Previous Page Next Page 
ఇందుమతి పేజి 4


    "అక్కగారూ! శుభమా అని పెళ్లి కూతురు ఇంటికి వస్తే, మిన్ను విరిగి మీద పడ్డట్టు అట్లా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు, మీకేమన్నా బాగుందా ఈ వరస?"
    "అబ్బే, అలాంటి దేమీ లేదమ్మా. అని ఆనంద బాష్పా'లని తప్పించుకో జూచింది మాణిక్యమ్మ గారు.
    "ఆనంద బాష్పాలు కాదు. అసూయ బాష్పాలు" అని పుల్ల విరిచినట్లు అనేసి పెరట్లోకి వెళ్ళిపోయింది వెంకాయమ్మ గారు.
    భోజనాలైన తరవాత మాణిక్యమ్మ గారు రాజుని రాజేశ్వరి దేవి దగ్గరికి తీసుకుని వెళ్లి, "నాయనా, పిన్ని" అని చూపించింది.
    "ఏం, పిన్ని ఏమిటి , అమ్మా అనక?' అని ఒక విసురు విసిరింది పక్కనే కూర్చున్న వెంకాయమ్మ గారు.
    "అబ్బే, ఏమీ లేదమ్మా. తల్లి పోయిన తరవాత ఊహ తెలిసిన నాటి నుంచీ నన్నే అమ్మా అని పిలవటం మొదలెట్టాడు. ఇప్పుడలా కాదంటే వాడి పసి మనస్సుకి ఏమర్ధ మవుతుంది చెప్పండి? అయినా సవతి తల్లిని పిన్నీ అని పిలవటమే మా ఆచారం, అందులో తప్పేముంది?" అన్నది మాణిక్యమ్మ గారు. అవసరమైనప్పుడు మాటకు మాట చెప్పగల సమర్దురా లావిడ.
    "ఏమో, మాకు తప్పే. అమ్మా అని పిలవక పొతే అది పలకదు. అయినా అమ్మమ్మ అమ్మ ఎట్లా అవుతుంది. ఆ నోరు లేని వాడి చేత పిలిపించు కుంటే మాత్రం?" అని సాగదీసింది వెంకాయమ్మ గారు. మాణిక్యమ్మ గారికి తల కొట్టేసినంత పనయింది.
    మూడు రోజులు ఉండి స్వగ్రామానికి వెళ్లి పోతారను కున్న వెంకాయమ్మ గారూ, సంతానం అలాంటి సూచన లేమీ ఇవ్వలేదు సరి కదా, సీతమ్మ గారితో చూచాయగా చచ్చిన భార్య తల్లి తండ్రులే తిష్ట వేసుకుని ఉండగా లేనిది, కొత్తగా కాపరానికి వచ్చిన నోరూ వాయీ లేని చిన్న పిల్లని పిలిస్తే పలికే దిక్కేనా లేకుండా ఇక్కడ వదిలేసి అప్పుడే ఎట్లా వెళ్లిపోతామని సాగాదీసుకున్నదట వెంకాయమ్మ గారు.
    రోజులు గడిచిన కొద్ది వెంకాయమ్మ గారికీ, మాణిక్యమ్మ గారికీ మధ్య వాగ్యుద్దాలు తీవ్రమయ్యాయి. వెంకటా చలపతి గారు చూసీ చూడనట్లు ఊరుకున్నారు. ఒకనాటి రాత్రి రాజేశ్వరి దేవి శయ్యాగృహం లో తల్లి గారి ఆనతి ప్రకారం భర్తతో ఈ సమస్య చర్చకు తీసుకు వచ్చింది.
    "మీ మామగారూ, అత్తగారూ ఇంక ఎల్లకాలం ఇక్కడే ఉంటారా?"
    "ఇక్కడ ఉండక ఎక్కడ ఉంటారు? వాళ్ళకీ మాత్రం ఎవరున్నారు కనక! ఆయనా గుడ్డివారయి పోయరాయను! ఆవిడా , ఆడది ఇక రాజు ఆవిడ దగ్గర పెరగ వలసిన వాడే కదా? తల్లి పోయిన నాటి నుండీ తల్లి కన్న ఎక్కువగా వాణ్ణి సాకుతున్నదావిడ. అల్లుడయినా, కొడుకయినా నేనే అని ఎంతో ఆప్యాయతతో చూసుకుంటూ వచ్చారింత కాలమూనూ. శ్రీదేవి పోయిన తరవాత వేరే కాపురం పెట్టు కుంటామని వాళ్ళే అన్నారు. కాని మేమే వద్దని బతిమాలి ఉంచాము. ఇప్పుడు కాదని వేరే కాపురం పెట్టమంటే వాళ్ళెక్కడికి పోతారు? రాజేమై పోతాడు?"
    "రాజు దేముంది? వాళ్ళు పెంచినట్లు మనం పెంచ కోలేక పోతామా? మనం ఏం చేసుకున్నా, ఎట్లా చేసుకున్నా ఆ బాధ్యత మనది. మన దగ్గరే ఉంటాడు. వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు, మనకెందుకు? ఉన్నదేదో పెట్టుకు తింటారు. లేకపోతె పస్తుంటారు. దేశంలో జీవనోపాధి లేని వాళ్ళందరి నీ మనం చేరదీయ్య గలమా?"
    "అట్లా అనకు, రాజేశ్వరీ! రాజు ఆవిణ్ణి విడిచి ఉండలేడు. వాళ్ళని అలా వెళ్లి పోమ్మనటం ధర్మమూ కాదు. అటువంటి ఉద్దేశాలు పెట్టుకోకు నువ్వు."
    "అయితే మా అమ్మని విడిచి నేనూ ఉండలేను. వాళ్ళిక్కడే ఉంటె మా అమ్మ ఇంక ఒక్క క్షణం ఇక్కడ ఉండదు. రోజూ రాద్దాంతం చూస్తూనే ఉన్నారుగా? అయన దేముంది లెండి, పుణ్యాత్ముడు. ఈ పాపిష్టి లోకాన్ని చూడక్కర లేకుండా కళ్ళు కాల్చుకు కూర్చున్నాడు. ఏమున్నా అవిడున్నది , చుప్ననాతి. మీకు ఆవిడే ఎక్కువయితే ఆవిడనే పెట్టుకు ఉండండి....నేను మా అమ్మతో కూడా వెళ్ళిపోతాను.."
    "రాజేశ్వరీ!"
    పట్టరాని కోపంతో భార్యను చెంపమీద చెళ్ళున కొట్టి, "హద్దూ పద్దూ లేకుండా మాట్లాడుతున్నావు. పో, నీ ఇష్టం వచ్చిన చోటికి పో" అని గదిలో నించి బయటికి గెంటి వేశారు వెంకటా చలపతి గారు.
    తలుపు దగ్గర నిలుచుని గదిలోని సంభాషణ ఆలకిస్తున్న వెంకాయమ్మ గారు తలుపు తెరుచుకుని వెక్కుతూ బయట పడ్డ కూతుర్ని పొదివి పట్టుకుని చెంపలు సవిరిస్తూ విరుచుకు పడ్డది; "నేరకపోయి చేసుకున్నా నమ్మా , ఈ రెండో పెళ్లి సంబంధం . అంతా అనుకున్నట్లే అయింది. అయినా లోకంలో రెండో పెళ్లి వాళ్ళని చాలామందిని చూశాం. అంతా ఇట్లాగే ఉన్నారా? చచ్చిన దాని గతి లేని తల్లితండ్రుల కోసం కావాలని పెళ్లి చేసుకున్న దాన్ని ఇల్లు వెళ్ళ'గొట్టే మానవుల్ని ఎక్కడైనా చూశామా? ఏం, గతి లేక వచ్చామా? పద. ఇంక ఇక్కడ ఒక్క క్షణం ఉండవద్దు. రేపు పొద్దున్నే ప్రయాణం. ఒరేయ్ గోపాలం, ఒరేయ్ గోవిందూ లేవండి రా సర్దండి. అయింది మీ సంబడం' అని వాళ్ళని తలా ఒక బాదూ బాది లేవగొట్టి కూర్చో బెట్టింది. వాళ్ళకేమీ అర్ధం కాక ఏడుపు లంకించు కున్నారు.
    ఈ హడావిడికి లేచి బయటికి వచ్చిన దుర్గాప్రసాద రావు గారు , మాణిక్యమ్మ గారూ , సీతమ్మ గారూ పరిస్థితి అర్ధం చేసుకున్నారు.
    దుర్గా ప్రసాదరావు గారు చేతి కర్రతో తడుముకుంటూ మెట్లెక్కి మేడ మీదికి వెళ్లి, "నాయనా, చలపతీ  ఏమిటి తండ్రి ఈ రాద్దాంతం? చిన్న పిల్ల మీద చెయ్యి చేసుకున్నావా? మా కోసం నీ కాపురం పాడు చేసుకోకు, నాయనా. నేనూ మాణిక్యం మా గతి మేం చూసుకుంటాం. రేపు ఉదయమే వెంకటరత్నం బావగారికీ కబురు పెట్టి పిలిపించు" అన్నారు.
