Previous Page Next Page 
ఋతుపవనాలు పేజి 4


    గోదాదేవికి సరిగ్గా నిద్ర పట్టలేదు. సంతోషమో, దుఖమో తెలియని కళ్ళకు స్పష్టంగా కనిపించని దృశ్యాలు, మనస్సు కు అందీ అందని చేలాంచలముల విసరుల కోసగాలులు సోకే జలదరింపు నిద్రపొనీయలేదు. నిద్రకు ప్రతిగా అపూర్వ వరాల్ని ప్రసాదించింది హేమంత రాత్రి! మంచం దగ్గరగా ఉన్న కిటికీ రెక్క తెరచింది. వీధుల్లో లైట్లు కళ్ళు చికిలిస్తూ వెన్నెల్ని వెక్కిరించలేదు. ఎక్కడో వినిపించే సినిమా రికార్డో, సెకండ్ షో నించీ వచ్చే జనం కేకలో, రిక్షాల , లారీల చప్పుల్లో ప్రశాంతి మీద చిలిపి రాళ్ళు విసరలేదు. అంతటా నిశ్శబ్ద దేవత! ఈ ప్రకృతి కి వెన్నెల్ని కించపరిచే తుంటరి ఆలోచన లేదు.
    దేవాలయం లో కనిపించే ఇత్తడి ధ్వజస్తంభం ఆకాశ దేవత నించీ జారి పడిన చేతి బెత్తం లా ఉంది. పక్కనే వేపచెట్టు , భక్తిగా ఆకూ అకునా తొణికే వినయంతో తలవాల్చు కునుంది. చిటారు కొమ్మల్లో కొంగల గుంపేమో- తెగి పడిన చుక్కల్లా , వెండి ముద్దల్లా కనిపిస్తున్నాయి. ప్రకృతి నగ్నంగా, తదేకమగ్నంగా కురిసే మంచు క్రింద పాపాల మలినాన్ని ప్రక్షాళనం చేసుకుంటున్నట్లుంది! రెక్క మూసి పక్క పైన వాలింది గోదాదేవి.
    సరస్వతి దుప్పటి కప్పుకుని ముడుచుకుని పడుకుని ఉంది. ఆముదపు దీపకాంతి మెత్తగా సంజె వెలుగులా ప్రసరిస్తుంది. వాసవి వాళ్ళ స్వంత ఇల్లు చాలా చిన్నది. 'దోసెడు కొంప లో పసులు త్రోక్కిడి " అన్నట్లుంది. పడుకోవటానికి అనంతయ్య తననూ, సరస్వతి నీ ఇక్కడికి తీసుకొచ్చాడు. అనంతయ్య చలిలో పడుకోవడం తన కలవాటే నంటూ బయట సోఫాలో పడుకున్నాడు. నడవ లో నాలుగు నిలువెత్తు చెక్క షెల్ఫులు.
    'అవేమిటి?' అంది.
    'అవి అన్నయ్య పుస్తకాలు.'
    'పుస్తకాలా?' ఆశ్చర్య పడింది. లాగి చూసింది, తాళాలు వేసి ఉన్నాయి.
    'తాళం చెవులు తేనా?' ముందు కడుగేసింది సరస్వతి.
    'వద్దు, తొందరేముంది? రేపు చూద్దాం....ఏం పుస్తకాలివన్నీ?'
    'పొలం పని లేనప్పుడు మా అన్న ఇక్కడ చదువు కుంటూ ఉంటాడు. మా అన్న రాత్రులు పడుకోవటమిక్కడే.'
    'మీరున్న ఇల్లు ఇరుకుగా ఉంది కదా, ఏదైనా వ్యవసాయ సామగ్రి నో, పశువుల్నో , ఈ ఇంట్లో చేర్చలేదేం?'
