Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 4


    "ఏమిటి సంగతి?" అంటూ వారిని సమీపించిన ధర్మారావు కు హృదయ విదారకమైన పరిస్థితి కంట బడింది.
    ఒక ఖైదీ ఆ నిశీధి ని పారిపోవడానికి ప్రయత్నించి పట్టుబడి పోయాడు; అందరూ ఎక్కడ తగిలేది, ఏమయ్యేది చూడకుండా చావగొడుతున్నారు.
    "ఆగండి!" ధర్మారావు సింహ గర్జన తో అందరూ ఆగిపోయి చూడసాగారు.
    "వీడు --వీడు సార్......" ఒక కానిస్టేబుల్ రొప్పుతూ ఏమేమో చెప్పబోయాడు.
    "నాకంతా తెలుసు. అతడిని వదిలి మీరందరూ వెళ్ళండి.' ఆజ్ఞాపించాడు ధర్మారావు.
    "సార్!' ఆశ్చర్యంతో తల తిరిగిపోయింది ఆ పోలీసుకు. అతడి సర్వీస్ లో ఎన్నడూ ఇటువంటి వారిని చూడలేదు.
    "అయ్యగారూ!" అని ధర్మారావు కాళ్ళకు చుట్టుకు పోయాడు ఆ ఖైదీ. ఇదివరకు సూపరింటెండెంట్ లాగా అందరితో పాటు తనను బూటు కాళ్ళతో తన్నని ధర్మారావు వింత స్వభావానికి ఆశ్చర్యపోతూ.
    "లే. నాకేమీ ఫర్వాలేదు. కానీ, మళ్ళీ పారిపోవడానికి మాత్రం ప్రయత్నించకు. " తీవ్రంగా అన్నాడు ధర్మారావు. "ఏయ్! అతన్నే కాదు మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త!' అని మిగిలిన అందరు ఖైదీలను హెచ్చరించాడు.
    కాపలా దారులతో "వాళ్ళ సంగతి రేపు నేను చూచుకుంటాను. జాగ్రత్తగా కాపలా కాయండి. ఎవరూ అతన్ని మళ్ళీ కొట్టకండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.
    "సూపర్నెంటు బాబు సాక్షాత్తూ దేముడే." చేతులెత్తి మొక్కుకున్నారు ఖైదీ లందరూ.
    "ఇలాటి దేవుడు ఎందుకు? ఎప్పుడో తన గొంతు మీదికి, మా గొంతుల మీదికి కూడా తెస్తాడు." గొణుక్కున్నారు పోలీసులు.
    తిరిగి వచ్చిన ధర్మారావు "ఏమిటా అలజడి?' అని ప్రశ్నించింది దయామయి.
    "పెద్ద విశేషమేమీ లేదమ్మా! ఒక ఖైదీ పారిపోబోయాడు. అందరూ పట్టుకొని అదుపు లోకి తెచ్చారు."
    "చూచావా మరి? ఇవాళ అదుపులోకి తెచ్చారు. మరోనాడు తేలేక పోనూ వచ్చు. వాళ్ళే తిరగబడి ఏం చేసినా చేయగలరు. నీకీ ఉద్యోగమే దొరికింది!' కొంత విచారంగా, కొంత నిష్టూరంగా అన్నది దయామయి.
    "ఇలా కూర్చో అమ్మా" అన్నాడు ధర్మారావు పక్క మీద మేను వాలుస్తూ. దయామయి చేరువలోనే స్టూలు మీద కూర్చుంది. కొద్ది సేపు ఇరువురూ ఎవరి ఆలోచనలలో వారుండి మౌనమే వహించారు.
    "నేను ఒక మాట చెబితే కోపం తెచ్చుకోవు కదమ్మా?" అని అడిగాడు కడకు.
    "చెప్పు, ఏమిటో?' నిర్లిప్తంగా అన్నది దయామయి.
    "మనం ఏ అపరాధం చేసి ఆ ఆశ్రమం లో పెరిగాము?"
    ఉలిక్కిపడి అంది దయామయి. "అంటే?"
    "ఆహా ..అంటే....చూడు. ఒక ఇల్లూ, యజమానీ, గృహిణి, పిల్లలూ, పెద్దలూ -- ఇటువంటి చక్కటి వాతావరణానికి నోచుకోకుండా, అందరి దయాధర్మ భిక్షల పై నడప బడుతున్న ఆశ్రమంలో -- ఎవరెవరో , ఎక్కడి వారో -- అందరం ఒక గుంపు గా పెరిగాము. దాతల దయాధర్మాల మినహా మనను బాధ్యతగా ప్రేమతో ఎవరు పెంచారు? సాధారణంగా మానవులందరికీ ఉండే గృహ వాతావరణమూ, సౌఖ్యమూ మనకెందుకు లోపించాలి?"  
    "అయితే ఏమంటావు? దానికీ, దీనికీ ఏమిటి సంబంధం?"
    "ఉంది మరి. అలాగే ఈ ప్రపంచం లో అనేక రకాల బాధలుంటాయి వాటిని అనుభవించే వాళ్ళందరూ నేరస్తులు, పాపులూ అనుకోకూడదు."
    ఒక్క నిమిషం ఆగి చూచాడు. దయామయి శ్రద్దగానే వింటున్నట్లు కనిపించింది. తిరిగి చెప్పసాగాడు.
    "ఇప్పుడు స్వేచ్చగా -- అంటే ఏ బందిఖానా లోనూ బందీ కృతులు లేకుండా, ఏ నేరమూ మోపబడ కుండా మన మధ్య తిరుగుతున్న మనుషు లందరూ ఏ నేరమూ, పాపమూ చేయని వాళ్ళేనని మనస్పూర్తిగా చెప్పగలవా నువ్వు?"
    దయామయి ముఖం ఇబ్బందిగా పెట్టింది.
    ధర్మారావు తిరిగి అందుకున్నాడు. "చెప్పవేం? అవునా? అలాగే బందీ కృతులందరూ , నేరాలు మోపబడిన అందరూ నిజమైన నేరస్తులు కారమ్మా! దారుణ హత్యలు, దోపిడీలు, చేసిన వారూ ఉండవచ్చు. వారితో పాటు చీమకైనా హాని చేయని వారూ ఉంటారు. మొత్తం మీద వారినీ, వీరినీ అందరినీ బాగా చూచి మంచి గుణాలు నేర్పడం మన బాధ్యత......అరె! ఏడుస్తున్నావా , అమ్మా? ఎమన్నాను, నేను? తప్పుగా అనలేదే?"
    కళ్ళు ఒత్తుకుంటూ దరహాస వదనంతో అన్నది దయామయి; "తప్పు కాదు, బాబూ! కలకాలం కీరింప బడే మాటన్నావు. వెయ్యేళ్ళు వర్ధిల్లు."    
    "అమ్మా!"
    "అవును. ముందు ఏదో ఆవేశంతో అనాలోచితంగా అన్నాను నేను. చిన్నవాడి వైనా, పెద్ద ఆలోచన చేశావు. అయినింటి గుణాలు, వంశ రక్తమూ ఎక్కడికి పోతాయి , మరి?"
    "ఏమిటమ్మా?' సాలోచన గా అడిగాడు కనుబొమలు ముడి వేసి, 'గతి లేక , జ్ఞానం వచ్చిన నాటి నుండీ అనాధ శరణాలయం లో పెరిగిన నాకు అయినింటి గుణాలూ, వంశ రక్తమూ , విశిష్టతా ఏమిటి? ఎన్నడూ వినని మాటలు వింటున్నానే' అనుకున్నాడు.
    ఖంగారు పడిపోయింది దయామయి. "మరి పడుకుంటాను. నిద్ర వస్తున్నది" అంటూ లేచి వెళ్ళబోయిన ఆమెను ధర్మారావు పోనీయలేదు. "ఏమిటమ్మా ? ఇప్పుడు నువ్వేమిటో అన్నావు? నాకు అర్ధం కాలేదు"అని అడిగాడు.
    దయామయి ఇక తప్పదన్నట్లు బలవంతంగా మాట్లాడింది. "ఏమీ లేదు కాని, అటువంటి సద్వర్తనం తోనే వివేకంగా ప్రవర్తించు, బాబూ. ఉద్యోగాలూ, అందరూ చేస్తారు. కాని ఇటువంటి బాధ్యతా యుత స్థానాలలో ఉన్నవారు ధర్మ దూరులు కాకపోవడమే మహాదాశయంగా పెట్టుకోవాలి. నువ్వు ఈనాడు ఏ నీతి నిజాయితీలతో నిర్మలంగా ఉన్నావో, ఎటువంటి స్వచ్చమైన ధర్మాన్ని నమ్మావో, ఆ ధర్మ చక్రాన్నే సదా విడనాడకుండా ఉండు. ఈ ధర్మ నిర్వహణ లో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. చలించకు. దీనులనేకుల బాగోగులను నీవు చూడవలసిన అవసరం ఉంది. నీవన్నది నిజం. వారిలో అందరూ నేరస్తులే ఉండరు. అయినా ఖైదీలు! అయిన వారికీ, ఆనందాల కూ, సకల స్వేచ్చా వినోదాలకూ దూరం చేయబడి సకల వేళలా నిఘాలో ఉంచబడిన ఆ దురదృష్ట వంతులు కేవలం కాలు చేతులు కదల్చలేని పసిబిడ్డల వంటి వారు. వారిని వీలైనంత దయగా, ప్రేమగా చూడడం నీ విధి. ఏమో-- పెంచే పెద్దల పెంపకాన్ని బట్టి పిల్లల స్వభావ ప్రవర్తనలు ఎర్పదినట్లే నీ ప్రేమ దరణ లలో వారి నీచ దారుణ స్వభావాలూ మారవచ్చునెమో!" అంటూనే మరి మాటలకు తావీయ కుండా వెళ్లి పోయింది.
    ధర్మారావు ను దయామయి అన్న చివరి మాటలు ముగ్ధుడు గా చేశాయి. కాని, అసలు విషయం మాత్రం ఆమె చెప్పలేదు. ఆమె ముందు అన్నమాటలలో ఏవో ప్రత్యేకతా, రహస్యాలూ ఉన్నవన్న మాట నిజం, నిస్సందేహం! అయితే ఆమె ఏదో విషయాన్ని అతి రహస్యంగా దాచి పెడుతూ ఈరోజు ఆవేశం లో అనేసిందనే సంగతి స్పష్టమవుతున్నది. ఇంతకాలం దయామయి ని ప్రేమించి గౌరవించడమే తెలుసు కాని, ధర్మారావు ఆమెను గురించి ఎన్నడూ విపరీతంగా ఆలోచించలేదు. ఆ అవసరమూ కలగలేదు. కాని ఇప్ప్దుదు ఆ ప్రయత్నం గానే ధర్మారావు మనస్సులోకి దయామయిని గూర్చి విమర్శనాత్మక మైన యోచనలు రాసాగాయి. ఆమె నడవడిలో తీరులో మాటలో, ఉచ్చారణ లో -- అడుగడుగునా ఒక ఔన్నత్యమూ, ఇతరులలో లేని ప్రత్యేకతా ప్రభావాలు గోచరిస్తాయి. అటువంటి స్త్రీలు సాధారణంగా ఎక్కడా తనకు తటస్థ పడరు. కాని, శరణాలయం చందాలు, ఉత్సవాల సందర్భంగా ఎక్కడి కైనా వెళ్ళినప్పుడు, జమీందారీ కుటుంబాలలో ఉన్నత వంశాలలో అప్పుడప్పుడు అటుబంతి ప్రత్యెక లక్షణాలు , రూపు రేఖలు ఉన్న స్త్రీ మూర్తుల దర్శనం అల్పకాలం లభించేది. 'ఇటువంటి ఇల్లాళ్ళూ, తల్లులూ ఉన్న వ్యక్తులెంత అదృష్ట వంతులో' అనిపించేది. ఆ సమయంలో. అటువంటి స్త్రీ దయామయి ఆ అనాధ శరణాలయం లో ఉండడం, అందునా తనను అంత ప్రత్యెక శ్రద్ధతో ప్రేమగా పెంచడం ధర్మారావు అప్పుడు ఆనంద కారణమైనా, ఇప్పుడు ఆశ్చర్య హేతువై జిజ్ఞాస ను రేకెత్తిస్తుంది. 'దీని వెనుక ఏదో అద్భుత రహస్యమే ఉండి తీరాలి!' అనుకున్నాడు.
    అతి నూతనమైన అనుమానాల అల్లి బిల్లి ఆలోచనలలో ఉండగానే నిద్రాదేవి అతడిని తన అనురాగ పరిష్వంగం లోనికి తీసుకున్నది.
    భోజనం చేస్తున్న ఖైదీల ను చూడటానికి వెళ్ళిన ధర్మారావు చాలా దూరం నుండే గలాభా విని చెట్టు చాటున నిలబడి పరిస్థితిని తిలకించసాగాడు. అటు ఖాదీ ల నుండి , ఇటు పోలీసుల నుండీ కూడా అతి దారుణమైన అసభ్యమైన, కర్ణ కఠోర మైన భాష వినవస్తున్నది.

 

                                    
    "గొడ్ల మాదిరిగా కఠినమైన పని చేసే వాళ్లకు ఈ తిండి ఎలా సరిపోతుంది." అనే ప్రశ్నే ఖైదీల అలజడి సారాంశం.    
    "దొంగ వెధవల బతుక్కు ఇంతకంటే మంచి కూడెలా వస్తుంది." అని కాపలా దారుల ఎదురు ప్రశ్నతో వాళ్ళు మరింత రెచ్చి పోతున్నారు.
    దుర్భాషలు ముదిరి పోలీసు లాఠీలు పైకి లేస్తున్న సమయంలో ధర్మారావు ప్రవేశించాడు రంగంలో. పరిస్థితిలో తాత్కాలికంగా శాంతి నెలకొన్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS