Previous Page Next Page 
అసుర సంధ్య పేజి 4


    ఆ పిల్ల కుర్చీలో పొందికగా కూర్చుని వింటుందే గాని నోరు విప్పి ఒక్క మాటైనా అనలేదు. నేల మీద చూపు నిలిపింది. రాజారావు కాఫీ తాగడం ఆపి మళ్లా అడిగేడు.    
    ఆ పిల్ల కుర్చీలో పొందికగా కూర్చుని వింటుందే గానీ నోరువిప్పి ఒక్క మాటైనా అనలేదు. నేలమీద చూపు నిలిపింది. రాజారావు కాఫీ తాగడం ఆపి మళ్ళా అడిగేడు.
    "చెప్పు వరం! అమ్మకి మావయ్య మీద అంతభక్తి భావం ఎందు కుండాలిట?"
    "నాకు తెలీదు" అన్నది బెరుగ్గా.
    "కాదు, నీకెవరూ చెప్పలేదు కదూ?-- మా అమ్మ చేసింది తప్పే అవుగాక, మావయ్య రక్త సంబంధాన్ని త్రోసి పుచ్చి అమ్మ మెడ పట్టి గెంటి, ఆమె మొహం ముందే తలుపు మూసినా, రాజారావు కంఠం వణికింది. అతనికి అమ్మ అనుభవించిన నిరాదరణ , జ్ఞాపకం రావడంతో కళ్ళు చెమ్మగిల్లాయి. కాఫీ కప్పు కింద పెట్టి గోడ వైపు తిరిగి కళ్ళు వత్తుకున్నాడు.
    వరలక్ష్మీ కి అతని మీద జాలి కలిగింది.
    "బావా!" అప్రయత్నంగా అనేసింది.
    రాజారావు గొంతుకలో గుండె నిలిచినట్టయింది. అతనిప్పుడు ఆనందంలో నిలువునా మునిగి పోయేడు. తత్తర పాటుతో అన్నాడు--
    "తెలుసు వరం! తెలుసు ఈ పిలుపు చాలు , ఈ ఆదరణ చాలు. నేను మళ్ళా మనిషి నౌతాను. వెయ్యి ఏనుగుల బలం వస్తుంది నాకు. ఈ పిలుపు కోసమే ఇంత దూరం వచ్చెను. నువ్వలా హృదయ పూర్వకంగా నన్ను 'బావా' అని పిలుస్తే చాలు, ణా నీడలు గుర్తుండవు. నా బాధలు గతానికి ఆహుతై పోతాయి వరం!"
    అతనిలో కలిగిన ఈ మార్పుకి ఆ పిల్ల ఆశ్చర్యపోయింది. తర్వాత సిగ్గుపడింది.
    "నాలుగేళ్ల క్రితం మీరు చిలకలపూడి తిరణాల కొచ్చేరు. అక్కడ అమ్మ మిమ్మల్ని చూచిందట. మీరామెను పలుకరించలేదు. పలుకరించి అమ్మ అవమానం చెందింది. అయితేనేం -- లక్ష్మీ దేవి ;లాటి నీ రూపం అమ్మని ఆకర్షించింది. అప్పట్నుంచీ నీ గురించే ఎక్కువగా చెప్పేది అమ్మ -- 'వరం అప్సరస లాటి పిల్ల నాయనా -- ' అని ఆనాడు మా అమ్మని గుర్తుపట్టి , చాటుగా వచ్చి ఆమె చేతిలో ప్రసాదం పెట్టావుట నువ్వు గుర్తున్నదా?' అడిగేడు.
    వరలక్ష్మీ తలూపింది.
    "అందుకే అన్నది -- వెన్నలాటి మనసుట నీది. ప్రేమని దాచుకోలేక నిన్ను చేతుల్లోకి తీసుకుని హృదయానికి హత్తుకున్నదిట. అప్పటి మా అమ్మ వాత్సల్యం గానీ, ఆవిడ కళ్ళల్లో నిలిచిన నీటిని గానీ జ్ఞాపకం పెట్టుకున్నావా వరం? చెప్పు నాకు " అన్నాడు గాద్గదికంగా.
    ఆ మాటతో వరలక్ష్మీ చలించి పోయింది.
    "నిజం వరం! అమ్మ గుర్తుకొస్తే నేనెందుకో పసివాడి నైపోతాను. పరిసరాలు మరిచి గట్టిగా ఏడవాలని పిస్తుంది. దీన్ని హృదయ దౌర్భల్యమనూ, పసితనమనూ, ఏమైనా అను ఆమె నన్నొదిలి వెళ్ళినా, ఆమె నాకు దూరం కాలేదు. కాదు. ఆమె స్మృతులు నన్ను విడిచి పెట్టవు వరలక్ష్మీ."

                       
    వరలక్ష్మీ కి ఏడుపోచ్చేట్టుంది. అందుకే కాఫీ కప్పు తీసుకుని వెళ్ళబోయింది--
    "అగు వరం! నీ మనసు నొప్పిస్తే క్షమించి మరీ వెళ్లు." అన్నాడు రాజారావు.
    "లేదు" అనేసి గబగబా వెళ్ళిపోయింది వరలక్ష్మీ.
    --రాజారావు బట్టలు మార్చుకున్నాడు. చెప్పులు వేసుకుని బయటకు రాబోయాడు. అత్తయ్య కనిపించడంతో ఆగి, ఆమె దగ్గరగా వెళ్లి కూర్చున్నాడు. అవిడెంత సేపటికి మాతాడింది కాదు. తనే కల్పించుకున్నాడు.
    "మావయ్య కి ఈ వూళ్ళో మంచి పేరున్నదని విన్నాను. ఆయన్నందరూ అభిమానించే వారని విన్నాను."'    
    "అయినా దుర్మార్గులేవరో కడుపునా పెట్టుకున్నాడు. అందర్నీ అయిన నమ్మేవారు. మనసు విప్పి మాటాడేవారు. చివరికి ...మా పాలిట రాక్షసులేవరో....కొంప తీశారు బాబూ!" అన్నదావిడ ఏడుస్తూ.
    రాజారావు మరేమీ మాటాడలేదు.
    "దేవుడనే వాడుంటే ధర్మరాజు లాటి మనిషిని పొట్టను పెట్టుకున్న దుర్మార్గులు సుఖపడలేరు. అతి నికృష్టమైన చావు చస్తారు."అన్నది కసిగా.
    "ఒక్కటి అడుగుతాను నిజం చెప్తావా అత్తయ్యా!"
    ఆమె ఏమిటన్నట్టు చూసింది. ఆమె మొహంలో బాధ కనిపిస్తోంది. కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. కన్నీటి చారలు స్పష్టంగా కనిపిసున్నాయి. ఆవిడ మూర్తిభవించిన శోకంలా ఉన్నది. రాజారావు తలొంచుకుని అడిగేడు.
    "సందర్భం తెలిసి గూడా ఇలాటి ప్రశ్న అడగడం అన్యాయమే! కానీ-- మనసుండ బట్టక అడుగుతున్నాను. అమ్మ బ్రతికుండగా నేనీ ఊరొచ్చి ఉంటె, నన్ను మీలో ఒక్కడ్ని గా చేసుకోమని అడుగుతే -- నువ్వు ఒప్పుకునేదానివేనా? తప్పు చేసిందనుకుంటున్న అమ్మని క్షమించగలిగే దానివేనా? చెప్పత్తయ్యా!"
    ఆమె తన మొహాన్ని అవతల వైపు తిప్పుకున్నది.
    "మావయ్య ని ఈ ప్రశ్న అడగటానికే , నేనీ వూరోస్తే . మీ దృష్టి లో తప్పు చేసిన అమ్మ లేదు . నన్ను ఒంటరిని చేసి వెళ్ళింది. నన్ను ఆదరించగలవా మావయ్యా అని అడగటానికోచ్చేను. ఈ దారుణం విన్నాను. నిలువునా కూలిపోయాను. మీకు తెలీదు -- అమ్మ నాకెన్నో చెప్పింది. నాలో మావయ్య మీద గౌరవ భావాన్ని పెంచిదే కాని అయన పట్ల మరిచిపోలేని కక్షని గానీ, పగని గానీ నేర్పలేదు. ఇప్పుడు చెప్పండి. అమ్మ దేవత కాదూ! మీరావిడ్ని క్షమించి ఉండేవారేనా? చెప్పండి ?" రెట్టించి అడిగేడు మళ్లా.
    ఆవిడ ఘోల్లున ఏడ్చేసింది.
    "తెలుసు నాకు. మావయ్య కీ, నీకూ అమ్మ మీద వాత్సల్యం చచ్చిపోలేదు . కానీ -- సంఘం . అది మిమ్మల్ని ఒత్తిడి చేసింది. భయపెట్టింది. బలవంతాన మిమ్మల్ని వేరు చేసింది. ఇదే నా బాధ. గుండెల్లో దాచుకున్న ఈ బడబాగ్ని ని మావయ్య తో చెబుదామనుకుని వచ్చెను. కానీ --" అతను వెక్కి వెక్కి ఏడ్వటం ప్రారంభించాడు.
    సుభద్రమ్మ గోడకి చేరగిల పోయింది.
    కొంతసేపటికి రాజారావు లేచి నిలబడ్డాడు. గుప్పెట బిగించేడు.
    "నాకు స్వర్గ నరకాల పైన నమ్మకం లేదత్తయ్యా! నేరం చేసిన మనిషి శిక్ష నిక్కడే అనుభవిస్తాడు. ఇది మాత్రం నిజం ." అన్నాడు గంబీరంగా. తర్వాత నెమ్మదిగా అడుగులేసుకుంటూ బయటకు నడిచేడు.
    ఇల్లు దాటిన తర్వాత సిగరెట్టు ముట్టించాడు. అతని మనసంతా గందర గోళంగా , సాలె గూడులా తయారయ్యింది. ఎన్నో ఆలోచనలు, అతని మస్తిష్కం లో మెదులుతున్నాయి. అవుతే ఒక్క దానికీ సరైన రూప మేర్పడటం లేదు.
    ఆ ప్రయత్నంగా అతని అడుగులు దేవాలయం వైపు దారి తీసాయి. మునసబు ఇల్లు దగ్గర పడింది. ఆయన ఇంటి అరుగు మీద నిలబడి మరెవరో మనుషుల్తో ఏదో విషయమై చేతులు తిప్పుకుంటూ ఉపన్యసిస్తున్నారు. శ్రోతలు కడు జాగ్రత్తగా వింటున్నారు. అయన, కొన్ని ముక్కలు సర్వ జనానికి, వీధి చివరి వరకూ వినపడేలా -- మరికొన్ని (ముఖ్యమైనవి కాబోలు) మెల్లిగా చెవిలో రహస్యం చెబుతున్నట్టుగానూ ఉన్నాయి. మునసుబు ని రాజారావు చూసిన వేళా విశేష మేవిటో గానీ అతనికి మునసబు పట్ల సదభిప్రాయం కలగటం లేదు.
    మావయ్య కీ, మునసబు కి ఆ మధ్య "మాటల్లేవని' తాత చెప్పేడు. అతని ఆకారానికి తోడు తాత అతని గురించి చెప్పిన ఆ విషయం తోడై -- మునసబంటే కొంత అయిష్టత కలిగించింది.
    రాజారావు మునసబు నీ, అతని తాలుకూ వందిమాగతుల్ని చూసి గూడా చూడనట్టు తలొంచుకు నడక వేగం పెంచాడు. కానీ-- మునసబే రాజారావుని పరామర్శించడంతో రాజారావు ఆగిపోక తప్పింది కాదు.
    "ఏం బాబూ అంతా సవ్యంగా ఉన్నట్టేనా?"
    ఈ రకమైన పరామర్శ లో రాజారావు కి కొంత అవహేళన స్పురించిన మాట నిజం. అతను ముభావంగా నవ్వి వూరుకున్నాడు.
    "మొదట్లో చిటపట లాడినా సుభద్రమ్మ మంచి మనిషి. ఎంతైనా మేనల్లుడివాయే. తెగించి కాదనడానికి అమెది అడ మనసా మరోటా? రెండు రోజులు గడుస్తే అన్నీ చక్కబడతాయి. నువ్వేం ఖంగారు పడకు. అన్నట్టు నువ్వెక్కడ పని చేస్తున్నట్టు చెప్పావూ?"
    "ఇంతకూ మునుపు నేనేం చెప్పలేదు గానీ ఇప్పుడు చెప్పవలసిన అవసర ముంటే అడగండి . చెబుతాను." అన్నాడు నిష్టూరంగా.
    "మునసబు గలగలా నవ్వేశాడు.
    "అసాధ్యుడివే! మరేమిటో అనుకున్నాను." అన్నాడు మునసబు వొచ్చే నవ్వుని అపుకుంటో.
    "కానీ, మీ గురించి నేనింకా ఓ నిర్ణయానికి రాలేదింకా."
    "నీబోటి వాడి కది బ్రహ్మ విద్యటయ్యా!" మళ్లా నవ్వేస్తూ అన్నాడు.
    "ఆలస్యమైనా మంచి మాటన్నారు."
    దీంతో మునసబు అభిమానం కొంచెం దెబ్బతిన్నట్టయింది. రాజారావు లాంటి వాగుడుపిట్టతో తను మాటలు పెంచుకోడం, అందునా అంతమంది ముందు మంచిది కాదనుకుని, వరస మార్చి అన్నాడు --
    "ఈ ఖబుర్లకే మొచ్చే గానీ-- వెళ్లిరా. అవతల నువ్వేదో పని తొందర్లో ఉన్నట్టున్నావు."
    "వీలు చిక్కినప్పుడు మరోమాటు కలుస్తాను. అప్పుడు తీరుబాటు చూసుకుని మాటాడుకోవచ్చు సెలవు మరి." అని చెప్పేసి కాలుతున్న సిగరెట్టు ని నేలమీద వేసి చెప్పుతో తొక్కి మరీ కదిలాడు రాజారావు . పది అడుగులు వేసిన తర్వాత మునసబు పార్టీ తాలూకు నవ్వులు వినిపించాయి గానీ -- వాటిని పట్టించుకోలేదు రాజారావు. ఆలయం వేపు వేగంగా నడవడం ప్రారంభించేడు.
    ఆలయం చేరుకునే వేళకి తాత మంటపం మీద కూర్చుని ఏదో పుస్తక పఠంనంలో మునిగి పోయి ఉన్నాడు. రాజారావు రాకని కూడా గమనించలేదతను. రాజారావు చెప్పులు విడిచి మెల్లిగా వొచ్చి తాత క్కాస్త దగ్గర్లో కూర్చున్నాడు. అప్పటి గ్గాని పుస్తకం నించి చూపు మార్చలేదాయన. రాజారావు ని చూచి పుస్తకం మూస్తో--
    "గీత చదువుతున్నాను " అన్నాడు.
    "అవుతే మిమ్మల్ని కలిసికోటానికి కిది వేళ కాదు గాబోలు" అన్నాడు రాజారావు మెల్లిగా నవ్వుతో.
    "అని కాదు" ముక్తసరిగా జవాబిచ్చేడు తాత.
    రాజారావు సిగరెట్టు పాకెట్టు తీసి సిగరెట్టు ముట్టించుకుని నింపాదిగా పొగ వదుల్తూ ఏదో చెప్పబోయాడు గానీ మధ్యలో తాత గొంతు అడ్డు పడ్డది.
    'ఆలయ ప్రాంగణం లో సిగరెట్టు నిషేధం కదా?"
    "కానీ నా కది వర్తించదు. అంతమాత్రం చేత దేవుడి మీద నాకు నిర్లక్ష్యమనీ చెప్పను. నేను సిగరెట్టు కాలుస్తున్నది అలంకార నిమిత్తం కానేకాదసలు."
    "దేవుడ్ని నిర్లక్ష్యం చేయడం చేయకపోవడ మనేది వేరే విషయం. సిగరెట్లు కాల్చడమనేది ఆరోగ్యానికి మంచిది కాదన్న ఉద్దేశ్యంతో, అతిగా కాల్చడమనే జాడ్యానికి దేవుడి పేరు మీదా, దయ్యం పేరు మీదా మన పెద్దలు కొన్ని నిబంధనలు చేశారని నా ఉద్దేశం" అన్నాడు తాత.
    "సరి సరి. మీరిప్పుడు సిగరెట్ల పైన ఉపన్యాస మిచ్చేలా ఉన్నారు. ఆ విషయాన్నీ కొంచెం అవతలకు పెట్టి నన్ను రక్షించండి."
    ఇద్దరూ కలిసి కట్టుగా నవ్వేశారు.
    "గమనించలేదు గానీ, నీకూ మాటలోచ్చు " అన్నాడు తాత.
    "సరిగ్గా ఇలాగే అన్నారు మునసబు."
    "అయన తెలివైన మనిషి."
    "నాకది తెలీదు. కానీ, మీనుంచి తెలుసుకోవాలని ఉంది. నిజం చెప్తారా తాతా."
    తాత రాజారావు వైపు ఏమిటన్నట్టు చూశాడు. రాజారావు సిగరెట్టు ని గట్టిగా ఓకే దమ్ము పీల్చి, అందంగా నుసి రాలుస్తూ అడిగేడు --


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS