Previous Page Next Page 
మారిన విలువలు పేజి 4

 

    రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారిపోతున్నా జానకి అత్తవారి మనోగతం అర్ధం కాలేదు. రమణయ్య గారి ఆరోగ్యం కుదుట పడలేదు. అల్లుడి అలుక తీర్చేందుకు అప్పుగా తెచ్చిన సొమ్ము మామగారి మందులకు పనికి వచ్చింది. తెలిసిన డాక్టర్ని తీసుకు వచ్చి చూపించేడు సూర్యారావు. అతడు మార్చి మార్చి మందులు ఇస్తూనే ఉన్నాడు. గుణం మాత్రం కనిపించటం లేదు. "ఇది మనోవ్యాదండి, మందుల కేం లొంగుతుంది?' అన్నారు కొందరు.
    "ఏమిటి చికాకు? ఎలా మొదలైంది ఈ జబ్బు" అని ప్రశ్నించేవారు చూడ వచ్చిన వాళ్ళంతా.
    "వియ్యలవారిని ఎదురు కొందికి స్టేషను కెళ్ళి అక్కడ ముఖం తిరిగి పడిపోయారండీ. అప్పటి నుండి ఇలాగే ఉంది. లేస్తే కళ్ళు తిరుగుతున్నాయంటారు. ఏమి తిన్నా ఇమడదు. మనిషి రోజురోజుకి నీరసించి పోతున్నారు. ఏం జబ్బో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇదంతా మా ఖర్మండి. మా రోజులు బాగాలేవు. అత్తారింట సుఖంగా కాపురం చేసుకోవలసిన ఆడపిల్ల గుండెల మీద కుంపటి లా ఇంట్లో కూర్చుందా? పైగా ఈయనకి ఈ మాయ జబ్బా? నేను ఆడదాన్ని ఏడవటం తప్ప ఏం చెయ్యగలను" అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకొనేది సుందరమ్మ.
    సుందరమ్మ ఈ మాటలు చెపుతుండగానే ఒక ఏడాది ఈ కొసనుండి ఆ కొసకు నత్తలా నడుచుకొంటూ వెళ్ళిపోయింది. రమణయ్య గారి స్థితి ఏం మారకపోయినా ఇంట్లో ఆర్ధిక పరిస్థితి మాత్రం తల్లక్రిందులయింది. సూర్యారావు జీతం నూట పాతిక రూపాయలు ఆ ఇంట్లో వాళ్ళ జీవనానికి ఆధారంగా నిలిచింది. ఇల్లు గడవాలి; పిల్లల చదువులు సాగాలి. తండ్రి సలహా పై జానకి టైపు , షార్టు హేండు పరీక్షలకు కట్టింది. "ఈ పరీక్షలు పాసై ఏదేనా ఉద్యోగం దొరుకుతే అన్నయ్యకు కాస్త ఆసరాగా ఉంటావమ్మా' అన్నాడు తండ్రి.
    రమణయ్య గారు మంచాన పడ్డ తరువాత అయన జబ్బు గురించి , ఇంటిపరిస్థితి గురించి వియ్యాల వారికీ నాలుగైదు ఉత్తరాలు వెళ్ళాయి. ఒక్కదానికీ వారి దగ్గరి నుండి జవాబు రాలేదు. ఒంట్లో బాధకు మనోవ్యాధి తోడు కాగా రోజురోజుకు దిగజారిపోసాగేరు రమణయ్య గారు. నోట్లోంచి మాట బయటపడడం కష్టంగా ఉంటున్నా, జానకిని చూసేసరి కల్లా , "నీ కన్యాయం చేసెనమ్మా!నన్ను క్షమించు, తల్లీ!" అని గోనుక్కొనేవారు.
    "మీరంత మాట అనకండి , నాన్నా! మీరు నాకు మేలే చేసేరు. వాళ్ళు కోరినంతా ఇచ్చి నన్ను అంపకం పెడితే మానవత్వం లేని ఆమనుష్యుల మధ్య నేను నలిగి పోయి ఉండేదాన్ని. జరిగిందేదో మన మంచికే జరిగింది." అని తండ్రిని ఓదార్చేది జానకి.
    తల్లిని, నలుగురు తోబుట్టిన వాళ్ళను , రెండు వేల అప్పుతో మునిగిపోతున్న ఇంటిని సూర్యారావుకు అప్పగించి ఒకనాటి అర్ధరాత్రి కన్ను మూసేరు రమణయ్య గారు. ఆఖరిసారిగా కన్నుమూత పడేవరకు అతను జాలిగా జానకి వైపు చూస్తూనే ఉన్నారు. "నాకోసం మీరు బాధపడకండి నాన్నా. నాకు మీరు చేసిన అన్యాయం ఏం లేదు." అని జానకి తన చూపులతో ఓదారుస్తూనే ఉంది. అన్ని వేదనలకు అయన అతీతంగా వెళ్ళిపోయేక, తండ్రి మనసును అంతగా బాధపెట్టిన కారణాన్ని తలుచుకొని కుమిలిపోయింది జానకీ.

                                                 *    *    *    *
    ఇరుగు పోరుగిళ్ళలో దీపాలు వెలిగేయి. సంధ్య పడినా, నేల ఇంకా చల్లబడలేదు. ఎండ వేడికి కాలిన గోడలు, గచ్చులు ఆవిర్లు కక్కుతున్నాయి. దక్షిణ తెరపి నుండి వచ్చిన ఆ కొద్ది గాలి కూడా గాడ్పునే  మోసుకు వస్తున్నది. "ఈ ఏటి ఎండలు పుట్టి, బుద్దేరిగి ఎప్పుడూ చూడలేదు" అన్నారు ముసలివారు. వరుసగా నాలుగేళ్ళు వేసవికాలంలో వారి దర్శనం చేసుకొంటే ,వారి నోట ప్రతి ఏడూ వింటాము. తెల్లవారితే పరగడుపు అన్నట్లు ఎప్పటి కప్పుడే కొత్త వారికి.
    నిత్యం చేసే పనులకే కొత్త ఆలోచనలు పులుము కొంటూ, కొత్త అనుభవాలను ఆఘ్రాణిస్తూ ఆనందించడమే జీవితం. పదినెలల వయసు నుండి తింటున్నా,  తిండికోసం ఉరుకులు పరుగులుగా మనిషి కష్టిస్తున్నాడంటే ,విసుగు, విరామం లేకుండా ఏ పూట కాపూట ఆసక్తితో ఎదురుచూస్తూన్నాడంటే మానవుని లో పాటలో కొత్తను ఊహించి ఆనందించే మనస్తత్వమే దానికి కారణం. ఈరోజు నిన్నటికి భిన్నంగా ఉంటుందని ఆశతో ఎదురుచూసే ఒర్పే మానవులకు లేకపోతె మనదేశపు జనాభా లెక్కల్లో అంకెల స్థానాలు చాలా వరకు దిగబడి ఉండేవి.
    అటువంటి ఆశతోనే వియ్యాల వారింటికి వెళ్ళిన కొడుకు రాకకోసం ఎదురు చూస్తున్నది సుందరమ్మ. భర్తను కోల్పోయిన సుందరమ్మ కు పిల్లలే పట్టుకొమ్మలు. వారంతా సుఖంగా పిల్లా, పాపతో బ్రతుకులు వెళ్ళదీయాలని ఆవిడ కోరిక.
    కోరిక  లెప్పుడు ఉన్నాయో బాధలు అప్పుడే పుడతాయి. తీరని కోరికలే బాధలు. మనిషి వీటికి లొంగి పొతే జీవితాంతం వ్యధలను కొని తెచ్చుకున్నట్లే . ఈ కోరిక తీరితే సరి- అన్నమాటకు అర్ధం ఉండదు. సాగరం లో కెరటం లా ఒకటి తీరితే దాని స్థానాన్ని ఇంకోటి ఆక్రమించుకొంటూనే ఉంటుంది.
    ప్రస్తుతం సుందరమ్మ కోరిక జానకిని సలక్షణంగా అత్తవారింటికి పంపివేయాలని. ఇది తీరేదాకా ఇంకో కోర్కేకు ఆమె మనసులో చోటు లేనంత పెద్దగా అక్రమించుకోంది ఆ బాధ్యత.
    వాకిట్లో దీపాల్లో చమురు పోస్తున్న జానకి కూడా అన్నగారి కోసమే చూస్తున్నది. రెండు మూడేళ్ళు గా సాగుతున్న ఊగులాట ఆరోజుతో తీరిపోవాలని ఆమె కోరుకుంటున్నది. అతడు తన మెడలో తాళి కడుతున్నప్పుడు తన జీవితం ఇలా అవమానాలకు, పరిహాసాలకు పాలవుతుందని ఆమె అనుకోలేదు. పెళ్ళి చేసుకొని అత్తింట కాలు పెట్టిన అనేకులు ఆడపిల్లలలో తనూ ఒకతేగా కాలం వెళ్ళి పోతుందని ఆశించింది. అంతకన్న జీవితంలో ప్రత్యేకత ఆశించే అవకాశం కాని, ఆశలు కాని ఆనాడు ఆమెలో లేవు.
    ఆదిలోనే హంసపాదు అన్నట్లు, మూడు ముళ్ళు తిన్నగా పడకముందే ఆమె వైవాహిక జీవితం ఒడుదుడుకుల పాలయింది. ఆ చిక్కుముడి ఆనాటి నుండి రోజురోజుకు బిగుసుకు పోతూ ఉండిపోయింది. దాన్ని బిగతీయడమో,విడతీయడమో ఆనాటి అన్న రాకతో తేలుతుందని జానకీ నిరీక్షిస్తున్నది.
    ఇంటి నిండా చీకటి పెరుకొన్నా ఇంకా జానకి దీపాలు వెలిగించలేదు."వాకిట్లో దీపం వెలిగించకుండా చీకట్లో ఏమిటి చేస్తున్నావే?" కూతుర్ని ప్రశ్నించింది సుందరమ్మ.
    "లాంతర్లు తుడుస్తున్నానమ్మా. ఈ రేషను మూలంగా ఏం చమురు పోస్తున్నారో గాని, వత్తి ఇట్టే బొడ్డు కట్టి చిమ్నీ మసి పారిపోతున్నది.ఎంత తుడిచినా తేటు రావడం లేదు." అన్నది జానకి చేతిలోకి అగ్గిపెట్టె తీసుకుంటూ.
    "అరగంటసేపయింది అక్కడ కూర్చుని. ఇంకా చిమ్నీలు తుడవడమేనా? సంధ్య పడేసరికి వాకిట్లో దీపం పెట్టుకోవాలనే దృష్టే ఉండదు. ఏం పిల్లలో!" అన్నది సుందరమ్మ విసుగుతో.
    "పోనీలే అమ్మా! ఇప్పుడు మించిపోయిందేం లేదు. ఎంత ఆలస్యంగా వెలిగిస్తే అంత మంచిది. కాస్త చమురేనా మిగులుతుంది" అన్నది జానకి నవ్వుతూ.
    "మరేం! మన బుద్దులు ఇలా ఉండబట్టే నెత్తి శని నాట్యం చేస్తున్నది. ఇంటి వాళ్ళ బుద్దుల్లో జేష్టాదేవి వాసం ఎర్పరచుకున్నాక, కాలం కలిసి రమ్మంటే ఎలా వస్తుంది? నే చెప్తున్నాను చూడు. వాడు చేతులు ఊపుకుంటూ తిరిగొస్తాడు" అన్నది సుందరమ్మ కొడుకు రాకను మనసులో పెట్టుకొని.
    "కాలానికి మనం అంటే పగెందుకుంటుందమ్మా! ఒకవిదాన కాకుంటే ఇంకో విధాన అనుకూలిస్తుంది" అని చెప్పాలను కొంది జానకి. తనకు బాల విహార్ లో వచ్చిన ఉద్యోగం గురించిన వార్త ఆమెకు అంద చెయ్యాలను కొంది. కాని ఆనాటి అన్న తెచ్చే సమాధానం పై తను ఉద్యోగం చేసేది, మానేది ఆధారపడి ఉన్నది. అదేదో తేలేకే చెప్పచ్చని ఊరుకోన్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS