Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 4


    కాస్సేపటికి సంబాళించుకున్న తరువాత శ్రీహరి చనువుగా అడిగాడు: "ఏమిట్రా మరి? ఇంకా ఎందుకు చేసుకోలేదు? ఏమైనా సిద్ధంతాలున్నాయేమిటి చేసుకోకూడదని?"
    నవ్వాడు రాజా. "చేసుకోవాలని పరితపించి పోవడమూ లేదు. అలాగని వద్దనీ భీష్మించుక్కూర్చోలేదు."
    "ఓహో! అయితే స్వప్నబాల నిజ జీవితంలో తటస్థపడలేదంటావు!"
    "ఇక కట్టి పెట్టవోయ్! రండి భోజనాలకు" అంటూ లేచాడు రాజా. భోజనాల దగ్గర మెల్లగా చెప్పాడు శ్రీహరి: "నువ్వు దర్జాగా భోజనాలకి రండి, కాఫీలకి రండి అని పిలుస్తూంటే పెళ్లైందనుకున్నాను నేను. బ్రహ్మచారిగాడైతే ఇల్లూ వాకిలీ ఏమిటి, హోటలు మెతుకులు తింటూ ఓ గదిలో పడుంటాడని నా అంచనా."
    "అది నిజమే అనుకో. కాని నాకదేం ఖర్మరా! అంతో యింతో వెనుక కూడా వున్నవాడినే కదా? అదీగాక ఒక్క గదిలో పడున్నా, హాస్టల్స్ లో యితరులతో కలిసున్నా ఏమిటో వూపిరి సలప నట్లుంటుంది నాకు. నా సరదాలు వృద్ది చేసుకొనేందుకు తగిన నిర్మలతకూడ లోపిస్తుంది. అందుచేత యిదే మార్గమన్పించింది. ఈ యిల్లు కొనేశాను. నౌకరూ, వంటమనిషీ వున్నారు. ఒక్కడికీ యింత ఖర్చు అనవసరమే అయినా ధన లోపం లేనప్పుడు విచారం దేనికీ? నా సౌఖ్యం కంటేనా?" అన్నాడు రాజా.
    "అదృష్ట వంతుడివి. "నవ్వాడు శ్రీహరి. "కానీ నౌకర్ల సేవ లేమాత్రం? నా అనే బాధ్యత గల వాళ్ళుంటే ఎంత సుఖం!"
    "మరి మీ అమ్మగారూ వాళ్ళూ......." అర్దోక్తిలోనే ఆగిపోయింది పద్మ ప్రశ్న.
    "నేను బి.ఎ. చదివేప్పుడే పోయారు. తోబుట్టువు లెవరూ లేరు. పూర్తిగా ఒంటి గాడిని" అన్నాడు తలవంచి అన్నం కలుపుకుంటూ. సంతోషంగా ఉన్న అతడి ముఖం ఒక్కసారి విషాద మేఘాచ్చాధితం కావడం చూచిన అతిథులు ముగ్గురూ బాధ పడ్డారు.
    "రాజా! భోజనాలయ్యాక 'షాపింగ్' కెళ్దామా?" మాట మార్చాడు శ్రీహరి.
    "అలాగే నిన్ననే అనుకున్నాంగా ఆ విషయం? అందుకే నేను సెలవు పెట్టేశాను ఆఫీసుకు" అన్నాడు రాజా.
    "థాంక్స్." చిన్ననాటి మిత్రుడి కలుపుగోలు తనానికి శ్రీహరి ముఖం ప్రఫుల్లమయ్యింది. శ్రీహరి పద్మతో చెప్పాడు: "మేము సెకండ్ ఫారంనుంచి ఇంటర్మీడియట్ వరకూ క్లాస్ మేట్సుం. ప్రాణంలా వుండేవాళ్ళం. తర్వాత చదువులూ, వుద్యోగాలూ వేరై కొంచెం దూరమయ్యాం. మళ్ళీ యీవిధంగా కలిశాం."
    భోజనాలు చేసివచ్చి తిరిగి డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు. పళ్ళెంలో తాంబూలం, సిగరెట్లు, మంచినీళ్ళు ఉంచి వెళ్ళాడు నౌకరు. పద్మ తాంబూలం తీసుకుంది. శ్రీహరి సిగరెట్ తీసుకుని, రాజా కివ్వబోయాడు. అందుకుని నవ్వుతూ తిరిగి పళ్ళెంలో ఉంచేశాడు రాజా, "నా అలవాట్లు మరిచిపోయావేమిటిరా? ఇదైనా నలుగురితోబాటు మాత్రమే" అంటూ.
    "ఓహో! ఎవరో కాని ఆ వచ్చే ఆవిడ గొప్ప అదృష్టవంతురాలు" అంది పద్మ.
    "అయితే సిగరెట్ కాల్చేవాళ్ళ భార్యలంతా దురదృష్టవంతులేనా?" అన్నాడు భార్యతో శ్రీహరి కొంటెగా.
    రాజా కల్పించుకున్నాడు. "మితంగా వుంటే అది చెడు అలవాటు కాదు. కాఫీ వంటిదే."
    "ఓహో! ఆడవాళ్ళ ముందు మరి స్నేహితున్ని సమర్ధించుకోక పోతే ఎలా?" అంది పద్మ ఎత్తిపొడుపుగా.
    నౌకరు సెజ్జతో గులాబీలు, సన్నజాజులు తెచ్చి రాజా ముందు ఉంచి వెళ్ళాడు.
    అవి తీసి పద్మ ముందు ఉంచుతూ శాంతి వైపు చూచాడు రాజా. కుర్చీ కిటికీ దగ్గరకు జరుపుకుని దూరాన ఎక్కడికో చూస్తూంది శాంతి.
    "ఏమండీ, శాంతీ, అంత ముభావంగా వున్నారు? ఇవిగో మీక్కావలసినవొచ్చాయి" అన్నాడు రాజా. శాంతి ఇటు తిరిగి చూచింది. "ఏం, మిమ్మల్ని కాస్సేపు అబద్దాలతో ఆడించాననా అంత కోపం? ఇలా వచ్చి కూర్చోండి."
    మెల్లగా వచ్చి కూర్చుంది శాంతి. గులాబీలు తీసుకుంటూ "ఆకులతో కోస్తే బాగుండేది"    అంది, ఏదో ఒకటి మాట్లాడాలి గనుక.
    "ప్చ్. వాడికంత కళాత్మకహృదయం లేదు మరి! మీదగ్గర ట్రెయినింగ్ కు పంపించనా?"
    "కళాకారులదగ్గర ఇన్నాళ్ళనుండి ఆపుతూన్న ట్రెయినింగంతా ఏమైనట్టు?" అంది తిరిగి మాట విసురుతూ శాంతి.
    నవ్వేశాడు రాజా. "మీతో మాట్లాడి గెలవలేం. త్వరగా తెమలండి" అంటూ టాక్సీ పిలవమని నౌకరుకు ఫర్మాయించాడు.
    లేత ఆకుపచ్చవర్ణపు దుస్తులలో, తలలో గులాబి సన్నజాజుల అందం ముఖ చందంతో పోటీ పడుతూంటే వయ్యారంగా కారెక్కుతూన్న శాంతిమీదినుండి చూపులు త్రిప్పలేకపోయాడు, రాజా.
    బజారులో పద్మ అనేకం కొంది. నాలుగైదు సిల్కుచీరలు, మంచి చమ్కీ జోళ్ళు, ఫాన్సీ హాండ్ బాగ్, రంగురంగుల గాజులు కొనుక్కుంది పద్మ.
    "అలా నిలబడిపోతావేం, శాంతీ? నువ్వు కూడా కావలసినవి తీసుకో" అన్నాడు చెల్లెల్ని శ్రీహరి.
    "అన్నీ వున్నవేగా!" అంది శాంతి నిర్లిప్తంగా ఎటో చూస్తూ.
    "ఎన్నున్నా ఆడవాళ్ళింకా యింకా కొంటూనే ఉంటారట!" అన్నాడు రాజా.
    "ఏ ఆడవాళ్ళ సంగతి తెలుసో తమరికి?" నవ్వాపుకొంటూ అడిగింది శాంతి.
    "మంచి దెబ్బ తీశావులే, చెల్లాయ్" అన్నాడు శ్రీహరి, రాజాను కొంటెగా చూస్తూ.
    "నా పని అయ్యింది మరి" అంది పద్మ.    
    "నువ్వేం కొనుక్కోలే దేవిటమ్మా? నాకేం బావుండలేదు" అన్నాడు శ్రీహరి చెల్లెల్ని.
    నవ్వింది శాంతి. "మంచి పుస్తకాల షాపు కెళ్దామన్నయ్యా."
    "వూఁనడు. చెప్పవేం, మరి? పదరా రాజా."
    పుస్తకాల పట్టిక గంటసేపు ఓపికగా పరీక్షించి కడకు రవీంద్రుని గీతాంజలి, నివేదన, గోరా, రెక్, బాల్ జాక్ 'యూజెనీ గ్రాండెట్', టాల్ స్టాయ్ 'అన్నా కెరి నీనా' తీసుకుంది. మరో దుకాణంలో కలర్స్ బాక్స్ తీసుకుంది.
    "చూశావా, నీకూ చెల్లాయికీ తేడా?" పద్మను చూస్త్జూ కళ్ళెగరేశాడు శ్రీహరి. పద్మ ముఖం ముడుచుకుంది.
    "మీరేం చదివారు?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, రాజా శాంతిని. శ్రీహరి జవాబు చెప్పాడు: "నాన్నగారు దాన్ని వదిలి వుండలేరు. అందుచేత ఇంటిదగ్గరే సాగింది చదువు. డిగ్రీ లేం లేవు."
    "మరి ఇవన్నీ......."
    "చదవగలదా అంటావు? అది చాలా ఇంటెలిజెంట్. ఆంగ్లో యిండియన్ లేడీచేత చెప్పించారు ఇంగ్లీషు. మనకంటే బాగా మాట్లాడుతుంది, తెలుసా?"
    ఇంటికి వెళ్ళుతూ రాజాను తమతో వచ్చెయ్యమన్నాడు శ్రీహరి. "కొంచెం పనుందిరా. రేపు తప్పకుండా వస్తాను" అంటూ దిగి పోయాడు రాజా.
    మర్నాడు సాయంత్రం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని జడ అల్లుకుంటూన్న శాంతి దగ్గరికి వచ్చి కాస్సేపు పరీక్షగా చూసింది పద్మ.
    "అయితే పెళ్ళి వద్దంటూ ఈ ముస్తాబంతా దేనికి? ఎవరికోసం యీ అలంకరణ?" అంది కళ్ళు త్రిప్పుతూ.
    శాంతి తీక్షణంగా చూచింది వదినవైపు. "పుట్టినవాటినుంచీ బొట్టు, కాటుక, పువ్వులు పెట్టే పెంచుతారు మనవాళ్ళు. ఇవాళ క్రొత్తగా ఎవరికోసమూ పెట్టుకోవటం లేదు. నువ్వేమైనా దొరసానిలా పెరిగావేమో మరి, నాకు తెలియదు."
    "ఎందుకంత భుజాలు తడుముకుంటావు? ఇవ్వాళ ప్రత్యేకంగా అలంకరించుకున్నావని నే ననలేదే? అసలు సంగతి చెప్తున్నాను."
    జడకు రిబ్బన్ వేసి తలలో పూలమాల అమర్చుకొంటూన్న శాంతి కొంచెం నవ్వుతూ కొంచెం గంభీరంగా అడిగింది: "అయినా అస్త్జమానూ ముసలమ్మలా పెళ్ళో పెళ్ళో అని ఇదేం ధోరణి, వదినా, నీకు? పెళ్ళికంటే జీవితపరమావధి లేదా?"
    "ఎంత కోపమమ్మా! ఆడబిడ్డ పెళ్ళి చూద్దామని కోర్కెగా వుండి అన్నాను."
    కోపంగా ఏదో అనబోయిన శాంతి, గదిలో నవ్వుతూ అడుగెట్టిన శ్రీహరినీ, రాజానూ చూచి ఆగిపోయింది. పద్మ మాటలు ఆ ఇద్దరూ విన్నారని ఈ ఇద్దరూ కూడ గ్రహించారు. అందుకే సన్తి ముఖం అరుణిమ దాల్చి ధరణి కభిముఖమైంది. అయినా దక్షిణేశ్వరంలో రాజాతో మాట్లాడినంత చనువుగా క్రిందటి రోజు అతడింటికెళ్ళిన తర్వాత మాట్లాడలేక పోతూంది. ఎందువల్లో తనకే తెలియడంలేదు. అతడు అవివాహితుడని తెలిసినందువల్లనా? కాకూడదే? అన్నయ్య స్నేహితుల నేకులతో తను స్వేచ్చగా మాట్లాడుతుంది. కాని, ఇటువంటి కలవరం ఎప్పుడూ అనుభవంలోకి రాలేదే? ఎందుకో మాటిమాటికీ అతడి సుందరరూపమే మనస్సులో మెదులుతూంది. ఇదివర కెప్పుడూ అందమైనవాళ్ళను చూడలేదవడ మబద్ధమౌతుంది. ఇంకేమిటి మరి? నిత్యం అతడి పెదవులపై నర్తించే స్నిగ్ధ చిరుదరహాసమే అనుక్షణం గుర్తుకు వచ్చి ఎదలో గిలిగింతలు పెట్టుతూంది. అతడి కొంటెతనేమ్ అడుగడుగునా జ్ఞాపకం వచ్చి నవ్విస్తూంది. ఈ రెండు రోజుల పరిచయ భాగ్యానికే అతడు తన మనస్సులో ఒక గౌరవ స్తానాన్నాక్రమించుకున్నాడు. అతడుకూడ చిత్ర కారుడు కావటమే యిందుకు కారణమా? అంత కంటే ఇంకేమీ కాదా?
    "శాంతీ, అడిగిన మాటకు సమాధానం చెప్పవు. అదేం మర్యాద?" శ్రీహరి కంఠం శాంతి ఆలోచనా స్రవంతికి అడ్డు పడింది. తత్తర పాటుతో తలెత్తి చూచేసరికి రాజశేఖరం తననే చూస్తున్నాడు. మల్లెపూ పరిమళంవంటి అదే చిరునవ్వు. కొంటెతనం నాట్యమాడే కనుదోయి.
    "మీరు వేస్తూన్న చిత్రమేమిటో ఇకనైనా చూడగల అదృష్టం మాకుందా?" నవ్వుతూ ప్రశ్నించాడు రాజా.
    "రండి" అంది తన గదిలోకి దారితీస్తూ, శాంతి.
    "చూపెడుతుండు. నేను కాఫీ తీసుకొస్తాను" అంటూ పద్మ లోపలి కెళ్ళింది. ఏదో చెప్పటానికి శ్రీహరికూడా భార్య వెనుకనే వెళ్ళాడు.
    గదిలోకి వెళ్ళి పెయింటింగ్ మీద తెర తొలగిస్తూ వెనుదిరిగి చూచిన శాంతి కలవర పడి బలవంతంగా చూపులు త్రిప్పుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS