Previous Page Next Page 
వంశాంకురం పేజి 4


    వెంకటేశ్వర సుప్రభాతము వినిపిస్తుండగా అదిరిపడి లేచింది. తొందరగా ముఖము కడిగి, సత్తితో నీళ్ళు తోడించుకుని, తలారా స్నానము చేసి, అత్తగారికి పూజలో సాయము చేసింది. ఇద్దరూ పూజ ముగించి బయటకు వచ్చేసరికి వాకిట్లో బండి ఆగింది. సరస్వతమ్మ గుమ్మము వైపు చూచింది. ఆమె మేనకోడలు రుక్మిణి దిగుతుంది. ఆమెను పలుకరించి తీసుక వచ్చింది.
    "ఏమమ్మా చెల్లాలా , పడక వదిలి తిరుగుతున్నావా?' అరుణ ను పలుకరించింది. ఆమె మాటలు బాధ కల్గించినా , చిరునవ్వుతో నమస్కరించింది. ఆమె నలుగురు బిడ్డలు, బిలబిల మంటూ వచ్చారు.
    "చూడత్తయ్యా; ఈ పిల్లలు రాగానే ఇంటి కెంత కళ వచ్చిందో , ఏడీ ఆనంద్?"
    "ఇంకా లేవలేదు కూర్చోండి." పిల్లలను దగ్గరకు తీసుకుంది. అరుణ నేరస్తురాలుగా తల వంచేసుకుంది. సత్తి చేత అందరికీ కాఫీలు ఇప్పించింది. రంగారావు గారికి స్వయంగా తనే పట్టుకెళ్ళి ఇచ్చింది.
    "కడుపు నొప్పి యెలా ఉందమ్మా?"

 

                                      


    "ఈ పూట లేదండి. బయటకు వచ్చి, మరో గ్లాసు తీసుకుని మేడ పైకి వెళ్ళింది. ఆనంద్ ఇంకా ఆదమరిచి నిదురపోతున్నాడు. అతన్ని లేపాలని ఆనందంగా ముందుకు వేసిన అడుగు అక్కడే ఆగిపోయింది. అతని మంచము దగ్గర యష్ ట్రే నిండా సిగరెట్టు పీకలున్నాయి. దాన్ని బట్టి ఊహించవచ్చు. రాత్రి అతను నిదురపోవటాని కెంత ప్రయత్నమూ చేశాడో. ఆమె హృదయములో బాకు దిగినట్టే అయింది. కాఫీ బల్ల మీద పెట్టి, నెమ్మదిగా అతని మంచం పై కూర్చుంది. ఒత్తయిన నల్లని జుట్టు అతని ముఖముపై చిందరవందరగా పడి వుంది. దాన్ని పైకి తోసింది. అతను వెంటనే మేల్కొన్నాడు. అతని పెదవులు సంతోషంగా విచ్చుకున్నాయి.
    "ఎంత చిత్రమో చూడు అరుణా"
    'చెప్పండి " అంది అతని జుట్టుతో ఆడుకుంటూ.
    "నేను నిన్ను గూర్చే తలుచు కుంటున్నాను. నువ్వే ఎదురుగా కూర్చున్నావు."
    "పోదురూ...." అన్నది సంతోషాన్ని ఆపుతూ.

 

                                      
    "కావాలంటే నా గుండెల దగ్గర చెవి పెట్టివిను. నీ పేరే వినిపిస్తుందో లేదో." ఆమె తల వంచి తన గుండెల మీద అన్చుకున్నాడు. తడిగా వున్న ఆమె వెంట్రుకలు చక్కలిగింతలు పెట్టాయి. అలా జుట్టును గుప్పెట్లో పట్టుకున్నాడు.
    "లేవండి. కాఫీ చల్లారి పోతుంది." లేచి కూర్చుంది.
    "ముఖము కడిగాక మరోసారి తాగుతాను. ఇప్పుడదిలాతే " దిండుకు అనుకుని కూర్చున్నాడు. ఆమె కప్పు అందిచ్చింది. అతను కాఫీ త్రాగి బాత్ రూమ్ లో దూరాడు. గది అంతా సర్ది పెట్టింది. నాల్గు రోజుల నుండి తను పైకి రాలేదు. అంతా చిందర వందరగా కనిపించింది. అతని షర్టులు , ప్యాంట్లు హెంగర్ల కేసి వాడ్ రోబ్ లో పెట్టింది. ఆరోజు కోసము దుస్తులు తీసింది. అతను స్నానము  ముగించి వచ్చాడు.
    "ఆరూ! రోజూ ఇలాగే ప్రత్యక్షమై కావాల్సినవి చేస్తే----"ఆగిపోయాడు.
    "మీ పనులు చేయాలని నాకు మాత్రము ఉండదా?" బాధగా చూచింది.
    "నేను మరిచే పోయాను. ఈ పూట ఎలా ఉంది?"
    "అబ్బబ్బ! కనిపించటము లేదూ? అందరూ ఒకే ప్రశ్న విసిగిపోయాను."
    "అడగను లే." అతని బూట్లు తెచ్చి పెట్టి తలకు నూనె రాసింది. ఆమెను అలాగే దగ్గరకు తీసుకుని, ఆవేశంగా ముఖమంతా ముద్దు పెట్టుకున్నాడు. అతని వడిలో అలాగే వరిగిపోయింది.
    "నేనోమాట చెప్తాను వింటారా?"
    "చెప్పు ఆరూ. నీమాట కాదని ఎప్పుడైనా అన్నానా?"
    "విన్నాక కాదంటారేమోనని...." సందేహంగా చూచింది.
    "లేదు అరుణా ఏనాడూ చేసుకున్న పాపమో శారీరక సుఖాలకు దూరమయ్యాము. మానసిక శాంతిని కూడా దూరము చేసుకుంటానా! చెప్పు ఏం కావాలో...." ఆమె నలాగే పొదివి పట్టుకున్నాడు.
    "నేను కొంత పుణ్యము చేసుకున్నాను. దాని ఫలితమే...మీ భార్య నయ్యాను. మీ సహృదయతను జన్మజన్మ లకు మరిచిపోలేను...." మధ్యలోనే ఆమె నోటిని మూశాడు.
    'చాల్లే పిచ్చి పొగుడు." మందలింపు గా అన్నాడు.
    "పోనివ్వండి నా కోర్కె చెప్పనా.... నా కోసము మీరిలా జీవితమూ పాడు చేసుకోవటము ఇష్టం లేదు. అత్తయ్య, మామయ్యా కూడా అనుక్షణము పసిపాపల కై అల్లాడి పోతున్నారు. యెవరినయినా తెచ్చి పెంచుకునే ఉద్దేశములో ఉన్నారు....ఎవరిని తెచ్చినా పెట్టడానికి ఉన్న స్వతంత్ర్యము తిట్టడానికి ఉండదు."
    "ఆ మాట నేను విన్నాను. నీకిష్టము లేదని చెప్పనా? నీ కిష్టము లేనిపని వారెన్నడూ చేయరు."
    "నా మాట పూర్తిగా వినండి. ఈ వయసులో వారి కోర్కె కాదనటము భావ్యంగా ఉండదు. మనకు కులదీసుడు కావాలి. మీరు...మీరు తిరిగి వివాహము చేసుకోండి. నాకే అభ్యంతరము లేదు." ఆనంద్ పకా పకా నవ్వేశాడు.
    "ఈ పెద్ద కోర్కేనా, అప్పటి నుండి ఊరించి, ఊరించి కోరావు."
    "నేను సీరియస్ గా చెప్తున్నాను.
    "నేను సీరియస్ గానే వింటున్నాను. పిచ్చిదానా. ఈ మాత్రము సుఖశాంతులు కూడా కరువవుతాయి. వచ్చే అమ్మాయి ఏదో వంకతో వస్తే, ఈ కాలములో రెండవ భార్యగా రావటానికి ఎవరంగీకరిస్తారు?" మృదువుగా ఆమె బుగ్గలు తాకాడు?
    "నేను బ్రతికివుండగా రావడానికి అంగీకరించరు. నేను చచ్చిపోతే అభ్యంతరం ఉండదుగా" అతని వడిలో నుండి లేచింది ." మీరు నా మాట వినకపోతే నేనింత విషము తీసుకుంటాను." బెదిరింపుగా చూచింది.
    "ఆరూ! ఇటు చూడు నా వంక. నన్ను విడిచి మరణించాలని ఉన్నదా?' ఆమె అతని వంక చూచింది. ప్రేమ తప్ప మరో భావము కంపించ లేదు ఆ కళ్ళలో. తొందరగా వచ్చి అతని హృదయము పై వ్రాలి పోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది.
    'మీ మంచితనముతో నా మతి పోగొడుతున్నారు....పెద్దవారి కోర్కెలు కూడా గమనించవద్దా," వెక్కుతూ అడిగింది. ఆమె వీపు నిమిరాడు.
    "కోర్కెలు కంతెక్కడ ? మనకెంత రాసి పెట్టి ఉంటె అంతే జరుగుతుంది. పిచ్చిగా ఆలోచించకు. పద ఈ పూట తొందరగా వెళ్ళాలి."
    'అసలు విషయము మరిచే పోయాను. మీ మామయ్యా కూతురు రుక్మిణమ్మ వచ్చింది."
    "యెప్పుడు?"
    "ఉదయమే. రండి." ఇరువురూ మేడ మెట్లు దిగి వచ్చారు.
    "బావున్నారా ఆనంద్? నల్లబడి పోయావు. నీ పెళ్ళి ఏమంటా అయిందో , అన్నింటికీ దూరమయ్యావు. అమ్మ యెప్పుడూ అంటుంది. మరో రెండు సంవత్సరాలు వెనుక పుడితే ఆ ఇంటి కోడలవు అయ్యే దానవే అంటుంది. అంత అదృష్టమేది?"
    "నీ అదృష్టానికేం వదినా! శ్రీరామ చంద్రుడి వంటి అన్నగారు , చక్కని బిడ్డలు"
    "నా అదృష్టము గూర్చి నాకేం బాధ లేదు. నిన్ను తలుచుకుంటేనే జాలి వేస్తుంది."
    "నువ్వు జాలి పడాల్సిన స్థితి నాకేముంది వదినా! అమృతమయి అమ్మ ఇప్పటికి పసి పిల్లాడి లాగే చూచుకునే నాన్న. కనుసన్నలలో మెదిలే ఇల్లాలు." అతని మాటలకు అరుణ చిన్నగా నవ్వుకుంది. రుక్మిణి ముఖము మాడ్చుకుంది. అరుణ వెళ్ళి అత్తగారు వేసిన పెసరట్టు తెచ్చి అతని ముందు పెట్టింది.
    'అరుణా! వదినకు కూడా పట్రా."
    "ఎందుకులే అత్తయ్యతో కూర్చుంటాను ." అన్నది. అతను ఫలహారము పూర్తి చేసి, అరుణ అందించిన వక్కపొడి అందుకుని వెళ్ళిపోయాడు. గడప దాటుతూ ఆగి అరుణ వంక చూచాడు.
    "ఏమైనా తేవాలా? మరిచే పోయాను పుస్తకాలు తెస్తానన్నాను కదూ?"
    'అలాగే పదో నెంబరు అల్లిక సూదులు పట్రండి. మీకోసము తెచ్చిన ఊలు అలాగే ఉంది." తలాడించి వెళ్ళిపోయాడు. ఆమె వెనుతిరిగి వచ్చేసరికి రుక్మిణి గొంతు వినిపిస్తుంది.
    "పడక మీద పడుకున్న రోగిష్టిదయినా, మన వాడిని ఆడించేలాగుందే కోడలు."
    'అదేం ఆడిస్తుంది? పాపం! కాస్త ఒంట్లో నెమ్మదిగా వుంటే లేచి సాయము చేస్తుంది. దాని గుణము బంగారమే. మా రాత బావుండలేదు."
    "నీది నిండు మనసులే అత్తయ్యా. ఈమధ్య బాబాయి వచ్చాడటగా? ఆహా, ఏం లేదు, అతనే అన్నాడు. సరస్వతక్క , యెవరైనా ఇస్తే ఓ పిల్లాడిని పెంచుకోవాలను కుంటుందని , నిజమేనా?"
    "అబద్దము ఏముందే రుక్మిణీ! ఏదో ఇంట్లో సందడిగా వుంటుందని. సత్తీ చిన్నమ్మనిలా పిలువు. రాత్రి తిండే తినలేదు చల్లారి పోతుంది." అమె అలా అనటము రుక్మిణి కి యెంత మాత్రమూ నచ్చలేదు. మూతి ముడుచుకుంది. అరుణ వెళ్ళి వంటింటి గుమ్మములో నిల్చుంది.
    "మామగారు ఫలహారము చెయ్యరా అత్తయ్యా?"
    "ఈ పూట శనివారము కదే. అయన  మధ్యాహ్నం ఒకేసారి తింటారు. నువ్వూ, రుక్మిణి కూర్చోండి." ఇద్దరూ ఫలహారము పూర్టి చేశారు. రుక్మిణి ఆఖరు కొడుకు ముద్దోచ్చాడు , వాడిని దగ్గరకు పిలువబోయి  ఆగిపోయింది. పుట్టినింటిలో జరిగిన ఓ సంగతి గుర్తుకు వచ్చింది. గాలి మార్పుకని వెళ్ళింది. అప్పుడే మారుటి అన్న వాసు కూతురు పుట్టినరోజు వచ్చింది. పిల్ల ముద్దుగా, బొద్దుగా ఉండి, అరుణను అత్తా, అత్తా అంటూ వదిలేది కాదు. ఇద్దరికీ బాగా చనువు ఏర్పడింది. పుట్టినరోజు పండుగని వచ్చినవాసు అత్తగారు అరుణ పాపల స్నేహము హర్షించ;లేకపోయింది. ఏవో మడత మాటలంటుంటే సహించలేక పోయింది. అన్నగారి మనసు తెలుసు. అందుకే ఆవిడ మాటలు లెక్క చేయ్యనట్టే తిరిగింది. ఆమె కూతురికి బోధించడం మొదలు పెట్టింది.
    "అందరి కన్ను ఒక్కలాగే ఉంటుందా? నీ పిల్లకు నువ్వు ముస్తాబు చెయ్యలేవు. గొడ్రాండ దృష్టి మహా చెడ్డదమ్మ." ఉలికిపడింది . తను గోడ్రాలా? అప్పటి నుండి పాపకు దూరంగా ఉండసాగింది. ఏ పాపను చూచినా యెత్తుకో బుద్దేసినా మనసు హెచ్చరిస్తుంది నిట్టూర్చి గదిలోకి వెళ్ళిపోయింది. ఆరోజు వంట తను ముట్టుకుంటే పెద్దవారిరువురికి పనికి రాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS