నా అభీష్టం నెరవేరింది. కోరిక చిగిర్చింది. అదే మగపిల్ల వాడయితే పిల్లి మొగ్గలు వేసేవాడేమో. అమ్మ దగ్గిరకి వెళ్లాను. అప్పుడు అన్నం తిని చెయ్యి కడుక్కుంటున్నది అమ్మ. నాన్న స్కూలు కు వెళ్ళారు. అక్కయ్య ఇంకా అన్నం తింటోంది.
రెండు చేతుల్లో వెనగ్గా కవరు జూచి, చెయ్యి కడుక్కుని వస్తున్న అమ్మని ముద్దు పెట్టుకున్నాను. అమ్మ ముఖం చిట్లించి కోపంతో "ఏమిటే నీ బొంద" అన్నది.

"అమ్మ నీ మొగుడుటే సుధా ఛీ ఛీ' అని చీదరించుకున్నది అక్కయ్య.
వెనక నుంచీ కవరు తీసి అమ్మ చేతికిచ్చి చెప్పాను.
"సర్వీస్ కమీషన్ పరీక్ష పాసయాను. ఈ జిల్లాకే రివిన్యూ డిపార్టుమెంట్ కి టైపిస్ట్ గా ఎలాట్ చేశారు. పలాని ఆఫీసుకు వేసినట్లు గా మళ్ళీ కలెక్టర్ అర్దరు వేయాలి."
అప్పటికి అమ్మ ముఖం విప్పారింది. అంతలోకే మళ్ళీ చిన్న బుచ్చుకుంది.
"ఈ అదృష్టం వాడి కూడా ఉంటె ఎంత బాగుండేది. కావలసిన మగపిల్లాడి కి చదువు రాక జులాయి వెధవలా తిరుగుతున్నాడు, అక్కర్లేని ఆడపిల్లకు చదువూ ఉద్యోగమూ అడక్కుండానే వస్తున్నాయి" అన్నది.
ఎందుకో అమ్మ మాటలు నా మనస్సుకు కష్టం కలిగించాయి. అక్కర్లేని ఆడపిల్లకు అనేసరికి ఎందుకో బాధపడ్డాను. ఆడపిల్లంటే ఈ మనుష్యుల భావాలు ఇంకా ఇట్లా ఉన్నాయ్యేమా అని అనుకుని ఏం మాట్లాడకుండా ఇవతలకు వచ్చేశాను. అక్కయ్య భోజనం చెసి నా దగ్గర కొచ్చింది. "నేను ఉద్యోగం చెయ్యటం నీకూ ఇష్టం లేదా అక్కయ్యా" "అదేమిటే నువ్వు మహారాజుగా ఉద్యోగం చెయ్యి. నువ్వు ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది గా. నాకొక చీర కొని పెడుదూ" అన్నది.
ఇన్నాళ్ళ కు ఒక మంచి అభిప్రాయం అక్కయ్య నోటి వెంట వచ్చినందుకు ఎంతో సంతోషించాను.
సాయంత్రం నాన్న వచ్చాక నాన్న నా ఆర్డరు కాగితాలు చూసి "రేపే నేను కాకినాడ వెళ్ళి కలెక్టరు గార్ని చూసి ఈ ఊళ్ళో నే పోస్టింగ్ ఇప్పించమని అడుగుతానమ్మా . ఎక్కడో వేస్తె ఆడపిల్లవు వంటరిగా ఎట్లా వెళతావు" అన్నారు.
ఆ మర్నాడే నాన్న కాకినాడ వెళ్లి కలెక్టరు గార్ని చూసి వచ్చారు. మరో పది రోజులు గడిచాయి. రాజమండ్రి లోనే ఆర్.డి. వో ఆఫీసు లో టైపిస్ట్ గా అపాయింట్ చేసినట్లు ఆర్డరు వచ్చాయి. కావలసిన సర్టిఫికెట్లు తీసుకుని అ మర్నాడే ఆఫీసులో టైపిస్టు గా జాయినయ్యాను. ఆవిధంగా నా జీవితం మరో మలుపు కు తిరిగింది.
రోజూ ఉదయం పదింటి కల్లా భోజనం చేసి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేదాన్ని. ఆఫీసు అయిదు గంటల వరకూ అని పేరుకే గాని అందరూ ఆరు గంటల వరకూ ఉండేవారు. ఆఫీసులో నేనొక్కతే కావటంతో మొదట్లో కాస్త బెరుక నిపించినా తరువాత ఆ వాతావరణం అలవాటయింది. టైపు చేసే ఫెయిర్ కాఫీలు కూడా తప్పు ల్లేకుండా నీట్ గా ఉంటాం తో , కొత్త టైపిస్ట్ బానే పనిచేస్తున్నదనే పేరు వచ్చింది.
మధ్యాహ్నం లంచ్ టైం లో మొదటి వారం రోజులు జవాను చేత కాఫీ మాత్రం తెప్పించుకుని తాగేదాన్ని. సాయంత్రం అయేసరికి కాస్త శ్రనిపించేది. నా పరిస్థితి గమనించిన నాన్న "ఫలహారం చెయ్యటం లేదు కదూ. కాఫీ నీళ్ళతో బండెడు కాగితాలూ టైపు చెయ్యమని ఎవరు చెప్పారమ్మా నీక్కావలసిన టిఫిన్ కూడా తిను. పొట్ట మాడ్చుకునే ఉద్యోగం నువ్వు చెయ్యక్కర్లేదు." అని గట్టిగా కేక లేశాడు. అమ్మ కూడా కోప్పడింది.
ఆ రోజు నుంచీ టిఫిన్ కూడా తీసుకునే దాన్ని. రోజూ ఇంటికి రాగానే అక్కయ్య.
"ఏయ్ మొగరాయుడూ ఇవాళ టిఫినేమిటే" అనేది. మొదట్లో కాస్త బాధపడ్డా అక్కయ్య మాటలు అంతగా పట్టించుకునే దాన్ని కాదు.
మొదటి నెల జీతం వచ్చింది. ఆరోజున జీతం తీసుకుంటుంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. జీతమంతా తెచ్చి నాన్న కే ఇచ్చాను. నాన్న ఓ పదిహేను రూపాయలు నాకు మళ్ళీ యిచ్చి "నీ ఖర్చులకు వాడుకోమ్మా. ఈ మిగతా జీతమంతా ఏం చెయ్యాలో తెలుసా" నవ్వు ముఖంతో నా వైపు చూశారు.
"నీకూ, అమ్మకు బట్టలు కొను. నాకు మాత్రం జేబురు మాలు కొనివ్వు" అని నా జీతమంతా నాకే ఇచ్చేశారు.
ఆ మర్నాడు సాయంత్రమే వెళ్ళి అందరికి బట్టలు తెచ్చాను. నేను తెచ్చిన బట్టలు చూసి అన్నయ్య అన్నాడు.
"నాకన్న నువ్వే నయమే సుధా. కాని ఒక్క మాట నువ్వు ఉద్యోగం చేసి సంపాదించే దానికన్నా నేను ఎక్కువే సంపాదించగలను. కాని ఆ సంపాదనకు మీ అందరి దృష్టి లో విలువ లేదు. ఈరోజు నుంచీ నేనూ సంపాదించటానికి ప్రయత్నిస్తాను. కానీ దాని ఆరాలు మీరు అడక్కూడదు.
నాన్న ముఖం వెలవెల బోయింది.
"దొంగతనం చేస్తావు?' అన్నాడు నాన్న.
"కాదు దాని అన్న లాంటిదే. రౌడీ తనం."
మరో మూడు మాసాలు గడిచాయి. ఆఫీసు లో అందరూ పరిచయ మయ్యారు. ఉద్యోగమూ జీతము అలవాటై పోయాయి.
ఏదైనా జీవితంలో తారసపడి నపుడు కోరి తెచ్చుకున్నదైతే ఆ అనుభూతి మనస్సు లో కొన్నాళ్ళే నిల్చి పోతుంది. మనకు తెలియకుండా మన మనస్సులో ఏమీ లేకుండా సందర్భాపడిన సంఘటనయితే మనస్సులో అది మరుపురాని సంఘటన గానే నిల్చి పోతుంది.
ఒకరోజున సాయంత్రం ఆరు గంటలకు టైపు చెయ్యవలసిన కాగితాలన్నీ క్లియర్ చేసి ఇంటికి వెళ్ళ బోతుంటే , శ్రావణ కుమార్ అనే యు.డి.సి వచ్చి ఓ నాలుగు పేజీల డ్రాప్ట్ బల్ల మీద పడేసి.
"సుభాషిణి గారూ, ఈ డ్రాప్ట్ ఇవాళ టైపయి డిస్పాచి కావాలి" అని అక్కడే నిల్చున్నాడు.
ఆరోజు ఎందుకనో నాకూ కాస్త విసుగ్గానే ఉంది. అందులో మండు వేసవి కాలం. మే నెల, పోనీ అయిదు గంటల లోపే వస్తే కొట్టక తప్పేది కాదు. ఆరు గంటలకు పట్టుదల గా వచ్చి అతనా విధంగా అనేసరికి నాకూ కాస్త చిరాకు కలిగి "పుస్తకం లో నోట్ చేసి టైం నోట్ చెయ్యండి. ఆరూ అయిదు నిమిషాలైంది. రేపు రాగానే కొడతాను." అని వెళ్ళిపోయాను.
'ఆఫ్టరాల్ యూ ఆర్ ఏ టైపిస్ట్ . ఒక యు.డి.సి ని మీరు దబాయిస్తారా ఇవాళ మీరు కొట్టక పోవాలి రేపు చార్జి మేమో ఇప్పిస్తాను." అని సిగరెట్ వెలిగించి స్టైలిష్ గా పొగ వదుల్తూ కుడికాలు నా టేబిల్ మీద పెట్టి నిల్చున్నాడు.
నాకూ చిన్న తనమనిపించింది. కోపమూ ఉక్రోషమూ నా పట్టుదలని పెంచాయి.
"మిస్టర్ శ్రావణ కుమార్, నేను ఆఫ్టరాల్ టైపిస్టు నైతే మీరు ఆఫ్టరాల్ యు.డి.సి నన్ను కించ పరిచినంత మాత్రాన మీకు ఎడ్వాన్స్ ఇంక్రిమెంట్ రాదు. ప్లీజ్ బిహేవ్ ప్రోపర్లీ అని వచ్చేశాను. అంతా విసుపోయి చూస్తూ నిల్చున్నారు. రెండు నిమిషాల్లో వాతావరణం ఇట్లా మారిపోతుందని ఎవరూ ఆశించలేదు.
నేను వెళ్ళిపోయి మర్నాడు వచ్చాను. అంతా నిన్నటి సంఘటన ను గురించే ఆలోచిస్తున్నారు. ఆఫీసు లో రెండు వర్గాలయాయి. నన్ను సమర్ధించారు కొంత మంది. శ్రావణ కుమార్ ని సమర్ధించారు మరి కొంతమంది.
నేను రాగానే ఆ కాగితమే టైప్ చేసి జవాను చేత అతనికి పంపేశాను. ఒరిజినల్ రిఫరెన్స్ అతని సీటుకు చేసి అప్పటికి నెలా పది రోజులయింది. ఇది గుర్తుంచు కున్నాను.
మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్.డి. ఓ గారి వద్ద నుంచీ పిలుపు వచ్చింది. అయన రూం కి వెళ్లాను. శ్రావణ కుమార్ అక్కడే ఉన్నాడు. ఆఫీసరు కు నమస్కరించి నిల్చున్నాను.
"ఈ అర్జెంటు రిఫరెన్సు నిన్న ననగా ఇస్తే టైపు చెయ్యకుండా ఇవాళ టైపు చేశావుట. ఆడపిల్ల వై యుండి అతన్ని దబాయించావుట." అన్నాడు ఆర్.డి.ఓ.
"సాయంత్రం ఆరు గంటలకు వచ్చి నేను మిషన్ మూసేసి వెళ్లబోయే సమయానికి వారు పట్టుదలగా వచ్చి ఇవాళ టైప్ చెయ్యాలన్నారు. అంతవరకూ నా దగ్గర ఉన్న కాగితాలన్నీ టైప్ చేశాను. ఏమీ లేవు. టైం నోట్ చేసి వెయ్యండి రేపు రాగానే టైప్ చేస్తానన్నాను. అందుకాయన కోపం తెచ్చుకుని ఏమన్నారో వారినే అడగండి." అన్నాను.
ఆర్.డి.ఓ గారు అతని వైపు చూశారు.
'ఆఫ్టరాల్ యు ఆర్ ఏ టైపిస్ట్ , ఒక యు.డి.సి ని మీరు దబాయిస్తారా, ఇవాళ మీరు కొట్టక పోవాలి రేపు చార్జి మేమో ఇప్పిస్తాను" అని అన్నట్లు చెప్పాడు.
"ఈ మాటనడం తప్పు కాదా. నువ్వు యు.డి.సి . వి. నీ దృష్టి లో అమ్మాయి ఆఫ్టరాల్ టైపిస్ట్. అంటే రివెన్యూ బోర్డు సెక్రటరీ దృష్టి లో నేను ఆఫ్టరాల్ ఆర్.డి. ఓ ని అంతేనా" అన్నారాయన. ఏం మాట్లాడకుండా తలవంచుకుని నిల్చున్నాడు శ్రావణ్ కుమార్. "యు కెన్ గో" అని నా వైపు చూశారు నేను వచ్చేశాను. తరువాత తెలిసింది. ఆ కరెంటు అతని దగ్గర నెలా పదిరోజులు ఆలస్యమై నందుకు ఆర్.డి.ఓ గారు శ్రావణ కుమార్ ని బాగా మందలించారని.
ఈ సంఘటన జరిగాక అందరూ నన్ను గౌరవంగా చూట్టం మొదలు పెట్టారు. అతనంటే పడని వాళ్ళు నన్ను సమర్ధిస్తూ అతని మీద చాడీలు నాతొ చెప్పేవారు.
మొత్తం మీద ఒక కొత్త వాతావరణం ఏర్పడింది. నేను టైప్ చెయ్యవలసిన కాగితాలన్నీ అయిదు గంటల లోగానే వచ్చేవి.
ఆ రోజు నుంచే శ్రావణ కుమార్ నాతొ మాట్లాట్టమే మానేశాడు. రిజిస్టర్ లో ఫెయిర్ కాఫీలు నోట్ చేసి వెళ్ళేవాడు. ఈ సంఘటనతో ఆఫీసులో అతని ప్రిస్టేజి కొంత తగ్గినట్లుగా ఉండేది. అందరితోనూ దబాయించి మాట్లాడే పద్దతి తగ్గించాడు. అతని ముఖం చూస్తె ఎందుకో నాకూ చిన్నతన మని పించేది.
ఒక రోజు నేనే అన్నాను. "శ్రావణ కుమార్ గారూ, జరిగింది మర్చిపోండి. క్షమించండి."
"నో నో అదేం లేదండీ. ఉద్యోగం అన్నాక అనేకం జరుగుతూ ఉంటాయి?' అన్నాడు.
