Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 4


    "అమ్మాయి చదువుకొంటున్నదా! అది కాస్తా అవ్వాలి. ఆనక పెళ్ళి" అంటుంది తల్లి, అమ్మలక్కలతో గాని వాళ్ళ నటు వెళ్ళనిచ్చి "ఏమండీ! మిమ్మల్నే, ఎందుకొచ్చిన పాడు చదువులు...... ఉద్యోగాలు వెలగబెట్టనా! ఊళ్ళేలనా? ఏదో ఓ సంబంధం చూడండి అని మొత్తుకుంటున్నా.. ఆనక ఊరెట్టుకున్నా లాభంలేదు....." అని దులిపేస్తుంది భర్తను.
    అచ్చంగా సురేఖ-తల్లి అరుంధతమ్మగారు, ఆడపిల్లకి పెళ్ళి ముఖ్యమని గుర్తించే స్త్రీ మూర్తులలో మొదట చెప్పాల్సిన వ్యక్తి.
    హెడ్క్లర్కు చేసి రిటైరైన శ్యామలరావు గారికి, ఆదినించి ఆఫీసరుచేత, ఇటు ఇంటావిడ చేత చీవాట్లు తినడమే అబ్బింది గాని- కూతురికి పెళ్ళి సమ్మంధం చూడ్డం చాతనైందికాదు.
    భార్య మొదట కళ్ళతో నిప్పులు చెరగి, ఆనక అంతలో కన్నీళ్ళు కార్చేసరికి, ఆ 'బ్రాహ్మడు' అనునయంగా "మరి ఈ చదువవ్వాలే కదా?..... అదీ గాక వొదినె ఏముంటుందో.....అంతా ఆవిడ పెత్తనం కదా?..... సరే ఆవిడకి రాస్తాను" అన్నాడు.
    వదినె అంటే శ్యామలరావుగారి అన్న (కీర్తి శేషులైన జెగన్నాధం)గారి అర్దాంగి ధనమ్మ.
    "సరిపోయింది...... తా నార్జించుకున్న నాలుగురాళ్ళూ ఆ మహానుభావు డార్జించి, పోతూ పోతూ ఓ భాగం మన పిల్లకి రాసేడు కదా అని ఇక మన పిల్లను వాళ్ళకు అమ్మేసుకున్నామా ఏమిటీ? అదీగాక ఇంతకీ పిల్ల- పెళ్ళి ఆమె చేస్తుందో, లేక తదనంతరం అన్నారు గనుక అదీ రానివ్వదో"-
    అరుంధతమ్మగారికి తోడికోడలి మీద నమ్మకం లేదు. అందుకు శ్యామలరావుగారికి ఆమెమీద కోపమూ లేదుకాని ధనమ్మగారిమీద ఆయనకు అన్న బ్రతికివున్న నాటినించీ గురీ, గౌరవమూ ఉన్నాయి. అదీగాక, తన కూతురికీ అన్న జగన్నాధం గాఉర్ రాసిపోయిన ఆస్తి సుమారు పాతిక వేలకు ఆమె సంరక్షకురాలని ఆయనెరుగును.
    ఆ మాటకొస్తే సురేఖ-బరువు గత ఐదారేళ్ళగా తానేమీ మోస్తున్నదిలేదు. ఆ పిల్లకి విద్యా బుద్ధుల కైతేనేమి, వేషభాషలకైతేనేమి ధనమ్మ గారిదే ప్రయాసా, వ్యయమూ-రెండూనూ.
    సురేఖ విషయంలో ధనమ్మగారే సంరక్షకురాలు, నిర్ణేత అనీ, భార్యకి బోధపర్చవల్సివచ్చి నప్పుడల్లా శ్యామలరావుగారి ప్రాణం తోకకి వచ్చేది.
    అయినా అతగాడు "పిల్లది పరీక్ష లిచ్చింది. ఇక ఆ డిగ్రీ కూడా చేత బడిందో, మన ఎరికను దని విద్యార్హతకు చాలిన సమ్మంధం రాదు కనక; నీ ఎరికెనేమేనా ఉంటే నీ ఆశీర్వాదం వెనక మేమూ, తథాస్తు అంటాము" అని ధనమ్మగారి పేరిట ఉత్తరం రాశాడు.
    అందుకు సమాధానం రెండు ఉత్తరాలుగా వచ్చింది. ఒకటి మరిది పేరట; మరొకటి సురేఖకూ రాసింది ధనమ్మ.
