"నీ విషయమే చూడు మీ అత్తయ్య ఎన్నో విషయాలు నీకు తెలియకుండా దాచి పెంచి పెద్ద దాన్ని చేసింది నిన్ను....ఆవిడ ఉద్దేశ్యాలు ఆవిడవి. అలాంటి వాటిలో ఒకటేమిటో తెలుసా....మనిషికి శీలం చాలా ముఖ్యం. డబ్బుంది నాకేం అన్న ధోరణి లో పెరిగితే అది దెబ్బ తింటుందని నమ్మిందామె. అందుకనే కదమ్మా నీకు చదువు చెప్పింఛి మీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చూసింది? నీకీ సంగతి షాక్ గానే ఉండవచ్చు. నీ అత్తయ్య ఆస్థి యావత్తూ నీకే వస్తుంది. అంతే కాదు నీ మేనమామ పోతూ పోతూ తన ఆస్తిని నీకు రాయడమే కాకుండా అవసరం వస్తే ఆదుకునెందుకోక సంరక్షకుడిని కూడా నియమించాడు' అగరాయన. నోట మాట రాలేదు లలితకి. అలాగే కూర్చుండి పోయింది. వెంకట్రామయ్యర్ ఆప్యాయంగా లలిత భుజం తట్టుతూ అన్నారు. "నీ భవిష్యత్తు ని గురించి నువ్వేం బెంగ పెట్టుకోనాక్కర లేదమ్మాయి. నిన్ను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళంతా ఉన్నారు. నీకు ఇరవై రెండేళ్ళు వచ్చేదాకా నీ ఆస్తి పాస్తుల విషయాలు నేనూ నీ మేనమామ నియామించిన శాస్త్గ్రి గారూ చూసుకుంటాం.
"మళ్ళీ నాకు సంరక్షకుడా' ఆశ్చర్యంగా అడిగింది లలిత.
"నేనిక్కడే ఇదే ఉద్యోగంలో కాలక్షేపం చేస్తానండీ." అంది.
"లేదమ్మా! శాస్త్రి గారికీ ఉత్తరం రాశాను. శాస్త్రి గారు మీ మేనమామ కు చాలా కావాల్సిన స్నేహితుడు. ఐశ్వర్య వంతుడు. మంచి సంప్రదాయకమైన కుటుంబం లోంచి వచ్చాడు. వీలైనంత త్వరలో నిన్ను వారింటికి చేర్చే బాధ్యత నాది. వాళ్ళు నీ మేలు కోరే వారు. నిన్ను తమ యింట్లో వ్యక్తిగానే చూడగలిగి ఉన్న వాడమ్మా శాస్త్రి.' వివరంగా చెప్పారు లాయరు గారూ.
"అది కాదండీ, జరిగినదేదో జరిగిపోయింది నా జీవితంలో నేను ఎలాగో సద్దుకుని కాలం వెళ్ళబుచ్చగలను ఈ మార్పు లెందుకని ? నాకు జ్ఞాపకం వచ్చాక ఈ ఊరు వదిలి వెళ్ళలేదు. పరాయి ఊళ్ళో నేను ఉండలేనండీ.' బాధగా అంది లలిత.
"కాదమ్మా. అలా అనకు. ఉన్నవూరే స్వంత ఊరవుతుంది. రేపు పెళ్ళి చేసుకుంటే అత్తవారి ఊరు వెళ్ళవా?....నీ ప్రయాణానికి అన్నీ సిద్దం చేస్తాను..అప్పటిదాకా అవ్వగారినే సాయం గా ఉండమను....ఇంద....' అంటూ ఐదొందల రూపాయలు చేతికి అందించారు లాయరు గారు. 'వెళ్ళే లోగా ఏమైనా బట్టా కావలిస్తే కొనుక్కో....' తన పని అయినట్టు లేచారు లాయరు గారు.
లలిత కూడా లేచి నిలబడింది.
"తప్పదంటారా?' అడిగింది.
"నీ మేనమామ నిన్నెంత అభిమానించే వాడో నీకు తెలియదమ్మా, మీ అత్తయ్య ని ఎన్నోసార్లు అడిగాడు నిన్ను తనే పెంచడానికి ఇమ్మని . కాని అడ దక్షత లేని చోటని పంపలేదు.అయన ప్రియ స్నేహితుడు నిన్ను ఆయనంతా అభిమానిస్తాడు. సందేహించకు.' కాగితాలు సద్దుకుని బయలుదేరారు లాయరు గారు. వీధి గుమ్మం దాకా ఆయనని సాగ నంపి లోపలికి వచ్చి కుర్చీలో కూలబడింది లలిత. ఎంతలో ఎంత మార్పు! అనుకుంది. మర్పేముంది?పంజరం లో నుంచి పంజరం లోకి మారదమేగా? విషాదంగా నవ్వుకుంది.
తను ఐశ్వర్యవంతురాలు.
తను ధనవంతురాలు! అయినా స్వేచ్చ లేదు.
ధనం కొనలేదు. తను కోరే స్వేచ్చని.
వారసురాలనని తెలియగానే మోహన్ లలిత మనస్సులో మెదిలాడు. 'పాపం! మోహన్' అనుకుంది.
"నాకీ ఆస్తి అంతా వస్తుందన్న సంగతి ఓ రోజు ముందు తెలిసినా ఈ క్షణం లో ఇక్కడ వచ్చి వాలును!' అనుకుంది. కాని తనతన్నీ చుట్టూ పక్కలకి రానివ్వదు.
అతని స్నేహం జ్ఞాపకం లేదు లలితకి. కాని అతను తనలో రేపిన అశాంతి నిత్య నూతనంగా ఉంటుంది.
మోహన్ ని ప్రేమించలేదు లలిత. అతగాడు తనలో సృష్టించిన పంచ వెన్నెల కలని ప్రేమించింది. కల్మషం ఎరుగని హృదయం అందించగల తోలి ప్రేమ అది. ఆలోచనలకూ తావివ్వని, దూరదృష్టి సారించనివ్వని తోలి వలపు అది. అది సమసిపోయింది. ఆ కల పొరల క్రింద నుంచి ప్రపంచాన్ని చూసి మోసపోయింది. కాని ఇప్పుడా పొరలు చీలాయి. వాస్తవం కొట్టినట్టు కనబడుతోంది. ఇక తననెవరూ నమ్మించలేరు, మోసం చేయలేరు. నిండైన వ్యక్తీ తనని ఆలోచనలతో -- ముంచకలడే గాని , నేలకి కాలూనకుండా ఊపిరి సలపకుండా కలలతో ముంచెత్త లేడు! ప్రేమ దేవతకి కూడా మట్టిలోనే ఉంటాయి కాళ్ళన్న సత్యం ముళ్ళ దారి వెంట నడిచి మరీ గ్రహించింది లలిత ....
ఆలోచనలకి స్వస్తి చెప్పి ఆఫీసుకి బయలుదేరింది లలిత. ఆఫీసులో అంతా సానుభూతి చూపెవాళ్ళే. ఆ సమయంలో అంతమంది స్నేహితులు ఉన్నారని తెలిసి వున్న తరుణం లో ఉద్యోగం వదిలి పెట్టాలని అనిపించలేదు లలితకి. కాని రిజైనివ్వక తప్పదు. రెండు రోజులలో రిలీవ్ చేస్తానన్నారు ఆఫీసు వాళ్ళు.
ఆ రోజు నుంచి మొదలు పెట్టింది లలిత ప్రయాణానికి సర్దడం. ఏమీ లేవనుకున్నా రైలుకు వెళ్ళే దాకా సర్దడం పూర్తీ కానేలేదు. అవ్వగారు లాయరు గారు వచ్చి రైలేక్కించారు.
"నిన్ను దింపుకోమని ఉత్తరం వ్రాశాను. ఏం ఫరవాలేదు. చేరగానే ఉత్తరం రాయమ్మా." అన్నారు రైలు కదలబోయే ముందు లాయరు గారు.
"ఏమండీ, అవ్వగారు నా దగ్గిరే ఉండి పోతారు. నేనీ ఊరు వదలకుండా ఉండకూడదా?" అడిగింది లలిత.
"లాయరు గారు నవ్వుతూ లలిత చేయి తన చేతిలోకి తీసుకున్నారు.
"మరేం ఫరవాలేదు. కొద్ది రోజులు పొతే నువ్వే రాస్తావు. ఆ ఊరు ఎంత బాగుందో. శాస్త్రి గారి ఇల్లు అంటే ఎలా ఉంటుందో నీ ఊహ కందడం లేదు. వారా ప్రాంతాలకి మకుటం లేని మహారాజులమ్మా' ఇంకా ఏదో చెప్పబోతుండగానే కూతపెట్టి రైలు బయలుదేరింది.
కనుమరుగయేదాకా అలా అవ్వగారి కేసీ లాయరు గారి కేసి చూస్తూ కూర్చుంది లలిత....అంతా దూరమై పోయారు. రైలు కూడా స్పీడు అందుకుని ముందుకి దూకింది. రైల్లో ఉన్నంతసేపూ తనకు తను ధైర్యం చెప్పుకుంది లలిత.
గడచిన జీవితాన్ని నెమరు వేసుకుంది.
"ఏది ఏమైనా ఎవరూ నన్నిక బంధించి ఉంచలేరు. నాలో కూడా వ్యక్తిత్వం పెరిగింది.' అనుకుంది.
* * * *
ఆ ఊరులో రైలు ఆగేసరికి ఉదయం పదిగంట లయింది. ఒక్క కుదుపుతో లేచి నిలబడింది లలిత పెట్టెలోంచి దిగి కొత్త గడ్డ మీద కాలు పెట్టింది. హడావిడి గా సమానులు దింపేస్తున్నారు కూలివాళ్ళు....
"ఇదొక కొత్త జీవితానికి నాంది' అనుకుంటూ స్టేషను అవతలకి నడిచింది లలిత....
స్టేషను అవతల రకరకాల బళ్ళు పోటీపడి బెరాలాడే ప్రయాణీకులు , ఒకటే గోలగా ఉంది. తన కోసం వచ్చినవారు ముందుకి రాకపోతారా అని ఎదురు చూస్తూ ఒక పక్క నిలబడింది లలిత కూలివాడు సామానంతా గుట్టగా పక్కనే పెట్టి కూలి డబ్బు కోసం తొందర పడుతున్నాడు. చేతి సంచి లోంచి డబ్బు తీసి వాడికి ఇచ్చింది. 'ఏదైనా బండి చూడమంటారా అమ్మాయి గారూ' అడిగాడు.
'నాకోసం వస్తామన్న వాళ్ళ కోసం చూస్తాను పది నిమిషాలు.' అంది లలిత -- చుట్టూ పక్కల పరిశీలనగా చూస్తూ. నెమ్మదిగా స్టేషను దగ్గిర జనం పల్చబడి పోయారు. రైలు దిగిన వాళ్ళంతా తమ తమ గమ్య స్థానాలకీ వాహనాలు బేరం ఆదుకుని వెళ్ళిపోయారు. ఉసూరుమంటూ లలిత మాత్రం అక్కడ మిగిలిపోయింది. 'లాయరు గారు మరీమరీ చెప్పరే-----తప్పకుండా ఎవరైనా స్టేషను కి వస్తారని ' అనుకుంది. అప్పుడే రైలు దిగి అరగంట దాటిపోయింది. కాని ఎవరి జాడా లేకపోయేసరికి ఎక్కడ లేని బెంగా ముంచుకు వచ్చింది. ఇంకో పది నిమిషాలు చూద్దామని నిశ్చయించుకుంది. అప్పటికే అటూ ఇటూ తిరిగే పనిలేని కుర్రవాళ్ళూ , పెద్ద వాళ్ళూ కూడా లలిత కేసి వింతగా చూస్తున్నారు. అదేమిటిక్కడ నిలబడి పోయింది? అన్నట్టు . స్టేషను లోకి వెళ్లి స్టేషన్ మాష్టారు గది దగ్గిరకి వెళ్ళింది లలిత. "ఏం కావాలండీ?' అని ఆత్రంగా అడిగారాయన. లలిత నెమ్మదిగా ఆయనకీ తన ఇష్టం చెప్పుకుంది. 'వారెవరైనా తప్పకుండా రావలసిందే. కాని ఉత్తరాల పొరపాటు వల్లనో ఏమో ఎవరూ వచ్చినట్టు లేదు. ఎవరినేనా పంపి బండి మాట్లాడి పెడతారా?' అని అడిగింది.
"నీకు కరెక్టు ఎడ్రసు తెలిస్తే చెప్పమ్మా, ఓ టాక్సీ వాడికి చెప్పి , తిన్నగా నిన్ను అక్కడ దింప మంటాను' అంటూ స్టేషను మాస్టరు గది దాటి బయటికి వచ్చారు. హ్యాండ్ బాగు లోనికి చేయి పెట్టి తన గార్డియన్ చిరునామా కాల కార్డు తీసి స్టేషను మాస్టరు చేతిలో పెట్టింది లలిత. అది చూసి అదిరిపడ్డంత పనైంది. స్టేషను మాస్టరు గారికి. "పోలయ్యా ' అంటూ ఒక్క కేక పెట్టారు. వారి నమ్మిన బంటు పోలయ్య ప్రత్యక్షం అయ్యాడు. 'నమ్మకస్తుడైన ఓ టాక్సీ వాణ్ణి తీసుకురా అమ్మాయి గారూ శాస్త్రి గారు ఎస్టేటు కి వెళ్ళాలిట' అన్నారు. అంతే వాడోసారి విచిత్రంగా లలిత కేసి చూసి టాక్సీ వాడి కోసం పరుగెత్తాడు.....వీరి ప్రవర్తనలో మార్పుని గుర్తించిన లలిత 'ఎవరీ శాస్త్రి గారు బాబూ' అనుకుంది. సామాన్లు పెట్టేదాకా రామ్మా లోపల కూర్చో. ఇంతట్లో నేను శాస్త్రి గారికి ఫోను చేస్తాను" అన్నారు స్టేషను మాస్టరు.
'వద్దండీ. అక్కరలేదు. ఎలాగా ఓ గంటలో వెళ్లి పోతాను కదా?' అంటూ లలిత వారించింది. ఎంతో నొచ్చుకుంటూ, 'ఎంతో పొరపాటై పోయిందమ్మా' అంటూ టాక్సీ లోకి ఎక్కించి, ఒకటికి పదిసార్లు టాక్సీ వాణ్ణి హెచ్చరించి పంపారు స్టేషను మాస్టారు.
అప్పటికే లలిత కి విసుగొచ్చింది. అసలిక్కడికి రావడం ఇష్టం లేని తనకు యీ వెల్ కం లేకపోవడంతో కోపం వచ్చేసింది. ఆ ఇల్లు ఎంతదూరం అయినా, ఎంత దగ్గిరే అయినా లెక్క చేసే స్థితిలో లెదామే తిరిగి తమ ఊరు వెళ్ళిపోయే అవకశం చిక్కితే చాలు అనిపించింది. అసలిదంతా ఇలా జరగడం లోనే ఏదో దోషం ఉంది అనిపించింది లలితకి. ఎవడో బాబూ యీ చాదస్తపు ముసలి శాస్త్రి! అని ఎప్పుడూ తను చూడని తన గార్దియిన్ని అసహ్యించుకోవడం ప్రారంభించింది. తనకిక్కడికి రావడం ఎంత ఇష్టం లేదో- బహుశా ఆయనకీ అంత అయిష్టంగానూ ఉండే ఉంటుంది. లేకుంటే ఇలా స్టేషను కి ఎవరిని పంపకుండా ఊరుకుంటాడా? అనుకుంది.
