
'యుద్ధం రాబోతుంది, అన్న పదంతి పుట్టీ పుట్టక ముందే వున్న ఆస్తీ, పాస్తీ , సొమ్ము చేసేసుకుని అలా ఒచ్చేసిన కుటుంబాలేన్ని లేవని వదినా, అలాంటిది తీరా ఆ యుద్ధం రావడం స్థిరమని తెలిశాక 'మనమూ వెళ్ళిపోదాం , పదండీ' అంటూ నేనెంత తొందర చేసినా, విన్నారా? 'మీ వాళ్ళు పెద్ద వాళ్ళ నొదిలేసి మనం మాత్రం అలా వెళ్లి పోవడం తప్పు కాదా. అంతా ఎకంగానే వెళ్దాం' అంటూ వాళ్లతో లంకె పెట్టుక్కూర్చున్నారు. సరి ఇంక మా నాన్నా? డబ్బుకీ, అయన ప్రాణానికీ లంకాయే. 'వున్నవేవో అయిన కాడికి అమ్మేసి వెళ్లి పోదామో' అని అమ్మ ఎంత మొత్తుకున్నా, ఆయనకి మన సోప్పితేగా?' ఇదుగో అదుగో ' అంటూనే బెరాల్జారుపుతూ వూర్కున్నారు. ఇంతలో జపాను వాళ్ళు నెత్తి మీదికి రానే వచ్చారు.' అంది. ఒకే కూతురన్న వెర్రి అభిమానం కొద్దీ, వాళ్ళున్న దేశానికే అల్లుడ్ని రప్పించేసుకోవడమే గాకుండా తన ఇంట్లోనూ, తన భర్త విషయం లోనూ కూడా, వారి ఏర్పాట్లే నడిపిస్తూ ఎందుకూ తనకి స్వేచ్చా స్వతంత్రాలు లేనిదానిగా చేసేసారు. తన తల్లి తండ్రులన్న కోపం జానకి కెప్పుడూ వుండేది.
'ఆ? ఇవన్నీ నిమిత్త మాత్రాలు జానకీ, విధి ఎలా ఉందొ!' ఆ ఖర్మ ని బట్టే కర్తకి, బుద్దులూ తోపిస్తాడా భగవంతుడు. అంతే' అన్నారు సర్దుబాటుగా పార్వతమ్మగారు.
'అది విధి కృతమో స్వయం కృతమో , ఏ రాయి తగిలి గాయం పడ్డా బాధ ప్రాణానికొకటేగా వదినా?
'లక్షలాదీ ఖర్చు పెట్టి స్వయంగా కట్టించుకున్న ఆ మెడతో సహా సర్వ నాశనం అయిపోయారు కదా, ఆ వెధవ ఆస్తి కోసరం ఆగడం వల్ల.... ' దుఖం గొంతుక్కడ్డి , నాలుక పిడచకట్టుకు పోవడంతో మొండి మొండిగా వచ్చాయి మాటలు జానకికి.
'ఏవిటీ ? మీ అమ్మా నాన్నా అంతానా?' గోడకి చేరుకున్నవారల్లా దబ్బున ముందుకి వంగుతూ, ఆశ్చర్యంతో అడిగారు పార్వతమ్మ గారు.
'ఆ. వాళ్ళ పెంపుడు కుక్క ఒక్కటి మినహా అంతా ఆ బాంబులకి ఆహుతై పోయారు. ఆ కుక్క కూడా రంగూన్ సరిహద్దుల్ని దాటి రాకుండానే పోయింది చివరికి' శూన్యం లోకి చూస్తూ అంది జానకి.
'రామ రామ, ఎంత సంపాదనా, ఎంత ఆస్తీ , హు.'
'నే కడుపులో వుండగా, కట్టుబట్టల్తో ఒక నాటు కోటు సెట్టి సలహా మీద అక్కడికి వెళ్లిన వాళ్ళు కొన్ని లక్షల కదికార్లయ్యారుట. పోనివ్వండి వదినా మధ్యలో వచ్చిన సిరి మధ్యలోనే మాయమై పోయిందను కుందాం, అయితే దాంతో కూడా మనుషులు కూడా పోవాలా చెప్పండి?'
'అదేగా అనుకోవడం!' ఇంతటి విషాదకరమైన విషయాన్ని ఏదో మామూలు మాటల్లా చెప్తున్న జానకిని చూసి 'దీనికి ధైర్యం ఎక్కన్నుంచోచ్చిందా?' అనుకుంటూ, అన్నారు.
'దీని కెంత బెంగ లేదూ.' అనుకుంటున్నారేమో. మరి ఔను వదినా. కలలో కూడా ఒకరి కీడు కోరడమో, ఒక అబద్ద వాడ్డవో! ఎరగని ధర్మమూర్తి మీ తమ్ముడి మీదే దైవం ఇంత పగ సాధించినప్పుడు , ఎన్నెన్ని మాయలో చేసి ఎలగెలగో సంపాదించి చేసుకున్న మా వాళ్ళ నిర్వాకం కోసరం , వాళ్ళ కోసరం బాధపడడ్డం దేనికీ చెప్పండి?' కల్మష మంటే ఏవిటో ఎరగని హృదయం గల జానకి తన మనసులో వున్నదున్నట్లు పైకి చెప్పేసింది.
'అయ్యో ఇంతటి యోగ్యురాలికా ఇన్ని కష్టాలు...అనుకున్నారు' పార్వతమ్మ గారు.
'అందుకే ఆరోజు ఉదయంజరిగిన జపాను విమాన దాడి బాంబులో , మావాళ్ళున్న పేటంతా సర్వనాశనం అయిపోయిందని తెలిసినా తీరా మమకారం కొద్ది బయల్దేరి దార్లో వుండగా మళ్లీ ఏ అపాయ శంకమన్నా ఊదిందంటే ఎన్ని ఘంటల కాలం మళ్లీ ఆ పల్లాల్లో దిగిబడి తలదాచుకో వలసోస్తుందో! ఈ లోగా నా గురించి మీ తమ్ముడెం బెంగ పడతారో! అనుకుని ఆ ప్రయత్నం మానేసి ఉన్న విలువైన నగలేవో మూట గట్టుకుని మీ తమ్ముడి గారి క్షేమం కోరి వెయ్యి దేవుళ్ళ కి మొక్కుకుంటూ అయన రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను.
దైవవశాత్తూ ఆరోజు ఇండియా కి బయల్దేరుతున్న వారు చాలామంది వున్నందున వారితో కలిసి మేమూ----'
'వోడలోనా?'
'వోడలోనా , ఇంకా నయం. ఏడాది ముందు నుంచీ ప్రయత్నిస్తే కూడా అప్పుడు వొడలో జాగా ఎక్కడిదీ. ఎక్కడ ఎలా వీలైతే అలాగ ముందుకు సాగిపోతుండడమే? కోరీ కొనుక్కున్న ఆ బంగళా! ముచ్చటపడి కొనుక్కున్నా సామాన్లూ అన్నీ అలాగే వదిలేసి ప్రాణాల మీది తీపి కొద్ది బయల్దేరి వచ్చేశాం. అయితే, అయితే , అ ప్రాణాల్ని మట్టుకూ కాపాడుకోగల్గామా?' బాధతో గొంతు పూడుకు పోవడం వల్ల కాస్సేసాగింది.
'తను మునుముందు వినబోయేది ఎరిగున్న విషయాలే అయినా ఎందుకో పార్వతమ్మ గారి గుండెలు దడదడా కొట్టుకో సాగాయి.
'రెండు నెలల పాటు చెప్పుకో దగ్గ పెద్ద ఇబ్బందు లేమీ లేకుండా ప్రయాణం సాగించాం.'
'మరి తిండి తిప్పలూ --'
'హు. భయం గూడు కట్టుకు పోయున్న కడుపులకి ఆకలీ, దప్పికా , అంటూ ఒకటి తెలసోచ్చేదా? నీరసంతో నిస్పృహ లయ్యే దాకా బడలికంటూ తెలిసోచ్చేదా? ఊహు. దొరికిన సరుకుల్తో ఏదన్నా నిలవ ఆహారాన్ని తయారు చేయించి దార్లో అక్కడక్కడా, సప్లయి చేస్తుండేవారు. మావంటి ప్రయాణికుల కోసరమని ఏర్పాట్లు చేసిన కొన్ని కొన్ని విడుదుల్లో . అలాంటి చోట్ల ఇచ్చిన ఆ చద్దో, వేడో రుచీ, పచీ అనకుండా ప్రాణం నిలబెట్టుకుందుకేదో ఇంత తినడం , సైరెన్ మోత వినిపించగానే ఆ చుట్టుపట్ల దగ్గరగా వున్న సారంగాలలోకి దిగడం, ఆ అపాయం తొలిగి పోగానే మళ్ళీ ముందుకు సాగిపోతూ వుండడం, ఒక్కొక్కసారి, నీళ్ళూ , బురదగా వుండే ఆ గోతుల్లో కొన్నేసి గంటల కాలం కూడా ఉండవలసిచ్చేదేమో. మొదట్లో వంట్లో కొంత పటుత్వం వున్నందున అల వుండడం అంతగా బాధనిపించేది కాదు గాని పోను పోను నిస్త్రాణ ఎక్కువై పోవడం, అందుకు తోడు బలుపు రోజులవడం , అబ్బ, నేపడ్డ బాధ ఆ దైవానికే ఎరకను కొండి?'
'ఇంకా మెల్లిగా అంటున్నావా తల్లీ. వింటుంటేనే నా ఒళ్ళు జలదరించీ పోతుంది.' అన్నారు ఒళ్ళు జలదరించుకుంటూ పార్వతమ్మ గారు.
'అసలలాంటప్పుడు కొత్త కొత్త రకాల రోగాలన్నీ కూడా పట్టుకుంటా యంటా యంటారు.'
'ఆహా అలాంటి వ్యాధుల వల్ల నైతే నెం, ఆకలి బాధల వల్ల నైతేనేం , నలభై మంది బయల్దేరితే రెండు నెలల కల్లా పన్నెండు గురం మిగిలాం. అందులోనూ....' ఆ పైని చెప్పలేక మొహానికి పమిటే చెంగు కప్పేసుకుంది జానకి, ఉస్సురని బలంగా నిట్టురుస్తూ తలొంచుకున్నారు పార్వతమ్మ గారు.
'పిల్లల్ని బలిచ్చేసిన తల్లి తండ్రులు, తల్లి తండ్రులని గోల్పోయిన పిల్లలు , ఎంత దగ్గర బాంధవ్యాన్నయినా ఆ కాస్త ప్రాణం పోయేసరికి ఆ ప్రేమా పాశాల్ని బలవంతంగా తెంచేసుకుని, ఆ శరీరాల్ని కాకులకీ, గద్దలకీ వదిలేసి ముందుకు సాగి పోతుండడమే కదా. ఒకట్రెండు సార్లు ఇంకా కొన్ని గంటల కాలం జీవం వుంటుందన్న వార్ని కూడా అలాగే వదిలి పారిపోవాల్సిన దుర్గతి కూడా పట్టేది వదినా.'
'అలాంటప్పుడు తగిన వైద్యం చేస్తే మళ్లీ బతికిన వాళ్ళెంత మంది లేరు వాళ్ల దురదృష్టం కొద్దీ ఆ సమయం అటువంటిదై పోబట్టి గానీ.' వేదాంత ధోరణిలో అన్నారు పార్వతమ్మ గారు.
'అదే ఆ తల్లితండ్రుల గోల కూడా. ఇంతకీ లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించ గల్గె మహారాజులు వాళ్లు అయితేనేం. పరిస్థితి అటువంటిదై పోయింది మీరన్నట్లు.
'హు. ఇంతకీ ఆ భగవంతుడు ఎవరి ప్రాణం మ్మీద వారికంత తీపి పెట్టాడు. అలా లేకుంటే బతికి బట్టకట్టి వారి వారి పాప పుణ్య ఫలాల్ని వారనుభావించడమన్నది ఎలా జరుగుతుందని.'
'నిజం చెప్పోవొదినా. ఎవరో ఎందుకూ అందుకు ఉదాహరణ కి ఇదుగో నేనే వున్నానుగా. ఏదో దైవ కృప వల్ల గడ్డు దారంతా దాటుకోచ్చేశాం. అనుకున్నానే కాని కాలయముడు ముందింకా వున్నాడన్నది తెల్సుకోగల్గానా చెప్పండి. అలా చూసినా వాడికి నే కనుపించానా.' జానకి కంఠం గద్గదికమై పోయింది.
'తప్పమ్మా నిండు ప్రాణాన్ని అలా అనుకోకూడదు,' వోదార్చారు.
'ఒక్క సంగతి మాత్రం నిజం వదినా. అయన పోయినా ఆయనతో పాటు పోలేక ప్రాణాల మీది తీపితో నేనిలా బతుకు తున్నాను గానీ, నేనే గనక ఏదన్నా అయ్యుంటే, ఆ మరుక్షణం 'అయన ప్రాణం వదిలేసుండేవారు. అంత నిర్మలమైన అనురాగం వారిది.' కళ్ళు తుడుచుకుంటూ అంది.
'చిన్నప్పట్నుంచి వాడి స్వభావం అటువంటిదే.'
'అంతవరకు అక్కడా అక్కడా తల దాచుకుంటూ వస్తూన్న మాకు ఆసారి మా పాలిటి కాలయముడు లాగ ఆ మిలటరీ కెంప్ గ్రౌండ్ శరణ్య మయింది. మొదట మమ్మల్ని వారెవ్వరూ లోనికి అనుమతించక పోయినా ఈయన స్నేహితుడోకాయన అందులో వున్నందున నా పరిస్థితికి జాలిపడి ప్రత్యేకంగా మాకశ్రయం ఇచ్చారు. యుద్ద సమయంలో అటువంటి చోటు చాలా ప్రమాదమని ఎరిగే వున్నా వేరే గత్యంతరం లేక ఆగక తప్పింది గాదు.
వారిచ్చిన చిన్న బ్రెడ్డు ముక్కల్ని తిని ఇన్ని నీళ్లు తగి సంచీ తల కింద పెట్టుకుని వో గుడారం చాట్న పడుక్కున్నాం. అమిత బడలిక వల్ల, నాకూ తెలియకుండా నిద్ర పట్టిపోయింది.
'నో' అంటూ బయల్దేరిన విమానం మోతకి దిగ్గున లేచి నిలబడ్డాను.
'వద్దు జానకీ. పడుక్కో త్వరగా అక్కడే పడుక్కో.' అంటూ అరిచి తనున్న చోట తనూ పడుక్కున్నారు. గుండెలదిరి పోయేటట్టు బాంబుల పెల్పులు, 'వో' అంటూ విమానాల రోద. నాకు తెలివి కూడా తప్పి పోయిందనుకుంటా ఆ భయానికి. ఇన్నీ చెవుల్లో పడుతూనే వున్నాయి గాని చైతన్యం మాత్రం లేదు నాలో.
కొంచెం అలికిడి తగ్గగానే తలెత్తి చూశాను. వద్దని చేత్తో సంజ్ఞ చేశారాయన. పూర్తిగా సద్దణిగాక లేచి కూర్చున్నాను. నిండు నెలల మనిషిని అంతసేపు తెను నెల మీద బోర్లా పడుక్కు నుండడం, కడుపు గడ్డ కట్టుకు పోయి కాలి వెళ్లు కొంకర్లు పోయినందు వల్ల కదల్లేక పోయాను. దబ్బున తను లేచి నావైపు రాబోయారు. ఇంతలో ఎక్కడో అధాటు బాంబు పేల్పు. వాడైన వో శూలం వంటి రేకు అయన పక్క భాగంలోకి దూసుకు పోవడం క్షణంలో జరిగిపోయాయి. ఉన్న బలాన్నంతా కూడదీసుకుని లేచాను. రక్త ప్రవాహం లో తేలుతున్న అయన శరీరాన్ని చూసి, అలాగే అక్కడే పడిపోయాను.' భోరుమంటూ మొహం కప్పుకుని ఏడ్చింది జానకి. ' రామచంద్ర మూర్తి ' అని పెద్దగా నిట్టురుస్తూ, గోడకి చేరబడి పోయారు పార్వతమ్మ గారు. 'ఈ ఘోరాన్ని వినడానికా ఇన్నాళ్ళూ ఇంత తహతహ పడ్డానూ' అని తనని తనే ఏవగించుకున్నారావిడ.
'మిమ్మల్ని బాధ పెడుతున్నట్టుతున్నా వొదినా' అంది కళ్ళూ మొహం తుడుచుకుంటూ జానకి.
'లేదమ్మా , నిండా మునిగిన వారికి ఇక చాలంటూ ఏవిటీ' అన్నారు, నిద్ర లేచిన్ సుధని ఒళ్లో కూర్చో పెట్టుకుంటూ.
'' ఆ తర్వాత శాన్నాళ్ళవరకూ ప్రజ్ఞా వస్తూండడం , వెంటనే ఆ భయంకర దృశ్యం గుర్తుకొచ్చి మళ్లీ స్పృహ తప్పి పోతుండడం , శాన్నాళ్ళ వరకూ అటువంటి పరిస్తితిలోనే వున్నానేనుకుంటా. ఆ మధ్యలో ప్రసవించడం కూడా జరిగి వుంటుంది. నాకు నొప్పులే రాలేదో, లేక ఈ యమ బాధల మధ్య ఆ నొప్పుల బాధ నాకు తెలియనే లేదో, అది కూడా నాకు తెలియదు.
కాలగర్భం లో బాధల్ని మరవగలడమనే దైవం చేసిన ఏర్పాటు ఎంత గొప్పదో గాని క్రమేణా రోజుకి ఒకటి రెండు మార్లు స్పృహ తప్పడం తప్పితే మిగతా కాలమంతా మామూలు స్థితి లోకే వచ్చేశాన్నేను.
అంతవరకూ కోలుకున్నాకనే పాపని నా వద్దకి తెచ్చి చూపారు. ఈ గందర గోళాల మధ్య నిర్జీవ శిశువు ప్రసవమో, లేక ప్రసవించిన వెంటనే శిశువు పోవడమో జరిగి వుంటుందని నిరాశ చేస్తుకున్న నాకు పొత్తిళ్ళ లో వుంచిన పాపని చూడ్డం తోనే నాకంటూ మిగిలిన ఆ నలుసుని చూడగానే పెల్లుబుకుతున్న ప్రేమతో , పాప వొళ్ళంతా నిమురుతున్నదాన్ని కాళ్ళు చూడ్డం తోనే కెవ్వున అరుస్తూ మళ్లీ స్పృహ తప్పాను.