    సరస్వతి ఒక్క క్షణం తన ముఖం కేసి చూసింది. ఆ చూపు తనను శోధిస్తూన్నట్లనిపించింది. తనలా అడగడం తప్పా? ఇల్లు శుభ్రంగా ఉంచినందుకు మెచ్చికోలు కనిపించి ఉంటె బాగుండేదా? అసలేదీ అనకుండా ఉంటె బాగుండేదేమో! మనసులో నొచ్చుకుంటుందేమో?
    సరస్వతి నవ్వింది. ఆ నవ్వులో సర్దుబాటు తనం కనిపించింది. యధాలాపంగా అన్నమాటకు నేనిట్లాంటి అర్ధాలు వెతకట మేమిటి? అనే అర్ధమేమో!
    'ఉహూ. ఇక్కడ పశువులూ, అవీ ఎప్పుడూ లేదు. సేనక్కాయ లో, కొర్ర లో , అరికె లో -- ఏవైనా ధాన్యం నిలవేస్తారు!'
    ఆ తరవాత సంభాషణ ఎక్కడి నుంచి ఎక్కడికి దూకిందో ఇప్పుడు జ్ఞప్తి లేదు. బుద్ది గురుతుంచుకోవడానికి వీల్లేని, రెండు పసి మనస్సు లాడుకున్న అట లవి!
    దేవాలయం లో కార్తీక దీపోత్సవం; జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంటల ఆమనీ సందడి; వేసవి లో పెన్నా నదిలో పండించే కర్బూజాల పంట; ఊరి బడిలో చదువు -- గలగలా సంతోష తరంగాల చప్పుడు చేసుకుంటూ ప్రవహించినాయి.
    ఆ ప్రవాహం లో సరస్వతి మనసుతీరా పసిదానిలా ఆదుకుంటుంది. అప్పుడప్పుడూ ఒడ్దేక్కి , 'ఛీ! ఛీ! మరీ ఇంత చిన్న పిల్లలాగా ఏమిటి? ఇంక ప్రవాహంలో దూకకూడదు" అనుకుంటుంది. ఆ సంకోచాన్ని గమనించింది తాను. చల్లగా చేయి పట్టి లాగితే , మళ్ళీ హాయిగా దూకుతుంది. అంతా క్రీడాభిరామమే!
    మనసులో దుఃఖాన్ని మరిపించడం ఒక్కొక్కప్పుడు జ్ఞాని కంటే అమాయకులకే సాధ్యమేమో ననిపించింది.
    మాట్లాడుతూనే ఆవులించి, 'నిద్దరోస్తోంది.' అంది.
    'అప్పుడే నిద్రా? తొమ్మిదిన్నరకే!'
    'రోజూ ఇదివరకే ఓక నిద్ర అయిపోయేది.
    'ఒక నిద్రేమిటి? నిద్ర ఒకటే గదా!'
    'ఊహు అది మీకు. మాకట్లా కాదు. మగవాళ్ళు పశువులకు మేత వెయ్యటానికి లేచి నప్పటికీ ఒక నిద్ర. తరవాత వాటికి నీళ్ళు, కుడితి పెట్టేటప్పటికి కొకటి. ఆ తరవాత సేద్యానికి కెళ్ళేటప్పుడు....ఇట్లా నాలుగు సార్లన్నా లేస్తాము. మీరు పదింటి దాకా మేలుకుని తరవాత ఉదయం పది దాకా నిద్రబోతారు...'
    'పది దాకా నేనేం నిద్రబోను-------తెలుసా?'
    'తొమ్మిదిన్నరకే లేస్తావా?'
    గోదాదేవి నవ్వింది.
    'ఉండు . అన్నయ్య నడిగి తాళాలు తెస్తాను...' అంటూ పరుగెత్తి మళ్ళీ అయిదు నిమిషాల్లో తిరిగొచ్చింది. 'తాళాలు ఎక్కడ పెట్టాడో కనిపించలేదు. '
    'అంటే మీ అన్న ఇప్పటికే నిద్రలో ఉన్నాడన్న మాట?'
    'ఊహు, చేనికి కావలి వెళ్ళాడు.'
    'రాత్రి పూట కావలా? ఎందుకు?'
    'పందులోచ్చి వేరుసెనగంతా ముట్టేలతో తవ్వి కాయలు నమిలేస్తాయి.'
    'అబ్బ! ఈ చలిలో కష్టం కదూ?'
    'అలవాటయింది.' అంది సరస్వతి మామూలుగా.
    తరవాత కాలేజీ లో తన చదువు గూర్చి అడిగింది. చెబుతుండగానే నిద్రలో పడిపోయింది.
    సరస్వతి కొంచెం పొట్టిగా, ఆరోగ్యంగా నిమ్మాపండు లా ఉంది. యౌవనం తృప్తిగా వ్యాపించిన అవయవాలతో , మధువుతో నింపిన నిండు కుండలా ఉంది. ఏ గాలి అలలూ కదల్చని 'ఉనికి' సాధించినట్లు నిమ్మళంగా నిద్రబోతుంది!
    ఇది తన ఇల్లు! ఇక్కడ తన మనః స్థితి చిత్రంగా ఉంది. ఇల్లంతా గంబీరంగా ధ్యాన ముద్రలో, అంత ర్ముఖుడైన యోగిలాగా ఉంది. ఇక్కడి నుంచీ తను తీసుకెళ్ళిన ప్రత్యేకమైన అనుభూతులేమీ ఇప్పుడు లేవు. నాన్న విశ్వరూపం లా నిలిచి తనలో కలిపేసుకున్నాడు. ఇక్కడి స్మృతుల్ని ఏ ఒక్కదాన్నీ మిగల్చుకుండా పోరాడి, తనని చుట్టుముట్ట కుండా తరిమేశాడు. అందుకు నాన్నకు కృతజ్ఞత చెప్పుకోవడంతో పాటు హృదయం లో ఏదో వెలితి ఏర్పడుతుంది. సంతోష పడేందుకే కాదు; దుఃఖానుభావానికైనా ఏదో ఒక ఆధారం, ఒక ఊహ హృదయానికి దొరక్కపోతే ఇట్లా ఉంటుందని ఇప్పుడర్దమౌతుంది. ఇక్కడ అమ్మ కష్టపడి సృష్టించిన తన మొదటి కాన్పును చూసుకుని ' నా బిడ్డ ' అని పొంగిపోయి ఉంటుంది.
    ఇక్కడ ఈ ఇంట్లో అమ్మా, నాన్న ల సంసారాన్ని ఎన్నో వెచ్చని వసంతాలు, పండు వెన్నెలలు చూసినాయి!  
    ఇంటి ముందు అరుగు మీద, అమ్మ ఒళ్లో కూచుని చందమామ కేసి చూస్తూ, అమ్మ చేత్తో 'పాలూ బువ్వా' తిని ఉంటుంది.
    ఆఖరుకి ఏ దుశ్శాసన హస్తం నెట్టి వేయడం వల్లనో, ఏ బలవదాకర్షణ కు ఓడిపోయో ..ఇల్లు విడిచి నాన్నను, తనను విడిచి, గతం మరిచి అమ్మ గుమ్మం దాటిందో-- ఆ క్షణం కలలో తగిలించుకున్న గాయంలా ఉంది. ఈ ఇల్లు, భూములు తన వనుకోవడాని కిప్పుడేదో కొత్త అనుభవంగా ఉంది. ఆ అనుభవం -- సంతోషమూ, దుఃఖమూ కాని అస్తిమిత భావ మాత్రంగా కదిలిస్తుంది. మళ్ళీ కిటికీ తెరిచి చూసింది.
    ఇప్పుడు దృశ్యం మారింది. తెల్లని చంద్రుడు కిరణాలలో తీవ్రత తగ్గించుకుని, ఎర్రగా మారి, పడమటి దిశగా వాలిపోతున్నాడు. గడ్డి వామి పక్కనున్న పెద్ద చింతచెట్టు మెడలో అద్భుత పతకం లా కొమ్మల మధ్య వెళ్ళాడుతున్నాడు.
    ఎక్కడో కోడి కూసింది. పక్కింట్లో రైతు మేత వేసి, గొడ్డు నడిలిస్తూన్న కేక! దూరంగా పొలంలో గొర్రెల మంద అరుపులు! అప్పుడు పక్కల మీద వాలి కళ్ళు మూసుకుంది గోదాదేవి!

                              *    *    *    *
    పొద్దు పొడుస్తుందనటానికి గుర్తుగా తూరుపు ఎర్రబడింది. రేకయి, సగమై, బింబమై బయటి కోస్తున్నాడు సూర్యుడు. నెత్తి మీద పెద్ద పెద్ద కడవ లుంచుకుని పెన్నానది నించీ నీళ్లు మోసుకెడుతూ మాట్లాడుకుంటూ , నవ్వుకుంటూ వెళుతున్న ఆడవాళ్ళను చూస్తుంది గోదాదేవి. ఆ వీధి మలుపు తిరిగి ఎదురుగా వస్తున్నా సరస్వతి కనిపించింది. ఆశ్చర్యంగా ఆప్రయట్నంగా రెండడుగులు ముందు కొచ్చి చూస్తుంది. నవ్వుకుంటూన్న సరస్వతి ముఖాన్ని తల మీద కూర్చుని నల్లగా సూర్య కిరణాలు సోకి మిలమిలా మెరుస్తున్న నీళ్ళ కడవను , రొమ్ము నంటుకుని బిగుతుగా తల మీదికి, కడవ క్రిందికి తీవేలా ప్రాకిన పైట, అప్పుడు అదును దొరికిందని అందాలు విరజిమ్ముతున్న ఆ పూలగుత్తుల్లా ఎత్తయిన .....వింత కదలికలతో వణుకుతూన్న నడుము, తడిసిన చీరే కుచ్చెళ్ల ను తప్పుకుని మట్టిలో ఆడుకుంటున్న నగ్న లైన పసిపాపల మల్లె ముందుకు దూకుతున్న ఆ తెల్లని పాదాలు...సరస్వతి ఇంత అందమైనదా!
    ముఖం మీద నీటి తుంపరులు పడి ఉలికిపడింది గోదాదేవి . సరస్వతి కిలకిలా నవ్వింది.
    'నేను....సరస్వతిని...'
    'ఆ...జ్ఞప్తి కోస్తోంది....' అంది చిన్న చిరునవ్వుతో.
    'అదేమిటి దుష్యంతుని లాగా? రాత్రంతా నీ దగ్గరే గడిపాను....' పెదాలు నవ్వు దాచుకుంటూ.
    'ఫరవాలేదు. ప్రయత్నిస్తే శ్లేష లో భట్టు మూర్తిని మించవచ్చునే!'
    సరస్వతి నవ్వుతూ రివ్వున మెట్లెక్కి, 'ఒక్క నిమిషం!' అంటూ లోపలి కెళ్ళి పోయింది.
    ఆ మెట్లేక్కడం లో సరస్వతి విరపూసిన పూల పందిరి కదిలినట్లుంది. ఇటు పక్క నుండి అటు పక్కకు దూకిన జడ, మేఘాల మనువులా తాకి చూడాలనిపించే మెడ, 'గంగ కద్దరి మేలిద్దరికీడు నుంగలదే!' అన్న కవి వర్ణన జ్ఞప్తి కొస్తుంది. సరస్వతి నిజంగా ఇంత అందమైనదే అయితే , మొట్టమొదట చూస్తూనే కనిపించ లేదెందుచేత? ఈ దృశ్యం అందమైనదిగా తన మనసులో ఉండి, ఆ అందం ప్రదర్శిస్తున్న సరస్వతికి తను అందం ఆపాదిస్తుందా? ఒక సలక్షణమైన యువతి నీళ్ల కడవ మోయడం లో ఇంత అందముందా? అంటే తను కూడా అలాగే ఉంటుందా? వెనకాల చెప్పుల చప్పుడు.... 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS