"కాబట్టి పెద్ద నాయకుడి వయ్యావన్న మాటా! వెనక ఒక పెద్ద రౌడి గుంపును వెంటేసుకుని పెద్ద వాళ్ళనే తప్పులు పట్టేటంత మొనగాడి వయ్యావన్న మాట! నీవెంత? నీ బతుకెంత? రాస్కెల్!షటప్! గెటౌట్!" మహా ఉద్రేకంగా , అరుస్తూనే చరచరా వెళ్ళిపోయాడు నాయుడు.
ఎర్రబడిన ముఖంతో అలాగే స్థాణువులా నిలుచుండి పోయాడు శేఖర్.
* * * *
సాయత్రం ఆరు గంట లయింది.
ఆకాశం ;లోని సంధ్య రాగం అతి మనోహరంగా ఉంది.
అందరికీ ఆత్మ బంధువు మంద పవనుడు మమతతో అందరి తనువులను స్పర్శిస్తున్నాడు.
పార్క్ లో జనం అట్టే లేరు.
మాలతి పందిరి నీడను కూర్చున్న నాయుడు కు విసుగేత్తుతున్నది.
సుకన్య ఎంతకూ రాదేమిటి?
మరో రెండు నిమిషాలకు ముఖం విప్పారింది. సుకన్య వస్తున్నది.
నాయుడుకు నవ్వు వచ్చింది. తమ వ్యవహారం లోకాని కంతా తెలుసు. అయినా సుకన్య ఇట్లా చాటుగానే వస్తుంది. పిరికి పిల్ల!
నవ్వుకొంటూ రెండడుగులు ఎదురు వెళ్ళాడు నాయుడు.
అయితే ఈ వేళ సుకన్య పెదవి మీద రోజూ జవాబుగా వెలుగే చిరునవ్వు లేదు. దిగులు కొట్టవచ్చినట్లు కనిపించుతున్నది.
అది గమనించిన నాయుడి కళ్ళలో కోపం కదలాడింది.
ప్రేమ పూర్వకంగా సుఖన్య చేతిని తన చేతిలోకి తీసుకుని. "ఏమిటోయ్! పొద్దున జరిగిన దానికేనా? ఏడ్చారు వెధవలు! వాళ్ళెంత? వాళ్ళ బతుకు లెంత? పనిలేని కుక్కలు ఏవో మొరిగాయని మనస్సు కష్ట పెట్టుకుంటామా? నీవలా దిగులుగా ముఖం పెట్టకు, డియర్! నేను చూడలేను మరి!" అని అంటూ ఆ అమ్మాయిని కూర్చోపెట్టి , పక్కనే తానూ కూర్చున్నాడు.
సుకన్య అలాగే తల వంచుకుని కూర్చున్నది.
నాయుడు సినీ హీరో ఫోజులో రెండు చేతులతో ఆ అమ్మాయి ముఖాన్ని పైకెత్తాడు.
సుకన్య కళ్ళలోనీళ్ళు . ఎదురుగా ఉన్న విద్యుద్దీపం కాంతులు ఆ నీళ్ళలో పడి ఇంద్రధనుస్సుల్ని సృష్టించాయి.
నాయుడికి కొంచెం చిరాకు వేసింది. "ఏమిటి, సుకన్యా! ఎవరేమనుకున్నా మనకు భయం లేదని చెప్పాగా! ఈ కన్నీళ్ళెందుకు? బ్రతికిన నాలుగు రోజులూ నవ్వుతూ, జీవితాన్ని ఆనందంగా, సరదాగా గడిపెయ్యాలనేదే నా సిద్దాంతం! అట్లా ఏదో కొంప మునిగినట్లు ముఖం పెట్టి ఏడవకు! ఊరుకో! నవ్వుతూ నాతొ గడుపు!" అన్నాడు.
సుకన్య ఇప్పటికి నోరు విప్పింది. అయినా, గొంతు గాద్గదికంగానే ఉంది. "బ్రతుకంతా నవ్వులతో గడపాలంటే, మీరొక్క పని చెయ్యాలి-- అదీ వెంటనే చెయ్యాలి .' అన్నది.
"ఏమిటోయ్ అది? త్వరగా చెప్పు. కాలం అమూల్య మైనది. ఒక్కసారి జారిపోతే మళ్ళీ మనకు చిక్కదు. త్వరగా చెప్పు."
"మీరూ, నేనూ వెంటనే నలుగురి ముందు పెళ్ళి చేసుకోవాలి!" నాయుడి కళ్ళలోకి చూస్తూ దృడంగా అంది సుకన్య.
తేలు కుట్టినట్లు ఉలిక్కి పడ్డాడు నాయుడు. "ఏమిటీ? పెళ్ళా? నీకేమన్నా పిచ్చా?' గొంతులో కాస్త వెటకారం , కాస్త భయం కనపడ్డాయి.
నాయుడి నుండి ఈ జవాబే ఆశించినట్లు సుకన్య ఏమీ కలవరపడలేదు. అలాగే దృడంగా అంది.
"కన్యగా మీ మనస్సును చూరగొన్న నేను మీ ఇల్లాలు కావాలని కోరడం లో పిచ్చి ఏమిటి? మనిద్దరం నలుగురి ముందు పెళ్ళి చేసుకుంటే, ,మన బ్రతుకంతా నవ్వుల పందిరి అవుతుంది. లేదా, ఇట్లాగే నలుగురి ముందూ నవ్వుల పాలవుతాము'. మీకు నేనంటే ఇష్టమయ్యే గదా, ఇట్లా ఎదురు తెన్నులు చూస్తున్నారు? నాకూ మీరంటే ఇష్టమయ్యే గదా, ఇట్లా కళ్ళు మూసుకుని ప్రవర్తించాను! మనిద్దరికీ ఇష్టమైనప్పుడు పెళ్ళి ప్రసక్తి తేవడం పిచ్చి కింద ఎట్లా జమ కడుతున్నారు?"
"అమ్మో డియర్! ఏమో అనుకున్నాను గాని, నా కంటే నీవే బాగా లెక్చర్ ఇస్తున్నావు! ఆడవాళ్ళ లో వాక్చాతుర్యం ఉంటుందని విన్నానే గాని, ఇంతవరకు అనుభవం లోకి రాలేదు. ఈవేళే తెలుస్తున్నది!" అంటూ పకపక నవ్వాడు.
ఇంతసేపటికి సుకన్య పెదవి మీద మందహాసం లాంటిది కనిపించింది. "అయితే మన పెళ్ళి ఎప్పుడు?' గోముగా అడిగినట్లు గానే మాట నిలదీసింది.
"ఎప్పుడో ఏమిటి? ఇదిగో ఇప్పుడే! ఇక్కడ! అయినా, మనం దైహికంగా ఏనాడో భార్యాభర్తలం అయ్యాముగా! ఈవేళ ఈ పిచ్చి ఏమిటి? పెళ్ళి అనేది మనం ఇంతకూ ముందు చాలా రోజుల క్రితమే చేసిన పనికి పబ్లిక్ లైసెన్స్! మేము ఫలానా పని చేస్తామని నలుగురి ముందూ సిగ్గు లేక చాటుకోవడం. ఆడవాళ్ళ కు సిగ్గు ఎక్కువ అంటారు గదా! మరి ఈ సిగ్గులేని పనికి లైసెన్స్ కావాలని పబ్లిక్ గా అడగడ మేమిటోయ్?' నవ్వుతూ అన్నాడు నాయుడు.
సుకన్య నిజంగానే సిగ్గు పడింది. అయినా, ధైర్యం గానే ఇట్లా అంది.
"మీ అమ్మా, నాన్నా మీరు చెప్పే సిగ్గులేని పని చేసినందుకెగా మీరు పుట్టారు! వాళ్ళు దొంగ చాటుగా వ్యవహరించారా? లేక దంపతుల మని చక్కగా సంఘంలో చెప్పుకోన్నారా?ఛీ! ఛీ! మన మాటల ముసుగు తొలగించి చూస్తె, ఎంత అసభ్యంగా ఉంటాయో మీకు తెలియకనా? ఇంత చక్కగా , నాజూకుగా అసభ్యాలు చెప్పగలరని ఈవేళే తెలుస్తున్నది! ఇంతకూ అసలు విషయాన్ని దాటేయ్యకండి. చెప్పండి. మన పెళ్ళి ఎప్పుడూ?"
మామూలు గా నవ్వుతూనే -- "చూడు, సుకన్యా! నీవు ఈ ప్రశ్న అడగవలసింది ఇప్పుడు కాదు. మనిద్దరికీ పరిచయం అయిన రోజునే "మనిద్దరం ప్రేమించుకుని తరువాత పెండ్లి చేసుకుందామండి!' అని చెప్పి ఉండవలసింది. ఆరోజునే ఏం సమాధానం చెప్పేవాడినో తెలుసా? 'సారీ, మేడమ్! నా కిదివరకే పెళ్ళయింది. అయిదేళ్ళ కూతురు కూడా ఉంది. నా భార్యకు క్షయ వస్తే ఒకటిన్నర సంవత్సరం నుంచీ మదనపల్లి శానటోరియం లో ఉంచి మందు ఇప్పిస్తున్నాను. చాలా వరకు జబ్బు తగ్గింది. ఇంక మూడు , నాలుగు నెలల్లో నాభార్యను తెచ్చుకుంటాను. కాబట్టి మనం హాయిగా నిరభ్యంతరంగా ప్రేమించుకోవచ్చు. పెండ్లి మాత్రం -- నో!" అని అనేవాడిని. ఆరోజే అడగక, ఈ దినం అడుగుతున్నా వెందుకు? దగ్గరికి వచ్చిన ఆడదాన్ని వదలడానికి నేను శుకుడినా?" అన్నాడు నాయుడు తాపీగా సిగరెట్ వెలిగిస్తూ.
అతని కళ్ళలో ప్రతిఫలించిన నిర్లక్ష్యానికి గొంతు పిసికి చంపుదామా అన్నంత కోపం వచ్చింది సుకన్య కు.
ఛీ! వీడి ముందు తాను తేలిపోకూడదు! తాను స్త్రీ! స్త్రీ జాతిని ఇప్పటికే చాలా కించ పరిచింది! ఇక ఈ నాటకానికి భారత వాక్యం పలకాలి.
"సరే, మిస్టర్! జరగవలసిందేదో జరిగింది. మీ బోటి వాళ్ళకు చేసిన తప్పులు ఇప్పుడు కాదు తెలిసేది. మీ కూతురుకు నా గతి పట్టినప్పుడు తెలుస్తుంది!"
అతి నిర్లక్ష్యంగా వెనక్కి తిరిగి చరచరా వెళ్ళిపోతున్న సుకన్య ను చూసి నాయుడు ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయాడు.
తనను బ్రతి,మాలుతుందనీ , నీవు తప్ప దిక్కు లేదని ఏడుస్తుందనీ, తన కాళ్ళు పట్టు కొంటుందనీ .... ఇంకా ఏవేవో ఊహించుకొంటున్న నాయుడి కి అవేవీ జరగకుండా సుకన్య ముఖాన కొట్టినట్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం తో పిచ్చి పట్టిన నట్లయింది! ఎంతో నిరాశ కలిగింది!
