Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 4


    'మునుగు దీయవు రావు నా ముందు కబల
    యేల యడియాస బెట్టె దీ లీల బాల
    యే నొనర్చిన యుపరాధమే మొ చెపును
    హృదయమును జింపి పెట్టేద నిదిగో
            కొనుము.'
    సూర్యం హృదయాన్ని చింపే ప్రకృతి ముందు పెట్టాడు. ఆమె అందాల చిందులు, అపురూపమైన రూపాల మార్పులు, ప్రేమ పలుకుల పరిహాసాలు, చిరునగవు తో చిన్నరైన చిలిపితనం అన్నీ భరించాడు. అతను యెన్నో ఆశించాడు. చల్లని దరహాసం, ఆమె చేతిలో పెట్టె గిలిగింతలు , ఒక బిగి కౌగలి , హృదయ స్పందన , ఒక ప్రేమ కానుక -- ఇలా యెన్నెన్నో కాంక్షించాడు. అతనూ అలాంటి ప్రేమ గీతి రాయాలనీ, అలా ఆడదాన్ని వర్ణించాలనీ, తను విన్న కమ్మని గొంతుకతోనూ ఆలాపించాలనీ, హృదయం వుప్పొంగించిన నాట్యం చూసి తను అలా నాట్యం చెయ్యాలనీ-- ఇలా తను కన్నవి, విన్నవి , ఊహించినవి-- యెన్నెన్నో కోరుకున్నాడు. అలా కోరుకోవటం లోనే ఆనందాన్ని పొందాడు. అతను అవి పొందలేక పోయినా వాటిని స్వంతం చేసుకున్నాడు. అలా చేసుకునే హక్కు సృష్టించిన మానవుల వారసుని గా తనకున్న దన్న గర్వంతోనే వాటిని తనవిగా చెప్పుకున్నాడు.

                         *    *    *    *
    సూర్యం చదువు స్కూలు పైనలు తో ఆగిపోయింది. అంతకు పైకి పోయే గీత మా వాడిలో లేదని తండ్రి చింతించాడు. సూర్యం కు గీత ల మీద నమ్మకం లేదు. చదువుదామన్న కుతూహలం వుంది. మంచి వస్తువు గాలిలో నిలబడదు. చెరువు వుండాలి. ఎవరేన్నేన్ని నీతి వాక్యాలు, వేదాంతం చెప్పినా సంసారానికి చేరువు డబ్బన్నది ఒప్పుకోక తప్పింది కాదు. దాని విలువ , అది లేక అనుభవించిన వాళ్లకు తెలుస్తుంది. ఒకరి చేత వ్రేలు చూపించుకోవటం సూర్యం కు కిట్టని పని-- చదువులో కూడా "నాకిది తెలీదండీ మేష్టారూ ' అని చెప్పకుండా చదివాడు. తెలివైన కుర్రాడని పించుకున్నాడు. చదువు మీద మమకారం తగ్గకుండానే యేమీ వుబుసు పోకపోతే వుద్యోగం మీదకు మనసు పోయింది. పల్లెలో కూర్చొని తను చేసిందేమీ లేదు. ఒకచోటి అందం చూడగా చూడగా ఒక గోడపై గీసిన పెయింటింగ్ లా ఒకే రీతిదై పోయింది. మార్పు కావాలి. మార్పు కోసం తహతహ లాడి పది చోట్లకు ఉద్యోగం కోసం పది అప్లికేషన్లు పెట్టాడు.
    ఎవరో దూరపు బంధవు "మీ అబ్బాయి చాలా తెలివైన కుర్రాడని విన్నాను. ఒకసారి చూడనిస్తారా?' అని వచ్చాడు.
    సూర్యంతండ్రి సగర్వంగా కొడుకును చూపించాడు. కుర్రాడు దబ్బపండు లా వున్నాడు. తలలో జుత్తు మెలికలు తిరగటానికి వురకలు వేస్తోంది. ముఖం లో గంబీరమైన హుందా మధ్య కనికారం తో నిండిన కళ్ళు మెరుస్తున్నాయ్. ప్రేమ పూలను వాసన చూసే కుదురైన ముక్కు- అ పైన వెడల్పాటి నుదురు. మమకారం ఏర్పడింది.
    'కుర్రాడిని నేను చదివిస్తాను.' అన్నాడు.
    సూర్యం తండ్రికి సంతోషం వెంటనే సంశయం పొడ సూపింది. మానవ నైజాన్ని యింతో అంతో అర్ధం చేసుకున్నవాడు కాబట్టి మౌనం దాల్చాడు.
    'నాకు ఒక్కర్తే అమ్మాయి. అబ్బాయిని చదివించి బాగు చేసి....అల్లుడ్ని చేసుకుంటాను.'
    ఇంత చులకనగా అతను చెప్పినందుకు సూర్యం కు ఆ వయసు లోనే మనస్సు లో మహాగ్ని రేగింది. 'నేను డబ్బుకు అమ్ముడు పోను నాన్నా' అన్నాడు చాటుగా!
    'ఆలోచించు నాయనా! ఎక్కడ ఉన్నా నివ్వు వృద్ది లోనికి వస్తే మాకదే పదివేలు! నీ తెలివితేటలను వినియోగించలేని చవటనై పోయాను.' అన్నాడు తండ్రి.
    సూర్యం కు యీ చివరి మాటలు భాధించాయ్. 'డిగ్రీ లేనంతమాత్రాన నా తెలివి రోజుకు రోజూ పెరక్కుండా పోదు నాన్నా! నాకు మీ అబ్బాయిగా వుండే గర్వం వాళ్ళ అల్లునిగా వుండటం వల్ల రాదు! నే వెళ్ళను' అన్నాడు.
    ఆ వయస్సు లోనూ సూర్యం కు యెదుటి వాళ్లు నాటుకున్న మొక్కలను వాళ్ళ ఏదరగానే బలవంతాన పీకి పారెయ్యటం యిష్టం లేదు. ఎదుటి వాని పూలతోట లోనికి చూచుకుని మొక్కలను మేసే పశువుగా మారటం అంతకంటే యిష్టం లేదు. అంచేత తండ్రితో 'అబ్బాయికి చదవాలని లేదు. ఉద్యోగం చేస్తానంటున్నా'డని చెప్పించాడు.
    'వచ్చిన అదృష్టం వదులు కున్నాడని ' కొందరన్నారు. 'ఈ కుటుంబాన్నేత్తడానికి బాధపడే గీత వీదికుంటే ఆ భాగ్యవంతుల యింట్లో యెందుకు పడ్తాడు?' ఇలాంటి మాటలు విన్న సూర్యం లో పట్టుదల హెచ్చింది. ఆ గీత అయాచితంగా ఒకరు గీసే కంటే తనే కష్టపడి ఆ గీత సృష్టించు కుంటాననుకున్నాడు. బ్రహ్మ గీసిన రాత బద్దకించటంవలెనే బూడితతో కప్పబడుతుంది. రాదు అనే దాని కంటే వస్తుంది అన్న ఆశ వలెనే జీవితం విలువ పెరుగుతుంది. ఒకరికి ఒక ఉపకారం చేసి ప్రత్యుపకారం కాంక్షించటం వలన మనిషి నిరీక్షిస్తూ చచ్చిపోతాడు. తనకు వర్షం కురిసాక విడివడే మేఘం లా, వెలుగిచ్చి క్రుంగె సూర్యునిలా, పళ్ళు రాల్చాక ఆకులూ రాల్చే వృక్షం లా వుండాలని ఉంది. మనిషి క్రుంగాక మరి లేవలేడు. మేఘాలు మళ్లీ అల్లుకుంటాయ్. సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు. చెట్లు మళ్ళీ చిగురిస్తాయ్.
    ఇలా వుండాలంటే తనకు 'నేను నేననే' గర్వం వుండాలి. ఆ గర్వం తను తలెత్తి తిరిగితేనే వస్తుంది. తన వుద్యోగం కోసం కూడా పది మంది వీడ్ని చూడు వాడ్ని చూడూ అన్నారు. దొడ్డి త్రోవ గుండా యింట్లో దూరటం తనకు యిష్టం లేదు. ఈ యిల్లు నాదీ అన్నట్లు ఆఫీసు లోనికి ముందు గేటు నుంచే తలెత్తు కొనే వెళ్లాలని తన ఆశ. ఇంట్లో యెంత హుందాతో కాలు పెట్టాడో అంత నమ్మకంతో అంత బాధ్యత తో అంత సమర్ధతతో అతను పని చేయసాగాడు. లోకం అంతటా మాలిన్యం ఒక్కటే లేదు. అన్యాయం అవినీతితో కోరికలు తీర్చుకోడానికి ప్రయత్నించి మరింత మాలిన్యం కుప్పలను సృష్టించటం తనకు  యిష్టం లేదు. కోరికలకు అకారాలుండవు. అవొక ఎండమావుల్లాంటివి. ఎంత పరుగెత్తినా పిడికిట లో పట్టలేం. ఆ ఎండ మావుల అందాన్ని దూరం నించి చూచి సంతోషించటం లోనే వుంది సుఖం!
    సూర్యం సుఖాన్ని కోరికలు తీర్చుకోవటం లో కాదు. తీర్చుకోకపోవటం వలన పొంద సాగాడు. ఎత్తుపల్లాలున్న ప్రకృతి లా, ఆరు ఋతువులున్న కాలంలో జీవితం వుండాలని అప్పుడే కదలిక వస్తుందని, కదలికతో అందం, అందంతో ప్రాణం తోణికిసలాడుతుందని కోరుకున్నాడు.
    అతను అందుకే నాలుగు గోడల మధ్య పట్టే మంచం పరుపు మీద పడుకోలేదు. నేల చాప మీద దొర్లాడు. జేబులో నున్న డబ్బులు యింకొకరి కిచ్చి తను ఒక పూట నోటిలో మంచినీరు పొయ్యకుండా ఆకలి యెలా వుంటుందో అనుభవించాడు. చలిలో పడుకున్నాడు, ఎండలో ఎండి వానలో తడిచాడు. కొండ లెక్కాడు, దిగాడు అనవసరంగా మాట పడ్డాడు. అవమానం సహించాడు. ఒంటిగా తిరిగాడు. రోడ్ల వెంట పడ్డాడు. జూలియట్ లేని రోమియో లా తిరిగాడు.
    అతని చేష్టలతో తిరుగుళ్ళ తో యెన్నో వూహల గ్రంధాలు అతని మనస్సు లైబ్రరీలో నిండుకున్నాయ్. ఆ పుస్తకాల్లో పరిచయమైన వ్యక్తులు, అమ్మాయిలూ ఒక్కొక్క విధమైన సందేశాలు యివ్వసాగారు . అలా తిరుగుతూనే కొన్నేళ్ళ కు అతను బియ్యే అనిపించు కున్నాడు.
    అతను పనికి వూహల వొత్తిడి కి తగ్గ బలం ఆ శరీరం లో లేకపోయింది. మొక్క మనోహరమైనదైనా నేల రాళ్ళతో నిండి పోయింది. హోటలు భోజనం లో రాళ్ళు,  సున్నం నీరు అతని పొట్టను గోకాయ్. ఈ లోకం అంతా కడుపు కోసమే ప్రయాస పడ్తుంది. ఎండా, వానా పంట కోసం, గాలి , రక్తం శుభ్రం చెయ్యటానికి, అగ్ని వంటకు ఈ ధాన్యాదులు , పళ్ళూ, దుంపలూ ఆఖరికి భూమిలోని ఖనిజాలు కూడా యీ కడుపు కోసమే పాటు పడుతున్నాయ్. కడుపు నింపటం కోసం ఒక అన్యాయం ఒక అవినీతి సహించతగ్గది. కాని యింద్రియ సుఖాల కోసం యెదుటి వాళ్ళ కడుపులను మడ్చటం అమానుషం. మనదేశం లో ముఖ్యంగా కడుపుకు సంబంధిచిన వాటి విషయం లోనే అన్యాయం జరుగుతుంది. లాభాలు రేడియోలు, పౌడర్ల మీద నూటికి నూరు బిగిస్తే ఫరవాలేదు, పాపం కాదేమో కానీ, తిండి గింజలు , నూనెలు వగైరా తినుబండారాల మీద దొంగ వ్యాపారం , కల్తీ యివన్నీ అమానుషం. మనిషి రాక్షస హృదయం కలవాడైతేనే యీ పని చెయ్యగలడు.
    రాక్షసహృదయుడైన హోటల్ యజమాని సూర్యం కడుపు చిన్నది చేసాడు. మచ్చ లేరగని పొట్టలో మచ్చలను వాడి ఆహారంతో సృష్టించాడు. ఆహారం కోసం ఆతృతతో చూస్తుండిన కడుపు ఆది కడుపులో పడగానే బయటకు తోయటానికి ప్రయత్నిస్తోంది. ఇదివరకు మనసులో ఘర్షణ కదలిక వుండేది. ఇప్పుడు కడుపులో అలజడి బయలుదేరింది. చివరకు సూర్యం తల్లి వచ్చి బస పెట్టవలసి వచ్చింది. ఆ తల్లి ప్రేమ రానురాను ఆ మచ్చ లరగుడుల పై తెర కప్పింది. ఇప్పుడు అన్నం సహిస్తోంది. ముఖం పచ్చ బడింది. జీవితం పై మళ్లీ మమకారం, ఆశా చిగుర్చి నాయ్.
    సూర్యం పదిహేను రూపాయల అద్దెకు తీసుకున్న యిల్లు ఒక లోగిల్లో వుంది. ముందు రెండు కుటుంబాలు. ఒక భాగం లో యింటి యజమాను రాలి సంతతి. వెనుక భాగం లో ఉత్తరం వేపు రెండు చిన్న గదులున్న భాగం లో సూర్యం, తల్లీ వుండేవారు. ముందుకు చిన్న వరండా -- వెనుక వరండా లో ఒక మూలకు  వంట కొట్టు వరండా వెనక రెండడుగుల జాగా, వెనుక ప్రహరీ గోడ. ఈ భాగానికి ప్రక్క భాగానికీ ఒకటే పెరడు. ఈ యింటి ఆడవాళ్ళు, ఆ యింటి ఆడవాళ్ళకి అదే రహదారి. పొరుగు యిల్లు ఒక్కటే గది! ఆ గది వెనక వరండా బదులు వంట యిల్లు -- ఆ భాగం లో రెండు చిన్న అరుగులు ఉండేవి. ఈ వెనుక భాగానికి రావటానికి చిన్న సందు రోడ్డు మీద నించి వుండేది. ఆ సందులో గోడ ప్రక్కనే ఒంటి కొబ్బరి చెట్టు నాకేమన్నట్టు హాయిగా గాలిలో కదిలేది. వెన్నెల్లో వెలిగేది. వర్షం లో తడిసేది. యెండలో ఎండేది. ఐనా దాని అందం తరగలేదు. విరగలేదు. ఒకోసారి గర్బంతో నిగనిగలాడుతున్న పడుచులా నింపుగా గెలలతో నుండేది. ఆ బరువు దిగగానే మళ్ళీ పూల గుత్తులు తలలో ముడుచుకున్న యౌవ్వని లా మనోహరంగా ప్రియుని ఆహ్వానించేది.
    సూర్యం యీ కొబ్బరి చెట్టు సమ్మోహనం లో పడి, ఆ చెట్టు వేపు ఏదో ఒక సమయాన దొంగ చూపు చూసేవాడు. అలానే అతని కళ్ళ కోసం అప్పుడప్పుడు వెతుకుతున్న అమ్మాయిల వేపు చూసినా తల చప్పునదించేసేవాడు. అతను యెదుటి వారికి యిబ్బంది కలిగిస్తున్నానాన్న ఆలోచన అంత వడిగా మార్పు తెచ్చేది. సంసారుల కుటుంబాల మధ్యలో పెళ్లి కాని తన వేపు వాళ్ళేవరు వేలు కత్తిలా చూపించి తను భద్రంగా పెంచుకోస్తున్న అహాన్ని పొడవటం యిష్టం లేదు. అలా పొడిపించుకునే అవకాశం యివ్వకూడదనే మనసు వువ్విళ్ళూరుతున్నా వీలైనంత హెచ్చు కాలం బయటే గడుపుతున్నాడు. ఈ కాలం లో ఏ లైబ్రరీ లో కూర్చొని తనకు యిష్టమైన పుస్తకాలు, ఒకోసారి యిష్టం లేని పుస్తకాలు కూడా చదవ సాగాడు. సాహిత్య పరిచయం తన కళా విహీనమైన మనసుకు వెల్లే వేసేది. తనదిగ జారిపోతున్న ఊహలకు చేయూత నిచ్చేది. ఊహల్లో వ్యక్తులకు 'దరిగా చేరి వాళ్ళ వేపు చూసి కనికరించటానికి యే లోపాలు కారణ మయ్యాయో వాటి దగ్గరగా తను పోకుండా వుండటానికి ఏం చెయ్యాలో ఆలోచించుకునేవాడు. ఈ ఆకాశం క్రింద వున్న అన్నిటితో పరిచయం చేసుకోవాలనీ, వాటి బాగోగులు తనవి  చేసుకోవాలని చివరకు తన హృదయం ఆకాశామంటై వీటన్నిటినీ యిముడ్చు కోవాలని ఇలా ఊహల రధాని కి కోరికల గుర్రాలు పూన్చి ఆశల కళ్లాలతో లాగేవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS