ఈనాటితో ఆ తన ఆరాధ్యదైవాల సంకల్పంవింది. ఇక తన కర్తవ్యం మిగిలిపోతూంది. రాజు క్రింద బహుశః నిద్రపోయె ఉంటాడు. ఆ ప్రధమ పరిచయం వద్దనుండీ ఈనాటి వరకూ అతని వయస్సు మననం అయ్యింది. ప్రతి చేష్టా, చర్యా కూడా ఎంతగా ఇప్పుడు ఆదమరపు కలిగిస్తున్నాయో అన్న ఉత్సాహమే నెగడయ్యింది.
'ఇన్నాళ్ళనుండి నువ్వు అతన్ని వలచేవు. అది చెప్పుకోవడానికి నీ అభిజాత్యం ఎదురైంది. అంత కంటే మరొకటిలేదు, సత్యా!' అన్న టొకాయింపే కలిగితే, కళ్ళు చేతుల్లో మూసుకుని సిగ్గుపడింది. బుగ్గను ఎవరో చుక్క కళ్యాణం బొట్టు పెట్టినట్లు.
ఈ తనవలపే పండితే, అమ్మా, నాన్నాకూడా ఆనందిస్తారు. పైగా అలుముకుని, ఎదురు చుక్కగా ఉన్న వాతావరణం, మండి నుసి అయి, ఓ ఉన్నత కుటుంబపు కోడల్లా తను మరిచిపోగలుతుంది. ఈ మధ్యతరగతి వాతావరణం మారి ఉత్తమానికే వెళ్ళుతుంది.
రాజు తనప్రక్కగా నించునే ఉంటే, తనెంతగా రాణిస్తుందో అన్న ధీమా అగరుబత్తే అయ్యింది. అది గంధప్పొడి ధూపం. తన విధి ఈవిధంగా రూపొందాలనే కొద్ది ఘంటలక్రితం కార్యసాధనకు ముందుకు తోసింది మృగ్యంగానే అన్న ముదావహం కలిగింది.
పూర్తిగా ప్రకృతే అయ్యింది తలంపుల్లో సత్య. వాళ్ళు నిద్రపోతున్న ఉచ్చ్వాస నిశ్స్వాసాలు. కిటికీకి ఆనుకుని ఉన్న సన్నజాజుల విరివిప్పు. వెన్నెల పిండిఆరబోసినట్లున్న తోట. తేమలేని గాలి-ఉద్రిక్తతే కొసరు అన్నట్లు.
'రాజు నావాడు. నావాడంటే నావాడు.' ఇదే మైకంలో మెట్లు దిగింది. అభిసారికే మంచం వద్దకే వెళ్ళి ఒదిగి మునికాళ్ళ మీద రాజును చూసింది. మాగన్నుపడ్డ కళ్ళు, కళ్ళుక్రింద పిల్లిపాదాలు. ఎంతగా నలిగిపోయాడో అన్న కట్టలుతెంచే జాలి. ఊగిపోయింది.
అవి తను తుడవాలన్న ఆయత్తతే. చూపే. దృష్టే ఏం చేస్తున్నానో అన్న ధ్యాస లేకుండానే కూర్చుని 'నారాజూ!' అన్న పైకనలేని మాటల్ని మ్రింగుతూనే ముఖం చేతుల్లో ఇముడ్చుకుని గుండెలకు హత్తుకుంది. కళ్ళను తడిమింది-చిలికిన కంఠంలో ఉప్పుచారల్లోంచి నీళ్ళు పీయూషం అయినట్లు.
తెల్లబోయి, తెమురుకోలేక పోయినాడు రాజు. ఏమిటిది అని అడిగినా జవాబు రాదన్న స్థితి సత్యధి. విసురున వచ్చిన సుడిగాలిలా. తను అచేతనుడే అయ్యేడు.
చుర్రున చురిక విసరినట్లే అయితే, సత్య కళ్ళు అప్పగించే తటాలున లేచింది. తను ముట్టుకున్నది ఓ యువక శరీరమేనా? తన వలపు పండించుకున్న రాజేనా? ఓ జీవచ్చవ హిమవంతపు ఈ స్పర్శ ఏమిటి? ఈ అశ్లేషణా దగ్ధవైచిత్రి ఏమిటి? తను ఎవర్ని కౌగలించుకుంది? శవాన్ని కాదుకదా?
నెమ్మదిగా మంచం దిగేడు. దగ్గరగా రాబోతేనే హడలి వెనక్కు తగ్గింది భయంతో.
"పిచ్చీ! ఎందుకా తలంపు కలిగింది? ఇప్పుడు చూచేవే-అదేస్థితి నాలో ఈమధ్య ప్రజ్వరిల్లు తోంది. ఈ భౌతికం నాదికాదు. కొన్నాళ్ళు ఎరువుతీసుకున్నా అన్న భావన. అదే అర్ధంకాక పారిపోయివచ్చే.
"అదేమిటి? ఏ విశ్వ అనంతాల దగ్గరకు వెళ్ళితే అర్ధం అవుతుంది? ఎవరు చెపుతారు టీక? ఈ తాత్పర్య ఫలితం ఏమిటి? ఏమిటి ఈనా జీవితం? ఏ మార్గాల్లో పడుతుంది?
"ఇదే క్షోభ. ఆవేదన. ఆక్రోదన. వాటి మూర్తీ భావమే నేను! నేనెవర్ని? ఎక్కడో బ్రతికి, చచ్చి, వచ్చినట్లున్న ఈ పిలుపు ఏమిటి?
"దీనితో నేను భీరువునైపోలేదు. అశక్తి-ఏశక్తి ఈ అలజడి కలిగిస్తోందో అదే నన్ను తోస్తోంది. ఓరోజు అర్ధం అవుతుందన్న ధైర్యం.
"అంతవరకూ....." ఇకపూర్తి చెయ్యలేక పోయేడు.
"రాజూ!" తెప్పరిల్లినట్లే.
"ఆరోజు వస్తా. పునః నీ ఇంటికే వస్తా. అప్పుడు...... అప్పుడు.........."
"రాజూ!" ఒక్కుమ్మడిగానే కాళ్ళు కళ్ళ కద్దు కుంది.
చేతిసంచీ పట్టుకునే, ముందు అతను నడి చేడు. వెనకాల సత్య, వీధిగుమ్మం మెట్లు ఒక్క చీడీ దిగే-
"సత్యా! నిన్ను చూస్తున్నప్పుడల్లా నీలోంచి ఏదో రూప నిర్ణయంలేని స్వరూపాన్ని చూస్తాను. నీకోసం వేచిఉన్నా నంటుంది. ఎప్పుడు నన్ను తీసుకువెళ్తావు అన్న తలంపే కలగజేస్తూంది.
"అదెవ్వరో చెప్పగలవా?" అన్నాడు.
బావురన్నట్లు గుమ్మానికే చేర్లబడింది. దుఃఖం. ఏ ఋషి నిష్ఠాభంగం అయి ఈమానవ కళేబరంలో తలదాచుకున్నాడు? ఏ పతన సామ్రాజ్ఞి అయి తను ఈనాడు కలుషితం చెయ్యాలనుకుంది? ఏమిటి ఈ సృష్టి రహస్యం? మానవజీవితం పునరపి జన్మ పునరపి మరణం అన్నదే నిజమవుతే, ఏమిటి ఈ సంక్షోభం?
"ఎప్పుడైనా, ఏనాడైనా, ఈ సత్య కొన్ని ఘంటలేనా నీసేవ చెయ్యగలిగితే ధన్యురాలవు తుందని మరిచిపోకు, రాజూ!" వెక్కివెక్కిన ఎక్కిళ్ళమధ్యనే.
రోడ్డుమీద అడుగు నిల్పుకుంటూనే-"సుమంగళీ భవ" అన్నమాటలు వినపడ్డాయి. ఎవరన్నారు? రాజు అన్నాడా? తెలియనే లేదు. కట్రాటలాగే కనుచూపు నిల్పింది. చేష్టలే లేవు.
* * *
"వారం అయ్యింది. అబ్బాయి రాలేదా?" సావిట్లోంచే రామచంద్రయ్య అడిగేడు.
"లేదు, మావయ్యా." రుక్మిణి.
"ఎక్కడకు వెళ్ళేడో? అదంటే వాడికి పంచప్రాణమున్నూ. చిన్న వయస్సులో ఎంత క్రూరంగా వదిలి వెళ్ళిపోయింది! ఆఖరుకు నన్ను కూడా....." కంఠం రుగ్ధపరుచుకున్నాడు.
"పెద్దలు. మీరే అంత బావురుమనిపోతే ఇక మా సంగతి ఎల్లా? ఎవరు చూస్తారు? పుట్టెడు దుఃఖం మ్రింగుకోలేకనే బావ వెళ్ళేడు. ఈ ఇల్లు, పరిసరాలు- ప్రతిదీ అత్తయ్యని జ్ఞాపకం చేస్తూనే ఉంది. అది మరిచిపోవడం అసంభవం, మావయ్యా!"
చిన్నదైనా సత్యమే చెప్పింది. ఈ ఇల్లు ఆరోజుల్లో చవగ్గా వచ్చిందనే కొన్నాడు. తర్వాత సౌధం దానిచేతుల్లో మణగి రూపొందింది. తన వయస్సు, ఆవిడ సాహచర్యం ఈ ఇంట్లోనే మూర్తీభవించేయి. మూడుపువ్వులూ, ఆరు కాయలూ కాసేయి. తనకు ఒక్కమాటలో చెప్పాలంటే లక్ష్మీప్రసన్నత అది కాలుపెట్టిన లగాయతు ఎత్తుకుని, ముమ్మరం అయి, ఊళ్ళోకెల్లా తనో ధనికుల్లో జమ అయి పోయేడు. పరివారాన్నే పోషిస్తున్నాడు. ఇది ఈ ఇంటి చరిత్ర.

ఈనాడు ఆ అధ్యాయానికి మంగళం పాడెయ్యవలసి వచ్చింది. అది వెళ్ళిపోయింది; తన్ని విధురుడి క్రిందచేసి. ఇక తను జీవితశేషం గడపవలసిందంతా, రాజుకోసం. తన వంశాంకురం. తనతర్వాత ఈ ఇంటికి, ఆస్తికి, బస్సులకు వాడు అధికారి. జీవితంలో తను సంతతికి ఇచ్చే ఆస్తి పాస్తులకు ఎప్పుడూ చింతపడలేదు. దాన్నిగూర్చి ఆలోచించలేదు.
కాని, ఒక్కటే దిగులు. వాడిని చూస్తూనే వచ్చేడు; వ్యక్తిత్వం వచ్చినప్పటినుండీ. తనతో మనస్సు విడిచి సాధకబాధకాలు ఎప్పుడూ మాట్లాడలేదు. ఆఖరికి ఆ కాలేజీల్లో ఉంటున్నా డబ్బుకొరకుకూడా తల్లికే వ్రాసేవాడు. అదీ తన పితృస్థానపు విలువ వాడిలో. ఇదే ఇప్పుడు సింహావలోకనం చేసుకుంటే తన స్థానపు విలువ ఏ స్థితికి వస్తుందో అన్న భయం లేకపోలేదు. అయినా తను తొణకలేడు. దిగ మ్రింగుకుని పరిస్థితుల్ని సవరించుకోవాలి. అదే గత్యంతరం కూడాను.
"వాడు నీతో అన్నాడా?"
"లేదు. కాని ఇది ఆలోచించవలసినదే."
హృదయం ఆర్ద్రపడింది. అదికూడా పరిస్థితుల్లో తను తీర్పు చెపుతున్నానన్న భావన కలగచెయ్యకుండా అల్లాగే అనేది.ఇప్పుడు రుక్మిణి. ఈ ఇంటికి సర్వాధికారిణి అయి ఏలవలసింది. ఈ భావన వత్సరాలక్రిందటే తనలో ఏర్పడింది. దానికి అది నీరుపోసి చిగురింప చేసింది. తనింటికి తెచ్చి, మెరుగులు దిద్దుటకే ఆనాడు తీసుకు వచ్చిన ముందుచూపుకు తర్వాతనే అభినందించుకున్నాడు.
ఈనాడు తను ఎదుట నిలబడి, 'రుక్మిణిని వివాహం చేసుకో' అని చెప్పలేకుండా ఉన్నాడు. తనలో ఏర్పడ్డ దూరపు ఉనికే ఈ పిరికితనం పోస్తూంది. చేసుకుంటే తను విచారించవలసింది లేదు. పైగా ఇంటి వ్యవహారాలన్నీ దానిపేరున జరిగినట్లే గడిచిపోతాయి. ఇక ఓ దృక్పథంలో చూస్తే, వాడు చదువు మానెయ్యవచ్చు. ఇంటి దగ్గరనే ఉండి వ్యవహారాలు చూస్తూ ఉంటే వాడి జీవితం కడుపులో చల్ల కదలకుండానే వెళ్ళుతుంది.
ఎక్కడకు వెళ్ళి ఉంటాడు? అన్నదానికి తను సమాధానం చెప్పుకోలేక పోతున్నాడు. ఇంటి మీద విముఖతే కారణం అయితే కాలేజీకి వెళ్ళి ఉండాలి. క్షణికం ఆప్యాయత పెంపొందించుకున్న ఎవరేనా ఉన్నారా అన్న సంశయం కలిగింది. ఇది తాత్కాలిక అపోహ అయినా, ధ్రువపడ్డ సత్యం కాదు. తమ వంశాలల్లో లేనిది అటువంటి గుణం. ఇక రాజులో ఆపాదించటం తన తెలివి తక్కువ అన్న ధైర్యం.
ఇన్నాళ్ళల్లోనూ చాలామంది, తన్ను పరామర్శించడానికి వచ్చినవాళ్ళు 'వాడేడీ?' అని అడిగేరు. ఎక్కడికి వెళ్ళేడు? తనకే తెలియదు. తను అబద్ధం ఆడి వాళ్ళను పంపేడు.
"మీ పెళ్ళి అయితే ఏదో ఓ మార్గంలో పడుతుంది." పైకి అనేసేడు.
సిగ్గుపడింది. అది సహజమే.
"అత్తయ్య వుండగానే అది జరుగుతుందను కున్నాను. కాని అదిలేదు." కళ్ళు చెమర్చేయి.
"నాన్నా, అమ్మా ఇన్నాళ్ళూ ఎందుకు రాలేదో అన్న దిగులుగా వుంది."
"ఆనాడే వ్రాసేను. ఎందుకు అందలేదో?"
"వాళ్ళువస్తే..." పూర్తి చెయ్యలేదు రుక్మిణి.
కాని, అది చాలు, దాని హృదయం చెప్పడానికి. ఎంతైనా పుట్టింటిమీద గౌరవ మర్యాదలు నిల్పడం విధి.
లోపలికి వెళ్ళింది. సోమయజుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించాలి. ఏర్పాట్లు చెయ్యాలి. కావలిస్తే సరుగుడుతోపు బంగళా బాగు చేయించాలి. ఎన్నో ఊహలు విజ్రుంభించాయి.
వీధిలో బండి ఆగిందన్న విషయంకూడా వినపడలేదు; వాలు కుర్చీలో భావనల్లో సృష్టి జరుగుతున్నప్పుడే.
"బావా, ఎంత దారుణం! కల్లోకూడా అనుకోలేదు." ఒక్కుమ్మడి కాళ్ళదగ్గరనే చతికిలపడి ఏడ్పు సాగించేడు, సీతారామయ్య బావమరిది.
ఉలిక్కిపడ్డాడు. "అక్కయ్య మమ్మల్ని గోతులో దింపేసింది. ఇంకా అందర్నీ అన్నపూర్ణ హస్తంతో చూస్తోవుందన్న భావనే. ఇంతగా....' మాట్లాడలేకపోయేడు.
"మా వదిన శుభలేఖ పంపుతుందని, ఇక ప్రయాణం కావాలని అనుకుంటుంటే, కొండ విరుచుకు పడ్డట్లు ఉత్తరం నిన్న అందింది. మా ఆశలు అన్నీ ఆవిడమీద పెట్టుకుని ఉన్నాం." లక్ష్మి.
తను జవాబు చెప్పలేడు. ఒకరిది రక్తస్పర్శ. రెండవ వారిది వియ్యపురాలి హోదా ఆక్రమించని ఆశయం.
అల్లాగే గడిచేయి క్షణాలు. రుక్మిణి వంటింట్లోంచి వస్తూనే, "నాన్నా" అంటూనే అండ చేరిపోయి ఏడ్చింది.
దుఃఖం. ఇది మానవత్వపు వల్లె. పదజాలాలకు అందని బాధ.
"ఈ వయస్సులో ఎల్లా భరించుకుంటా నన్న బెంగే, బావా."
"రాజు ఏడీ?"
మావయ్య, కోడళ్ళు ముఖం చూచుకున్నారు.
"బజారుకి వెళ్ళేడా?" లక్ష్మి వదలదలుచుకోలేదు. పైగా తను వచ్చిన పని వాడి నిర్ణయం మీద ఆధారపడి ఉంది.
"ఊరుకు వెళ్ళేడు." ముక్తసరిగానే అన్నాడు. రుక్మిణి తలవంచుకుంది.
ఏదో జరిగిందన్న విషయం మృగ్యం అవలేదు లక్ష్మికి.
"వంటా అవీ చూడాలి" అంటూనే లోపలికి అడుగులు వేసింది. రుక్మిణికి తప్పలేదు వెనకాల వెళ్ళడం. ఈ వెళ్ళడం వెనకాల తనకు కావలసినన్ని ప్రశ్నలు నిండి ఉన్నాయి. అమ్మ అంటే తనకు ఆ చిన్న వయస్సులోనే అర్ధం అయ్యింది. కూపీలు లాగి, ఆరాలుతీసి, ఓనిర్ధారణ క్షణాల్లోనే చెయ్యాలన్న తత్వం.
"ఎక్కడికి వెళ్ళేడే వాడు?"
తెల్లబోయింది రుక్మిణి. అమ్మ అంత ధీమాగా, సర్వాధికారిణిగా అడుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు.
"ఆకర్మ అయిన తర్వాతనే చెప్పకుండా వెళ్ళి పోయేడు." అబద్ధం ఆడలేదు. ఆడినా ప్రయోజనం లేదు.
"మరి మీమావయ్య ఏం చేస్తున్నట్లు?"
"వస్తాడన్న నమ్మకం ఆయనకూ, నాకూ వుంది."
"ఏడ్చినట్లే వుంది." ఈసడించేసింది.
