Previous Page Next Page 
రంగులవల పేజి 4


    భర్త మాట్లాడలేదు. జనంతో క్రిక్కిరిసిన బస్సు వచ్చింది. ఆగకుండా వెళ్ళిపోయింది. పరిగెత్తి, కాచ్ చేశాడు భర్త.
    తనూ, మామగారూ మిగిలిపోయారు.

                             *    *    *

    డాక్టరును కలిసేటందుకు మామగారు అబిడ్సు లో దిగేడు.
    తులసి కోఠీలో దిగగానే జయశీల కనిపించింది.
    "ఏమమ్మా, క్లాసుకు రావటంలేదేం?" అంది.
    "ఏమో, పడటంలేదు. ఎందాకా వచ్చాయి పాఠాలు?" అంది తులసి.
    "రా, చెబుతాను" అంటూ జయశీల హోటల్ కు లాక్కెళ్ళింది.
    "క్లాస్ కే వెడదాం. ఇప్పుడు హోటల్ కెందుకూ" అంటున్న తులసిని వినిపించుకోకుండా జయశీల ఫామిలీ రూంవైపు నడిచింది.
    "ఇవ్వాళ క్లాస్ లేదు. మన ఇన్ స్ట్రక్టర్ మారాడు, తెలుసా అతడికి బొంబాయిలో ఉద్యోగం వచ్చింది. వెళ్ళిపోయాడు. పాపం, బాగా చెప్పేవాడు గదూ" అంది.
    "ఏం బాగోలే! ఇప్పుడెవరొస్తున్నారు?" అంది తులసి.
    "ఇప్పుడా, ఓ ముసలినక్క వస్తున్నాడు. జన్మలో ఆడదాన్ని చూడనట్టుగా వ్యవహరిస్తాడు" అంది జయశీల.
    తులసి మాట్లాడలేదు. సర్వర్ వచ్చాడు.
    "ఏమోయ్, ఏం తీసుకుంటావు?" అంది జయశీల.
    తులసి ఆప్యాయంగా తన పర్సు నొక్కుతూ, "కాఫీ చాలు" అంది.
    "లేదు. టిఫిన్ తీసుకో" అంటూ "రెండు పెసరట్టు" అంది సర్వర్ తో జయశీల.
    "చెప్పలేదేం, ఎందుకు రావటంలేదు?" అంది మళ్ళీ.
    "ఇంట్లో బిజీగా ఉంటున్నాను. మా ఆయన పేరంట్స్ వచ్చారు. మా అత్తను కంటి ఆపరేషన్ కోసం హాస్పిటల్లో చేర్చాం. అందువల్ల తీరిక చిక్కటం లేదు" అంది తులసి సాధ్యమైనంత గంభీరంగా.
    "మరి మార్చిలో పరీక్షలు గదా, నువ్వు సీరియస్ గా ప్రాక్టీస్ చెయ్యకపోతే ఎలా ఆప్పియర్ అవుతావు?" అంది జయశీల.
    "అప్పియర్ అవను" అంది తులసి.
    "అబ్సర్డ్! నిన్నందరూ ఫస్ట్ రేట్ స్టూడెంట్ గా కన్సిడర్ చేస్తున్నారు. నువ్వు అప్పియర్ కాకపోవటం-షేం, షేం!" అంది జయశీల.
    తులసి మాట్లాడలేదు.
    "పోనీ, ఈ ఆపరేషనేదో అయింతరవాతయినా రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ చెయ్యచ్చుగా" అంది జయశీల.
    "ఊఁ, అదే అనుకుంటున్నాను. మా పాపనుకూడా రప్పించుకుంటే కొంచెం సాయంగా ఉంటుంది. నేను ప్రాక్టీస్ చేసుకోవటానికి తీరిక దొరుకుతుంది" అంది తులసి.
    "పాపెవరు?"
    తులసి చెప్పింది. సర్వర్ పెసరట్లు తెచ్చాడు.
    "ఏం చేస్తోంది?"
    "ఎస్సెసెల్సీ పాసయింది సంబంధాలు దొరకటం లేదు. ఏదైనా ఉద్యోగం చేయించాలంటే వయసు లేదు" అంది తులసి.
    "పోనీ, ఈ లోగా టైపు నేర్పించవచ్చును నీలాగా" అంది జయశీల.
    తులసి తల ఊపింది. పాపకూడా వచ్చేస్తే, ఊళ్ళో తన తల్లిదండ్రులు మరెంత ఒంటరిగా ఉండవలసివస్తుందో అనే బాధ క్షణకాలం ఆమె హృదయాన్ని ఆర్ద్రం చేసింది.
    తులసిని బిల్ ఇవ్వనీయలేదు జయశీల. షార్ట్ హాండ్ ఇన్స్తి ట్యూట్ కబుర్లు చాలా చెప్పి, "బోర్ కొట్టావా, సారీ!" అంటూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది.
    తులసి బస్ స్టాండ్ వైపు నడిచింది.
    
                            *    *    *

    ఇల్లు చేరేటప్పటికి, వీళ్ళ వరండాలోతప్ప ఇల్లంతా చీకటిగా ఉంది. మామగారు ఈజీ చెయిర్ లో పడుకున్నారు. అతణ్ణి చూడగానే నాలిక్కరుచుకుని "అప్పుడే వచ్చేశారా!" అంది.
    "అవునమ్మా డాక్టరుగారు లేరు. అందువల్ల వెంటనే రిక్షా కట్టుకుని వచ్చేశాను. అదీగాక తాళం చెవులు కూడా నా దగ్గిరే ఉన్నవాయె. మీ రెక్కడ నా కోసం కూర్చుంటారోననికూడా తోచింది" అన్నాడు.
    తులసి చీర మార్చుకుని వచ్చి త్వరత్వరగా వంట మొదలెట్టింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కమల వాళ్ళు లేరు. వెనకవాటాలో స్టూడెంట్స్ కూడా ఎటోవెళ్ళారు. లైట్ వేసి తాళం పెట్టి వెళ్ళారు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. అనవసరంగా లైటు కాలుస్తుంటారు. వాళ్ళ దగ్గిర ఎలక్ట్రిక్ ఐరన్ కూడా ఉన్నట్టుంది. భర్తకు చెప్పి గట్టిగా వార్నింగ్ ఇప్పించాలి. కరెంటు బిల్లు మరీ ఎక్కువ వస్తూంది. అసలు ఇలా స్టూడెంట్స్ కెప్పుడూ అద్దె కివ్వకూడదు. ఇల్లు మరీ ఛండాలంగా చేస్తారు. కమలవాళ్ళు వచ్చారు. వంట పూర్తయింది. మామగార్ని పిలిచింది భోజనానికి.
    "వాడుకూడా రానీ, ఇద్దరం ఒక్కసారే లేస్తాం" అన్నాడు. తను చేసేదేమీలేక పత్రిక తిరగేస్తూ కూర్చుంది. రేడియోలో ఇంగ్లీషువార్తలు కూడా ఐపోయాయి. భర్త రాలేదు. అతడెందుకు రాలేదో తనకు తెలుసు. మామగారికి బలే ఆకలేస్తుండాలి. పాపం, ముసలాయన్నెందుకు కష్టపెట్టడం?
    "ఆయన ఇప్పుడే రారు. మీరు లేవండి" అంది.
    "సరే, వడ్డించు."
    మామగారికి వడ్డించి తను దూరంగా నిలుచుంది.
    "అమ్మాయ్, నిజంగా చెబుతున్నాను. నీకు ఇల్లు సర్దుకోవటం తెలిసినట్లుగా ఆ పెద్దదానికి తెలియదమ్మా" అన్నాడు.
    తులసి ముసిముసి నవ్వులు నవ్వింది.
    "సావిత్రికూడా అంతేనమ్మా నా కూతురని కాదుగాని, దానికీ ఇల్లు అమర్చుకోవటమే రాదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఐనా ఇంత ఓపికగా ఇంటిపని చేసుకుంటావు. నాకు నిన్ను చూస్తే తృప్తిగా ఉంటుంది. ఇవన్నీ ఒకరు చెబితే వస్తాయా, తమంతట తాము తెలుసుకోవాలిగాని."
    ఎందుకూ తన నంతగా పొగిడేస్తున్నాడు?
    "మరి కాస్త అన్నం పెట్టించుకోండి" అంది తను.
    "వద్దమ్మా, వద్దు. ఇప్పటికే ఎక్కువైంది. ఆ పచ్చడి బావుందీ, రెండు ముద్ద లెక్కువే తిన్నాను" అంటూ లేచాడు.
