Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 4

                                   
    "యెందుకు?"
    "నువ్వు నాతోనే మాట్లాడడం ఆవిడకు కష్టంగా వుంది. ఈ యింట్లో ఆ మనిషి విలువ గుర్తించని వాడివి నువ్వు. ఆవిడ అప్పుడప్పుడు అంటోంది, నాన్న తన గొంతు కోసినట్లు నా గొంతు మరొకరు కోసే తెలిసి వస్తుందిట.'
    'యెంత మాట అంది నిన్ను?'
    'తప్పేం వుంది? నాన్న యింతకన్నా తక్కువేవీ చేయలేదు. నీదారి నువ్వు చూసుకుంటున్నావు. అయినా నిన్ను నేను అనడం కూడా బాగు లేదు. యెవరి ఖర్మ వాళ్ళది.'
    శ్రీనివాస్ యిదేదీ అలోచించే స్థితిలో లేడు. ఆ పసి మనసు పూర్తిగాస్వాదీనం తప్పిపోయింది. ప్రస్తుతం వున్న ఆలోచనల్లో అతన్ని పూర్తిగా తన పరం చేసుకుంది  యీ ట్రైనింగ్ ఆలోచన -- సరస్వతి యేడుపు యేడుపు గానే మిగిలిపోయింది.

                           *    *    *    *
    'శ్రీనివాస్,' సుభద్ర చాలాకాలం తరువాత పిలిచింది. వొంచిన తల ఎత్తకుండా అలాగే కూర్చున్నాడు.
    "భోజనానికి రావయ్యా౧' సుభద్ర యేడాది వైవాహిక జీవితంలో ఆరిందా అయిపొయింది.
    "యిప్పుడు ఆకలిగా లేదండి,' అతనికి ఏకవచన ప్రయోగం నచ్చలేదు.
    'ఆకలిగా లేదండి! యేమాటయ్యా అది? నేను నీకు పిన్నిని-- నన్ను మన్నించడం ఛ! నాకే బాగులేదు. అయినా ఒకే యింట్లో యేడాది నుంచీ నేను వున్నాను అనే ధ్యాస నీకు లేదంటే ఆశ్చర్యంగా ఉంది కదూ?' సుభద్ర కంఠం కొద్ద్దిగా మారింది. 'ఈ యింట్లో నీ దృష్టి కి సరస్వతి తప్ప మరొకరు కనిపించరేమో? నాకూ అన్నయ్య లు వున్నారు. వదినలు రాని క్రితం జీవితం సరస్వతి కన్నా సుఖం గానే గడిపాను. కానీ, ' ఆవిడ మొహం చిన్నబోయింది.
    శ్రీనివాస్ కుతూహలంగా వింటున్నాడు అన్నా చెల్లెళ్ళ అపురూప బంధం మీద అతనికి యెంతో గౌరవం వుంది.
    'నాన్న యింత కన్నా మంచి సంబంధం తీసుకు రాలేకపోయారు. అందరి పట్లా జీవితం ఒకే విధంగా వుండదు, యింతకీ దురదృష్టం నాది.'
    'అంటే పిన్ని నవ్వు నటిస్తోందా?'
    ' మీ నాన్న నిజంగా తెలిసే చేశారో లేక కక్కుర్తి పడ్డారో తెలీదు. నన్ను చేసుకోవడం లో అయన మంచీ- చెడూ యేది ఆలోచించలేదను కుంటాను. రెండు సినిమాలతో నాలుగు షికార్ల తో కడుపు నిండిపోదు.'
    'యిప్పుడవన్నీ దేనికండీ.'
    'ఒక్క మాట అడుగుతాను నువ్వు నిజం చెబుతావా శ్రీనివాస్.'
    శ్రీనివాస్ తలెత్తాడు. అతనికి అదేదో వినాలనే ఉంది.
    'సరస్వతి కి కూడా మీ నాన్న యీడు మనిషిని, అనారోగ్యంతో శిధిలం అయి పోయిన వాడిని యేరి కోరి తెచ్చి చేస్తావా నువ్వే అయితే.'
    'పిన్నీ,' అప్రయత్నంగా అనేశాడు శ్రీనివాస్.
    'నీకు సుతరామూ యిష్ట వుండదు. మీ నాన్నకి అసలు ప్రాణం కొట్టుకు పోతుంది. అలాంటి తపన మా నాన్నకే వుంటే నాకన్నా పెద్ద కొడుకు వున్న మీ నాన్నకి యిచ్చి చేయక పోయేవారు!
    'నాకు అన్నం పెట్టండి పిన్నీ!' అంతటితో అపేయాలనుంది అతనికి ఆధోరణి.
    సుభద్ర వడ్డించేందుకు వెళ్ళిపోయింది. శ్రీనివాస్ కి యేవీ పాలుపోవడం లేదు.
    సుభద్ర కి చాలా సంతోషంగా వుంది. తను కాపురానికి కాలు మోపిన యిన్నాళ్ళ లో యేనాడూ యింత తృప్తి అనిపించలేదు. భర్తతో కేవలం యాంత్రికంగా గడిపేస్తోంది రోజుల్ని. తన వునికినే వైరాగ్యంతో మరచిపోయిన అతని సమక్షంలో జీవితం మరీ చేదుగా చాలా వెగటుగా వుంది. ఇరుగు పొరుగు యిళ్ళల్లో తన యిడు . ఆడవాళ్లు సాయంత్రం షికారుగా భర్తల వెంట రంగు రంగుల చీరలతో రకరకాల ఫాషన్లతో ముచ్చటగా ముస్తాబై వెడుతూ వెడుతూ తన వైపు వొక్కో చూపు విసురుతుంటే ఆ చూపులు నిజంగా వాడి బాణాల్లా వచ్చి సుభద్ర హృదయాన్ని ముక్కు లు చేస్తున్నాయి చీలికలుగా. తన ముద్దు ముచ్చట్లు తీర్చేందుకు గోపాలం యెందుకో ఆలోచించడు . జానకిని ప్రేమించి ప్రాణం పెట్టి, దారిద్ర్యం భరించ లేక ఎక్కడేక్కడో తిరిగే వాడని తను యెన్నో సార్లు విన్నది. ఆ ప్రేమను తను మాపుకోమని కానీ, తుడుచు కో మనిగాని అనగలదా? కాని నలుగురిలా తనకీ భర్త పక్కనే నలుగురి లోకి వెళ్లాలని, సినిమాల్లో నాయకీ నాయకుల్లా వుండాలనీ అమాయకంగా కోరుకోవడం లో సుభద్ర తప్పేమీ చేయలేదు. అది ఆత్యశని కూడా అనిపించలేదు.
    చాలాసార్లు సుభద్ర తండ్రి పుట్టింటికి రమ్మని పిలిచాడు. శ్రీనివాస్ యిప్పుడు ఆలోచించాడు ఆ మాటలు యింకా రింగు మంటూనే వున్నాయి అతని చెవుల్లో.
    'నాకూ ఇల్లు వుంది. నేను రాను. నువ్వు యేమీ అనుకోకు. నిన్ను బాధ పెట్టాలని కాదు. కొత్త పెళ్లి కూతుళ్ళ కి వుండాల్సిన వేడుకలు నాకేమిటి నాన్న'
    'అదేవిటి సుభద్రా నువ్వు కావూ?"
    'హు' సుభద్ర నవ్వింది. 'నేను కాకేం కొత్త పెళ్లి కూతుర్నే. నా దృష్టి లో అమ్మ యీడు వారు కూడా కొత్త పెళ్లి కూతుళ్ళే' సుభద్ర తండ్రి మరి యెప్పుడూ రావడం కానీ రమ్మని కబురు చేయడం గానీ చేయలేదు.
    సుభద్ర అన్న మాటల్లో యెక్కడా అబద్దం , అతిశాయోక్తీ లేవు. నిజానికి సుభద్ర తల్లీ జానకి వొకే యీడు వాళ్ళు కావడం లో ఆశ్చర్యం యేముంది?
    'మరి కొంచెం వేసుకోవోయ్ పెరుగు పచ్చడి . నీకు యిష్టం అని సరస్వతి అంది నాతొ.'
    'వొద్దు పిన్నీ నాన్నకి వుంచండి.'
    సుభద్ర నిట్టూర్చింది. గోపాలం ఈ మధ్య రాత్రిళ్ళు యింటి పట్టున వుండడం లేదు. అక్కడికి శ్రీనివాస్ తను చిన్నతనం నుంచీ యెరిగిన ఇళ్ళు వాకబు చేసి మరకొన్ని కొత్త యిళ్ళల్లో కూడా మాట వరసకి అడిగి తెలుసుకున్నాడు తండ్రి జాడ. గోపాలం అటువంటి చాయలకే రావడం మానుకున్నాడు.
    'నాన్న త్వరగానే వస్తారు. పిన్నీ నాకు తెలుసు నాన్న....నాన్న'
    'నన్ను మభ్య పెట్టడం యేవిటోయ్. మీ నాన్నకి నేను యెలా కనిపిస్తున్నానో?"
    శ్రీనివాస్ చెప్పేశాడు, 'అయన చాలా కాలం అయిపొయింది పిన్నీ అటువంటి యిళ్ళ చాయల కి వెళ్లి. అమ్మ పోయాక మీరు యీ యింటికి వస్తూ వస్తూ చేసిన మహో పకారాన్ని మరచి పోలేం. నాన్న పూర్తిగా మారిపోయారు. అయన రాత్రిళ్ళు యెక్కడో వుండడం లేదు . పురాణ సప్తాహం శివాలయం లో చేస్తున్నారు. అయన పని పెట్టుకుని అక్కడికే వెడుతున్నారు.'
    'మీరు అపోహ పడుతున్నారు. నాన్న చాలా మారిపోయారు.'
    సుభద్ర నమ్మలేనట్లుగా చూసింది.
    'ఒట్టు నన్ను నమ్మండి నిజం.' శ్రీనివాస్ అంటుంటే సుభద్ర చిత్రంగా చూసింది అతని వైపు. అప్పుడే అనిపించింది. బహుశా చిన్నప్పుడు గోపాలం యిలాగే వుండే వాడేమో? పద్దెనిమిదేళ్ళ వయసు దాటుతున్నప్పుడు నాజూకు కోసం అందరి మగ పిల్లలు మాదిరి, శ్రీనివాస్ చేస్తే ఆశ్చర్యం లేకపోయేది. చిత్రంగా పదేపదే చూడాలనిపించేది కూడా కాదేమో.
    కానీ శ్రీనివాస్ తన తల్లికి మహా యిష్టం అని చక్కని మీసాలు పెంచాడు. అవి గుబురుగా కాకుండా పై పెదవికి రెండు వైపులా పైకి లేచి సవాల్ చేస్తూన్నాయి. అతని అందాన్ని రెట్టింపుచేస్తూ.
    సుభద్ర మనసుని యెవరో కమ్చీతో కొట్టి లేపుతున్నారు. శ్రీనివాస్ వెడల్పాటి చాతీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది. రెప్పలు క్రిందికి దింపేసుకుని శ్రీనివాస్ అడిగే మజ్జ్జిగ కంచంలో వొంపేసి 'చూడు శ్రీనివాస్ నువ్వు యేవీ అనుకోకు. తలనొప్పి వస్తోంది వున్నట్టుండి . నీ భోజనం కూడా అయిపొయింది కద. మంచి నీళ్ళూ యింకా యేమైనా కావాలంటే సరస్వతి ని పిలుస్తాను.' అంటూ వెళ్ళిపోయింది.
    సరస్వతి రావడంతో శ్రీనివాస్ బాతాఖానీ కొడుతూ చాలాసేపు కూర్చుండి పోయాడు వంట యింట్లో నే.

                         *    *    *    *
    గోపాలం యింటి సందు చివర నుంచి రెండు వీధులు దాటితే భీమశంకరం యిల్లు వస్తుంది. భీమశంకరం గోపాలం చిన్నప్పటి నుంచీ స్నేహితులు. అంతేకాదు క్లాసు మేట్సు, యిప్పుడు కొలీగ్స్ . భీమ శంకరం భార్య గోపాలాన్ని 'అన్నయ్యా' అనే పిలుస్తుంది. అద్దం  లాంటి మనసు తోటి. అడపా దడపా భీమశంకరం యింటి కొచ్చి పొద్దు పోయేదాకా కూర్చుని మరీ వేడుతుంటాడు గోపాలం. అలాంటప్పుడు భీమశంకరం  అనేవాడు; చూడు గోపాలం మరీ ప్రొద్దు పోయింది. ఇక్కడే భోజనం చేసి వెళ్ళు' అని.
    పార్వతీ ఖచ్చితంగా అనేది: 'అన్నయ్యా నువ్వు వెర్రి వాడివి ఈయన వేసే ఎత్తు నీకు తెలీదు. నువ్వు కక్కుర్తి పడి కతి కేవు  కొంప ముంచీ, చచ్చినా అతకదు!
    "నీది వట్టి చాదస్తం పార్వతీ, సరస్వతి నాకు కోడలు కాకపొతే మరెవరికి గుండె లుంటాయి డాన్ని చేసుకుందుకి.'
    పార్వతి నవ్వి; 'భలేవారే, అన్నయ్యా యిది మరో ఎత్తు. నువ్వు మాత్రం భోజనం చేయకు. అయినా నీకు పెట్టేది నేను కదా,' అంటుంది.
    భీమశంకరానికి  కూడా తెలియని బంధం మరొకటి ఉంది.  పార్వతి ని అనురాగ హృదయంతో కట్టేసింది కూడా అదే. గోపాలం వరుసకి అన్నయ్యే అవుతాడు నిజానికి. కానీ సంఘం, మనుష్యులూ , కట్టుబాట్లూ, వీటి మధ్య ఆ బంధాన్ని గోపాలం పూర్తిగా మరిచే పోయాడు. కానీ పార్వతి యెప్పటికీ మరిచి పోలేదు. జానకిని దిక్కులేని వాళ్ళ శవాన్ని యీడ్చి పడేసినట్లు పడేశారని తెలిసిన రోజున గుండెలు అవిసి పోయేలా ఏడ్చింది నాలుగు గోడల మధ్య తనలో తనే కుమిలి పోతూ.
    కానీ భీమశంకరం యిటువంటి వాటిని లెక్క జేయ్యడు.అందుకే అటు మింగలేకా, యిటు పైకి కక్కలేకా ఆ బాధని కంఠం మధ్యే వుంచుకుంది పార్వతి. జానకి పోయి కూడా మూడేళ్ళు దాటి పోయాయి.
    భీమశంకరం రిటైరయ్యే సరికి గుంటూరు నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోయాడు స్వగ్రామానికి.
    సరస్వతి అప్పుడప్పుడు తల్లితో అనే మాటలు విని నవ్వుకునేది పార్వతి కి ఉన్న ప్రేమ గ్రహించి.
    'చూడు శ్రీహరి అత్తయ్య నాన్నకు యెన్ని సార్లు చెప్పేదో గుర్తుందా!' సరస్వతి నవ్వింది.
    అందంగా, ఆకర్షణీయంగా నవ్వితే మిలమిలాడుతూ యిట్టే కట్టేసే కళ్ళతో కిలకిల లాడే స్వరంతో సరస్వతి పురుషుణ్ణి బందీని చేసే అందాన్ని సంపాదించు కుంది.
    శ్రీవారి నవ్వాడు ప్రతిగా : 'అమ్మ వట్టి పిచ్చిది సరస్వతి. ఆవిడకి నిన్ను కోడలిగా చేసుకోవాలని దేనికి వుండేదో అర్ధం కాదు.'
    'అంటే?' చురుగ్గా చూసింది సరస్వతి.
    'అబ్బే నేను అనేది యేవిటంటే నీకు అందం చదువూ యేవీ లేవని తెలిసీ ఎలా వొప్పు కుందబ్బా అనే సమస్య.'
    సరస్వతి నేల మీద గీతులు గీస్తుండి పోయింది చాలాసేపు. సంధ్య చీకట్లు నాలుగు వైపులా కమ్మెందుకు సిద్దంగా వున్నాయి సరస్వతి కావాలనే పని గట్టుకుని శ్రీవారి రూమ్ కి వచ్చింది.
    శ్రీవారి చటుక్కున సరస్వతి వైపు తిరిగి కొంచెం నిర్ఘాంత పోయాడు. సరస్వతి కి యింతలోనే కోపం వస్తుందను కోలేదు. 'సారీ సరస్వతి నీకు కోపం వచ్చిందను కుంటాను.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS