Previous Page Next Page 
దీప శిఖ పేజి 4


    వాళ్ళు ముగ్గురూ వెళ్ళిపోయిన తర్వాత కూడా "అరవై అయిదు, అరవై రెండు, తొంభై తొమ్మిది, అబ్బ! ఎన్ని మార్కులో! పైకి చూస్తె మళ్ళీ ఒట్టి అమాయకుడి లా ఉన్నాడు. ఆడదాని కంటే అన్యాయంగా అలా సిగ్గుపడుతూ బెదురూ బెదురుగా చూస్తాడేమిటి?......ఏమో నబ్బా-- తనకి మాత్రం సిగ్గేయ్య లేదు, ఎంతసేపయినా ఆ అబ్బాయి కేసి అలా చూడాలనే అనిపించింది...." అని ఆలోచిస్తూ రామనాధం తో కలిసి గోపాలం వెళ్ళిన దిక్కుగా చూస్తూ. అలాగే నిలబడి ఉండి పోయింది చాలాసేపటి వరకూ విజయ..........
    మర్నాడు ఉదయం "శంకరం గారికి నేను ఇచ్చిన మాట నిలబెట్టారు . మీ మేలు ఎన్నటి కి మరువలేను. మూడు పూట్లా పెరుగుతో భోజనానికి నెలకి ఎనిమిది రూపాయలు ఇచ్చేలాగ పూటకూళ్ళి ఇంట్లో గోపాలాన్ని చేర్పించి నెలకి రెండు రూపాలకు గది ఏర్పాటు చేశాను. కొంచెం మంచీ చెడ్డా చూస్తూ ఉండండి. గోపాలం నువ్వు కూడా అప్పుడప్పుడు వచ్చి రామనాధం గారికి కనిపిస్తూ ఉండు. మరి నే వస్తా-- ఈ మెయిలు బోటు తప్పి పోయిందంటే ఆలో లక్ష్మణా అంటూ మళ్లా సాయంత్రం రాదారీ పడవ వేళ దాకా కూచోవాలి" అంటూ గబగబా వెళ్ళిపోయాడు శేషయ్య.
    "నేనూ ఇంక-- పెట్టె, పరుపు చుట్టూ పట్టించు కొని, రూం కి వెళతా నండీ' అన్న గోపాలం తో.
    "వేళుదు గాని లేవయ్యా! అప్పుడే తొందరేం వచ్చింది" అన్నాడు రామనాధం.
    "మావయ్య ఎంత మంచివాడో " అనిపించింది విజయ కి.
    గోపాలం మొహమాట పడుతూ నిలబడి ఉండి పోయాడు.
    "ఇదిగో ఇటు చూడు. మాది లంకంత కొంప , ఇందులో అక్కు పక్షులు లా మేం ఇద్దరం బిక్కు బిక్కు మంటూ ఉంటాం. బ్రహ్మ సమాజ మతస్తుడిని ఏమో, వెలివేసినట్లు మా యింటికి పని చేసేవాళ్ళు కూడా రారు. వాళ్ళ కేసులేవో గెలిపిస్తూ వుంటాను. కనుక తప్పదురా భగవంతుడా అంటూ పార్టీలు మాత్రం వస్తూ వుంటారు. అనుకో. అదేనా  పొద్దున్న పూట ఓ గంట తక్కిన సమయాల్లో విజయా నేనూను. నేను కోర్టుకు వెళ్ళిపోతే పాపం అది ఒక్కత్తే -- ఇదంతా చెప్పాడేవీటి ఈయన అనుకుంటున్నావేమో!...ఇలా చెప్పడం లో అర్ధం ఏమిటంటే , నువ్వు మరీ అలా పరాయి వాడిలా మొహమాట పడుతూ ఉంటె లాభం లేదనీ, నువ్వు తరుచు వస్తూ ఉండాలని. అందులో అదివారంనాడూ , శలవు రోజుల్లో నూ వుంది చూశావ్. అప్పుడు పూర్తిగా ఇక్కడే ఉండి పోవాలనీను-- ' అన్నాడు రామనాధం కళ్ళ జోడు లోంచి గోపాలాన్ని పరిశీలిస్తూ. ఎంత చిత్రంగా మాట్లాడతారీయన ! ఆ మాటల మడుగున ఎంత ఆప్యాయత, ఎంత మహనీయత ! ఎప్పుడూ చిర్రు బస్సు మనడమే కాని అన్నయ్య ఇంత ఆప్యాయంగా మాట్లాడేడా ఎప్పుడేనా?....