    కంచం కడిగేసి ఇల్లు సర్దింది. మామగారు ఏదో దైవస్తుతి శ్లోకాలు చదువుకుంటూ మంచం మీద వాలేరు. లైట్ తీసేసి తులసి ఈజీ చెయిర్లో వాలింది. మనసు సందిగ్ధంలో పడి కొట్టుకుంటూంది. పాప కోసం ఉత్తరం రాయటమా, మానటమా? భర్త ఏమనుకుంటాడు?
    గేట్ చప్పుడైంది. స్టూడెంట్స్ వచ్చారు నవ్వుకుంటూ. వెంటనే లేచి లోపలికి వచ్చింది. వాళ్ళ వెనకే భర్తా వచ్చాడు.
    అతడు కాళ్ళు కడుక్కుని రాగానే, "లేవండి, తిందురుగాని" అంది.
    "నా కాకలిగా లేదు, నువ్వు తినేయ్" అన్నాడు.
    "కొంచెం తినండి, రండి. నేనూ తిన్లేదు. మీ కోసం కూర్చున్నాను" అంది భర్త మౌనం వహించాడు.
    కాసేపు చూసింది. అతడు పక్క వెయ్యటానికి ఉద్యమించగానే ఆ పని తనే పూర్తి చేసింది. అతడు పక్కమీద వాలేడు.
    "రారా?" అంది.
    అతడు మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు.
    చివాలున లైటు తీసి, వంటింటిగొళ్ళెం పెట్టి, ఈవలి తలుపు బోల్డు వేసేసి వచ్చి మంచంమీద వాలింది.
    "నిన్ను తినెయ్యమన్నానుగా, నువ్వెందుకు మానావు?" అన్నాడు భర్త.
    తులసి మాట్లాడలేదు.
    "ఇలాంటి పొగరుకు మాత్రం తక్కువ లేదు. వెళ్ళి తినమంటే వినిపించటం లేదూ నేను హోటల్లో తినేసి వచ్చాను" అన్నాడు అతడు ఉద్రేకంగా.
    "అదికూడా మీ ఇష్ట ప్రకారమే జరగాలా ఏమిటి? నాకూ ఆకలిగా లేదు. మానేశాను. నేను మీ కళ్ళకు బానిసకన్నా హీనమైపోయాను. మాట్లాడితే అలా నిందిస్తారు, అంత నీచమైన పని నేనేం చేశాను?" అంది.
    అతడినించి జవాబు రాలేదు.
    తులసికి నిద్ర రాలేదు. లేచి ఈవలికి వచ్చింది. చల్లగా గాలి వేస్తున్నది. చేతులు కట్టుకుని, కొంగ చెవుల మీదిదాకా లాక్కుని నిలుచుంది వరండా అరుగుమీద చీకటిగా, చలిగా, ఒంటరిగా, విసుగ్గా, ఇరుగ్గా ఉంది. మనసు మనసులో లేదు. భర్త మారడు. తను ఒంటరిది. కనీసం ఈనాడైనా తనను ఊరడించకూడదూ! ఊరడించడు. ఎందుకు ఊరడిస్తాడు, అవసరాలు తీరినన్నాళ్ళూ ఎవరూ ఎవర్నీ గౌరవించక్కర్లేదు. గేటు అవతల కుక్కలు పోట్లాడుకుంటున్నాయి.
    తనకు నిద్ర కావాలి. అనునయం కావాలి. తోడు కావాలి. కొంచెం సుఖం కావాలి. కొన్ని సోమరి అబద్ధాలు కావాలి. పాప రావాలి. పాప వస్తే ఇందులో సగం తీరతాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS