
3
అరగంట అటూ ఇటూ తిరగేస్తున్న పేపరు విసుగ్గా మడిచి పక్కకి పడేసి తల తిప్పి పడకగది వైపు చూశాడు ప్రభాకరం. ఎక్కడా లీల తెములుతున్న జాడలే లేవు. టైము చూశాడు. అయిదున్నర అవుతూంది. ఆమెతో అయిదుంపావుకల్లా సిద్ధంగా ఉండాలని చెప్పి మూడు గంటలు దాటింది. కానీ, ఇప్పటికీ ఆమె రెడీ కాలేదు.
"లీలా....లీలా!"
"వస్తున్నానండీ..." విసుగ్గా, నీరసంగా పలికిందామె స్వరం.
"ఏం చేస్తున్నావ్?" అంటూ గదిలోకి వెళ్ళాడు. పెట్టెలూ, బీరువా తెరవబడి ఉన్నాయి. బట్టలన్నీ కలియ వెతికేస్తూంది దేనికోసమో.
"ఏమిటి....వెతుకుతున్నావు?"
"నల్లపూసలండీ...పొద్దున్న తలంటు పోసుకోబోయేముందు ఎందులోనో పడేశాను. ఇప్పుడెన్ని వెతికినా దొరకడం లేదు..."
"పోనీలే, వచ్చాక చూడకూడదూ?"
"అయ్యో! నల్లపూసల్లేకుండా ఎలారాను?"
"సర్లే నీ చాదస్తం! నేను చూస్తా. నువ్వు రెడీ అవు" అంటూ ఆమెని లేపి తాను వెదకడం మొదలు పెట్టాడు. మొదటి బీరువా....దొరకలేదు. బట్టలన్నీ క్రమంగా పెట్టి, తాళం వేసి లీల ఖరీదయిన బట్టలుండే పెట్టె తెరిచాడు. అట్టడుగుకు పోయింది చేయి. గట్టిగా పాకెట్టు.....'ఇదేమిటి?' అనుకొంటూ పైకి లాగాడు. 'ఎర్రని కాగితంలో చక్కగా, అందంగా చేసిన పాక్. పైన అందంగా "టు...లీల అండ్ ప్రభాకరం (ఫ్రమ్ జయ, ఫర్ ఎ హేపీ మేరీడ్ లైఫ్!" అని వ్రాసి ఉంది!
ఏవో పుస్తకాల్లో ఉంది...
బహుశా ఇది జయప్రద పెళ్ళిలో ఇచ్చిన ప్రెజెంటేషన్ అన్నమాట. వేదిక దగ్గర తను అన్నీ అక్కగారికి ఒప్పజెపుతూ ఉన్నప్పుడు జయప్రద అక్కడే ఉంది. గ్లాసులూ, చెంబులూ, ఫాన్సీ సామానూ-ఇలాంటి వాటి మధ్య ఈ పుస్తకాలెందుకని మానేసిందేమో?... అయినా ఇన్నాళ్ళవరకు వాటిని తనకు చూపించకుండా లీల ఎందుకు దాచిందో! మరిచిపోయిందేమో!
ఇచ్చిన పాకెట్ ఇచ్చినట్టే ఉంది కాని, ఇందులో ఏముందో చూద్దాం అనే కోరికతో కనీసం లీలైనా దాన్ని విప్పినట్లు లేదు....ప్రెజెంటేషన్ విప్పి చూడనైనా చూడకుండా పెట్టె అడుగున దాచి వెయ్యడం సాధ్యమా?....బహుశా లీలకి పుస్తకాలంటే ఇష్టం లేదేమో?
ప్రభాకరం ఆ పాకెట్ ను విప్పకుండా ఉండలేక పోయాడు..... రిబ్బన్ తెగకోసి కాగితం ఊడదీసేసరికి కనపడ్డ వస్తువుల్ని చూచి అతని మనస్సు చివుక్కుమంది. ఎవరో లీలకీ, తనకీ మధ్య ఒక పెద్ద అఘాతాన్ని సృష్టించి వికటాట్టహాసం చేస్తున్నట్లు అదిరిపడ్డాడతను.
"ఏస్పెక్ట్స్ ఆఫ్ బర్త్ కంట్రోల్!"
ఎర్ర త్రికోణం లేదు....అది విదేశీ పుస్తకం. అట్టమీద ముఫ్ఫయ్యే డేళ్ళు దాటిన భర్త, ముఫ్ఫయ్యేళ్ళు దాటిన భార్య;వారిద్దరి మధ్య ఒక నాలుగేళ్ళు బాబు-ఇద్దరి భుజాలమీద చెరో చెయ్యీ వేసి టేబిల్ ఎక్కి నించున్నాడు. వాడు తనని చూపే నవ్వుతున్నట్లు అనిపించింది ప్రభాకరానికి.
కుటుంబ నియంత్రణ అయినా కాదు; బర్త్ కంట్రోల్!
ఇందు కన్న మాట లీల తన సంభాషణ లేమీ వినడం లేదు!.... తన భావాలకీ, ఆమె ఆశయాలకీ ఇంత వైరుధ్యం ఉందని తనకు తెలియలేదు....ఉండవచ్చునని ఊహించలేకపోవడం తనదే తప్పేమో? అని ప్రభాకరం తనని తాను కసురుకున్నాడు.
మరుక్షణంలో లీల ఆ పుస్తకం కనీసం తెరిచి చూడనైనా చూడలేదన్న విషయం గుర్తుకొచ్చింది. పార్సెల్ పార్సెల్లాగే ఉంది కదా!
లోపల ఏముందో చూద్దామని ప్రభాకరం పుస్తకం తెరిచాడు.
"ప్రియస్నేహితులు లీలా ప్రభాకరాలకు-
సదా మీ స్నేహాన్నే కాక మీ ఆరోగ్యాన్ని కోరడం నా విధి.
దాంపత్య వంటచేలో మొక్క కాదు, ఏటేటా పువ్వు పూసి వెన్ను తొడగడానికి.
నే చెప్పినట్టు వినమని శాసించను....ప్రపంచంలో మేధావులు, ఠింకర్పు చెప్పినట్లు చెయ్యండి.
-మీ జయప్రద."
"ఏస్పెక్ట్స్ ఆఫ్ బర్త్ కంట్రోల్!"
ఇంగ్లీషు పుస్తకం అది....అక్కడక్కడ చూసేడు ప్రభాకరం....అమెరికన్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, బ్రిటిష్ శాస్త్రజ్ఞులు కొందరు వ్రాసిన వ్యాసాలు వైజ్ఞానిక ధోరణిలో కాక సులభ శైలిలో ఉన్నాయి అందులో.
సంతాన నిరోధం....
లీలని అడిగి చూడాలి-ఈ పుస్తకం విషయమే కాక ఈ ఇతర కానుకల విషయం. జయప్రద ఏమయినా వైద్యసలహాకూడా ఇచ్చిందేమో?
కొంపతీసి..... తనకు తెలియకుండానే ఏదైనా మార్గం ఆమె తానుగా అమల్లో పెట్టుతూ ఉందా?
ఆపైన అతను ఆలోచించలేకపోయాడు.
లీల అవతలి గదిలో పని అయిపోయిందన్న ధోరణిలో చప్పుడు చేస్తూ వచ్చేస్తూంది.
హడావుడిగా ఆ పుస్తకాన్ని, మిగిలిన వస్తువుల్ని, చీరల్ని అక్కడి వక్కడే వదిలేసి బయటికి వెళ్ళాడు ప్రభాకరం.
లీల ఎకాయెకి హాల్లోకి వచ్చింది.
ముఖానికి పేపరు అడ్డంగా పెట్టుకొని ఈజీచైర్లో తీరుబాటుగా కూర్చున్న ప్రభాకరాన్ని చూస్తే ఆమెకి చిన్నగా నవ్వు వచ్చింది. చిలిపిగా పేపరు తొలగించింది. అతను ఎర్రగా చూశాడు.
"అయిపోయిందండీ. పోదాం, పదండి."
"దొరికాయా అవేవో పూసలు?"
"లేదు. అవి లేకుండానే బయల్దేరుతున్నాను."
"వే వీ పూట రాను."
"అని వెతుకుతూ టైమ్ వేస్టు చేశావవేగా, ఈ కోపం అంతాను?"
"కాదు."
"మరి దేనికో?"
"అది సరికాని, మీ ఫ్రెండు అడ్రస్ ఇస్తావా?"
"నా ఫ్రెండా? ఎవరండోయ్?"
"అదే-మీ డాక్టర్ ఫ్రెండ్."
"జయదా? ఓశ్. మీకు తెలియదా? డాక్టర్ జయ. జయరామా క్లినిక్, రామారావ్ పేట..." హఠాత్తుగా ఆగింది లీల.
'పెట్టె అడుగున జయ ఇచ్చిన కానుక పార్సెల్ ఉంది-అది చూశాడా?'.... పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది...
4
"పోనీ, మా అక్కయ్యగారింటికి వెళతావా, లీలా?" అంటున్న ప్రభాకరం వైపు వింతగా చూసింది లీల.
"ఏ అక్కయ్యగారు?"
"అదే... మా పెద్దక్కయ్యగారి ఇంటికి..."
"అక్కర్లేదు లెస్తురూ..."
"అదికాదు...నేను చెప్పేదేమిటంటే నువ్వేమీ శ్రమ పడకూడదు."
"ఆఁ అసలు నేను పడుతున్న శ్రమేముందండీ?"
"కనపడని శ్రమ ఇక్కడంతా వంటా పెంటా, పాలేర్లూ పశువులూ, అందరికీ ఇక్కడ నువ్వు మాతృమూర్తివి....అంటే మరేం లేదు. అమ్మగారినన్న మాట: ఈ అమ్మగారు ఈ బిడ్డలందర్నీ పాకుతూ కూర్చుంటే, లోపలనున్న ఆ బాబు...అసూయతో కిరకిరలాడిపోతాడు" అని నిండుగా నవ్వాడు ప్రభాకరం.
"కోరిక తీరగానే కవిత్వం పుట్టుకొస్తున్నట్టుందే మీకు!"
"నా కోరిక అప్పుడే తీరుతుందనుకుంటున్నావా?"
"అప్పుడే తీరేది కాదని నాకు తెలుసులెండి....ఓ పది మందైనా పుట్టవద్దా?"
"ప్చ్! మీ అమ్మగారే ఉండి ఉంటే ఆవిడే నిన్ను జాగ్రత్తగా చూసుకునేవారు కదా!"
"అమ్మకు మనవణ్ణి చూసుకునే అదృష్టం లేదు. మనమేం చేస్తాం?"
"అందుకే నే చెప్పేది విని, అక్కగారి ఇంటికి వెళ్ళు. నీ కే లోటూ లేకుండా మా అక్క చూసుకుంటుంది."
"అబ్బ... నా కొద్ధండీ.... నా కిక్కడే బావుంటుంది."
"నేనుకూడా వీలు చూసుకుని అక్కడికి వస్తూంటాగా?"
"వద్దండీ....నే నిక్కడే ఉంటాను."
"అది కాదు, లీలా..... రెస్ట్ కావాలిగా నీకు?"
"రెస్ట్ కి నే చేసే పనేముంది లెస్తురూ!"
"పనంటే పనా? ఈ డోకులూ, వాంతులూ, అన్నం తినకపోవడం, నీరసం, దానితో తిక్క..."
లీల తీయగా నవ్వింది. "ఇవెన్నాళ్ళో ఉండవండీ. అసలా నాలుగయిదు నెలలు పోయేదాకా మా అమ్మ ఉన్నా, తీసుకెళ్ళేది కాదు. ఆ టైముదాకా ఇక్కడే ఉండి అప్పటికి మీ అక్కయ్యగార్ని రమ్మని ఉత్తరం రాస్తే సరి!"
* * *
ఏదో పని చేసుకుంటున్న లీల హఠాత్తుగా ప్రభాకరం వేసిన కేకలు విని, కాస్త తొందరగా ఇవతలికి వచ్చింది.
"లీలా...ఇటు రా!" అని కేక వేసిన ప్రభాకరం అంతలోనే కంగారుపడిపోయి, "అంత జోరుగా నడవ వద్దన్నానా?" అని కోపం తెచ్చుకొన్నాడు.
మెరిసే కళ్ళతో ప్రభాకరం వైపు చూసింది లీల.
అతని వెనకగా ఎవరో ఒక ఏభై ఏళ్ళావిడ చేతిలో ముతకగుడ్డ సంచీ పట్టుకొని నిలుచుంది.
"ఎవర్ని తీసుకొచ్చానో చూస్కో.... నీ కోసం" అని ఆవిడ వైపు వేలు చూపించాడు ప్రభాకరం.
"నమస్కారమండీ" అంది లీల.
"పసుపు కుంకుమలతో నూరేళ్ళు వర్ధిల్లు, తల్లీ."
"ఈవిడెవరండీ" అన్నట్టు చూసింది లీల.
"ఈవిడా, మా అమ్మా ప్రాణస్నేహితులు. ఒక ఊళ్ళో పుట్టి పెరిగినవాళ్ళు. ఆవిడ కొడుకుల్లో నే నొకన్ని, కాబట్టే మనింటికి వచ్చారు."
"మా ప్రభాకరం ఆపేక్ష అలాంటిది, తల్లీ. వాళ్ళకి నేను చేసిందేముంది కనక?" అంటూ విశాలమ్మ నిండుగా నవ్వింది.
"అందుకే...మా కెందుకుగానీ...మీ కోడలికి చేసుకోండి...మనవఁడు పుట్టి నడక నేర్చేదాకా మీ రిక్కడే ఉండాలి."
"అయితే మనవరాలు అక్కర్లేదా?"
"మీ ఇష్టం, మీ దయ. మీ మనఁవల్నీ మనవఁరాళ్ళనీ వదిలేసి వచ్చారు కనక మీ ఆశీర్వచనమే మాకు శిరోధార్యం."
విశాలమ్మ వెడల్పుగా నోరంతా తెరిచి నవ్వింది. లీల భుజ మీద చెయ్యి వేసి ఆమెని రెండు సార్లు తట్టింది. "చాలా అదృష్టవంతురాలిని, తల్లీ. మా అబ్బాయి రత్నం...నీ చక్కదనం, బాబు మంచితనం మీ పిల్లలకే వస్తే లోకం నందనవనమే అయిపోతుంది."
లీలకి ఏదో జ్ఞాపకం వచ్చి నవ్వింది.
'అలా నవ్వకు' అన్నట్టు సంజ్ఞ చేశాడు ప్రభాకరం, తానూ నవ్వుతూ.
"పాపం, కాలం కలిసిరాక ఈవిడ ఇలా అయింది గాని" అని ప్రభాకరం ఆవిడ స్నానానికి వెళ్ళగానే ఆవిడగూర్చి చెప్పడం ప్రారంభించాడు.
"కొడుకులూ, కూతుళ్ళూ లేరాండి?"
"అదే చెప్పబోయేది. ఇద్దరు కొడుకులున్నారు. శుభ్రంగా సంపాదిస్తారు. ధారాళంగా ఖర్చు పెడతారు. కాని పట్టుమని మూడు నెలలపాటు ఏ కొడుకూ ఈవిడకి తిండి పెట్టడు."
"ఒకవేళ ఈవిడకీ. కోడళ్ళకీ పడలేదేమో?"
"ఏ కోడలికి ఏ అత్తతో పడింది కనక....కాని ఆ విషయంలో ఈవిడ దేం పొరపాటు లేదు. నువ్వే చూస్తావుగా, ఈవిడ ఎలాటివారో!"
* * *
"అమ్మా" అని పెద్ద కేక పెట్టింది లీల. వంటింట్లో పని చేసుకుంటున్న విశాలమ్మ కంగారుగా గదిలోకి వచ్చింది. లీల పరుపుమీద పడుకుని ఉందన్న మాటే గాని కడుపుమీద చెయ్యి వేసుకొని ఒకటే చుట్టుకుపోతూంది.
"ఏమమ్మా పిలిచావా?"
లీల ఏడుస్తూంది. "కడుపులో! ఏదో చెప్పరానంత నెప్పిగా ఉందండీ. చూడండి, నాకేమైందో, ఇలా రండి... అబ్బా!"
విశాలమ్మ దగ్గరగా వెళ్ళింది.
"అరగంటైందండీ ఈ మాయదారి నెప్పి. అక్కడికీ రాత్రేం తినలేదు కడుపు నెప్పి వచ్చేవి, అమ్మా!" ఏడ్పు బాధలమధ్య అన్నది లీల.
విశాలమ్మకు క్షణంలో పరిస్థితి అర్దమైంది. నిన్న మంచంమీద ఒక జంబుకానా, దుప్పటి తలగడ అమర్చి, "ఒక్కసారి నువ్వు లేచి ఇటు రా, తల్లీ" అన్నది. "ఇది మామూలు నెప్పి కాదమ్మా....డాక్టర్ని తీసుకొస్తానుండు..."
లీల లేచి మంచం మారింది.
పెద్ద మంచంమీద దుప్పటి తీసి లుంగచుట్టి కిందని ఓ మూలకి విసిరేసింది విశాలమ్మ. యథాలాపంగా అటు చూసిన లీలకి, రంగు భయంకరంగా కనపడి సంగతి బోధపడింది.
'తనకి రక్త స్రావం అవుతూంది...' లీలకి భయంతో బాధ మరింత ఎక్కువైంది....ఆమెకు స్పృహ తప్పింది...
మొహంమీద తడిగుడ్డతో ఎవరో ఒత్తుతున్నా రన్న స్ఫురణతో లీలకి స్పృహ వచ్చింది..... కాని ఆమె నీరసంగా అయిపోయింది. 'చచ్చిపోతున్నప్పుడిలాగే అవుతుంది కాబోలు' అని ఒక ఊహాతరంగం ఆమె మెదడులో జారింది. కళ్ళు తెరవకుండా ఉన్నాయి. వినడమే తెలుస్తూంది.
"మరేం ప్రమాదం లేదు. నాలుగు రోజుల్లో మామూలు మనిషి అయిపోతుంద. నాలుగో నెలా అన్నారు?" అంటూంది ఎవరో పొరుగమ్మ.
"మీ రంతా తప్పుకోండి." ఆ కంఠస్వరం లేడీ డాక్టరు సుభద్రమ్మది.
"అమ్మా, సరిగ్గా చూడండి. ఏమాత్రం అవకాశం ఉన్నా జారిపోనివ్వకండి. మా బాబు గుండె పగిలి పోతుంది ఈ సంగతి వింటే. ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, నాయన!" విశాలమ్మ కష్టం అంతా తనకే వచ్చినట్టు దుఃఖిస్తూంది.
'తన కడుపులో బిడ్డ నీరైపోతూందా?....తన ప్రభాకరం ఆశ నీరై పోతూందా? తన ఆరోగ్యం నీటిమీద రాత అయిపోతూందా?..... అమ్మా....అమ్మా అని పిలవవలసిన జీవం పెదవి విప్పకుండానే, హృదయం ఏర్పడకుండానే హరించిపోతూందా?....మొగ్గ తొడగకముందే ప్రాణం రక్తమై, రక్తం నీరై ప్రవహిస్తూందా?....ప్రభాకరానికి తన మొహం ఎలా చూపించాలి?'