    "మీరు ఊరుకోండి, మామగారూ. చెప్పుడు మాటలు విని చెడిపోయింది రాజేశ్వరి. ఇది డానికి పుట్టిన బుద్ది కాదు. దాని బుద్ది తిరిగి విచక్షణ జ్ఞానం ఏర్పడితే అదే తిరిగి వస్తుంది. మీరిక్కడికి వెళ్ళనక్కరలేదు."
    'అలా కాదు , నాయనా. లోక రీతికి విరుద్దంగా నడిస్తే ఇటువంటి అనర్ధాలే కలుగుతాయి. నువ్వింక నా కడ్డు  చెప్పకు. నీకు తెలుసు , నేనొక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాని కింక మార్పు ఉండదని" అంటూ మెట్లు దిగి కిందికి వచ్చేశారు దుర్గాప్రసాదరావు గారు.
    "అదేమీటన్నయ్య , ఆవిడేదో నోటికి వచ్చినట్లు పేలిందని మీరూ తొందర పడతారా?"అని అడ్డం పడ్డది సీతమ్మ గారు.
    "నీకు తెలియదు ఊరుకో చెల్లమ్మా. అమ్మా, రాజేశ్వరీ . అతనేదో తొందరపడి నీ మీద చెయ్యి చేసు కున్నాడు. తప్పు పని. నీ సంసారం చక్క బెట్టుకో తల్లీ. నీకెలా ఇష్టమో అలాగే జరుపుకుందాం. అమ్మగారి నేమీ బాధ పడవద్దని చెప్పు" అని తన గదిలోకి వెళ్లి పోయారు దుర్గాప్రసాద రావు గారు, గోడలు తడుముకుంటూ.
    మరునాడు ఉదయం వెంకటరత్నం గారూ, అయన భార్యా రుక్మిణమ్మ గారూ వచ్చారు. వెంకటరత్నం గారు దుర్గాప్రసాదరావు గారి అన్నగారి కుమారుడు. గుంటూరులో ఒక విద్యా సంస్థలో ఆచార్యు లుగా పని చేస్తున్నారు. దుర్గా ప్రసాదరావు గారు ఉద్యోగం వదిలి పెట్టి గుంటూరు వచ్చినప్పటి నుంచీ వెంకటరత్నం గారే ఆయనకు అండగా ఉంటూ వచ్చారు. స్వంత కుమారుడు లేని దుర్గా ప్రసాదరావు గారు వెంకట రత్నం గారంటే ప్రాణం. చిన్నతనం లోనే తండ్రిని కోల్పోయిన వెంకట రత్నం గారికి దుర్గాప్తసాదరావు దంపతుల యెడల అసాధారణ మైన వాత్సల్యం. రుక్మిణమ్మ గారు కూడా వారి ఎడల ఆ విధంగానే ఉంటారు. వెంకటా చలపతి గారికి వెంకట రత్నం గారి ఎడల శ్రీకృష్ణుని ఎడల అర్జునిడి కి లాగ భక్తీ విశేషమైన గౌరవము ఉన్నాయి.
    పరిస్థితులు పూర్తిగా అవగాహన చేసుకున్న వెంకట రత్నం గారు దుర్గాప్రసాద రావు గారి ప్రతిపాదనే బలపరిచారు. అదే సరిఅయిన మార్గమని వెంకటా చలపతి గారికి నచ్చ చెప్పారు. రాజు పెంపకం ప్రశ్న వచ్చింది. మాణిక్యమ్మ గారు రాజును విడిచి ఉండలేనన్నారు. సవితి తల్లీ, ఆమె పరివారమూ కుర్రవాడ్ని సరిగా చూడరని ఆమె భయం. తండ్రి వెంకటా చలపతి గారికి కూడా అలాగే అనిపించింది. అయినా కొడుకుని, "నాన్నా, తాతయ్య, అమ్మమ్మా, ఇంక నించి మామయ్యా గారి ఇంట్లో ఉంటారట. నువ్వు నా దగ్గర ఉంటావా. తాతయ్య దగ్గిర ఉంటావా?" అనడిగాడు. తాతయ్య దగ్గిరే ఉంటా నన్నాడు రాజు. రాజేశ్వరీ గాని, ఆమె తల్లి గాని ఈ విషయం లో ఏమీ అనలేదు. సీతమ్మ గారికీ అదే నచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS