"ది పేషెంట్ యీజ్ రెడి".
అతని పల్కులు వినిన వెంటనే మాదప్ప అతనిపై వున్న గుడ్డను తొలగించాడు. నున్నగా క్షవరం చేయబడిన అతని పొత్తికడుపు భాగం అదీ పపు కాంతిలో రాగిరేకులా ఎర్రగా మెరుస్తోంది.
సిస్టర్ వెంటనే స్పిరిట్ లో ముంచిన దూది ముద్దను పట్టకారుతో మాదప్ప కందించింది. అతడు తను కోయవలసిన భాగాన్ని దృష్టిస్తూ అంత మేరకు స్పిరిట్ తో రుద్దాడు.
ఆమె టవల్స్ అందించగా రెడ్డి అతడి కిరువైపుల వాటిని ఒత్తుగా పెట్టాడు. టవల్ క్లిప్స్ అందుకుని అవి తొలగకుండా పెట్టాడు.
కుమార్ గదిలో దూరంగా నుంచున్నాడు. అతనితోపాటు ఇద్దరు విజిటింగ్ డాక్టర్లు కూడా నుంచుని వున్నారు. ఇద్దరు స్టూడెంట్ నర్స్ లు కూడా వున్నారు. అందరు తలకి గుడ్డటోపీలు, మాస్క్ లు, గౌను, ఓవర్ షూస్ వేసుకొని "శుభ్రంగా" తయారై దేనిని కూడా తాకకుండా నుంచున్నారు.
మాదప్ప కొన్ని క్షణాల పాటు ఆ పొట్ట భాగంవైపు తదేకంగా చూచాడు. బహుశః లోపలి అవయవాలు, కండరాలు, రక్తనాళాలు, అన్నీ అతనిదృష్టికి అగుపడుతున్నాయో ఏమో! ఒక్కక్షణం అతడు కన్నుమూసి తెరచినట్లు భ్రమ కలిగింది కుమార్ కు, మాదప్ప కళ్ళు గడియారం కేసి చూచాయి. దృష్టి పొట్టమీదకు మరల్చి చేయి చాపాడు.
సిస్టర్ పదునైన చిన్న కత్తి అతని హస్తంలో వుంచింది.
తనకు కావలసినంత మేరకు చర్మాన్ని - క్రొవ్వును కోశాడు. రక్తం స్రవించింది. డాక్టర్ రెడ్డి వెంటనే రక్తాన్ని అద్దేస్తున్నాడు. అతని చేతిలోని ఆకత్తిని తీసికొని బేసిన్ లో పడేసింది. మళ్ళీ అదే కత్తి దేనికి కూడ వాడబడదు. ఆమె ఇద్దరికి రక్తనాళాలను పట్టే "ఫోర్సెప్స్"ను అందించింది, రక్తం స్రవించకుండా చేయటానికి తెగిన రక్తనాళాలను కనుక్కుని పట్టుకుని కట్టేశారు. ముళ్ళు వేయగానే రక్తనాళాలను పట్టి పెట్టిన పట్లకార్లను తీసేశారు. తర్వాత మాంసకండల్ని ప్రక్కకు త్రోసి ప్రేవుల్ని చూచారు. గజిబిజిగా, గందరగోళంగా, నెమ్మదిగా కదుల్తున్నాయా చిన్నప్రేవులు, వాటిని వేడినీళ్ళలో ముంచి పిండివేసిన టవల్ తో పక్కకు నెట్టి పెట్టారు, వాటి కింద ముద్ర మడ్డి రంగులో మూత్రపిండాల జంట అగుపించాయి. చూడగానే ఎడమ మూత్రపిండం ఎంతగా పాడై పోయినదీ తెలిసిపోయింది, చూడటానికి వచ్చిన ఆ ఐదుగురు తొంగి తొంగి చూశారు.
మాదప్ప వ్రేళ్ళు అతి చురకుగా పని చేస్తున్నాయి. బాహ్య ప్రపంచాన్ని కతీతులి అందరు ఆపరేషన్ లో లీనమయ్యారు. కుమార్ మైమరచి చూస్తున్నాడు. ఎవ్వరు నోరు మెదవటం లేదు, మాదప్ప మరుక్షణంలో ఏ ఆయుధాన్ని కోరతాడో దాన్ని సిస్టర్ హుషారుగా అందిస్తోంది. రెడ్డి మాదప్ప చర్యల కనుగుణంగా మెలుగుతున్నాడు, అందరు సహకరించి ఐకమత్యంతో పనిచేస్తూ శస్త్ర చికిత్స చేస్తోంటే మిగతావారు - అందులో నిమగ్నమై చూస్తున్నారు.
టవల్ వేదినేళ్ళలో పిండి ప్రేవుల్ని పక్కకు పెట్టారు. ఆ ఆవిరి మాదప్ప కళ్ళజోడును మసకగా చేసింది. అది గమనించిన స్టూడెంట్ నర్స్ వెంటనే వాటిని తీసి శుభ్రంచేసి అతని కళ్ళకు పెట్టింది, "థాంక్స్" అన్నట్లు చూచాడు. రెడ్డి కనుబొమలపై చెమట బిందువులను చూచిన కుమార్ వాటిని తుడిచి వేశాడు. ఆపరేషన్ లో పాల్గొనేవారెవ్వరు కూడా ఈ పనులు చేయరు.
రెండవ మూత్రపిండం ఆరోగ్యంగా వుంది. దానికి జబ్బు అంటలేదు. పాడై పోయిన మూత్ర పిండాన్ని తీసివేయక ముందు కొంతసేపు దాన్ని అటు ఇటు కదిలించి చూచారాయన. ఏ మాత్రం చికిత్సకు లొంగదిది, చేయి చాపాడు. సిస్టర్ చిన్న కత్తిని అతని చేతిలో వుంచింది.
దాన్నికోసి సిస్టర్ చూపిన బేసిన్ లో పడేశాడు. దాన్ని లేబరేటరీలో పరీక్షకు పంపుతారు. దానివల్ల ఎన్నో విషయాలు తెలిసికోవచ్చు. వారుచేసిన పరీక్షలు ఎంతవరకు సరియైనవో కూడా తెలిసికోగలరు. శస్త్రచికిత్స చేసి అందరు తీయగలరు గాని-దేహం లోపలి అవయవాలను బాహ్య పరీక్షల మూలంగా, ఎక్స్ రేల మూలంగా, మూత్ర పరీక్షల మూలంగా పరీక్షించి వాటి జబ్బుకు కారణాలను కనుక్కుని డయగ్నయిజ్ చేయడం కష్టమైనపని. అనుభావగ్నులైన మేదావు లకే అది చేతనగును.
మూత్రపిండం కోసి వేయగా మిగిలిన గొట్టాన్ని మూసి కుట్టేశారు. సూదులు చంద్రవంకలా వుంటాయి. దారం - "కాట్ గట్" ను గొర్రె ప్రేవుతో చేస్తారు. మాదప్ప ఎడమ చేత్తోకూడా సునాయాసంగా ముళ్ళు వేయటం - కుట్టటం చూస్తుంటే కుమార్ కు కూడా అంత ప్రతిభతో తానెప్పుడు వేయగలడా? అని కోరుకునేవాడు, ఆరాధిస్తున్నట్లే వారంతా చూస్తుండి పోయారు.
ఆపరేషన్ అయిపోయినట్లే, మిగిలిన దంతా- భయంకరంగా తెరచుకున్న పొట్ట భాగాన్ని మూయటమే.
సిస్టర్ ఆయుధాలను, గాజుపడ్డ ముద్దలను లెక్క చూస్తోంది. ఆమె లెక్క సరిగా వున్నదో లేదో నని అసిస్టెంట్ నర్స్ మళ్ళీ చూస్తోంది. ఆర్టరీ ఫోర్సెస్స్ లెక్కచూస్తూ ఒకటి తక్కువ కావటం గమనించిందామె.
"సరే...ఆర్డరీ ఫోర్సెస్స్ ఒకటి తక్కువ పడింది"
"మాదప్ప-అసిస్టెంట్ సర్జన్ రెడ్డి ఇద్దరు నెమ్మదిగా వెదకటం ప్రారంభించారు. ఎక్కువ వెదకనవసరం లేకుండానే ప్రేవుల మధ్యలో అగు పడింది.
"అన్నీ లెక్కకు సరిపోయాయి సర్" అంది థియేటర్ నర్స్. ఆమె నుంచి ఈ హామీ వినగానే సర్జన్స్ ఇద్దరూ పొరలు పొరలు గా మూస్తూ వచ్చారు. ఆఖరుగా చర్మాన్ని మూసి కుట్లు వేస్తున్నారు.
ఆపరేషన్ అయిపోవచ్చినదని నర్స్ మాటల మూలంగా తెలిసికొన్న అనెస్తటిస్ట్ రోగికి మత్తు మందు ఇవ్వటం ఆపుజేశారు. కుట్టిన చర్మం మీద గాజుగుడ్డ, ఆపైన దూది పరచి బేండేజి చేసే సమయానికి రోగి గాఢమైన మత్తు వదిలిపోయింది. స్మారకంలోకి వస్తున్న గుర్తుగా అతడు అప్రయత్న ప్రక్రియలకు లొంగుతున్నాడు!
అనెస్తటిస్ట్ బాధ్యత అయిపోయింది. అతడు మెల్లగా ఒక్కమాటు విశ్వసించాడు.
అంతసేపు ఆపరేషన్ చేసినా - థియేటర్ లో వాళ్ళు మాట్లాడిన మాటలు వ్రేళ్ళమీద వెక్కించవచ్చును. నిశ్శబ్దంగా క్రమంగా జరిగిపోయింది. మాదప్పతో సహకరించిన ప్రతివారు తమవిధిని చక్కగా నెరవేర్చారు. ఒకరి పొగడ్తలు వారు కోరరు, వారు అక్కడవున్నదే అందుకు. సర్జన్ ఏది చేయబోతాడు. ఏది అవసరమో వారికి తెలుసు. అంతగా అనుభవం - తర్ఫీదు పొందిన వారు. ఆపరేషన్ విజయవంతమైన దంటే అది అందరిపై ఆధారపడి వుంటుంది.
అతడిని "స్ట్రెచ్చర్" లో పరుండజేసి నెమ్మదిగా బైటికి తీసికొని వెళ్ళిపోయారు.
సిస్టర్ ఒక్కమాటు థియేటర్ ను కలియజూచింది. దీర్ఘంగా విశ్వసించింది. చాల అలసటగా వుంది..... కాని..... కాని.... థియేటర్ మళ్ళీ తయారుగా వుంచాలి. అది తన డ్యూటీ స్టూలు మీద ఒక నిమిషం కూచుంది....అంతే....లేచి శుభ్రం చేయించడంలో చేయిడంలో నిమగ్నమై పోయింది!
వెలుపల మాదప్ప అతడి బంధు మిత్రులతో మరేం ఫరవాలేదని - ధైర్యం జెప్పాడు.
మరుసటి రోజు డాక్టర్స్ అంతా "రౌండ్స్ కు బయలు దేరారు, ఒక నర్స్ - టవల్ తో బేసిన్ లో లోషన్ తో వెంట వెళ్తోంది.
షాహుకారు గదిలోకి వెళ్ళారు. డ్యూటీ నర్స్ నెమ్మదిగా అంటోంది. "సర్-నేను చచ్చి పోతాను-బ్రతకనంటూ ఏ మందుగాని, ఇంజెక్షన్ గాని తీసికోవటం లేదు. బాధ నివారణ కు ఏదీ చెయ్యనివ్వటం లేదు....చాల నిస్పృహతో వున్నారు."
వారికి చాల ఆశ్చర్యం వేసింది. ఇది పూర్వకాలం కాదు. ఆధునిక యుగం. క్రొత్త రకం మందులు యాంటీబయెటిక్స్ ("క్రిమి సూక్ష్మ జీవి సంహార మందులు) ఎన్నో వున్నాయి రెండు కిడ్నీల పని ఒకటి చేయగలదు. దానికి శ్రమ కాదు, అది భరించగలదు. ప్రాణ హాని సంభవించేటంత హానికరమైన ఆపరేషన్ కాదు కానీ ఆరోగ్యం పొందాలంటే రోగికి తనపై నమ్మకం కుదరాలి. బ్రతుకుపై ఆశ పడాలి మనోదార్ధ్యం కల్గి నిబ్బరంగా వుండాలి. ధైర్యంతో బాధను సహించాలి. అప్పుడే ఎలాంటి జబ్బులైన మందులకు లొంగుతాయి. మానసిక ప్రవృత్తిపై రోగి ఆరోగ్యం ఆధారపడి వుంది.
"ఎంత ధైర్యం చెప్పినా లాభం లేకపోయింది" డాక్టర్ రెడ్డి అన్నాడు. ఆయన భ్రుకుటీకరించి స్టెత స్కోప్ ను చేతితో త్రిప్పుతూ ఏదో ఆలోచనలో పడిపోయారు,
ఉన్నట్లుండి అతని ముఖం వికసించింది. చిరునవ్వులో షాహుకారు తల దగ్గర నుంచుని మెల్లగా పిల్చారు.
అతను బాధగా కళ్ళు తెరచారు. "మీకు కొద్దిగా జ్వరం తప్ప మరేమి లేదు. నొప్పి లేకుండా వుంటానికి యింజెక్షన్ ఇస్తాను." "నాకొద్దు బాబూ -నాకొద్దు - ఇలా ఒదిలి పెట్టండి. అందరూ నాకన్యాయం చేశారు-అది - దాని పిల్లలు నా గొంతు కోశారు.... అబ్బో.....బాధ" "మీరు అలా అరిస్తే నిజంగా బాధే- ఎందుకంత బెంబేలు పడ్తున్నారు, ఇదే మంత పెద్ద ఆపరేషనే కాదు......"
"నన్ను చంపేయటానికే తెచ్చారు. త్వరగా పోతే ఆస్థంతా కాజేద్దామని......" భార్య దూరంగా నుంచుని కళ్ళు ఒత్తుకుంటోంది. "చూడండి-బాధలో వుండి మీకలా అనిపిస్తోంది. మీకు చక్కగా నయమౌతుంది....పాడైన దాన్ని తీసి పారేశాను...ఇక మీలో ఏ జబ్బులేదు .... లక్షణంగా తిరుగుతారు ... ఎందుకూ..... ఇరవై సంవత్సరాల క్రితం నాకూ ఒక మూత్రపిండాన్ని కోసి పారేశారు. హాయిగా వున్నాను చూడండి....ఎంత ఆరోగ్యంగా వున్నాను...నూరేళ్ళదాకా బ్రతుకుతానని మా అమ్మ అంటారు. నాలో ఏదైనా లోపం వుందా? అవిటి వానిగా కనిపిస్తున్నానా?"
మాదప్ప నిటారుగా నుంచుని సూటిగా రోగి కళ్ళలోకి చూచాడు. రోగి కళ్ళలో కొత్త వెలుగు ప్రకాశించింది. నర్సుకు ఏదో చెప్పాడు. ఆమె ఇంజక్షన్ యిస్తుంటే మెదలకుండా వూరుకున్నాడు.
నెల లోపుగా స్వాస్థ్త్యత పొంది ఇంటికి వెళ్ళి పోయాడు.
పక్షం రోజులకు ఒక సారి చూపించు కోటా నికి తిరిగి ఆసుపత్రికి వెళ్ళాడు. ఆఫీసులో కూచుని వున్న మాదప్పకు నమస్కరించి కూచున్నాడు. పరీక్షచేసి మరేం ఫరవాలేదని చెప్పి,మాదప్ప వేరే పనిమీద వెళ్ళబోయాడు .... ఆ హుషాకారులేచి నుంచుని వినయంగా అడిగాడు. డాక్టరు గారు - నిజంగా - మీకు కూడా ఒకటే వుందా"
ఆయన నవ్వి షర్టు అంచులు పైకి లాగ బోతున్నట్లు నటిస్తూ "ఏం చూస్తారా?" అన్నాడు.
"అబ్బే- లేదండి - అందరి లాగానే మామూలు మనుషుల్లా వుంటామన్న మాట" మధన తల పంకించి "ఔను" అని అన్నాడు.
అతను వెళ్ళాక మాదప్ప కుమార్ ని కలిశాడు.
"కుమార్ అడిగాడు" సర్- ఏమీ అనుకోక పోతే - మీకూ ఒకటే.....ఆయన విరగబడి నవ్వాడు "అబ్బే లేదు డాక్టర్- నాకు రెండూ సలక్షణంగా వున్నాయి .... ఒకటే అయితే ఏనాడో చచ్చిపోయేవాడిని"...."ఇద్దరూ శృతి కలిపి నవ్వారు. ఆయన మళ్ళీ ప్రారంభించాడు "ఆడపిల్ల పెళ్ళి చేసేప్పుడు అబద్దాలా డొచ్చునట. మరి అంతకన్నా ముఖమైన ప్రాణాన్ని కాపాదేందుకు ఎన్ని అబద్దాలైన చెప్పొచ్చు.....అటు చూడు....ఎంత హుషారుగా వెళ్తున్నాడు...."
అతను వెళ్ళిన దిక్కుకేసి చూస్తూ నుంచున్నాడు కుమార్. "ఒక చిన్న మాట...రోగి మనసు కనిపెట్టి వైద్యం చెయ్యాలి ఒకే వైద్యం కొన్నిసార్లు పనిచేయదు..... నిలకడపై తెలిసి కొంటావు.... ఆ ....ఏదీ..... ఆ హార్ కేసు చార్టు!"
* * *