    "ఏమేవ్! విన్నావా వొదిన ఏమన్నదో! దాని గురించి మీ రెందుకు బెంగపడతారు? ఇక్కడికి శలవుల్లో పంపేయండి అనీ..... రాసింది వొదినె..... నే చెప్పాగా, ఆమె ఎప్పుడూ అశ్రద్ధ మనిషికాదు."-భార్యని పిలిచి ఆ ఉత్తరం ఆమెకిస్తూ తన పిల్లకప్పుడే ముహూర్తం నిశ్చయమైపోయినంత మురిసిపోయాడు శ్యామలరావుగారు.
    అరుంధతమ్మకి రకరకాల కోపమొచ్చినా, ఎటూ మింగలేక కక్కలేక, వంటఇంట పోపుల డబ్బా తిరుగదోసుకొని, గంజి కాళ్ళమీద వార్చుకుని కోపం తీర్చుకుంది.
    ఆ విధంగా సురేఖ బెజవాడ దొడ్డమ్మగారింటికి ప్రయాణమయ్యింది. సురేఖకి దొడ్డమ్మంటే, చిన్నప్పుడు  భయముండేది. అదే, వయస్సూ, జ్ఞానమూ, సంస్కారమూ పెరిగి భక్తిగా రూపొందింది.
    సురేఖను ఎమ్మే సీటుకి అప్లికేషను పడేసి మరీ రమ్మంది ధనమ్మ.
    'పద్మావతి', తనూ కలిసి ఇదే అదను అని యూనివర్శిటీలో ఎమ్మేకి అప్లికేషన్లు పడేశారు.
    ఆనాటి రాత్రి; సురేఖ భాస్కరం భయపడ్డట్లు దారిలో తప్పిలేదు. తిన్నగా ఇంటికి చేరుకొని ధనమ్మగారి ప్రశ్నలన్నింటికీ జవాబులిచ్చింది.
    ఆనక బెత్తం పుచ్చుకుని భయంకరాకారంతో హెడ్ మాస్టరు నించుంటే గుంజీలు తీసే పిల్లాడిలా భయంగా ఆమె ఒడ్డించినవన్నీ తిన్నది.
    అర్ధరాత్రి దాటేక గాని ధనమ్మగారి కుశల ప్రశ్నలవలేదు.
    ఆమెకు అప్పుడు కూడా తెలుసుకోవల్సిన సంగతులు తెమలనేలేదు. కాని సురేఖ-ఆరోగ్యం గురించి ఆమె, తన రక్తపు పోటుకంటే మిన్నగా ఆలోచించే తత్వం మనిషి.
    సురేఖను ధనమ్మగారు పడుకోమని చెబుతూ "బెంగెందుకో? మీ నాన్నకి... నేనుండగా.....నీకు రాజులాంటి మొగుణ్ణి చూశానం"ది.
    అయితే సురేఖకి మాత్రం ఇందాక అరవవంటవాడు వండిన తెలుగు-మెంతికూరలోని ఇంగువ తేన్పులు, ఆ రాజులాంటి భర్త నింత పిసరైనా తల్చుకోనివ్వలేదు.

                                       6

    జయమ్మగారు కూతుర్ని బియ్యీడి చదవమన్నది. ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించింది. తన కూతురికి దాని కాళ్ళమీద నిలబడగల ఆవశ్యకత అవసరమని ఆమెకు ఆలోచన మీదనే తెలియనవసరంలేదు. అనుభవం ఆమెకంతవరకు ఉన్నది చాలును.
    పద్మ ఉత్తరం రాసి పోస్టులో పడేసి వస్తూనే తల్లి తన నేదో అడగడంకోసరం కూచోడాన్ని గమనించింది. ఏమడుగుతుందో కూడా ఆమెకు తెల్సును. అవకాశమయితే తల్లి-కంటబడకుండా తన గదిలోకి పోదామనుకుంది కాని జయమ్మగా రడిగింది:    
    "అమ్మాయ్! ఉత్తర మెవరికే?"
    "మా ఫ్రెండుకులే గాని...." అంటూ తలలిని, ఏమార్చేటందుకు "అమ్మా! ఆకలేస్తుందే" అన్నది పద్మావతి.
    జయమ్మ వెంటనే లేచి వంట ఇంటికేసి వెడుతూ "రా మరీ; నీదే ఆలస్యం ..... నువ్వెక్కడికో పోతివాయిరి! ఉదయమెప్పుడో తిన్న ఇడ్డెను ముక్క....." అన్నది.
    తాత్కాలికంగా రామన్న ప్రశ్నల వర్షం ఆగినందుకు పద్మావతి సంతోషించింది గాని, ఆ పిల్లకి తల్లి-తత్వం పూర్తిగా తెలుసును.
    జయమ్మకి లోకజ్ఞానం చదివి ఆలోచించి వచ్చిందికాదు - ఆమె జీవితంలో అన్నిరకాల ఒడుదుడుకులు చవిచూసింది. ఆమె గుండెల్లో గల గాయాలూ - ఆమె గతాన మోసిన కష్టాలూ ఇవాళ ఆమెకు బ్రతుకంటే ఒక రకం ఉదాసీనతను, లౌకిక వ్యవహారాల పట్ల కాఠిన్యాన్ని ప్రసాదించేయి.
    "అమ్మాయ్!" అన్నది జయమ్మ "నువ్వు బియ్యీడి చదవకూడదనే నిశ్చయించుకున్నానన్న మాట" అడిగింది.
    "అది కాదమ్మా.... పద్మావతికి తల్లిని కాదనగల శక్తి కోసరం, భాషకోసరం వెతుక్కుంటున్నట్లు అన్నంలో వేలు కెలుకుతూ వూరుకుంది.
    "సరే, మరి ఈ ఎమ్మే ఏమగు దాహమంటారు. పైగా ఈ వయస్సులో ఉన్న నన్ను దూరంగా వదిలి వెళ్ళాలే అని చూస్తున్నానం"ది జయమ్మ కూతురి మనసు నొప్పించకుండా మళ్ళిద్దామా అన్నట్లు.
    "అదెందుకమ్మా!" తల్లి తన కోరిక నంగీకరించినట్లే భావించి ఉత్సాహంగా చెప్పింది పద్మావతి "నువ్వు లేందే నా కెవరు వొండిపెడ్తారు?... ఈ గదీ అదీ.....అద్దెకు ఇచ్చేసి ఇద్దరం పోదామ్....."
    జయమ్మగారు కూతురి మనసులో విశాఖపట్నం చదువు ఎంత లోతుగా వేళ్ళూని కూచుందో గ్రహించింది. ఆమె దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. గంభీరముద్రలో ఆలోచనా నిమగ్నమైనట్లు పనుల చక్కబాటులో పడ్డది.
    ఆమె ఈవాళ తన కూతురి భవిష్యత్తు గురించి అలోచించినంత తీక్షణంగా గాని, లోతుగా గాని పాతిక సంవత్సరాల క్రితం తన గురించి ఇంత పిసరాలోచించలేదు.
    మూడు రోజుల్లో, తననొక జీవితం కాలం ఒకరికి కట్టుబడి ఉండమని వేసిన మూడు ముళ్ళనూ తెంచుకుని, ఒక్క మనిషిని నమ్ముకుని విశాల ప్రపంచంలో పడిపోయింది.
    నిజంగా ఆవేళ అలాగ చేయకపోతే, ఆమె జీవితం ఇంక నేహంో రకంగా ఉండేదేమో.
    ఇవాళ ఆమె వైధవ్యం నాలుగేళ్ళ వయసు గలది మాత్రమే. అలా గాకపోతే ఆమెను పాతికేళ్ళ క్రితమే ఇది వరించి ఉండాల్సింది.
    ఆమె గతం గురించి ఇంత పిసరుకూడా జ్ఞాపకం తెచ్చుకుని విచారించదు. కాని అప్పుడప్పుడు ముఖ్యంగా పద్మ గురించి తల్చుకున్నప్పుడు ఇంకా తనకు ప్రమాదాలు తప్పలేదేమో ననిపిస్తుంది.
    "సరే! సీటు రాదేమోనంటివిగా" అన్నది అయిదు నిముషాల తర్వాత.
    అప్పటికి గాని పద్మావతికి తల్లి తన గురించే ఆలోచిస్తున్నాదని గ్రహింపుకి రాలేదు.
    ఆమె అప్పటికే స్నానాల కుండులో కూచుని ఉదయం కట్టు విడ్పుబట్టలకు సబ్బు- పెడుతున్నది.
    "దొరుకుతుందనే ధైర్యముందమ్మా...." అన్నది తన కెవరో తెలిసి చెప్పినట్లు.
    పద్మావతికి భాస్కరంతో స్నేహంకంటే, ఆ క్షణంలో భగవంతుడు ప్రత్యక్షమై వరమిస్తానన్నా కోరదగిందేమీ లేదు.
    అతగాడికి దగ్గిరగా బ్రతకాలనే పిపాసలో, ఆ పిల్ల భవిష్యత్తు గురించి ఆలోచనకూడా చెయ్యనుంకించదు. ఎమ్మే అని అంత తపస్సు చెయ్యడానికి కారణం, భాస్కరం ఎమ్మెస్సీ వాల్తేరులో చదూతూండడమే.
    జయమ్మగారు ఆలోచననుంచి తప్పుకుందికా అన్నట్లు కూతుర్ని పక్కకి తప్పుకోమని సైగ జేస్తూ, ఆ పిల్ల పెట్టిన సబ్బుతోనున్న బట్టలు తానే గుంజడాని కుపక్రమించింది.
    పద్మావతి "నీ కెందుకమ్మా శ్రమా, కాస్త విశ్రాంతి తీసుకో" మన్నా, విన్నదికాదు.
    పద్మావతికి తల్లి ఆ విధంగా ప్రవర్తిస్తే వారించడం ఎంత ఉప్పెనకి కారణభూతమౌతుందో తలుసు గనుక తప్పుకుంది.
    ఆ మాటాడకపోవడం జయమ్మగారు మధ్యాహ్నం నాలుగ్గంటలదాకా కూతుర్ని పలకరించనే లేదు.
    ఈలోగా పద్మావతి హెచ్.జి.వెల్స్ "టైమ్ మెషీను" పుస్తకం చేతబట్టుకుని అది చదవడం మాని, గతంలోని సంఘటనలను పెల్లగించి, పెల్లగించి తల్లి ఉదాసీనతకి కారణం వెతక సాగింది. అయితే ఆమె ప్రయాస వృధా అయింది.
    అందుకు కారణం జయమ్మగారి గతం ఏమంత బాగా ఆ పిల్లకు ఏమంత తెలియకపోవడమే - ఆమెకు తెలిసినదల్లా తన తండ్రికి తన తల్లివలన కలిగిన సంతానం, తానొక్కతేనని మాత్రమే. ఆయనకి మొదటి కళత్ర సంతానం నలుగురున్నారు. అంచేతనే అతగాడి ఆస్తి ఓ మోస్తరు చెప్పుకోదగిందే అయినప్పటికే తనకీ, తల్లికీ దక్కిందల్లా తాము ఉంటున్న ఇల్లు మాత్రమే.
    జయమ్మగారు గత ఐదారేళ్ళగా ఆ ఇంటి దిగువ భాగంనుంచి వస్తున్న అద్దెతోనే పద్మావతి చదువు నడుపుకొస్తున్నది.
    అదీ ఉన్నఊరు గనుకనూ, ఇంటిమీద అద్దె వంద రూపాయలు వస్తున్నది గనుకనూ సరిపోయింది. లేకపోతే ఆమె అప్పులపాలైనా అయ్యేది; లేదా పద్మ చదువునేనా ముగిసేది.
    వయసు వచ్చిన పిల్ల మనసు పోగొట్టుకున్నట్లు ఉంటే, అందుకు కారణం గ్రహించలేనంత అమాయకురాలు కాదుగదా జయమ్మ. ఆమెకి కూతుర్ని నిలదీసి అడగగల ధైర్యం చిక్కిందికాదు. కాని మనసునే ఏదో వ్యధ పీడించసాగింది.
    ఆమె నాదుకుందికీ, ఆర్చిందికీ కూడా ఎవరూ లేరు. పద్మావతికి ఆడదిక్కయినా, మగదిక్కయినా తనే; తనకీ తనే.
    పద్మావతి అనుకున్నట్లు చదివి గట్టెక్కితే తన కేంకావాలి? అది లెక్చరర్ ఉద్యోగం చేసి తనను పోషించనక్కర్లేదుగాని తాను సుఖపడితే అదే చాలును.
    తన కెంత కావాలి? తనెన్నాళ్ళు బ్రతకాలి? ఆమె దిగ్గున ఇదే ఆలోచన వచ్చినప్పుడు మంచం మీద లేచి కూచుంటుంది. తను గనక లేకపోతే పద్మావతి సంగతేంగాను?
    పద్మావతికి పెళ్ళి చేయడమా? చదువు సాగించడమా? పెళ్ళే చేయడమంటే సమ్మంధం ఎవరు చూస్తారు? తనకీ, తన తల్లీ-తోడుకీ ఏనాడో తెగిపోయిందికదా!

                                     7

    "ఏయ్! పెళ్ళికూతురూ ఇలా రా!"
    వసంతకి ఎక్కడ లేని సిగ్గు వచ్చింది. దాన్ని కోపంలో దాచుకుందామని విఫల ప్రయత్నం చేస్తూ "అమ్మా! అన్నయ్య చూడే" అంటూ పారిపోయింది.
    "నే నేనున్నాను పిన్నీ! ఇది పెళ్ళికూతురు కాకపోతే, పెళ్ళికొడుకు నవుతా నంటుందా ఏం?" అంటూ, ఆ పిల్ల ననుసరించేడు భాస్కరం.
    "అమ్మా! అన్నయ్యకీ పెళ్ళి చేసేవే" వసంత చెప్పింది.
    "అదెలాగూ తప్పదు. అప్పుడే ఆ ప్రయత్నమూ అయ్యింది ....." అన్నది జానకమ్మగారు, కూర ముక్కలు తరుగుతూ బాస్కరం గుండెల్లో రాయి పడింది. నోరెండిపోయింది.
    "అదెక్కడే! చెప్పవే! ముందన్నయ్య పెళ్ళే, ఆనక నాకు....."
    "ఛప్! పెంకె ఘటమా! నవ్వగల్రు. నీది మొదట; ఆనక వాడిదీ....."
    భాస్కరం-మొహంలోని విషాద ఛాయను వసంత మొదట గమనించింది. ఏమో అనబోయి వూరుకుంది-
    "అన్నయ్యకు పీట వెయ్యవే కూచుంటాడూ."
    "ఎందుకమ్మా, ఇదో వస్తాగా" అన్నాడు. భాస్కరం బయటికి వెడదా మనుద్యుక్తుడైనట్లు అటు తిరిగాడు.
    "ఉహుఁ! అది కాదురా ..... నీతో మాటాడాలి..."అన్నదామె.
    "దీనిష్టం, ఆ కుర్రవా డిష్టం కుదరడమే కదమ్మా, మనకు కావాలి! అదెలాగా రేపు తేలిపోతుంది ...." అన్నాడు చెల్లెలి కేసి కొంటెగా చూస్తూ, భాస్కరం అతగాడిలోని ఉత్సాహం ఎవరో ఎత్తుకుపోయినట్లు డీలాగా కూచున్నాడు.
    "సరి! సరి! దాని సంగతి కాదు..... నీ సంగతి.....నీ కో సమ్మంధం వచ్చింది...." అని చెప్పి, జానకమ్మ గారు కూరముక్కల గిన్నె తీసి, చేత బట్టుకుని నించున్నది; భాస్కరం-మొహంలోని మార్పులను చదువుతున్నట్లు.
    "నా చదువవనీ పిన్నీ!"    
    "భలేవాడివే! వదినె వస్తే చదువు సాగదా ఏం? ...... ఇంచక్కా సాగుతుంది....." తల్లి వెనకనే లేచి కత్తిపీటనెత్తిగోడవార పెడుతూ అన్నది వసంత.
    భాస్కరం క్రుద్దుడై "నువ్వుండమ్మా! పెద్ద వాళ్ళ మాటల్లోకి రాక" అని విసుక్కున్నాడు.
    అన్నయ్య-కోసం అర్ధంకాక దమ్మిడీ అంత మొహం చేసుకుంది వసంత. భాస్కరం తన తప్పిదాన్ని గ్రహించేలోపునే మూకుట్లో కూర ముక్కలను వేస్తూ, జానకమ్మగారు "వసంతా! నువ్వా గదిలో కూచో" మని ఆదేశించింది.
    భాస్కరానికి తన క్షమాపణ చెల్లెలి కెలా చెప్పాలో అర్ధం అయ్యిందుకాదు. వసంత తనచేత సాధారణంగా పల్లెత్తుమాట పడకుండా మసలుకొంటుంది. ఆ పిల్ల నొచ్చుకుంటే భాస్కరం భరించడం అసంభవమే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS