వెల్లిపోయేటప్పుడు ఆమెను పరీక్షగా చూడగలిగాడు రవిచంద్ర. లేత గులాబీ రంగు శరీరచ్చాయ. గుబురైన తలకట్టు. కొంచెం పెద్ద వనిపించే కళ్ళు. నడకలో ఎంత సోయగం. సమంగా ఉన్న అంగ సౌష్టవం . కొంచెం పొడగరి అనిపించే ఆకారం.
ఏదో స్టేషను వచ్చింది. స్టేషను లో చాలా తక్కువ మంది జనం ఉన్నారు. రాత్రి రంగును కడుక్కుంటున్నది ప్రకృతి. విచ్చుకుంటున్న లేత తెలుపుదనం, బద్దకంగా వదులుతున్న చీకటి. దూరంగా అప్పుడప్పుడు ఎదో అమ్మేవారి కేకలు. ఉదయం పుట్టబోయే ముందుండే కోలాహలం!
ట్రెయిను కదిలింది. "గుడు బై టు మై స్టేట్, బై బై." స్టేషను వెళ్లిపోతుంటే చేయి ఊపుకుంటూ నవ్వుతూ అన్నాడు రాజగోపాలం.
'మళ్ళీ బ్రతికి బాగుంటే , పైవాళ్ళు అనుగ్రహిస్తే వచ్చే ఏడాది కి తెలుగు సీమలో అడుగు పెడతాం" అన్నాడు. ఎందుకనో ఆతని గొంతులో దాచుకుందా,మనుకున్నా దాగని హోం సిక్ నెస్ లాంటి వేదన ధ్వనించింది.
"నాకేందుకనో ఒక్కొక్కప్పుడు ఈ అనుభూతులన్నీ విచిత్రమని పిస్తాయి. నాదీ, నా వారూ , నా జాతీ, నా దేశం -- ఇవి లేకపోతె మనిషి మొద్దు బారిపోతాడు. తన జన్మకు అర్ధాన్నీ, ప్రయిజనాన్ని కోల్పోతాడు. ఏమంటారు?' అన్నాడు . రాజగోపాలం మాటల్లో కొట్టవచ్చే సూటిదనం, జీవితపు విలవలను తేలిగ్గా చెప్పే నేర్పరితనం, ఎవరికైనా ఇట్టే కనిపిస్తాయి. అతను మాట్లాడే ప్రతీది అర్ధ వంతం గాను, యుక్తి యుక్తం గాను ఉన్నట్ల నిపిస్తుంది.
రవిచంద్ర వింటూ తల ఊపాడు.
"డోంట్ గెట్ బోర్ డ్ ట్రెయిన్ ప్రయాణం లో ఎంత వినే ఓపిక ఉన్నవాడి నైనా ఇట్టే బోర్ చెయ్యచ్చు. మామూలు కంటే ఎక్కువగా మాట్లాడతారు ట్రావెలింగ్ లో మనుషులు."
ఈసారి రవిచంద్ర నవ్వి, 'అబ్బే! అదేం లేదు. మీ మాటలు సరదాగా ఉన్నాయి, కానివ్వండి" అన్నాడు.
ప్రియంవద వచ్చి, కాఫీ గ్లాసులోకి వంచుకుంది. ఫ్లాస్కు ఖాళీ అయింది. తాగబొయేదల్లా ఏదో జ్ఞాపకం వచ్చి ఆగిపోయి సగం కాఫీని ఫ్లాస్కు లో కి వంచింది.
"ఎవరికిఅది ?' అడిగాడు రాజగోపాలం.
"మీకు. మధ్యలో స్టేషన్లు రావడం ఆలస్యం అయి, కాఫీ లేకపోతె నా ప్రాణం తీస్తారు. అందుకు" అంది ప్రియ కాఫీ సిప్ చేస్తూ.
"ఆడవాళ్ళు మాజిక్ కి బాగా పనికొస్తారు. చూడండి, కాఫీ ఆవిడ అందులో తిరిగి పోసేదకా రెండోసారి సంగతి నాకు జ్ఞాపకమే లేదు. మనమీదేదో సానుభూతి తో అందులో పోస్తున్నట్లు! పైకి, ఇన్ డైరెక్ట్ గా కాఫీ కి బానిసల ని మనను ఎత్తి పొడవడమూను! ఏం అన్యాయం! ఏం అన్యాయం!" రాజగోపాలం ఆమెను ఉడికించే ప్రయత్నంలో అన్నాడు.
ప్రియ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ కాస్సేపు నిశ్శబ్దం.
ఏదో స్టేషను వచ్చింది. రాజగోపాలం దాన్ని గురించి రవికి చెప్పాడు. అటు తరువాత ఇంకేదో విషయం సంభాషణ లోకి దొర్లింది. అయితే సంభాషణ లో ఎక్కువ భాగం రవిచంద్ర మౌనముద్రే వహించాడు. రాజగోపాలం , ప్రియంవద లు వాళ్ళుకు తెలిసిన వాళ్ళను గురించి , వాళ్ళ విషయాలను గురించి మరికాస్సేపు చాలా మాట్లాడుకున్నారు. ఇంకాస్సేపయిన తరవాత మాట్లాడ డానికి ఏమీ దొరకలేదు.
అందరూ మౌనంగా పత్రికలూ చూస్తూ కొంచెం విసుగ్గానే గడిపారు.
మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు మాత్రం రాజగోపాలం గబగబా కారియర్ తో కింది కి దిగి , భోజనం పెట్టించుకుని వచ్చాడు. ప్రియంవద అది ముగ్గురికి సర్దింది. రవిచంద్ర మొదట భోజనం చేయడానికి నిరాకరించాడు. రాజగోపాలం బలవంతం అతనికి తినడం తప్పించి మరో మార్గం చూపించలేదు.
వార్ధా స్టేషను వచ్చింది. బండి కాస్సేపాగి కదిలింది.
వార్ధాలో ఆ కంపార్టు మెంటులోకి ముగ్గురు ఎక్కారు. అందులో ఒకామె స్త్రీ . దాదాపు పాటికే ళ్లుంటాయి. జుత్తు ఎత్తుగా ముడి వేసుకొని లేసులో బిగించింది. సూటి చూపులు. కళ్ళల్లో నించి కొట్ట వచ్చేటట్టుగా నిష్కల్మషత్వం. ఆమె పక్కన భర్త కాబోలు. కొంచెం మోటుగా ఉన్నాడు. పక్కనే తమలపాకుల పాందాన్ ఉంది. ట్రెయిన్ లోకి ఎక్కిన కొంచెం సేపట్లోనే దాదాపు రెండు మూడు సార్లు పాను కట్టుకొని వేసుకున్నాడు.
రాజగోపాలం అదేపనిగా చూడసాగాడు వాళ్ళ వైపు.
కొంచెం సేపటి తరువాత పాందాన్ పెద్దమనిషి మరాఠీ లో కోరాడు. "మీకు అభ్యంతరం లేకపోతె తమలపాకు సేవించవచ్చు." అని. రాజగోపాలం "థాంక్స్ అలవాటు లేదు" అని వినయంగా చెప్పాడు. ఆ సంఘటన తో అప్రయత్నంగా అతని సంభాషణ ఉత్తర దేశస్థుల మంచి తనం మీదికి పోయింది.
"ఉత్తర దేశస్తులలో కొట్టవచ్చేటట్లుగా కనపడేది వాళ్ళ కలుపుగోలు తనం. మనుషు లందరు అమాయికుల్లా , స్నేహ పూరితంగా కన్పిస్తారు. నాకేండుకనో మన తెలుగు వాళ్లకు, వీళ్ళకు విపరీతమైన భేదం ఉన్నట్లుగా తోస్తుంది. లేని తెలివిని ప్రదర్శించు కోడానికి ప్రయత్నిస్తారు మనవాళ్ళు. ఉన్న కొద్ది తెలివిని, మంచితనం మాటున దాచుకుంటారు వీళ్ళు" అన్నాడు.
"అవునులెండి, పొరుగింటి పుల్ల కూర రుచి" అంది ప్రియంవద ఎక్కువ ఆలోచించ కుండానే.
రాజగోపాలం అకస్మాత్తుగా గాంబీరంగా మారిపోయి, "అలా అనుకోటం మన పొరపాటు. నేనన్న విషయం అందరికీ వర్తించక పోవచ్చు. అయితే మనలో చాలా ఎక్కువ మంది తెలుగు వాళ్లకు ఆ జాడ్యం ఉంది. అదే కాదు, తప్పును తప్పుగా ఒప్పుకోడానికి గూడా ధైర్యం లేదు" అన్నాడు.
ప్రియ కొంచెం బెదిరినట్లు అనిపించింది. తేలిగ్గా నవ్వటానికి ప్రయత్నిస్తూ , "మీకు ఏం పోద్దుపోక , ఏదో విధంగా మమ్మల్ని రెచ్చగొట్టి నాగపూర్ వచ్చేదాకా అదేపనిగా మీరే మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. మేము ఒప్పుకోం" అంది.
రాజగోపాలం కులాసాగా నవ్వుతూ, "నిన్ను రెచ్చగోట్టక ముందే రెచ్చిపోతావు. నాకు తెలుసు. రవిచంద్ర గారు మాత్రం మాటలకు రేషను ఏర్పాటు చేసుకున్నారు" అన్నాడు.
రవిచంద్ర పళ్ళు బయట పడకుండా నవ్వాడు.
"జోనల్ సిస్టం లాంటిదెం లేదు లెండి. మీరు ఎన్ని కబుర్లైనా రవాణా చేయచ్చు" అన్నాడు.
రవిచంద్ర నవ్వుతూ, "అదేం లేదు . నాకు చెప్పడం కంటే వినటం ఇష్టం. మీరు చెప్పేది వింటూనే ఉన్నాను" అన్నాడు.
ఇంతలో నాగపూర్ పరిసరాల్లో కి ట్రెయిన్ వచ్చేసింది. సాయంత్రం అయిదు కావస్తున్నది. సూర్యుడు అలిసిపోయి తీక్షణంగా ప్రకృతి ని తిలకించడం మానేశాడు. సాయంకాలపు నీరెండను పట్టణం పల్లె వాటుగా ధరించి శోభాయామానంగా కనపడ సాగింది.
సిటీ మధ్యలోంచి ట్రెయిన్ పరిగెత్తు తున్నది.
రాజగోపాలం ఆప్రయత్నంగా రవిచంద్ర భుజం మీద చేయి వేసి, "మీరు నాగపూర్ లో ఎందుకు దిగకూడదు" అన్నాడు.
రవిచంద్ర ఇబ్బందిగా నవ్వాడు.
ప్రియంవద సామాన్లు సర్దుతూ ఆ మాట లాంటున్నప్పుడు భర్త వైపు చూసింది. మళ్ళీ రాజగోపాలం ప్రశ్నే రెట్టించాడు. రవిచంద్ర మాట్లాడలేదు.
"నేను నవ్వుతాలుకూ గాదు అంటున్నది. నిజంగానే కులాసాగా రెండు రోజులు గడపవచ్చు. మీరు కొత్తవారేం కాదు. సంకోచించ పడకూడదు. మా రవీంద్ర చిన్నప్పటి స్నేహితులు. ఇప్పుడు మా మిత్రులు."
రాజగోపాలం ఆ మాటలంటూ అతన్ని సూటిగా చూశాడు. ఆ చూపుల్లో కొట్ట వచ్చే టట్లుగా మంచితనము, ఎందుకో రవిచంద్ర మీద ఉదయించిన జాలి!
దూరం నుంచి దగ్గిరగా వస్తున్న పట్టణం. ఎత్తుగా బంగళాలు, రోద చేస్తూ పరిగెత్తే వాహనాలు. తీరిక లేనట్లు ఎవరి పని మీద వాళ్ళు ఉరుకుతున్నట్లుగా జనం!
రవిచంద్ర "క్షమించండి . నేను ఇంకోసారి........" అని ఏదో అనబోయాడు.
రాజగోపాలం మాత్రం 'అదేం లేదు ,.మీరిక్కడ దిగావలసిందే. మన తెలుగు వాతావరణం కొంచెం కనపడేది ఈ పట్టణం లోనే. ఇది దాటితే మీకు ఇబ్బంది కలుగుతుంది. రెండు రోజులు హాయిగా గడపండి మాతో బాటు . తరవాత మీరు........."
"నన్ను ఇబ్బందిలో పెట్టకండి. నేను దిగలేను." అన్నాడు రవిచంద్ర. కొంచెం కటువుగా అనిపించాయి ప్రియంవద కు ఆ మాటలు. రాజగోపాలం మాత్రం తేలిగ్గా తీసుకొని మందహాసంతో , "దెన్ సారీ, ఎప్పుడైనా మీరీ ప్రాంతం రావటం తటస్థిస్తే తప్పకుండా మా ఆతిధ్యం స్వీకరించాలి. అన్నట్లు, ఇదీ మా అడ్రసు" అంటూ గబగబా కాగితం మీద వ్రాసి ఇచ్చి రవిచంద్ర జేబులో కుక్కాడు.
అలిసిపోయిన రైలు పరిగెత్టటం మానేసింది. ప్రియంవద సర్ధుడు అయిపొయింది. కోలాహలంగా నాగపూర్ స్టేషన్ వచ్చేసింది.
స్టేషను నిండా జనం. దిగిన జనం, దిగుతున్న జనం, ఎక్కే జనం . ఎటుచూసిన మనుషుల ప్రవాహం.
పోర్టరు ఎవళ్ళో వెనక నించి తరుముతున్నట్లుగా వచ్చి గబగబా సామాన్లు దింపసాగాడు. పాందాను పెద్ద మనిషి తాపీగా ఇంకో కిళ్ళీ చుట్టుకొని వేసుకొని ఇంకో పోర్టరు దింపవలిసిన సామాన్లను చూపిస్తూ ఏదో మరాఠీ లో పురమాయించాడు.
వార్ధా లో ఎక్కిన కొద్ది మంది అక్కడ దిగారు.
ప్రియంవద సామాన్లన్నీ పోర్టరు కిందికి దించేసిన తరవాత, "ఏమిటి మీరు దిగదలుచుకోలేదా?' అంది ముసిముసిగా నవ్వుతూ భర్తతో.
రాజగోపాలం "జస్ట్ ఏ మినిట్" అంటూ "ఏయ్ కాఫీ" అని కాఫీ వాణ్ణి కేకేశాడు.
కాఫీ తీసుకు వచ్చాడు వాడు. "మనం కాఫీతో పార్ట్ అవుదాం . ఏమంటారు?' అన్నాడు రవిచంద్ర తో.
రవిచంద్ర దిగులుగా కనిపించాడు. ప్రియ కాఫీ గ్లాసులు అందుకొని మిగతా ఇద్దరికీ ఇచ్చి తను తాగసాగింది.
కాఫీ తాగడం పూర్తీ అయిన తరువాత , "వెళ్దామా?' అన్నాడు రాజగోపాలం భార్యతో. ఆమె తల ఊపింది.
ప్రియంవద దిగబోతూ రవిచంద్ర వైపు క్షణం చూసి, "నమస్తే! మీరు నాగపూర్ వస్తే తప్పక మా ఇంటికి రావాలి. మీరొక్కరే గాదు, నూతన వధువు తో కూడా"అంది. అందంగా, హాయిగా ఆమె గొంతు ధ్వనించటం దేవుడు ఆమె కిచ్చిన వరం.
రాజగోపాలం దిగడం కొంచెం ఆలస్యం చేశాడు. ప్రియంవద కంపార్టుమెంటు లో నించి దిగి భర్త కోసం ఎదురు చూడసాగింది.
రాజగోపాలం రవిచంద్ర చేతిని తన చేతులలోకి తీసుకుంటూ, "గుడ్ బై , త్వరలో కలుసుకుందాం' అన్నాడు.
రవిచంద్ర దాచుకుందామనుకున్నా దాగని బాధ చూపుల్లో ప్రస్పుటించింది. ఏం మాట్లాడలేక పోయాడు.
రాజగోపాలం "మీరు చాలా ఆలోచనల బాధలో ఉన్నారు. విష్ యూ అల్ హాపీ నెస్. ఇంతకంటే నాకేం చెప్పాలో బోధపడటం లేదు. బాధను మీరు బాధించదలుచుకుంటే దాన్ని మరిచిపోవాలి. నేను మీ దగ్గిర ఎక్కువ చనువు తీసుకొని ఉంటె నన్ను క్షమించండి. నాకెందుకనో స్నేహంలో నమ్మకం ఉంది " అన్నాడు.
రవిచంద్ర కృతజ్ఞతా పూర్వకంగా చూడగలిగాడు.
"ఓ .కే....బై..బై........." అంటూ రాజగోపాలం కిందికి దిగాడు. అతనికి చిరునవ్వు మ్ ఉత్సాహము అందంగా అతికిన ఆభరణాలు.
ఏదో కులాసాగా ప్రియంవద తో మాట్లాడుతూ క్షణం సేపట్లో కనుమరుగై పోయాడు.
