జానకి వెలిగించి ఇచ్చిన దీపం పట్టుకొని సుందరమ్మ వంట ఇంట్లో కాలు పెడుతుంటే సూర్యారావు వీధి తలుపు తెరుచుకొని ఇంట్లోకి వచ్చేడు. ఆ దీపాన్ని అక్కడే వదిలి, "ఏమైందిరా? పండా, కాయా?' అంటూ వచ్చింది సుందరమ్మ.
తల్లిని, చెల్లెల్ని తెరిబార చూసి , "ఏలినాటి శని నా నెత్తెక్కి కూర్చుంటే, వెళ్ళిన పని పండేలా అవుతుందమ్మా ? కాయే"అన్నాడు సూర్యారావు నిస్పృహతో.
"ఏమన్నారేమిటి? సుందరమ్మ దిగులుగా ప్రశ్నించింది.
"ఏమంటారు! మన సంబంధం వాళ్ళ కక్కర లేదుట. మన పిల్లని భార్యగా ఏలుకొనే కంటే బ్రహ్మచారిగా ఉండడమే అతనికి నయమట."
"మనం ఏమంత విషం పోసేమురా! కాళ్ళు కడిగి కన్య నిచ్చినందుకా?"
"సూర్యారావు తల్లి మాటకు జవాబు చెప్పలేదు. క్షణ కాలం జానకి వైపు రెప్ప వేయక చూసి, "పెళ్లినాటి రాత్రి నువ్వు స్టేషను కు వేళ్ళేవా?" అని ప్రశ్నించేడు.
"అతడు చెప్పేడా?" జానకి నిదానంగా అడిగింది.
"ఎవరో ఒకరు చెప్పారు గాని , ఎందు కెళ్ళేవు?"
"అతని బుర్రలో మన్ను కాక ఇంకే పదార్ధం అయినా ఉందేమో చూసి రావడానికి."
"జానకీ! ఏమిటా మాటలు?' సుందరమ్మ కసిరింది.
"అవునమ్మా! ఈమాట అడిగిందికే వెళ్ళెను. మీ తండ్రి అన్నదాని కల్లా గంగిరెద్దు లా బుర్ర ఊపడమేనా , లేక మీ ఆలోచన ఏమైనా మిగిలి ఉందా? అని అడిగెను. ఈ పెళ్ళి విషయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా కాస్త అలోచించి చెయ్యమని చెప్పి వచ్చెను. తప్పా?"
"తప్పా.... తప్పున్నారా? దానికి వాళ్ళు చిలవలు పలవలు అల్లి, నీ చెల్లెలు కులట అన్నారు. అలాంటి ఆడది మా ఇంట్లో ఉంటె, మా వంశం లో ఉత్తర గతులు ఉండవన్నారు. దానికి రాత్రి షికార్లు అలవాటే అయి ఉంటుంది. ఆరోజు దాని ఖర్మ కాలి మావాడు కనిపించేడు. ఆ చీకటిలో పోల్చుకోలేక పోయి ఉంటుంది. తీరా ఎదుట పడ్డాక నీతిశాస్త్రాలు ధర్మ శాస్త్రాలు బోధించింది అన్నారు. ఇంకా నేను చెప్పలేనివి, మీరు వినలేనివి....' సూర్యారావు ఆవమానంతో తల దించుకొన్నాడు.
సుందరమ్మ ఏ భావం వేలిబుచ్చని కూతురి ముఖం లోకి చూసింది. మొగుడు వదిలి బ్రతుకు బండలయిందని విన్నా కంట తడి పెట్టదెం ఇది? అనుకొంది. ఈ కాలం పిల్లల అహంకారం వీళ్ళను ఎక్కడికి లాక్కు పోతుంది భగవంతుడా -- అని వాపోయింది.
ఉన్నట్లుండి సూర్యారావు లేచి చెల్లెలి భుజం పట్టుకొని, "జానకీ! నీకాపురం , నా పరువు నిలిచిందికి ఒక పని చెయ్యగలవా?"అన్నాడు.
"ఏమిటది?" నిర్లిప్తంగా ప్రశ్నించింది ఆమె.
"నేను నీ అత్తవారిల్లు వదిలి వస్తుంటే, ఆ సందు చివరలో మీ పినమామ గారి కోడలు కనిపించింది. ఏమన్నారని ప్రశ్నించింది. వారన్నది చెప్పెను. జరిగిన దానికి ఆవిడ చాలా బాధపడ్డాది. నీ కాపురం సూటి పడడానికి ఒక సలహా చెప్పింది. కాస్త ఆలోచించి చూస్తె అది ఫలిస్తుందనే అనిపిస్తున్నది నాకు."
"ఇంతకీ ఏమిటా సలహా?"
"నిన్ను పసుపు కుంకం పెట్టి తీసుకెళ్ళి వారింట దిగవిడవమంది. నాలుగు రోజులు మనసూ, ఒళ్ళూ నీది కాదనుకొంటే అన్నీ సర్దుకు పోతాయంది. నిజానికి ఆవిడ కాపురం కూడా అలాగే సూటి పడిందిట. 'పైకి పంతాలే కాని, లోపల అంత కథినులు కారు వీళ్ళు, అన్నగారూ"అన్నది."
'ఛీ! " మనసులోంచి చీత్కారం చేసింది జానకి.
కూతురు ముఖ కవళికలను క్షణ కాలం పరిశీలనగా చూసింది సుందరమ్మ.ప్రపంచంలో ఎంత హేయమైన వస్తువును చూసినా, ఎంత అసభ్యమైన మాట విన్నామనిషి అంతకన్న ఎక్కువగా తన జుగుప్స ను చూపలేడు అనుకొంది.
కొడుకు అన్నమాటఅంత తేలిగ్గా కొట్టి వెయవలసినది కాదనుకొంది. పిల్ల కళ్ళేదురుగా ఉంటె వాళ్ళపట్టు పంతాలు చల్ల బడవచ్చు. ఆడపిల్ల ఈరోజు కాకుంటే మరో రోజైనా అత్తారింటికి వెళ్ళవలసిందే కదా? అవాంచితమైన ఈ స్పర్ధలు ఇంకా పెరక్కుండా వెంటనే వెళ్తే మంచిదని భావించింది.
"ఏమంటావే జానకీ?అన్నయ్య అంటున్నట్లు ఒకసారి వెళ్ళి రాకూడదూ?' అన్నది.
"నేను, వెళ్ళను. " నిశ్చలంగా సమాధానం చెప్పింది జానకి.
"ఏం? ఎందుకు వెళ్ళవు? ఎల్లకాలం పుట్టింట్లో కూర్చుంటావా? పెళ్ళయేక ఆడదానికి పెట్టినా, తిట్టినా మగడే గతి. అత్తింట ఉంటేనే అందం. ఆదరం. వాళ్ళు మాత్రం మనుషులు కారూ? నిన్ను చంపుకు తింటారా? ఓమాట ఒదెబ్బ పడకుండా ఏ ఆడదానికి గడిచిందెం?"
"ఎందుకు వెళ్ళనా , అమ్మా? అతన్ని పెళ్ళి చేసుకొన్నది చావుదెబ్బలు తినిందికి, గొడ్డు చాకిరీ చేసివారు పెట్టె ఎంగిలి మేతుకులు తినిందికి కాదు. ఆపాటి ఓర్పు చూపిస్తే , ఆపాటి చాకిరీచేస్తే నా పొట్ట నిండక పోదు. ఆడది పెళ్ళి చేసుకొంటూన్నది తిండికోసం కాదు. అవమానాలూ, అగచాట్లూ పొందుతూ కూడా కొందరు స్త్రీలు వభర్తలని వదల లేకపోతున్నారంటే పట్టెడు మెతుకుల కోసం కాదు. ఈ విషయం మగాళ్ళు గుర్తించి , తమ అహంభావాన్ని ఒక డోసు తగ్గించుకొని, స్త్రీని గౌరవంగా సాటిమనిషిగా చూడగలగడం ఎంత త్వరలో నేర్చుకుంటే అంత మంచిది."
పెళ్ళి చేసుకున్న స్త్రీ అత్తింటికి వెళ్ళడంలో గౌరవ గౌరవాల ప్రసక్తి ఎక్కడ వచ్చిందో సుందరమ్మకు అర్ధం కాలేదు. భర్త రక్షణ కింద ఉండడం కంటే ఆడదానికి కావలసిన గౌరవమేమిటి? అనుకొంది.
చెల్లెలి మాటలు వినిక్షణ కాలం నిరుత్తరుడయేడు సూర్యారావు. అంతలోనే తేరుకొని, "జానకీ! ఇది ఆవేశాలకి, పట్టు పంతాలకి లొంగి పోవలసిన సమయం కాదు. కాస్త నిదానంగా ఆలోచించు" అన్నాడు.
"ఇందులో ఇంక ఆలోచనకేం లేదన్నయ్యా! మనస్పూర్తిగా నమ్మే చెపుతున్నాను. అయన అన్న ఒక్క మాటతో మాత్రం నేనేకీభవిస్తున్నాను. ఇష్టం లేని భార్యతో కాపురం చేసే కన్న బ్రహ్మచారిగా ఉండడం నయం అన్నారు అయన. ఆడదానికీ, ఆ మాటే వర్తిస్తుంది. నాలుగు రోజులు పాటు మనసు, ఒళ్ళు నాది కాదనుకొందికి నేను జడ పదార్ధాన్ని కాను, అన్నయ్యా!
"ఎప్పుడైనా జీవితంలో అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితే ఏర్పడితే నా అంతట నేను వెళ్ళగలను. పసుపు, కుంకం పెట్టి దిగవిడిచే శ్రమ నీకక్కరలేదు. కన్నె తాడు పట్టుకుని దిగవిడిచి వచ్చిందికి నేను మీ ఇంట పుట్టిన పాడి అవును కాను. మీరు సొమ్ము పెట్టి కొన్న బానిసను అంతకన్నా కాను." మాట పూర్తీ చేస్తూనే విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది జానకి.
తల్లి ముఖం చూసేడు సూర్యారావు.
"ఈ ఆవేశం తగ్గితే కాని దానికేం చెప్పినా అర్ధం కాదు" అన్నది సుందరమ్మ.
