ప్రకాశాన్ని ఆలోచనలు చుట్టూ ముట్టాయి. ఇటువంటి సంఘటనకు అతడు ఎదురు చూడలేదు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనా ఎదురు చూసిందే అయితే, ఆ జీవితం కన్నా చావు- మేలు. ఆ బ్రతుకు బరువు లాగడం ఎడారిలో బండి లాగడం వంటిది. ఎదురుచూడని కొన్ని సుఖదుఖాలు ఎదురైనప్పుడే జీవితం మీద ఆశ- అసలు బ్రతకాలనే కోరిక కలుగుతుంది.ప్రకాశం ఎదురు చూడనివి అతని పాతికేళ్ళ జీవితంలో చాలా జరిగాయి. ఆతడు బాగా చదువుకొని ఎన్నో గొప్ప పనులు చేయాలనుకుంటున్న సమయంలో- అంటే ప్రకాశం బి.ఏ మొదటేడు చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు.అంతటితో చదువుకు స్వస్తి చెప్పి ప్రకాశం సేద్యం చూచుకోక తప్పలేదు. ఇంకా లేతనైనా అతని భుజాల మీద చాలా బరువులు, బాధ్యతలు ఉన్నాయి. వ్యవసాయం చూసుకోవాలి. వానాకాలం రాక మునుపే బావి పూడు తీసి లోతు చేయించాలి. చెల్లెలు శాంతను కనీసం బియ్యే దాకా చదివించాలి. ఇంకా ఇలాంటివి ఎన్నో!
ప్రకాశానికి ఆలోచనలతోనూ, విశ్వనాధయ్య గారికి మంచి కలలతోనూ తెల్లవారింది.
ఉమాపతి ఉదయం ఆరు గంటలకు మద్రాస్ కు చేరాడు. గదికి వెళ్ళి స్నానం చేసి, హోటల్లో భోజనం చేసి పడుకొని నాలుగు గంటల దాకా నిద్రపోయాడు. నిద్రలేచి ముఖం కడుక్కొని బట్టలు వేసుకుంటుంటే విమల వచ్చింది. విమలకు దాదాపు ఇరవై ఏళ్ళు. ఆవిడలో నవ నాగరికత కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ఎత్తుగా దువ్వి వదులుగా వేసుకున్న వాలుజడ, హృదయంలోని కోరికలుపొంగి పైకి వచ్చినట్లున్న స్థనాలు, పల్చని ముఖంలో బలమైన ముక్కు, ఆవిడ చూపుల కంటే చపలమైన హృదయం--విమల లక్షణాలు.
గదిలో అడుగు పెట్టి పెట్టగానే తలదువ్వు కొంటున్న ఉమాపతి కనిపించాడు. "హలో డియర్! వచ్చేశావా! గ్లాడ్" అంది ఒక్క అంగలో గెంతి ఉమాపతి భుజాల మీద చేతులు వేసి.
ఉమాపతి అలాగే ముద్దు పెట్టుకున్నాడు. "సరేగానీ, విమలా, అలా ఉత్తరం రాసేశావెంటి? మా నాన్న శుద్ధ 'బకరా' కాబట్టి తెలుసుకోలేక పోయాడనుకో" అన్నాడు ఉమాపతి.
"నాకుమాత్రం తెలీదేంటి? చూడు, డియర్! మనం ఈరోజే బెంగుళూరు బయలుదేరాలి."
ఆశ్చర్యంగా విమల కేసి చూశాడు ఉమాపతి.
"ఎందుకంత ఆశ్చర్యం డియర్! కాకినాడ లో ఏ పేషెంటుకో సూది గుచ్చుతున్న మానాన్నగారేమనుకుంటూ ఉంటారనుకున్నావ్-- నా కూతురు విమల వాళ్ళ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ తో బాటు బెంగుళూరు ఎక్స్ కర్షన్ వెళ్ళి ఏమేమో చూస్తూ ఉంటుంది-- అని.
ఉమాపతి నవ్వి అన్నాడు:
"అలా తల్లిదండ్రులను మోసం చేయకూడదు. తప్పకుండా వెడదాం. కానీ మనవద్ద మొరార్జీ దేశాయి లేడే!"
'అది మనకు వదులు డార్లింగ్."
"కానీ అక్కడ చచ్చేంత చలి అనుకుంటాను. ఇది డిసెంబరు నెల!"
"అందుకేగా , డార్లింగ్ , వెళ్ళడం?" అంది విమల ఉమాపతి భుజాల మీద చేతులేసి అరకన్నులతో చూస్తూ.
* * * *
తాను ప్రకాశంతో మాట్లాడిన సంగతి భార్యకు మాత్రమే చెప్పారు విశ్వనాధయ్య గారు. సుందరమ్మ సంతోషానికి మేరె లేకపోయింది.
"ప్రకాశం తల్లి సావిత్రమ్మ గారితో మాట్లాడాను.ఆవిడకు కూడా అభ్యంతరం లేదు. కానీ శాంత ను కూడా పెళ్ళి చేయాలనే ఆవిడ ఉద్దేశం లాగుంది. ఆ....సుందరా,శాంతను మన ఉమాపతి కి చేసుకొంటేనో?"
"శాంత చాలా కుదురైన పిల్ల" అంది సుందరమ్మ.
'అదే నా అభిప్రాయం కూడా. ఈ విషయాన్ని ఇక్కడ కదిపితే కుదరదు. నేను ఈ లోగానే బయలుదేరి మద్రాసు వెళ్ళి మనవాడితో మాట్లాడి రావాలనుకుంటున్నాను."
"మీకోసం ఎవరో వచ్చారు మామయ్యా." శారద వీధిలో నుంచి వచ్చి పిలిచింది.
విశ్వనాధయ్య గారు లేచి వీధిలోకి వెళ్ళారు.
"శారదా ఇటురా, ఇలా కూచో." సుందరమ్మ పిలిచింది.
అత్తయ్య గొంతులో ధ్వనిస్తున్న క్రొత్త దనానికి ఆశ్చర్యపోతూ శారద కూర్చుంది.
'అమ్మ ఎక్కడి కెళ్ళింది?"ప్రశ్నించింది సుందరమ్మ.
"నాకు తెలీదు. ఇంట్లో లేదు."
"నేనొక మాటాడుగుతాను -- మనసులోనే దాచుకుంటావు కదూ?"
తలూపింది శారద భయంగా.
"నీకు ఉమాపతిని పెళ్ళి చేసుకోవడం ఇష్టమే కదూ?"
శారద మనస్సు అల్లకల్లోలమైపోయింది. శాంతంగా ఉన్న మడుగులోకి రాయి విసిరి నట్లయింది. తనకూ, ఉమాపతీ కి సంబంధించిన పాత స్మృతులు రేగాయి. శారద మనస్సులో! ఆమెకు ఏడుపు వచ్చింది. అత్తయ్య గుండెల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
"అన్నీ నాకు తెలుసమ్మా. ఎడవ్వద్దు. ఇష్టం లేకపోతె పోనీలే. వాడు వెధవ. వాడితో నీకు సుఖం లేదు."
శారదకు ఏడుపు అధిక మౌతుంది.
"పోనీ, ప్రకాశాన్ని చేసుకోవడం యిష్టమేనా?" ఒడుపుగా సమయం చూసుకుని ప్రశ్నించింది సుందరమ్మ.
"అత్తయ్యా!!' శారద అదిరిపడింది. ఆవిడ వెన్నులో విద్యుఘాతం ప్రాకింది.
'అది కాదమ్మా. అతడు చాలా మంచివాడు. అంతో ఇంతో భూమీ పుట్రా వుంది. ఈ ఊళ్ళోనే మా కళ్ళ ముందే నువ్వు ఉండవచ్చు."
"అది కాదత్తయ్యా...నేనిలాంటి దాన్నని...."
తర్వాత సుందరమ్మ కు వినిపించ లేదు. అవును, శారద శీలం చెడిన పిల్ల! అలాంటి పిల్లను ప్రకాశానికి కట్టబెట్టి అతణ్ణి తాము మోసం చేస్తున్నారు. ఇది అన్యాయమే! కానీ శారదకు ఈ పాపంలో ఉన్న భాగమెంత? పాపం! అసలు శారదకు వయస్సు వచ్చిందే కానీ వయస్సు తో బాటు బుద్ది పెరగలేదు. ఈ పాపంలో ఆ పిల్లకు భాగం ఉన్నా బాధ్యత లేదు.
"ఆ మాటనకు తల్లీ. శరీరం వేరు, మనస్సు వేరు. చెడకూడనిది మనస్సు. అంత మాత్రానికి నువ్వు చేసింది తప్పు కాదనను. కానీ తెలియక విధి లేక చేసిన తప్పు. అందువల్ల పాపం నీది కాదు. ఆ వెధవ.... వాడు.... ఆ ఉమాపతిది." సుందరమ్మ మాట్లాడలేక పోయింది. ఆవేశం, కోపం ఆవిడ గొంతులో మాటలను అడ్డుకున్నాయి. ఒళ్ళో పడుకొని ఏడుస్తున్న శారదను గట్టిగా గుండెలకు అదుముకుంది. సుందరమ్మ కళ్ళ నుండి ఏకధారగా కారుతున్న కన్నీళ్లు శారద తలను అభిషేకించాయి.
వీధిలోకి వెళ్లిన విశ్వనాధయ్య గారు తిరిగి వచ్చి, వంటింట్లోకి రాబోయి మళ్ళీ వెళ్ళి పోయాడు. ఊళ్ళో విహారానికి వెళ్ళిన రత్నమ్మ తిరిగి వచ్చింది. ఆమె వచ్చిందని తెలియగానే శారద లేచి వెళ్ళిపోయింది. శారద ముఖం చూడగానే ఏదో జరిగిందనుకుంది రత్నమ్మ. అడిగినా ఏమీ లేదంది శారద.
* * * *
ప్రకాశం మధ్యాహ్నం భోజనానికి పొలం నుంచి తిరిగొచ్చారు . రాగానే --
"ఉత్తరాలేమైనా వచ్చాయామ్మా" అన్నాడు.
ప్రకాశం తల్లి సావిత్రామ్మ రెండు ఉత్తరాలు యిచ్చింది. సారధి మదరాసు నుంచి తన క్రొత్తగా అచ్చయిన కావ్యం "రుద్రవీణ" పంపాడు. ప్రకాశం ప్రాణ స్నేహితుడు భానుమూర్తి రెండో ఉత్తరం వ్రాశాడు. తనను హైస్కూలు తో లెక్కల మాష్టారుగా వేశారనీ రెండు రోజుల్లో వస్తాననీ వ్రాశాడు.
ప్రకాశం భోజనం చేసి 'రుద్రవీణ' చదువుకొంటూ తాళవారంలో కూర్చుని ఉంటే విశ్వనాధయ్య గారు వచ్చారు.
"ప్రకాశం , పది రోజుల ప్పుడు మదరాసు కు మా ఉమాపతి కి యాభై రూపాయలు పంపితే ఇవాళ డబ్బు తిరిగొచ్చింది" అన్నారు.
ప్రకాశం కాస్సేపు అలోచించి ఊళ్ళో ఉండడెమో అన్నాడు. ఆమాటతో విశ్వనాధయ్య గారు మరీ డీలా పడిపోయారు. విశ్వనాధయ్య గారు కొడుకు విషయంలో ఎంత బాధపడుతున్నారో ప్రకాశానికి తెలుసు. తన కుటుంబ విషయాలు కూడా విశ్వనాధయ్య గారు దాపరికం లేకుండా ప్రకాశానికి చెబుతారు. అతనితో చెప్పకపోతే వారికీ తృప్తి లేదు.
"నువ్వోకసారి మద్రాసుకు వెళ్ళి రాగలవా, ప్రకాశం?" అన్నారు కాస్సేపటికి.
"నా స్నేహితుడోకడు ఇవాళనే ఉత్తరం రాశాడు. అతని కొత్త కావ్యానికి ఇక మూడు రోజుల్లో ఆవిష్కరణ ఉందిట. నన్ను రమ్మని వ్రాశాడు. నేను వెడదామా వద్దా అనుకొంటున్నాను. మీరెలాగూ వెళ్ళమంటున్నారు కాబట్టి వెడతాను. రెండు పనులూ చూసుకు రావచ్చు."
"ఎప్పుడు బయలుదేరుతావు?"
"బయలుదేరితే రేపే బయల్దేరాలి." తప్పకుండా రేపే బయలుదేరు. అన్ని విషయాలూ బాగా గమనించి రా. వాడ్ని ఎలాగైనా నువ్వే బాగుచేయాలి ప్రకాశం." విశ్వనాధయ్య గారి కంఠం గద్గదమైంది.
"అలాగేనండి..."
"ప్రకాశం....!"
"ఏమండీ?"
"ఉమాపతి దారి కోస్తాడంటావా?"
"భగవంతుడున్నాడు ,చూద్దాం!"
విశ్వనాధయ్య గారు మరి కాస్సేపు సావిత్రంమతో మాట్లాడి వెళ్ళిపోయారు.
విశ్వనాధయ్య గారు ఇంటికి వెళ్ళేసరికి ఇల్లు గుండంలా ఉంది. రత్నమ్మ పిచ్చి కుక్కలా నోటికి వచ్చినట్లల్లా అరుస్తూ ఉంది. శారద ఏడుస్తూ మూల కూర్చుని ఉంది. సుందరమ్మ కూడా కోపంగా ఎవరి మీదో నోరు పారేసుకుంటుంది. విశ్వనాధయ్య గారు లోపలికి వెళ్ళేసరికి రత్నమ్మ ఎదురుగా వచ్చింది.
"ఏరా, విశ్వనాధం , నీకంత కానివాళ్ళమై పోయామా? మీ కొంపలో మేముండటం నీకు యిష్టం లేకపోతె చెప్పు. ఊరి బయట గుడిసె వేసుకుని ముష్తెత్తుకు బ్రతుకుతాం."
విశ్వనాధయ్యగారికి అసలు విషయం అంతు పట్టలేదు.
