"పెద్దవాళ్ళతో వచ్చిన చిక్కే అది!" అన్నది కుముదిని.
'పెద్ద వాళ్ళ మీద వుండే గౌరవం పేరుతొ మన ఆశలనీ భవిష్యత్తు నూ చెడగొట్టుకోనూ లేము, వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ వుండనూ లెం. నా పరిస్థితి ఇలా వుంది!' అని నిట్టూర్చింది సుమిత్ర.
'ఆవిడ ఉద్దేశ్యాలలో మార్పు కోసం ప్రయత్నించి చూడక పోయావా?'
"అదీ చేశాను. క్రొత్తలో నామాట లకి ఆవిడ కోప్పడేది -- తరువాత విసుక్కుని నన్ను వెళ్లి పోమ్మనేది. ఇప్పుడు ఏమీ అనడు-- విని ఊరుకుంటుందంతే....'
'అంటే ఆవిడలో పరివర్తన కలుగుతోందన్న మాట!' అన్నాడు కుముదిని --
సంధ్యా కాశం లో రంగులు చీకటి తెరల వెనక్కి తప్పుకున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు మొలుస్తున్నాయి. డాబా నిండా నిరాశ లాంటి చీకటి అలుము కుంటోంది.
'వెడదాం పద -- మీ జారు వస్తున్నట్లుంది .' అన్నది సుమిత్ర దూరంగా కనిపించిన వెలుగు వంక చూసి.
ఇద్దరూ మెట్లు దిగి వచ్చారు--
కుముదిని కారు కదలగానే వెనక్కి తిరిగి వచ్చి వరండాలో కుర్చీలో కూలబడింది సుమిత్ర.
తల బరువుగా ఉన్నట్లుంది.
వారం రోజులుగా అమ్మ ఆరోగ్యం ఏమీ బావుండ లేదు. నీరసం ఎక్కువైంది. ఆవిడ ఆరోగ్యం మరీ దిగజారి పోవడానికి కారణం తనూ, రఘు అన్నయ్యా యిద్దరేనేమో!
పరీక్షలు దగ్గర కొచ్చేశాయి. ఇంతకాలం కష్టపడి చదువుకున్న చదువు ఎలా వొడ్డున పడుతుందో! చదవాలని పుస్తకం తీసుకుంటే, అందులో దీనంగా చూస్తున్న అమ్మ బొమ్మే కనపడుతుంది.
కాలం పరిగెడుతోంది. దానితో పోటీ పడి మనుష్యులూ పరిగెడుతున్నారు. కానీ తమ జీవితాలలో ఏదో స్తంభన ఏర్పడుతున్నట్లనిపిస్తోంది.
'స్నానం చేయక పోయావా?' అన్నది ఇందుమతి వరండాలో లైటు వేసి. సుమిత్ర ఏమీ మాట్లాడలేదు.
"అట్లా దిగాలు పడి కూర్చుంటే ఎలా గమ్మాయ్! పరీక్షలూ నెలైనా లేవు-లేచి స్నానం చేసి చదువుకో! హాయిగా వుంటుంది. కాఫీ కావాలంటే యిస్తానులే -- ' అన్నది ఇందుమతి మళ్ళీ బోధ చేస్తున్నట్లు.
విశ్వం, సావిత్రీ, చిట్టి , పుస్తకాలు తీసుకొని వచ్చి చాప మీద కూర్చున్నారు.
"నువ్వూ రా అత్తయ్యా!' అని పిలిచింది సావిత్రి.
సావిత్రి కి అత్తయ్యంటే చాలా ఇష్టం. అత్తయ్య చదివేది చాలా పెద్ద చదువు అనీ, తనూ అలా చదవాలని కలలు కంటూ వుంటుంది.
"వస్తానుండు సావిత్రీ!' అని గభాలున లేచి వెళ్ళిపోయింది సుమిత్ర.
స్నానం చేసి అలమారా లో పుస్తకాలు తీసుకుంటూ, మంచం మీద పడుకున్న తల్లి వంక ఒకసారి చూసింది. వెలుగు లేని కళ్ళతో ఇంటి కప్పు కేసి చూస్తూ పడుకుంది ఆవిడ.
"ఇక్కడ ఉక్కగా వుంది. నీప్రక్క వరండాలో వేయనా?' అని అడిగింది ఆపేక్షగా ఆమె మీదకి వంగి.
'ఇలా కూర్చో!' చేయి పట్టుకుని నెమ్మదిగా అన్నది అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ తనని అంత ప్రేమగా పిలిచి చాలా కాలమై పోయింది. ఒక్కమ్మడిగా పొంగిన ఆ ప్రేమ వాహిని సుమిత్ర కళ్ళల్లో అట్టడుగు పొరల్లో దాగిన నీటి జలని పైకి చిమ్మింది.
ఇష్టులైన వారి నుండి దూషణ తిరస్కారాలను తట్టుకోడం ఎంత కష్టమో ఒక్కొక్కసారి ప్రేమాభిమానాలను తట్టుకోడం కూడా అంత కష్టమే!
'చెప్పమ్మా!' అన్నది సుమిత్ర చీరె కొంగుతో కళ్ళు తుడుచుకుని.
'నువ్వంటే నాకేం కోపం లేదు -- బాగా చదువుకుని పరీక్షల్లో నెగ్గు -- దిగులు పెట్టుకోకు!వెళ్ళు!' అనేసి గోడ వైపు తిరిగి పడుకుంది ఆవిడ , ఇంకేమీ మాట్లాడడం యిష్టం లేనట్లు.
అయిదు నిమిషాలు అలాగే మంచం మీద కూర్చుని లేచి వెళ్ళిపోయింది సుమిత్ర. సుమిత్ర చదువుకోడం పూర్తీ చేసి , భోజనం కానిచ్చుకుని ప్రక్క మీదకి చేరేసరికి పదకొండు గంట లౌతుంది. వరండా అంతా మల్లెపూలు వెదజల్లి నట్లు వెన్నెల పరుచుకుంది. తల్లిని నెమ్మదిగా లేవదీసి ఆమె మంచం తన ప్రక్కనే వేసి పడుకోబెట్టి స్పీపింగ్ డోస్ యివ్వబోయింది సుమిత్ర.
"ఒక్కొక్కళ్ళ కి జ్ఞానోదయం కావడం చాలా ఆలస్యం అవుతుంది చిన్నమ్మాయ్! కాలాతీతమైన ఈ కనువిప్పు వల్ల ప్రయోజనం శూన్యం!' అన్నది అన్నపూర్ణమ్మ గారు.
తల్లి కళ్ళల్లో కి ప్రశ్నార్ధకంగా చూసింది సుమిత్ర. ఏదో చెప్పాలనే ఆరాటం అంతు లేకుండా వుంది ఆ వృద్దమూర్తి కళ్ళల్లో, ముడతలు పడిన వదనంలో!
'నువ్వు చెప్పింది మొదట్లో నాకు అర్ధం కాలేదు -- ఇప్పుడిప్పుడు అవుతోంది. నేను పురాణాలు, భారత భాగవతాలూ చదివాను . కానీ వాటిలో ఉండే భావాన్నీ అవి చాటి చెప్పిన సత్యాన్నీ జీర్ణించుకోలేక పోయాను.' ఆయాసంతో ఆగిపోయింది.
ఇంత విజ్ఞాన యుతంగా ఆవిడ మాట్లాడడం సుమిత్ర ఎప్పుడూ వినలేదు --
దీపం ఆరిపోబోయే వేళకు ఒక్కసారి గుప్పుమని కాంతి విరజిమ్మి చటుక్కున ఆరిపోయి వూరుకుంటుంది.
'వాడు చేసిన తప్పేమీ లేదు. నాకు వాడిని చూడాలనుంది, రేపు టెలిగ్రాం యిప్పించు--' అన్నది ఆవిడ చివరికి.
సంభ్రమాశ్చర్యాలతో అమ్మ వంక చూసి, "నిజంగా!' అన్నది సుమిత్ర.
"నేనింకా ఎక్కువ కాలం బ్రతకను-- నా జీవితమంతా వేదనతో నే గడిచిపోయింది. చివరికైనా ప్రశాంతంగా, సంతోషంగా పోవాలనుంది చిన్నమ్మాయ్! మాధవుడి తో చెప్పి రేపు రఘునీ కోడల్నీ రమ్మని టెలిగ్రాం యిప్పించు--'
స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని కళ్ళు మూసుకున్న తల్లికి మెడ వరకూ దుప్పటి కప్పి విడిన జుత్తు ముడి వేసింది సుమిత్ర. ఆవిడ ముఖంలో గంబీర్యం కనపడింది ఇన్నాళ్ళ కి.
సంతోషం ఎన్ని జబ్బులకైనా ఔషదమే. కానీ ఇంత నీరసం మీద అమ్మ సంతోషాన్ని కూడా భరించలేదు-- ఆమె శరీరంలో ఏమాత్రం బలం ఉన్నా ఈ జ్ఞానోదయమనే దీపం సహాయంతో రుగ్మతల చీకట్ల ను పారద్రోల గలిగి వుండేది. ఆమె చెప్పినట్లు అంతిమ దినాలు సమీపించిన మాట నిజమే!
రఘుని ఆహ్వానించడానికి పెద్దన్నయ్య ఏమంటాడో!
వియత్పధంలో ప్రయాణం చేస్తూ జరిగి జరిగిపోతున్న తెల్లని మబ్బు తునకలనూ, చంద్రుడి నీ చూస్తూ పడుకున్న సుమిత్ర కి నిద్ర రాలేదు. తెల్లవారడం కోసం నీరీక్షిస్తూ వుండిపోయిన సుమిత్ర కి తల్లి జీవితం కళ్ళకి కట్టింది. ధనవంతురాలైన చందాసుల కోడలుగా పదిహేనేళ్ళ కే అత్తవారింట అడుగు పెట్టింది అన్నపూర్ణ.
ధనంతో పాటు , అది సమకూర్చే వ్యసనాలన్నీ వున్నాయి ఆ ఇంట్లో పురుషులకు. బంగారం పండే భూములూ, విశాలమైన లోగిళ్ళూ కల ఉమ్మడి కుటుంబం. మాధవరావు పుట్టుకతో నాలుగు చీలిక లైంది. భూమీ ఇల్లు కూడా నాలుగు చెక్కలైనాయి. వృద్దుడి మరణంతో. అన్నపూర్ణ భర్త సుబ్బరామయ్య గారంటే జరీ అంచు ధోవతీ, సిల్కు లాల్చీ , కళ్ళజోడూ కల ఆరడుగుల విగ్రహం అని ఎవరైనా చెప్పేవారు. పేరుకి భార్య అన్నపూర్ణ.
'కానీ పట్నం నిండా ఆయనకి కావాల్సిన పడతులే. స్త్రీలో లత్వం , జూదం ఆయనకు ఉగ్గు పాలతోనే జీర్ణమై పోయాయి. తండ్రి మరణం వల్ల తన పరమైన ఆస్తిని విక్రయించేసి విజయవాడ పట్టణం లో ఇల్లు కొనుక్కొని కాపరం మార్చేశాడు. అయన కొన్ని రోజులకి. అప్పటికే ముగ్గురు పిల్లలు. ఒంటరి కాపురం వలన అనేక బాధ్యతలు అన్నపూర్ణ నెత్తిన పడ్డాయి. నిర్లిప్తత నిండిన మనస్సుతో, ఏవిధమైన అనుభూతులూ లేని హృదయంతో సంసారం లాక్కు వచ్చింది అన్నపూర్ణ. సుమిత్ర పుట్టే సరికే పల్లెటూళ్ళో భూమి కరిగిపోయింది.
సుబ్బరామయ్య గారి శరీరం అనేక వ్యాధులకు నిలయ మై పోయింది.
ఇంటర్మీడియట్ చదువుతున్న మాధవరావు నెత్తిన సంసార బాధ్యత వదిలి నిశ్చింతగా వెళ్ళిపోయాడు మహానుభావుడు. సంసారం సాగడం కోసం అడ్డమైన ఉద్యోగాలూ చేసి చివరికి ఇందులో స్థిరపడి పోయాడు మాధవరావు -- అతని పెళ్ళీ, అక్క పెళ్ళీ ఒక్కమాటే జరిగిపోయాయి. ఇందుమతి తల్లి తండ్రులిచ్చిన కట్నంతో విమల పెళ్లి అయిందని పించేశాడు మాధవరావు -- అప్పటికీ ఇప్పటికీ అదే సమస్య! ఆడపిల్ల పెళ్లి!!
