నడుచుకుంటే?"
    "నడవచ్చు. కాని ఇది నా నీతి అని చెప్పుకోటానికి కూడా ఒక అర్హత ఉండాలి. అప్పుడే అది బెడిసి కొట్టదు. లేకపోతె పతితులూ హంతకులూ ఇదే. మా నీతి అని చెప్పుకుంటే లోకం గతీ సంఘం గతీ తల క్రిందులవుతుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS