Previous Page Next Page 
ఆరాధన పేజి 4

               
                                       3
    ఏదో చిన్న స్టేషన్ రాగానే దిగి వెళ్లి మామిడి పళ్ళు తెచ్చి అందించాడు 'తినండి' అంటూ. కాదనలేక స్వీకరించిందామె. కానీ ఎందుకో తినాలన్పించలేదు.
    మద్రాసు రాగానే అన్నాడతను--
    'ఒక్క గంట మా యింట్లో గడప గలరా?' ఆ కంఠనా ధ్వనించిన అనురాగానికామె కదిలిపోయింది. స్నేహితురాలు మంజుల కు ఫోను చేసింది. వో గంట తర్వాత రాగలనని. ఆమె అంగీకారం వినగానే ఆ యువకుని ముఖాన ఆనందం కాంతులు విరజిమ్మింది.
    స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి అయిదు నిమిషాల్లో వచ్చాడు. తరువాత పది నిమిషాల్లో వారి ముందో అందమైన కారాగి వుంది. అది అతనిదేనని గ్రహించింది అనూరాధ.నౌకరు వెంటనే 'డోర్' తెరిచి వినయంగా నిలబడ్డాడు.
    అపరిచితుల మధ్య , అతని యింట్లో ఎలా మెలగాలో అని అనుకున్నదామె. 'ఈ డాక్టర్ జీవితంలో ఆనందం మచ్చుకైనా లేదనిపించుతోంది. ఎవరు శపించగలోగారింత మృదు హృదయుడ్ని?' ఆమె ఆలోచనలో తేలిపోతోంది.
    'దిగండి! మళ్లీ వెళ్ళిపోతానంటారు గంట పూర్తీ కాగానే' అన్నాడతడు. ఆలోచనల్లోంచి తేరుకుని దిగిందామె రెండతస్తుల మేడ. ముందు అందమైన పూల తోట. గేటు తీసి సవినయంగా నమస్కరించాడో నౌకరు.
    'జమీందారు కాదు గదా!' అనుకున్న దామెలోని అనుమానం.
    పూల తీవలెన్నో రంగు లోలికించుతోన్న మేడపై అందంగా పాకి వున్నాయి. అందాల సుమ బాలలు వయ్యారంగా కదులుతూ నవ్వులతో చిందులు వేస్తున్నాయి.
    ఎదురుగా వో తెల్లని కుక్క పిల్ల చెవులు వూపుకుంటూ వచ్చి అతని పాదాల చుట్టూ తిరగసాగింది.
    'టామీ! ఈ డాక్టర్ కున్న ఒకే కుక్క స్నేహమయి.' అంటూ పరిచయం చేశాడతను.
    ఎందుకతడు మాటి మాటికీ తన ఒంటరితనాన్ని అలా వ్యక్తం చేస్తున్నాడో ఆమెకు అర్ధమావ్వడం లేదెంతగా ఆలోచించినా. ఆమె అతని వంక చూసింది. కానీ అతడు కుక్క పిల్లను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. క్రింద నాలుగు గదులు. విశాలమైన హాలు.
    'పార్వతమ్మా! అమ్మగారికి వేడినీళ్ళు వుంచు బాత్ రూమ్ లో' అన్నాడతడు. వద్దని వారించినా అతడు విన్పించుకోడని మౌనం వహించింది అనూరాధ.
    సుమారు యాభై యేళ్ళున్న వో స్త్రీ 'రండమ్మ!' అంటూ బాత్ రూమ్ చూపించింది. అంతే! 'మీరు బాబుగారి కేమౌతారని ప్రశ్నించలే దొక్కరూ!' అతనికి తల్లితండ్రులు లేరని తెలిసి కొందా పార్వతమ్మ నడిగి.
    'బాబుగారెంతో మంచోరమ్మా కానీ బగవంతుడు అన్నేయం జేశాడు తల్లీ! అమ్మను తీసుకు పోయినాడు. అయ్యను కూడా కరువు జేసినాడమ్మా! లచ్చలున్నాయి. ప్చ్! పాపం! కానీ వోరుండారు? సిన్నప్పుడే మేనమాగోరు తీసి కేల్లారు. చదువు సందెలు జెప్పించారు. ఎంత తిన్నారో, ఏం జేశారో తల్లీ! ఎవరికి తెలుసు! బాబుగోరు డాక్టటేరయ్యాక యీ మేడ కట్టి వచ్చేశారు. ఒక్కరన్నా అయ్యగారి ' సేమం  అడిగే వాళ్లు లేరు గందా! రామ! రామ! తిరణాల సేజలా వస్తారమ్మా ఎప్పుడూ!' ఆమె చెప్పుకుపోతూనే వుంది.
    కొంతవరకు అ డాక్టర్ మనస్సు ను అర్ధం చేసికోగల్గిండప్పటికి. జడ అల్లుకుని నుదుట కుంకుమ వుంచుకోబోతోంది -- వో పాకెట్ తెచ్చింది పార్వతమ్మ--
    'అమ్మాయి గోరూ! ఇదిగో చీర, పూలు పంపారు అయ్యగోరు. బాబుగారియ్యాల సంతోషం తో వుండారమ్మా చాన్నాళ్లకి. ఎవరికీ యింత యిదిగా పూలు పంపించలేదు. కట్టుకోండమ్మా! కాదంటే సిన్నబోతారు' అన్నదో పాకెట్ తెచ్చి అనూరాధ ముందుంచుతూ.
    అనూరాధా కా కోరిక వింతగా వుంది. తిరస్కరించాలనీ అన్పించడం లేదు అంగీకరించాలనీ అనుకోవడం లేదు.
    హల్లో చప్పుడైంది. అతను వస్తున్నాడని గ్రహించింది. వెంటనే పూలు తురుముకుంది. చీర కట్టుకుంది.
    'లోపలికి రావచ్చునా?' మృదువుగా వినిదించిందతనిలోని అనురాగ వీణియ.
    'పరదా పద్దతి లేదులెండి. రండి!' అన్నదామె.
    పార్వతమ్మ 'బంగారు బొమ్మలాగుండారు! తల్లీ!' అంటూ మురిసిపోతూ, పనుందంటూ వెళ్ళిపోయింది. హరికృష్ణ లోనికి రాగానే తన వంక చూసి వర్ణించు తాడను కుంది అనూరాధ. కానీ అతడు కనులేత్తనే లేదేంత సేపటికి.
    అక్కడే వున్న కుర్చీలో కూర్చుని ఎదురుగా వున్న కిటికీ లో నుంచి కన్పించుతూన్న రోడ్డు వైపు చూస్తూ అన్నాడు --
    'మిమ్మల్ని యిబ్బంది పెట్టాననుకుంటాను.'
    కావాలనే మౌనంగా వుండి పోయిందామే. ప్రక్కనే వున్న పుస్తకాల బీరువా వంక చూస్తూ.
    'అమ్మ లేదు. కానీ ఉగాది నాడు అమ్మకో చీర పెట్టి పూజ చేయడం అలవాటయి పోయింది డాక్టర్ కి. ఎందుకంటారా? అదే నా పుట్టిన రోజు. స్వర్గం లో వున్న అమ్మ తప్పక నన్ను దీవించుతుందని నా నమ్మకం....' అతని కంఠం జీరవోయింది. కన్నులలో నీళ్ళు తిరిగాయి. క్షణ మాత్రం ఆగిపోయాడు. దివంగుతురాలైన మాతృమూర్తి స్మృతులతో కదిలి పోయిందా మృదుహృదయం. 

 

                                        
    'ఆ చీరలన్నీ అలాగే వుండి పోయాయి. ఎవరికీ యివ్వాలన్పించలేదు. కానీ మీకు యివ్వకుండా వుండలేక పోయాను.'
    అనూరాధ మనస్సున వేయి ఆలోచనలు పడగలు విప్పాయి ఒక్కమారుగా. 'ఇదేమిటి? ఇంత పవిత్రంగా వుహించుకుంటున్నాడు నన్ను? నేనెవర్ని ఈయనెవరు? వింతగా వుంది! ఎవ్వరూ ఆత్మీయులే లేరంటున్నాడు? మరి....నేను ఆత్మీయురాలినా? ఎలా? పెళ్లి జేసికోవచ్చుగా? అందం వుంది. ఆస్తి వుంది . అందుకు తగిన హోదా వుంది. అందాల సహచారిణి దొరికి తీరుతుందిగా?' మధ్యలో అతని వంక చూసింది.
    పొడుగైన విగ్రహం! నిర్మలంగా నవ్వుతున్న కళ్ళు! ఎర్రని ఛాయా!
    'ఏం తక్కువ యీ డాక్టర్ కి? ఎందుకలా మ్రోడులా-- వుండి పోయాడూ?' ఆమె వూహ లోకంలో నుంచి వెలికి వచ్చే సూచనలే కన్పించక పోవడంతో అతడే అన్నాడు తిరిగి--
    'మీ స్నేహితురాలి కి 'ఫోను' చేశాను లెండి. రావడం కొంచెం ఆలస్య మౌతుందని.'
    అప్పటికి గానీ గుర్తుకు రాలేదామేకా సంగతి. అతడంత హడావిడి లోనూ ఆ సంగతిని మరిచి పోనందుకెంతో అభినందించింది లోలోన.
    భోజనాలు చేస్తున్నంత సేపూ మాట్లాడుతూనే వున్నాడు. ఎంతో దగ్గరి బంధువులా, ఆత్మీయుడి లా అనురాగాన్ని కురిపించుతూ మధ్యలో నవ్వించు తున్నాడు.
    'ఎన్నాళ్ళకో నవ్వుతూ తిన్నారు బాబుగోరు' అన్నది పనిమనిషి -- పాత్రల్ని సర్దుతూ.
    అనురాధ తాంబూలం వేసుకుంటూ అన్నది.
    'ఇక వెళ్ళనిస్తారా?'
    ఏదో చెప్పాలని ఆమె వంకే చూస్తున్న హరి కృష్ణ ఆ మాట వినగానే విరమించు కున్నాడు తన ప్రయత్నాన్ని. ఆ సంగతి గ్రహించింది అనూరాధ.
    'మరీ యింత మృదువుగా వుండకూడదు మగవాళ్ళు. అలా వుంటే ఎన్నో యిబ్బందు లున్నాయి.' అన్నదామె ఏదో భావాన్నీ చెప్పాలన్న వుద్దేశ్యంతో.
    అతడామె వంక చూశాడో క్షణం ....
    'మీకు తెలియదసలు సంగతి. నేనెవరి తోనూ మృదువుగా మాట్లాడలేను. అందుకే నాకెవరూ ఆత్మీయులు లేరు.' అన్నాడు.
    'ఆ! ఒక్క నిమిషం ఆగండి! చాలు!' అంటూ అతడు లేచి వెళ్ళాడు లోనికి. మేడ పైకి వెళ్లి వస్తూ చేత్తో వో ఆల్బం తెచ్చి ఆమె కందించాడు.
    మొదటి పేజీ లో అతని 'ఫోటో' యే వుంది. రెండో పేజీ తీయగానే నవ్వుల పువ్వులు జల్లుతున్న అందమైన వో అమ్మాయి 'ఫోటో' వుంది. ఎవరన్నట్టు చూసింది అనూరాధ.
    'నా క్లాస్ మేట్! వరసకి మేనగోడలు కూడాను.'
    'పేరేమిటి?'
    'శారద! ఎంతో మంచిది. నేనంటే ప్రాణం పెడుతుంది.' అన్నాడు అతని స్వరం కొంచెంగా వణికిందా మాట అటుండగా.
    'మరి....' ఏదో అడగబోయింది అనూరాధ.
    'ప్లీజు! ఇపుడేమీ అడక్కండి! అంతా చెబుతావోసారి. పదండి! మీ మంజుల గారికి కోపం వస్తుందేమో!' అంటూ లేచి నిల్చున్నాడు. డ్రైవర్ని కేకవేసి కారు సిద్దంగా ఉంచమన్నాడు.'
    అంతలోనే పరాయి మనిషిలా మారిపోయిన అతడి ప్రవర్తన కామె విస్తు పోయిందేంత గానో. అంతవరకూ 'వెళ్ళవద్దు' అన్న మనిషే 'పదండి' అంటూ తానె పంపించుతున్నాడు.
    'ఏమిటీ మనిషి? వింతగా వుందే? ఎవరికీ అర్ధం గాడనుకుంటానే! ఎవరా శారద? ఎక్కడుందో ఆ అమ్మాయి?!' కారులో కూర్చున్నా ఆమె అతని వింత మనస్తత్వాన్ని గురించే ఆలోచించుతూండి పోయింది.    
    కారు ఆగగానే మంజుల గారి యిల్లేమో అని దిగబోయింది. కానీ ఎదురుగా 'డాక్టర్ శారద య,మ్.డి' అన్న బోర్డు వేలాడుతోంది.సందేహన్నణచుకుని దిగిందామె.
    హరికృష్ణ గేటు తీసి 'లోనికి రండి' అన్నాడు.
    'అరె! ఇదేమిటివాళ?! ఇంత శ్రద్ధ బావకి? కబురు చేసినా, రానన్నావుగా? మరి....' ఎదురుగా అనూరాధ వుండడం చూసి ఆగిపోయిందామె.
    తెల్లని చీరలో పాలరాతి బొమ్మలా మెరిసి పోతోందా యువతి.
    'అనూరాధ అని మొన్న వో సారి పేపర్లో పడింది చూశావా? అదిగో ఆమె యీ అనూరాధ! మన మద్రాసు లో వో ప్రోగ్రామ్ ' యివ్వడానికి వచ్చారు!...
    మా శారద! చెప్పానుగా మీకు!' అన్నాడు అనూరాధ వైపు తిరిగి.
    నమస్కరించుకున్నారిరువురూ. శారద కనులలో ఆశ్చర్యం తొంగి చూస్తోందేందుకో అనూరాధనుచూసినపుడు.
    'సతీశ్' లేడనుకుంటానే !' అన్నాడు హరికృష్ణ.
    'లేరు బావా! అయన కాకినాడ వెళ్ళారు నిన్ననే! ఏదో పనుందని' అన్నదామె. శారదకు వివాహమైందని గ్రహించింది అనూరాధ. ఆమె కాఫీ, టిఫిన్ తీసికొని రమ్మని నౌకర్ని కేకవేయబోతుండగా వద్దని వారించాడు హరికృష్ణ.
    బయలుదేరి వెళ్తుండగా అన్నది శారద --
    'ఈ చీర చాలా బావుంది! ఎక్కడ తీసుకున్నారు?'
    ఆమె ఆ ప్రశ్న ఎందు కడిగిందో అర్ధం చేసుకుంది అనూరాధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS