రధానికి బ్రహ్మాండమైన మోకులు కట్టేవారు. దాన్ని ఊరి పెద్దలంతా లాగేవారు "గోవిందా, గోవిందా" అంటూ. ధర్మకర్త మొదటిసారి మోకు లాగేవాడు. ధర్మకర్త తరవాత ఊరి పెద్ద చౌదరి , ఆ తరువాత మునసబు కరణాలు , ఆ తరువాత కుల పెద్దలు -- అలా వారి వారి హోదాలను బట్టి , తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని బట్టి మోకు లాగేవారు. "గోవిందా, గోవిందా" అనే మాటలు వేలాది మంది ఉచ్చరించటం తో , ఆ భక్తుల కంఠనాధం చుట్టూ పట్ల అయిదారు మైళ్ళ దూరం వినిపించేది. ఆబాల గోపాలం ఏదో మహా యానం సాగిస్తున్నట్లు రధం వెంట సాగిపోయేవారు. రధం ఏయే వీధుల గుండా వెళ్ళాలో కూడా ఒక సంప్రదాయం నిర్ణయించేది.
పార్ధసారధి చిన్నప్పటి నుంచీ విపరీతంగా అల్లరి చేసేవాడు. గుళ్ళో పూజారికీ సారధి అంటే హడలుగా వుండేది. రోజూ దేవుడికి అర్చన చేసేముందే ఫలహారం సారధికి పెట్టేవాడు పూజారి. ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఒకనాడు సారధి ధర్మకర్త గారి కూతురు జడ పుచ్చుకు లాగాడని పెద్ద రభస జరిగింది.
ఇప్పుడు మా ఊరు వెళ్ళినా ఎక్కువకాలం ఉండాలని పించటం లేదు. సారధి నేనూ కలిసి ఆ సాయంత్రం ఊరంతా కలియ తిరిగాం. ఆ రోజుల్లో బ్రాహ్మల బజారని ప్రత్యేకంగా ఒక బజారుండేది. అలాగే బ్రాహ్మల చేరు వుండేది. ఇప్పుడు బ్రాహ్మణ బజార్లో కోళ్ళు తిరుగుతున్నాయి. నాయుళ్ళు, రెడ్లు ఆ ఇళ్ళు కొనుక్కున్నారు.
సారధి, నేను నాలుగు వీధులు తిరిగి గుడి దగ్గిరికి చేరుకున్నాం. ఆ ధ్వజస్తంభం మాకు చాలా పరిచితమయింది. ఆ గోపుర శిఖరాలు మా క్రీడా కేంద్రాలా రోజుల్లో. ఇప్పుడు అలయమంతా కరెంటు పెట్టించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, వేశారు. అట్లతద్ది కి చాలా అల్లరి చేసేవాళ్ళం. అందరి దొడ్ల ల్లోనూ జొరబడి, కూరగాయలు కోసి, గోపుర శిఖరం మీద గుహలోకి చేర్చేవాళ్ళం. రాత్రి పన్నెండు గంటలకు ప్రారంభమయ్యే మా హడావిడి తెల్లవారు ఝాము దాకా సాగేది. ఆ అర్ధరాత్రి గాడాంధ కారంలో అంత ఎత్తు నున్న ఆలయ గోపురం ఎలా ఎక్కే వాళ్ళమో తలుచుకుంటే ఇప్పుడు భయం వేస్తుంది. మాలో పార్ధసారధి కున్న తెగింపు, చొరవ ఎవరికీ ఉండేవి కావు. గోపురానికి మూడు గుహలున్నాయి ఒకాదాని మీద ఒకటి. చివరి గుహలో గుడ్ల గూబ లుండేవి. ఒకరాత్రి సరదాగా గోపురం ఎక్కాడు సారధి. గుడ్ల గూబను పట్టుకోవాలని అతని ప్రయత్నం. నేనూ, రఘుపతీ అతనికి తోడుగా వెళ్లాం. కాని అతనితో పైకి ఎక్కటానికి మేం సాహసించ లేదు.
సారధి ఒక్క గెంతులో గోడ మీదికి ఎగబాకాడు. గోపురం పైకిమెల్లిగా పాకుకుంటూ వెళుతున్నాడు. పైకి చూస్తున్న మాకే కళ్ళు తిరిగాయి. అంతలో సారధి తిడుతున్నాడు. పెద్దగా కేకలు వేస్తూ , "నీ ప్రాణం తీస్తా ఇవాళ! నా సంగతి నీకు తెలియదూ?' అంటూ అరుస్తున్నాడు.
అది తాచు పాము. నల్లతాచు. బుసలు కొడుతూ అతని మీదికి వస్తుంది. అతని నోట్లో ఈత బెత్తముంది. గుడ్ల గూబను అదిలించటానికి నోట కరుచుకు వెడుతున్నాడు . అప్పుడే పెద్ద వాన కురిసి వెలిసింది. అందుచేత సారధికి పైకి వెళ్ళటానికి పట్టు చిక్కడం లేదు. ఒక చేత్తో గోపురపు అర అంచును పట్టుకొని రెండో చేత్తో ఆ ఈత బెత్తాన్ని పాము మీదికి విసురుతున్నాడు. అరుస్తున్నాడు. తాచు పారిపోయింది. మేం కింది నుంచి మూడు బ్యాటరీ లైట్లు వేస్తూ, భయశ్చర్యాలతో వణికిపోతూ జరుగుతున్నది చూస్తున్నాం. తాచు తోక ముడిచి, పైకి సాగి, మూడో గుహలోకి పోయింది. 'ఇవాల్టి కి దిగరా , సారధి " అంటూ మేం కేకలు పెడుతున్నాం.
"ఇవాళ దీని అంతం చూస్తా" అంటూ పైకి వెళుతున్నాడు . మాకు భయం వేసింది. సారధి జీవితం ఆనాటితో అయిపోయిందను కున్నాం.
"ఒరేయ్ , గుడ్ల గూబని రేపు పట్టుకోవచ్చు. దిగి రారా ఇవాల్టి కి. తాచు పైకి దూరింది" అని ఏడుస్తూ అరిచాను.
"వెధవ గుడ్ల గూబెందుకురా! ఆ తాచు గాడి నే పట్టుకువస్తా. ఇవాళ డానికి బుద్ది చెప్ప వలసిందే. ఆ టార్చి ఇలా అందించరా!" అన్నాడు.
మాకు పైకి ఎక్కటానికి ధైర్యం చాలలేదు. వాడే క్షణం లో కిందికి జారి చేతిలోంచి టార్చి లాక్కున్నాడు. నేను, రఘుపతి ఇద్దరం ఎంతో బ్రతిమిలాడాం. "చస్తావురా!" అంటూ చొక్కా పుచ్చుకు లాగాం. సారధి ఉగ్రుడై ఇద్దర్నీ తోసుకుంటూ , "పొండిరా పిరికి సన్నాసులు! నామీద బుస కొడుతుందా? ఇవాళ దాని అంతం కనుక్కుంటా" అంటూ మళ్ళీ గోపురానికి ఎగబ్రాకటం ప్రారంభించాడు.
మాకు భయం ఎక్కువై ఇంటికి పరుగెత్తాం. ముకుందరావు ని, అనంతమ్మ ని లేపి , ఏడుస్తూ జరిగినదంతా చెప్పాం. వీధి అంతా లేచారు. తలో లైటూ తలో కర్రా పుచ్చుకొని దేవాలయం దగ్గిర పోగయ్యారు. గోపురం చిట్టచివరి గుహలో టార్చి వెలుగుతుంది. కేకలు వినిపిస్తున్నాయి. కింది నుంచి ముకుందరావు, అనంతమ్మ ఏడుస్తూ కిందికి దిగి రమ్మని కొడుకుని పిలుస్తున్నారు.
"మీరెవరన్నా పైకి పోయి నా బాబుని రక్షించండి బాబూ " అంటూ అనంతమ్మ అందర్నీ బ్రతిమలాడుతూ , తల బాదుకుంటూ ఏడుస్తుంది.
గుడి ఎదురుగుండా మునసబు గారి ఇల్లు ఉంది. మునసబు గారి కూతురు సుబ్బులు కూడా అందరితో పాటు ఆ సంరంభం చూడటానికి బైటికి వచ్చింది. ఆవిణ్ణి ప్రేమిస్తున్న యువకుల్లో రంగదాసు ఒకడు. అతను సినిమాల్లో చేరాలని గిరజాలు పెంచుకొని మద్రాసు వెళ్లి ఉపోషాలు చేసి, బక్కచిక్కి తిరిగి వచ్చాడు. అతను సుబ్బుల్ని మెప్పించాలనే తాపత్రయంతో గోచీ బిగించి, "నీ బిడ్డను రక్షించే భారం నా"దంటూ అనంతమ్మ గారికి హామీ ఇచ్చి, గోపురం పైకి ఎగబ్రాకటం ప్రారంభించాడు.
ఇంకా మూడో గుహలో టార్చి వెలుగుతూనే ఉంది. అంతలో మొదటి గుహలో అడుగు పెట్టిన రంగదాసు ఒక్కసారిగా కేక పెట్టాడు.
"అమ్మ బాబోయ్!పాము!'
ఆ కేక విని కింద పోగైన నాలుగు వందల మంది జనం వణికి పోయారు. కింద ఎక్కడన్నా పాముందేమో అని కలియ జూసుకున్నారు. తాడు తొక్కి ఉలిక్కిపడ్డాడు చౌదరయ్య.
పెనుగులాడి పెనుగులాడి సారధి బయటికి వచ్చాడు . గుహలోంచి తల బైటికి పెట్టాడు. పాము తోక పుచ్చుకు గిరగిరా తిప్పుతున్నాడు. జనమంతా నిశ్చేష్టులై , భయ సంభ్రశ్చర్యలతో పైకి చూస్తున్నారు. పది టార్చి లైట్లు పైకి వెలుగుతున్నాయి. పామును తిప్పి తిప్పి, "ఇప్పుడు తెలిసిందా ముండా సారధి అంటే ఏమిటో?" అంటూ క్రిందికి విసిరాడు. అది పోయి, పోయి మునసబు గారి కూతురు సుబ్బులు మీద పడింది. ఆవిడ గావు కేక పెట్టి మూర్చ పోయింది. పాము అప్పటికే చచ్చి వుండడం వల్ల ఆమెకు ప్రాణ భయం కలగలేదు.
సారధి మొదటి గుహలోకి వచ్చి, ఊరికినే భయపడి మూర్చపోయిన రంగదాసు ని గిల్లి, చీరి, లేపి, నెమ్మదిగా కిందికి తీసుకు వచ్చాడు.
ఇలాటివే పార్ధ సారధి లేత వయసులో చేసిన దుండగాలు, సాహసాలు ఎన్నో నా కళ్ళ ముందు మెదులుతున్నాయి.
* * * *
ఆ రోజుల్లో మా ఊరి నిండా పాటి మట్టి గోతు లుండేవి . ఇళ్ళ మధ్యనే చాలా లోతుగా , భయంకరంగా ఉండేవి.
ఒకనాడు సార బీడీలు కాల్చాలని మేం నిశ్చయించు కున్నాం. ఒక పెద్ద తన్ను లాతయ్యాక , అప్పుడే రఘుపతి కి మాకు కొంచెం కొంచెం స్నేహం కలుస్తుంది. సారబీడీలంటే , ఎండిపోయిన సారపాదు తీగెల్ని సిగరెట్ల లా కత్తిరించిన ముక్క లన్న మాట. ఎవరికీ తెలియకుండా కాల్చాలి వాటిని. ఊరి బయట పాడుబడ్డ సత్రం ఒకటి ఉంది. ఎప్పుడన్నా ఉప్పర్లు, ఎరుకలు, ఏనాదులు అక్కడ దిగుతా రంతే.
సరే! ఆ నిర్మానుష్యమైన దయ్యాల భవనం మాకు తగిన చోటని సారధి నిర్ణయించాడు. అతని మాటకు తిరుగు లేదు. అతను తలుచుకున్నది చేసి తీరతాడు.
ఆ దయ్యాల భవనం లో ఒక ఆదివారం మధ్యాహ్నం నేను, సారధి , రఘుపతి, కొత్తగా వచ్చిన హెడ్ మాస్టారబ్బాయి లింగరాజు ఓ గంట సేపు సార బీడీలు కాల్చాం. ఆ కాల్చటం లో మాకు ఏ మాత్రం సుఖం కనిపించలేదు. అదో సరదా! అంతే!
మరునాడు హెడ్ మాస్టర్ రామదాసు గారికి జరిగిందంతా తెలిసింది. చింత బరికే పెట్టి నెత్తురు చిమ్మే లాగా మా అందరిని కొట్టాడు. మేమందరం కన్నీరు మున్నీరుగా ఏడ్చాం కాని సారధి మాత్రం మేస్టారికి చెయ్యి అప్పగించి ఊరుకున్నాడు. మా ముగ్గుర్ని ఎన్ని దెబ్బలు కొట్టారో, ఒక్క పార్ధ సారధిని అన్ని దెబ్బలు కొట్టారాయన.
అరచెయ్యి చిట్లి నెత్తురు చిమ్మింది.
పార్ధసారధి "అమ్మో" అనలేదు.
కంట తడి పెట్టలేదు.
తప్పు క్షమించమనలేదు.
ఇంక కొట్టలేక రామదాసు గారు అతన్ని వదిలి పెట్టి నమస్కారం చేశారు.
'అన్ని దెబ్బలు కొట్టినా ఏడవకుండా ఎట్లా ఉండగలిగావురా , సారధి!' అని అడిగాను.
సారధి నిర్లక్ష్యంగా తల ఎగరేస్తూ "ఈ మాత్రానికేనా?" అన్నాడు.
హెడ్ మాష్టారు గారికి ఈ రహస్యం తెలిసింది ఎవరో అరా తీసి కనుకున్నాడు సారధి. నేరం చేసింది లింగరాజు. అతనే ఆ సంగతి వాళ్ళ నాన్నకి చెప్పాడు.
"సాయంత్రం సత్రం దగ్గరికి, రా లింగరాజూ!" అని పిలిచాడు సారధి . లింగరాజు వణికాడు. అది కేవలం పిలుపు కాదు అజ్ఞ. సారధికి ఎదురుతిరిగే ధైర్యం మా కారు పిల్లల్లో ఎవరికీ లేదు. నన్నూ, రఘుపతి నీ కూడా రమ్మన్నాడు. లింగరాజు ని ఊరికినే వదిలి పెట్టడీ సారధి. ఆ సంగతి మాకు తెలుసు. కాబట్టి మరునాడు సారధి నిర్ణయించిన సమయానికి మేం ముగ్గురం సత్రం దగ్గరికి వెళ్లాం.
సారధి మాకోసం ఎదురు చూస్తున్నాడు.
