5
అయిదారు సంవత్సరాలు గడిచాయి. ఆ కాలంలో కనకదుర్గా శంకర నారాయణుల జీవితాల్లో ఎన్నెన్నో విశేషాలు జరిగాయి. అందులో ముఖ్యమైనవి , ఆ దంపతుల కు మరో కూతురు కలగడమొకటీ, ఆ రెండో అమ్మాయి పుట్టిన ఆరేడు మాసాల్లో నే సర్వేశ్వరరావూ , జ్ఞానాంబికా-- ఇద్దరూ కాల ధర్మం చెందడం మరొకటీను.
జ్ఞానాంబి కా, సర్వేశ్వర రావు గార్లంటే ....ఏదో వయసు మళ్ళిన వారు; వెళ్ళిపోయారు అనుకోవచ్చు. కానీ, పాపం మన శంకర నారాయణ గారికే రారాని ఆపద వచ్చి, నెత్తిన పడింది. మనిషికీ కీడు అన్నది జరగలన్నది లలాట లిఖితమైన ప్పుడు , ఇక కారణాలతో నిమిత్త మేమిటి?
ఒకనాడు తాను గుర్రమై అరుణ నూ, సీతా మహాలక్ష్మీ ని వీపు మీద ఎక్కించు కుని, పిల్లలతో పాటు తానూ కేరింతలు కొడుతూ, ఇల్లంతా తిరుగుతున్నాడాయన. ఏదో జరిగింది. "అబ్బా!" అంటూ చావు కేక పెట్టాడు శంకరనారాయణ.
"నాన్నా! నాన్నా!"
"ఏమిటండీ? ఏమిటండీ?" అంటూ కనకదుర్గ కంగారు పడుతూ వచ్చింది.
"ఆ, ఏమీ లేదు. పిల్లల్ని దించు!" అన్నాడాయన ఏదో యమయాతనను అనుభవిస్తున్న వాడిలా.
తన కూతుర్ని దించుతూ, "మొద్దు ముండా! గాడిదలా ఉన్నావూ, నీకూ ఆటలేనా?' అంటూ దుర్గ అరుణను కోప్పడింది. అరుణ కళ్ళు నీళ్ళతో నిండాయి.
"ఛీ, పాపం, ఆ పిల్ల ఏం చేసిందే? అరుణను ఏమీ అనకు. ఆరూ, వెళ్ళు తల్లీ. చెల్లాయి ని తీసుకెళ్ళి ఆడుకో. ఫో. పొమ్మా. అమ్మ ఏదో కోపంలో అందిలే! ఏదీ....నవ్వు! నవ్వాలి మరి! నా బంగారు అరుణ నవ్వితే నాకే బాధా ఉండదు. నవ్వు మరి!" అంటూ తన బాధ తాను పడుతూ, ఆ పసికందు హృదయానికి తగిలిన గాయాన్ని మాన్ప జూచాడు ఆ పుణ్యాత్ముడు. అరుణ నవ్వినట్టు ఏదో చేసింది.
"మా అరుణ బంగారే! ఇక వెళ్ళమ్మా. సీతా, అక్కయ్యతో కూడా వెళ్ళు." ఇద్దరూ పిల్లలూ వేల్లుతూన్న వైపే చూపులను నిలిపి, వాళ్ళు కనుమరుగు కాగానే, శంకరనారాయణ అలానే కూలిపోయాడు.
"అయ్యో! ఏమిటండి? ఏం జరిగింది? లెవండి."
లేవలేనన్నట్టు తల ఊపాడు శంకరనారాయణ . పరిస్థితి ఎంత భయానక మైనదీ ఇప్పుడు అర్ధమయింది దుర్గకు.
"అయ్యో! ఏమిటండీ ఇది? మీ బాదేమిటి?ఎందుకు లేవలేరు? నన్ను ఊతగా తీసుకుని లేవండి. రండి."
"లాభం లేదే, దుర్గా! ఏం జరిగిందో నాకే తెలియదు. ఈ చెయ్యీ, ఈ కాలూ ...రెండూ కొయ్యబారి పోయాయి. కదల్చడానికి వీల్లేదు, మెదల్చడానికి వీల్లేదు. నీవు ముందు డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి." అన్నాడాయన అలానే నేల నాశ్రయించి.
తనకు తెలియకుండానే దుర్గను దైన్యం, అసహాయత, ఆవేదన, భయం దుఃఖం -- అన్నీ ఒక్కసారిగా ఆవహించాయి. వెళ్లి ఎలాగయితే నేం డాక్టరు గారికి ఫోన్ చేసింది.
సరిగా ఆ క్షణం నుంచే ఇన్నాళ్ళూ సకల భోగ భోగ్యాలూ అనుభవించడానికి నోచుకున్న ఆ కుటుంబం , అష్టకష్టాల పాలయిందని చెప్పవచ్చు. శంకర నారాయణ గారి కుడి కాలూ, కుడి చేయీ పడిపోయాయి. ఆ పట్టణం లోని డాక్టర్ లే కాక, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నలుగు రయిదుగురు స్పెషలిస్టు లు వచ్చారు; పరీక్షలు చేశారు; ఫీజులు పుచ్చుకున్నారు. కడకు శంకర నారాయణ గారిని మోసుకు వెళ్లి, వేలూరు లోని మిషన్ హాస్పిటల్ లో కూడా చేర్పించారు. కానీ, అంతా మానవ యత్నమే అయింది. దైవం ఆ కుటుంబాన్ని ఎందుకు దయ తలచలేదో మరి! డాక్టర్లు మాత్రం ఏం చెయ్యగలరు? తాము నేర్చుకున్న శాస్త్రాన్ని సద్వినియోగం చెయ్యడానికి ప్రయత్నిస్తారు అంతేనా? ఎన్ని చేసినా ఏమీ లాభం లేకపోయింది.
కనకదుర్గ కఠిన హృదయు రాలేమీ కాదు. అయిన దానికీ కాని దానికీ మొహం మాడ్చు కునేది కాదు. కళకళ లాడే ముఖం. మరీ ఆ ఇద్దరు పిల్లల్నీ కన్న నాటి నుంచీ ఆమెలోని అందమూ, ఆనందమూ ఎన్నో రెట్లు పెరిగి పోయినాయి.
ఇకపోతే , ఒకప్పుడు -- "అది కాదె! ఏదో......దిక్కూ మొక్కూ లేని పిల్ల. జాలి దాలిచి పెంచు కుంటున్నా మనుకో......" అంటూ జ్ఞానాంబిక నూరిపోసిన చుప్పనాతి తనం, ముఖ్యంగా అరుణ విషయం లో ఆమెలో అప్పుడప్పుడు పొడ చూపుతుంది. అదీ క్షణికం గానే! ఆ పిల్ల కళ్ళలోని నీలాలు చూశాక గానీ, శంకర నారాయణ గారి మధ్యవర్తిత్వం వల్ల తన పొరపాటు తాను గ్రహించి నప్పుడు గానీ ఆమె మామూలు మనిషై పోయేది. అన్ని కళలూ మళ్ళీ ఆమె ముఖాన వేలిసేవి.
శంకర నారాయణ గారికి వచ్చిన ఈ ముప్పుతో ఆమె అమాంతంగా శోక సాగరం లో మునిగిపోయింది. నల్లని విషాదచ్చాయ ఆమె ముఖ కమలాన్ని ఆవరించింది. చిరునవ్వంటే ఏమిటో, సంతోష మంటే ఏమిటో ఆ ప్రాణి మరిచిపోయింది.
పరిస్థితులు ప్రతికూలించి నప్పుడూ, గ్రహచారం గతి తప్పినప్పుడూ , జీవితమే చీకటి మాయమై మనం దారీ తెన్నూ కాననప్పుడూ, ఎవరైనా, 'అదుగో, ఆ దారి వెంట నడవండి. ఫలితం దక్కుతుంది!" అన్నారను కొండి. దాన్నే పరమావధి గా పరిగ్రహించి, అటు వైపే వెళ్ళడానికి నానపాట్లూ పడతాము -- మన పాట్లు తప్పు తాయనీ, కాలం కలిసి వస్తుందనీ , కటిక చీకట్లు కమ్ముకున్న జీవితంలో కొంత కాంతి ని చూడగల మనీను!
నడి ఎడారి లోని పాంధుడు దప్పిగొని, నాలిక పిడచ కట్టుకుని పోతున్న సమయంలో ఎండ మావుల్ని చూచి, భ్రమించి అటు వైపు అడుగులు వెయ్యడం అసమంజసం ఏమీ కాదు కదా!
అలానే కనకదుర్గ ఎవరెన్ని చెప్పినా వింది. భర్తనూ, పిల్లల్నీ వెంట బెట్టుకుని, వైద్యుల్నీ వెదుక్కుంటూ దేశాటనం చేసింది. కన్యాకుమారి నుంచి కాశ్మీరు వరకు ఉన్న రాష్ట్రాల లోని భిషగ్వరుల నందరినీ కలుసుకుంది. కానుకలు చెల్లించింది. పరీక్షలు, చికిత్సలు చేయించింది. వేలు ఖర్చాయి నాయి. కానీ, శంకరనారాయణ గారికి మాత్రం స్వస్థత చిక్కలేదు.
ఉసూరుమంటూ అందరూ ఇల్లు చేరుకున్నారు. నెలనెలా శంకరనారాయణ గారు సంపాదించే రెండు మూడు వేల సంపాదన ఆగిపోయి ఇప్పటికే చాలా కాలమయింది. అరుణ కిప్పుడు సరిగా తొమ్మిది సంవత్సరాల వయస్సు. సీతామహాలక్ష్మీ కి ఏడున్నర. చిన్నపిల్ల సరస్వతి కి అయిదేళ్ళు.
6
కలతలూ కష్టాలూ కనకదుర్గ లో కలిగించిన మార్పనండి, అరుణ కర్మ అనండి, ఏ కారణం వల్లనైతేనేం కార్యక్రమం లో అరుణ మరీ అగచాట్ల పాలయింది. కనకదుర్గ కు అరుణ పైని ఇదివరకు ఉన్న కరుణ బొత్తిగా సన్నగిల్లి పోయింది. కనకదుర్గ మనసు ఎప్పుడూ స్థిమితంగా ఉండేది కాదు. ఏవేవో ఆలోచనలు, ఆందోళన లు ఒకరి కెరుకపరచుకోలేని ఆరాటాలు, భర్త పరిస్థితి ని కళ్ళారా చూస్తున్న ఏమీ చేయ్యనివ్వని తన అసహాయత-- ఇన్ని, అన్ని వేళలా ఆమెను అధః పాతాళం లోకి క్రుంగ దీసేవి.
అరుణ ఏ రవంత తప్పు చేసినా, అసలు తప్పు అన్నది ఆ బిడ్డ పరాన ఉన్నా లేకపోయినా తన మనసు చెడి, పాడై ఉండడం మూలాన్ని కనకదుర్గ ఆ పిల్లను తిట్టేది, కొట్టేది ; అరుణతో పాటు తానూ ఏడ్చేది.
గోరు చుట్ట మీద రోకటి పోటు అన్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డం అన్నారు. "సూర్య కర సంతృప్త ప్రదానాంగు డై, తాళ ద్రుమచ్చాయ త్వరతోడన్, పరువెత్తి చేరి నిలిచిన బట్టతలవాని తల పైన ఆ తాటికాయ పడ్డమే కాక, ఆ తల తత్ఫలపాత వేగమున శబ్ద యోగం బుగా నిచ్చెన్" అన్నారు.
నిజమే మరి! కొందరి జీవితాల్నీ మనం గమనిస్తుంటే, వారెంత గొప్పవారైనా కానీ, ఎంత మంచి వారైనా, కానీ కాలం వక్రించి నప్పుడు కేవలం కష్టాలే వారికీ కేటాయించబదినట్టుంటాయి.
నిజం చెప్పాలంటే , ఆస్తి పాస్తులకు సంబంధించిన గొడవలు, శంకర నారాయణ గారికి , వారి దాయాడులకు తోలి నుంచీ ఉంటూనే ఉన్నాయి. వాళ్ళు, శంకర నారాయణ గారికి అయన అనుభవిస్తున్న ఆస్తి మీద ఎలాటి హక్కు లేదని కేసు వేయడం, జిల్లా జడ్జి గారే దాన్ని కొట్టి వేయడమూ జరిగి చాలా కాలమయింది. ప్రతిపక్షుల పరిస్థితి బాగులేక, ఇంకా పై పై కోర్టు లకు వెళ్ళే శక్తి వారిలో లేక, ఇన్నాళ్ళూ ఆ కుంపటి ని తమలోనే దాచుకున్నారు. అది రగులుతూనే ఉంది. శంకర నారాయణ గారి కర్మవ శాత్తూ అది ఇప్పుడు భగ్గున మండింది.
మళ్ళీ హైకోర్టు కెక్కారు దాయాదులు. శంకర నారాయణ గారికీ ఉన్న స్థిరాస్తి మొత్తం నూట పాతిక ఎకరాలు. రెండు బంగళాలు. పాతిక ఎకరాలనూ, ఒక బంగాళా నూ ఒక పెద్ద లాయరుకు ఎర చూపారు. ఇప్పటి శంకరనారాయణ గారి పరిస్థితి మనకు తెలుయనిదేముంది? ఖర్చు చేయడానికి డబ్బు లేదని కాదు, పాపం, ఆ వ్యక్తీ లో ఓపిక ఏదీ?
అందుకని, రాజీ పడతానని శంకరనారాయణ దయాడులకు కబురు చేశాడు. సగం ఆస్తి వదులుకుంటానన్నారు. దాయాదులు ఒప్పుకోవాలను కున్నా, వాళ్ళ లాయరు పడనివ్వలేదు. సరి, కోర్టు కెక్కారు. ఆరేడు వాయిదాలు పడి, అందరూ మానసికంగా నలిగిపోయిన తరవాత తీర్పు చెప్పారు.
ఒక్క దెబ్బతో శంకర నారాయణ గారి సర్వస్వమూ తుడుచుకు పోయింది. పరిస్థితుల ప్రాభవాన్ని బట్టి ఓడలు బళ్లయ్యాయి! శంకర నారాయణ గారు తన ఇల్లు వదిలి, అద్దె కొంప చేరుకోవలసి వచ్చింది.
శంకరనారాయణ గారు అట్టే బాధపడలేదు. అనుభవాలతో పండి పోయిన వాడు కాబట్టి, అయన "అంతా కర్మ' అనుకుని ఊరుకున్నారు. కానీ, కనకదుర్గ అలా ఉండలేక పోయింది. అహోరాత్రులూ పనిగట్టుకుని పరితపించింది. ఆమెను ఓదార్చడానికి వచ్చిన అమ్మలక్కలు జరిగిన అనర్దాన్నంతటినీ అరుణ నెత్తి మీద రుద్దారు.
"మనిషి వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ అన్నారమ్మా! మీరు నిజంగా తొందర పడ్డారు. ఆ ఆరేడు నెలలు ఆగి ఉంటె , మీ పిల్లలు మీకు కలిగే వారా? అనవసరంగా దారిని పోయే దరిద్రాన్ని ఇంట తెచ్చి పెట్టుకుని ఇన్ని ఇక్కట్లు పాలయ్యారు!"
"మీ అమ్మ, నాన్నా పోవడ మేమిటి, శంకర నారాయణ గారి కాలూ చెయ్యీ పడిపోవడ మేమిటి, ఈ అద్దె కొంప లోకి మీరు రావలసి రావడమేమిటి! రామరామ అదెంత నష్ట జాతకురాలో ఆ బ్రహ్మకే తెలియాలి!"
"నన్నడిగితే దాన్ని ఏ అనాధ శరణాలయం లోనో పడేసి, ఇప్పటి కైనా చేతులు కడుక్కోడం మంచిది!"
"ఆ ....పాపం కనకదుర్గమ్మ గారేం చేస్తారు లే? శంకర నారాయణ గారికి ఆ పిల్ల అంటే పంచ ప్రానాలూను!"
ఇలా అలా అరవై తొమ్మిది అభిప్రాయాల్ని వెల్లడించారు అమ్మలక్కలు కనకదుర్గ ఏం చెయ్య గలుగుతుంది? అన్నిటిని తలుచుకుని తల్లడిల్లింది , కుమిలి కుమిలి కన్నీరు కార్చింది.