    ఇలా ఆలోచిస్తూ నిలబడి ఉండి పోయిన గోపాలాన్ని చూసి "ఏమిటలా  సందేహంగా ఆలోచిస్తున్నావు! ఓహో!....మీ అభిప్రాయం అర్ధం అయింది....కాని విజయ అభిప్రాయం ఏవిటో అనా? కుర్రపిల్ల డానికి వేరే అభిప్రాయం ఏం ఉంటుంది ?....నేను ఏం చెబితే అదే!....అయినా నీ తృప్తి కోసం దాని చేత కూడా చెప్పిస్తాను-- ఏం విజయా! ,,,మొహమాటం ఏం పడకుండా గోపాలం మనింట్లో మూడో మెంబరు లా ఉంటూ, తరుచు వచ్చి ఇక్కడ ఉంటూ ఉండాలి....అదే కదూ నీ అభిప్రాయం కూడా? అన్నాడు రామనాధం.
    "ఉహూ!" అని తల అడ్డంగా ఊపింది విజయ.
    "ఆ! " అని తెల్లబోయాడు రామనాధం.
    మనస్సు చివుక్కు మనిపించింది గోపాలానికి.
    ఒక్క క్షణం ఎవ్వరూ మాట్లాడలేదు. గంబీరంగా ఉన్న ఆ నిశ్శబ్దానికి భంగం కలిగిస్తూ "ఎందుకాయన ఇక్కడికి వస్తూ ఉండడం?" అంది సీరియస్ గా మొహం పెట్టి.
    "ఎందుకేవిటి?" అన్నాడు రామనాధం. విజయ ఇలా అంటుందే విటి.... గోపాలం చిన్నబుచ్చుకోడు?..... అని మనస్సులో అనుకుంటూ.
    "అవును....తీరా అయన రూం నుంచి అంత దూరం నడిచి మన ఇంటికి వచ్చినపుడు, నువ్వే పార్టీల హడావిడి లోనో ఉంటావు, లేదా ఏ హితకారిణి సమాజానికో, స్నేహితుల ఇళ్ళ కో వెళ్తావు. ఒకవేళ ఇంట్లో ఉన్నా ఏ పుస్తకం చదువు కుంటూ నో, దేన్నీ గురించి ఆలోచించు కుంటూనో' పరధ్యానంగా ఆ ,ఊ అంటూ మాట్లాడతావు. ఆ మాత్రం డానికి శ్రమ పడి అంత దూరం నుంచి ఆయన్ని రమ్మనడం ఎందుకు?' అంది విజయ కొంటెగా మావయ్య కేసి చూస్తూ.
    పదిహేనేళ్ళ విజయ , అంత గడుసుగా మాట్లాడడం చూసి ఆశ్చర్య పోయాడు రామనాధం. ఉండుండి ఆడవాళ్ళు ఎంత విచిత్రంగా మాట్లాడుతారు.......విజయ ఇంత గడుసుతనంగా తన పరధ్యానాన్నీ, బాధ్యత లేని తన ప్రవర్తన నీ పరిహాసం చేస్తుందని తను ఎప్పుడేనా ఊహించగలిగాడా ?..... ఏడాది క్రితం తన చెలెల్లు చనిపోయినపుడు ఎంత జాలిగా, బాధగా, అమయాకంగా , కనిపించింది విజయ తనకి?....అప్పుడు తన చెల్లెలి జ్ఞాపక చిహ్నంగా మిగిలిపోయిన ఈ పిల్లని తీసుకు వచ్చి, తల్లి పోయిన దుఃఖాన్ని అనాధ అయిపోయానే అన్న ఆవేదననీ మరచి పోయెలాగ జాగ్రత్తగా పెంచాడు కనకే మళ్ళీ ఇన్నాళ్ళ కి ఆమెలో చైతన్యం ,. ఉత్సాహం తిరిగి జీవం పోసుకున్నాయి. విజయ సున్నితంగా తనని పరిహాసం చెయ్యటమే కాదు. గోపాలం తరచూ వస్తూ వుండాలనే అభిప్రాయాన్ని కూడా ఎంత బలంగా బలపరచింది? విజయ తెలివికి  రామనాధం తనలో తను నవ్వుకుని ఎంత గోపాలం వైపు చూశాడు. విజయ మాటలకి ఆతను కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు.
    సీరియస్ గా మొహం పెట్టి రామనాధం "అవునోయ్ గోపాలం? మా విజయ చెప్పినట్లు నువ్వు తరచు మా యింటికి రాకు," అన్నాడు.
    వెంటనే 'అదేవిటి?....నేను చెప్పినట్లు అంటావేమిటి?....నేను అలా అన్నానా?' అంది కంగారుగా విజయ.
    ఏం అర్ధం కాక గోపాలం రామనాధం గారి మొహం కేసి చూశాడు , విజయ అంటూన్న మాటలను వినిపించుకోకుండా రామనాధం "ఏమంటే వస్తే నీతో మాట్లాడటానికి నాకీ కాళీ వుండదు. విజయ కా క్షణం ఇంటి పనులతో తీరిక ఉండదు." అని అంటుండగానే విజయ కల్పించుకుంటూ "నాకు కాళీ ఉండదంటావు . నేనేమంత పనితో వేగి పోతున్నానని?" అంది కోపంగా.
    "అదేమో నాకేం తెలుసు" అన్నాడు రామనాధం ఇంకో దిక్కుగా చూస్తూ.
    "చాల్లే-- ఊరుకో మావయ్యా-- నువ్వలా మాట్లాడితే ఆయనేం అనుకుంటారు?... అయన ఇక్కడికి తరచు  వస్తూ వుండటం నీకు ఇష్టం లేదని అనుకోరూ?" అంది తీవ్రంగా. కంఠం లో కోపం ప్రస్పుటంగా కనిపించేలా--
    రామనాధం తాపీగా "ఆహా-- అలాగా ?...అయితే నేనన్నప్పుడే  కాని, నువ్వన్నప్పుడు అలా అనుకోడన్నమాట?"! అన్నాడు.
    అప్పటికి కాని రామనాధం ఎందుకు అంటున్నాడో అర్ధం కాలేదు విజయ కి.
    అర్ధం అయి చిన్నగా నవ్వుకుంది.
    గోపాలమూ నవ్వాడు. మావా మేనకోడళ్ళ మాటలు, కేవలం వినోదార్ధము అన్నవే కాని, వేరే ఏమీ కావని గ్రహించడం తో--
    రామనాధం కూడా వాళ్ళ ఇద్దరి నవ్వుల్లో నూ శ్రుతి కలిపాడు.
    ఇలా నవ్వుతూ నాలుగు రోజుల కొకసారి వచ్చి విజయ ఆప్యాయతనీ, రామనాధం గారి ఆదరణ నీ మనసారా అనుభవించి ఆనందిస్తూ, తన నాలుగేళ్ల కాలేజీ జీవితాన్ని నాలుగు మధుర క్షణాలుగా గడప సాగాడు గోపాలం. ఇన్నాళ్ళూ గంబీర వాతావరణం లో. ఏ నిమిషంలో ఏం కోపం వచ్చి అన్నయ్య తిడతాడో అనే భయంతో. బిక్కు బిక్కు మంటూ బెదురూ బెదురుగా  కాలక్షేపం చేసిన గోపాలానికి, విజయా రామనధాల సహచర్యంలో స్వేచ్చామయమైన , సంతోషదాయక మైన ఒక నూతనానుభవం అవగతం కాసాగింది.
    డానికి తోడు, రామనాధం గారు అప్పుడప్పుడు తనతో పాటు గోపాలాన్ని ఏ హితకారిణీ సమాజానికో మ్ న్యాపతి సుబ్బారావు గారి వంటి ఏ మిత్రుల ఇంటికో , హిందూ సమాజం లో జరిగే ఏ మీటింగు కో తీసుకు వెళ్లి ఊళ్ళో నలుగురు పెద్దలకీ పరిచయం చేస్తూ ఉండేవారు. దాంతో గోపాలానికి సంఘం లో విశిష్టమైన స్థానమూ , విశేలమైన పలుకుబడీ లభించసాగాయి. ఫలితంగా, రామనాధం పట్ల కృతజ్ఞతా, గౌరవమూ అధికం కాజోచ్చాయి. చూడగా చూడగా కాస్తో కూస్తో తెలివి తేటలు వుండి స్వేచ్చగా స్వాతంత్య జీవనం చేయాలను కున్న ప్రతి వ్యక్తీ "లా" చదివి ప్లీడరీ యే చేస్తున్నట్లు కనిపించింది. ఏ రంగం లో చూసినా వాళ్ళనే మొదటి స్థానాలు. ఏ మీటింగు కి వెళ్ళినా వాళ్ళవే ఆగ్రా సనాది పత్యాలు. ఏ ఉద్యోమం లో చూసినా వాళ్ళవే ప్రముఖ పాత్రలు. ఇలా ప్లీడరీ అనేది మేధావుల వృత్తిగా కనిపించడంతో "ఏవైనా సరే నేను ప్లీడరే కావాలి!" అని నిర్ణయించు కొన్నాడు. గోపాలం. పైగా మాట అంటే పడని తనలాంటి సున్నిత హృదయం కల పౌరుష వంతులకి అదే తగిన వృత్తి. ఒకరి కింద చేతులు నలుపుతూ. అధికారులకి అనుక్షణ మూ ఒంగి ఒంగి సలాములు చేస్తూ ఉండనక్కర లేదు. ఇష్టం అయితే కోర్టుకి వెళ్ళవచ్చు. లేకపోతె లేదు. హాయిగా దర్జా అయిన ఉద్యోగం. బోలెడు స్వేచ్చ. సంఘంలో కావలసినంత పలుకుబడి, అందుకే చేస్తే ప్లీడరీ యే చెయ్యాలి. చదివితే "లా" ఏ చదవాలి. అన్నయ్య కాదన్నా, హరిహరాదులు అడ్డం పడినా , తను "లా" యే చదువుతాడు, "లాయరే" అవుతాడు.
    రోజులు గడుస్తున్న కొద్దీ, రామనాధం గార్నీ , అయన మిత్రుల్నీ చూస్తున్న కొద్దీ , గోపాలం లో ఈ కోరిక బలపడి బాగా పేరిగి వెళ్ళు పాతుకోసాగింది.
    ఇటు టవర్ బెల్ లా కాలేజీ లో నిర్విరామం గా కనిపించే కూల్డ్రే గారి మంద్ర గంబీర ఉపన్యాసము లతో పరవ సాహిత్య సంస్కృతీ భావములతో  కళాత్మక మైన జీవిత వ్యాఖ్యానము లతో, అటు బయట రామనాధం గారి సహచర్యం వల్ల లభించే వారావరణం లో నిత్యమూ ప్రత్యూష పవనాంకురాల వలె హృదయాన్ని స్పదింపజేసే విద్యాధికుల పరిచయాలతో. వీరేశ లింగం వంటి సంస్కార స్వరూపుల ఉదాత్త జీవితాలతో, ఈశ్వర పితృ త్వము, సర్వమూ నవ సౌభాతృత్వము, కులమత రాహిత్యమూ ఏకేశ్వరోపాపన వంటి బ్రహ్మ సమాజ భావములతో, నిత్యమూ తారసపడే రాయనం వెంకట శివుడు, చిలక మార్తి లక్ష్మీ నరసింహం, న్యాపతి సుబ్బారావు పంతులు గార్ల వంటి ప్రముఖుల ప్రభోధములతో , కొత్తగా వినిపిస్తూ ఉన్న వడ్డాది సుబ్బారాయుడు గారి భక్త చింతామణి పద్య రసాన్యాదనతో. వీటి అన్నిటికి మించి రామనాధం గారు చూపించే ఆదరణ తో. హృదయాన్ని పులకింప చేసే విజయ ఆప్యాయతతో మెదడంతా నిండి, మనసంతా పండి, ప్రతి క్షణమూ ఒక దివ్యాను భవముగా ప్రతి రోజు ఒక నవ్య జీవనముగా నాలుగేళ్ళూ నాలుగు మధుర క్షణాలు గా గడిపి బి.ఏ పరీక్ష కి కూర్చునే రోజుల నాటికి. వేషం లో భాష లో భావాల్లో గుర్తించలేనంత అభ్యుదయాన్ని అందుకున్నాడు గోపాలం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS