Previous Page Next Page 
పాప నవ్వింది పేజి 4

 

    ఆవిడ చూపిన అభిమానానికి కమలకి కొంచెం ధైర్యం వచ్చింది. లోపలికి వెళ్ళి హల్లో కూర్చున్నారు. బిక్షాలు కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టాడు. కమల వొద్దంటే 'అదేమిటమ్మా కమలా ఇంక ఇది నీ ఇల్లే అనుకోవాలి. మాతోపాటు కలిసి వుండాలి. నీక్కావలసింది సిగ్గువిడిచి తినాలి తాగాలి. అంత బిడియపడద్దనటంతో కమల తీసుకుంది.
    అంతలో ఆమె లేచి కమల చెయ్యి వదలకుండా వున్న పాపని చూసి 'చూడమ్మా పాప తోటకెళ్ళి మల్లెలు కోసుకురా రమణమ్మతో' అని పంపించి ;చూడమ్మా కమలా నేను కొంచెం అర్జెంటు పని మీద బైటి కెళ్ళాలి. నీకీలోగా ఇల్లు చూపిస్తారా అంటూ తీసి కెళ్ళింది.
    వంట ఇల్లు ఇంట్లో కలిసి వున్నా వేరే పెద్ద భోజనాల హాలు, స్టోరు గది, వంట గది పెద్దవి విడివిడిగా వున్నై. భోజనాల హలో పదహారు మంది కూర్చునే బల్ల కుర్చీలతో ఒక మూల వుంది. మధ్యలో ఎనిమిది మంది కూర్చునే బల్ల ఒకటి శుభ్రమైన గుడ్డ పరిచి కుర్చీలతో సిద్దంగా వుంది.
    రాజేశ్వరిదేవి 'పంతులూ' అని కేకేయ్యటంతో చేతిలో గరిటె పట్టుకుని ప్రత్యక్షమైనాడు వంటమనిషి. 'ఈయనే మన వంట మనిషి.' అని కమల కి చెప్పి' చూడు పంతులూ ఇక నుంచి ఈ కమలదే పాప భారం అంతా. ఎట్లా కావాలంటే అట్లా చేసి పెట్టాలి. అసలే కొత్త, సిగ్గుపడుతుందో,తినదో జాగ్రత్త గా చూసుకో' అన్నది.
    సిగ్గుపడుతున్న కనులను చూసి పాపం చిన్న పిల్లే, మంచి ఇంటి పిల్ల. ఏం నిభాయిస్తుందో' అనుకున్నాడు పంతులు. 'చంద్రమ్మ ఏదీ' అన్న రాజేశ్వరీ దొడ్లో కాకరకాయలు కొస్తున్నదని చెప్పాడు. కమల రాజేశ్వరిదేవి దొడ్డి వైపోకసారి చూసి లోపలి కొచ్చారు.
    'కమలా ఈ పక్కగదులుమీవి. నీదీ పాపదీను.ఆ పక్కది రమణమ్మది. అంటే పాప ఆయాది. చెప్పటం మర్చిపోయాను. రమణమ్మే పాపకి నీళ్ళు పోయటం, తల దువ్వటం , బట్టలేయ్యటం అన్నం పెట్టటం అంతా చూస్తుంది. పాప వంటా అది కూడా రమణమ్మే చేస్తుంది. నీ కిష్టమైతే పాప తో పాటే వొండించుకు తిను. లేకపోతె నాతొ పాటు తిందువు గాని. నీ ఇష్టం. ఈ గది నీది. నీ సామాన్లక్కడే పెట్టారు. అన్నీ వున్నై గదిలో. నీకేదైనా కావాలంటే నిస్సంకోచంగా నాతోగాని, శ్రీనివాసరావు గారు, అంటే ఆరోజు చూశావే- ఆ పెద్దాయన - ఆయనతో గాని చెప్పు. వెంటనే ఏర్పాటు చేస్తాం.'
    ఈ హాలు ఆడుకోటానికి , పాడుకోటానికి, దేనికైనా సరే , బాగా పెద్దది.పక్క గదిలో పాప బట్టలు అవ్వీ పెడతాం. మునుపు మంచం కూడా ఇక్కడే వుండేది. కాని పాప ఇక్కడోద్దని అక్కడే వేయించుకుంది.'
    'చూడమ్మా కమలా. పాపకి నాలుగేళ్ళు నిండినై. వయసుకిమించిన తెలివి గలది. ఏదీ తెలుసుకోందే ఊరుకోదు. నిన్ను యక్ష ప్రశ్నలాటి సతమతం చేస్తుంది. ఎంత వోపికతో చెప్తావో ఏమో' అంటూ పాప పేరొచ్చేటప్పటికి నవ్వుతో నిండిన కమల ముఖాన్ని తృప్తిగా చూసింది. 'పాప తండ్రి యూరప్, అక్కడ తిరుగుతున్నాడు. ఎప్పుడొస్తాడో తెలియదు.' అంటుంటే ఆమె ముఖాన విచారం కమ్మటం కమల గమనించి ఎందుకా అనుకుంటూ వుండగానే 'పాప తల్లి....లేదు' అనేసి ముఖం తిప్పెసుకుంది. ఆమె మనసు బాధపడుతున్నట్టు గ్రహించిన కమల ఎందుకా అన్నట్టు ఆలోచిస్తూ నిల్చుంది.
    ఇంతలో ఆమె తేరుకుని 'కానీ కమలా నీపని సగం తేలికైంది. ఎందుకంటావేమో పాప ఎందుకో నిన్ను చూస్తె అభిమాన పడుతుంది. సాధారణంగా అది ఎవరి దగ్గరికి చనువుగా పోదు. మాట్లాడదు. ఆఖరికి రమణమ్మ తో నాలుగేళ్ల నించి చూస్తున్నా ఎక్కువ మాట్లాడదు. అటువంటిది నీవు వొచ్చి వెళ్ళినప్పటి నించి ' కమలీ' ఎప్పుడొస్తుందన్న ప్రశ్నే. వొచ్చి నప్పుడు నీతో ఎక్కడ ఎట్లా అడుకోవాలో , ఎట్లా నీచేత కధలు చెప్పించుకోవాలో  అన్ని ఆలోచనలే. ఎవరేమిచ్చినా తీసుకోదు. అట్లాంటిది నువ్వు పళ్ళివ్వగానే సంబరంగా తీసుకొనటం నాకే ఆశ్చర్యంగా వుంది. ఎవరూ పేరుపెట్టి పిలవటానికి వీల్లేదంటుంది. ఒక్క శ్రీనివాసరావు గారిని మాత్రం మధురీ అననిస్తుంది. అట్లాటింది మొదటి రోజునే నీవు మాధురీ అంటే వూరుకుంది. వింతగా!
    ఇక పనల్లా నువ్వు పాపని కనిపెట్టుకుని ఉండి కాలక్షేపం చెయ్యటం. మంచి పద్దతులు అలవాట్లు నేర్పడం, కాస్త చదువంటే ఇష్టం కలిగేటట్లు చెయ్యటమూను. నువ్వంటే ఇష్టపడుతున్నది కనక అట్టే పేచీ పెట్టదనుకుంటాను. నేనున్నా లేకపోయినా పాప బాధ్యతంతా ఇక నీదే. ఏదైనా కావలిస్తే నన్ను గాని, శ్రీనివాసరావు గారినైనా కాని అడుగు. నీవు నిస్సంకోచంగా హాయిగా ఇంట్లో మనిషల్లే వుండు, భయపడకు. ఈ గది నీ ఇల్లు. మార్పులు కావాలంటే చెప్పు, నిమిషంలో చేయిస్తా' అని వీపు తట్టి వెళ్ళిపోయింది.
    'మెల్లగా కమల తన గదిలోకి వెళ్ళింది. మంచం, కుర్చీలు , బల్ల, ఫాను డ్రెస్సింగ్ టేబిల్ అన్నీ పెట్టి వున్నై. అ గది వెనక చిన్న స్నానాల గది . అందులో వాష్ బేసిన్ పక్కనే చిన్న దొడ్డి అన్నీ అందులోనే అమర్చారు. తనకి కావాలంటే తప్ప బైటకి పోయే అవసరం లేదు. ఇక్కడ తన ఫిడేలు కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. వాయించటానికి టైమున్నా లేకపోయినా అని అనిపించింది.
    'కమలీ , కమలీ ఎన్ని మల్లె పూలో చూడు' అంటూ సజ్జ నిండా పూలతో పరిగెత్తు కొచ్చిన పాపని దగ్గరకి తీసుకుంది.
    'ఎన్ని పూలు తెచ్చావమ్మా. అన్నీ నువ్వే కోశావా మాధురీ? చేతులు నేప్పేయ్యలేదా?'
    'లేదు కమలీ , రమణమ్మ గిల్లి కింద పడేస్తే నేనేరి సజ్జ లోవేశా. కమలీ నీకు గుచ్చటం వచ్చా?'
    'గుచ్చటం ఏమిటి మాధురీ? గుచ్చితే బాగుండవు. నేను కట్టి పెట్టనా. మరి మరువం కనకాంబరాలు లేవా మాధురీ?'
    'వున్నై , బోలెడున్నై, రమణమ్మ ఆవ్వి వద్దంటుంది. తెస్తా నుండు' అంటూ పరిగెత్తింది.
    'మాధురీ అగు. నేనూ వొస్తా ' అంటూ కమల కూడా వెనక వెళ్ళింది. మాధురీ ఈ మాటలకి పరిగేత్తేది ఆగి కమల వచ్చినాక చెయ్యి పట్టుకుని అక్కడున్న చెట్లన్నీ చూపించటం మొదలెట్టేనది.
    ఎన్నో రకాల గులాబీలు, మల్లెలు జాజులు సంపెంగ లు , మందారాలు విరబూసి వున్నై. తోటలో కొన్ని గుబురుగా కత్తిరించి వున్నై- కొన్ని సిమెంటు ఆర్చీల మీద పాకి వున్నై . వాటి కింద సిమెంటు బెంచీలు. ఎటు చూసినా కమల కళ్ళకి హాయిగా వుంది. తివాచి పరిచినట్లు పచ్చిక, అక్కడక్కడ పౌంటైన్ లు , లైటు స్తంభాలు - కమలకి ఎదో సినిమా చూస్తున్నట్లుంది.
    అంతలో పాప ఒకచోటికి తీసికెళ్ళింది.' అక్కడ చిన్న పిల్లలు ఆడుకునే సీసాలు, జారుడు బండలు , వుయ్యాలలూ అన్నీ వున్నై గబగబా కమలని ఈడ్చుకుంటూ పాప సీసా ఎక్కి 'నువ్వు కూచో కమలీ' అని కమల తటపటాయిస్తుంటే చెయ్యి పట్టుకు లాగి కూర్చోపెట్టి పరిగెత్తి అవతల వైపున కూర్చుంది. సంతోషంతో చప్పట్లు కొడుతూ ఆడటం మొదలు పెట్టింది. రెండు నిమిషాలు కాగానే లేచి వుయ్యాల దగ్గరికి కమల ని లాక్కెళ్ళి వుయ్యాలెక్కి, నువ్వూ ఎక్కు కమలీ ఎవరేత్తుగా పోతారో 'అంటూ కూర్చుంది. కాని వూపు తెచ్చుకోటం చేత కాలేదు.
    'కమలీ  వూపుతావా?'
    మళ్ళీ రెండు నిమిషాలు కాకముందే జారుడు బల్ల దగ్గరికి పరిగెత్తింది.
    ఆడుకోటానికి ఎవరూ లేక మొహం వాచినట్లై - కమలీ దొరకగానే సంతోషం పట్టలేక చప్పట్లు కొడుతూ మొహం సంతోషంగా వెలిగిపోతూ వుంటే, కాలు నిలవకుండా , దూది పింజల్లె పరిగెడుతున్న మాధురి ని చూసేటప్పటికి కమలకి తల్లి లేని పిల్లన్న మాట జ్ఞాపకం రావడంతో మనసులో జాలి, అభిమానమూ పుట్టుకొచ్చినై.
    అంతమంది పెద్దవాళ్ళ మధ్య ఆడుకునేందుకు , సంతోషాన్ని తనతో పాటు పంచుకోటానికి ఎవరూ లేక ఆ పసి మనసెంత ఆరాటపడేదో, స్వానుభవంతో కొంత వూహించగలిగింది. ఏ వయసు వాళ్ళకి ఆ వయసు వాళ్ళు యెంత అవసరమో గ్రహించింది. అందర్లోకి కాస్త తను చిన్నదిగా కనపడడాన ఆ పాప మనసులో తను స్థానం పొందగలిగానని అర్ధం చేసుకుంది. ఇది నిలుపుకోవాలంటే కేవలం మాధురితో సమానంగా తనూ ఆడాలి. పాడాలి. మెలగాలి. మాధురి కోరుకునే ఆ 'తోడు' కావాలి తను. అని నిశ్చయించుకుంది.
    వెంటనే పాప దగ్గరికి పరిగెత్తి కెళ్ళి 'అమ్మ దొంగా అన్ని నువ్వొక్కత్తేవె ఆడుకుంటావా , నేనోద్డా.' అంటూ ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఒక క్షణం కమల గొంతు చుట్టూ చేతులేసి వెంటనే దిగి వుయ్యాల ఎక్కి కూర్చుంది సంబరంగా. కమల వూపుతుంటే కేకలేస్తూ వూగుతున్నది ఏవేవో మాతాలాడుతూ.
    ఇంకా పాప టిఫిన్ కి రాలేదేమా అని రాజేశ్వరి దేవి చూట్టానికి వచ్చింది. తోటలో వుందని తెలిసి పిలవటానికి రమణమ్మని పంపి తను కిటికీ లోంచి బైటకి చూసింది. పాప కమల మెడచుట్టూ చేతులు వేసి మాటలు చెప్పడం , వాళ్ళిద్దరూ నవ్వుకోటం , పాప సంబరంగా చప్పట్లు కొట్టడం, పరిగెట్టడం చూసి ఆమె ముఖం ఆనందంతో విప్పారింది. ఇన్నాళ్ళ కి పాపకి నచ్చిన నేస్తం దొరికిందని హాయిగా తృప్తిగా లోపలి కెళ్ళింది.
    వాళ్ళ మామ్మ దగ్గరికి పరిగెత్తుతున్న పాపను పట్టుకుని ' మాధురీ అగు, చేతులు సబ్బేసి కడుక్కోవాలి. మురికి పట్టం ఇద్దరం రా' అనగానే ' ఎవరు ఫస్ట్' అంటూ పాప పరిగెత్తింది. నవ్వుకుంటూ కమల వెనక వెళ్ళింది. రమణమ్మ చేతులు కడగపొతే ' వద్దు కమలీ కడగాలంది' పాప. కమలే ముఖం చేతులు కడిగి రతుడిచి పౌడరు రాసి జుట్టు దువ్వింది. కమల చెయ్యి పట్టుకుని వంట గది వైపు పోబోయిన కమలితో పాప "టీ అక్కడ కాదు ఇక్కడా' అంటూ వేరే గదిలోకి తీసుకొని వెళ్ళింది.
    అక్కడ అప్పటికే రాజేశ్వరి దేవి, శ్రీనివాసరావు గారూ కూర్చుని వున్నారు. కమలని చూడగానే అయన 'ఏమ్మా ఇక్కడ బాగుందా లేకపోతె అప్పుడే వెళ్ళిపోవాలని చూస్తున్నావా' అన్నారు నవ్వుతూ.
    కమల నవ్వుతూ , సమాధానం చెప్పే లోపల పాప ఒక్కదూకులో కమల దగ్గర కొచ్చి చెయ్యి పట్టుకుని 'కమలీ నువ్వు వెళ్తావా . వెళ్ళిపోతావా' అంటూ ఏడుపు ముఖం పెట్టటం చూసి కమల చటుక్కున పాపను దగ్గరకు తీసుకుని 'లేదమ్మా వెళ్ళను. నీ దగ్గరే వుంటా' నన్న మాటలకి కొంచే తృప్తిపడ్డా చెయ్యి వదలకుండా తనతో పాటు కుర్చీ దగ్గరకి తీసుకొచ్చింది.
    'కూర్చోమ్మా కమలా, టిఫిన్ తీసుకుందువు గానీ' అన్న మాటలకి కమల సిగ్గుగా తల వంచుకుని 'నేనే వేరే తింటాలెండి.' అన్నది. దానికి వాళ్ళిద్దరూ 'ఇకనించి అదేం వీల్లేదు. మాతోపాటే నువ్వునూ . లేకపోతె పాపకి చెప్తాం' అన్నారు. అయన 'మధురీ మీ కమలీ చెయ్యి వదలకపోతే ఎట్లా తింటుందమ్మా' అన్నారు.
    పాపకి వేరే టిఫిను , పాలు, ప్లేక్స్, బిస్కెట్స్ పెట్టారు. పాప తినకుండా కూర్చుంది. 'ఏం పాప ' అన్నదానికి ' కమలీ' వెళ్ళిపోతుంది , నేను తినను' అంది.
    'లేదమ్మా , నేను వెళ్ళను. నే పెడ్తా తిను' అంటూ పెట్టటం మొదలెట్టింది. పాప రోజూ కన్నా కాస్త ఎక్కువే తిని కమల చెయ్యి వదిలి పెట్టింది. 'నువ్వు తొందరగా తిను' అంటూ.
    కమల ఆ పెద్దవాళ్ళ ఎదుట తినటానికి సిగ్గుపడటం చూసి 'సరే కమలా రేపటి నుంచి మీ గదికే పంపిస్తా. ఇవాళ్టికి తిను' అన్నది రాజేశ్వరిదేవి. కమల ఎట్లాగో కానిచ్చి బైటికొచ్చేసింది పాపతో.
    వాళ్ళిద్దరూ బైటి కెళ్ళగానే 'మంచి పిల్లే దొరికింది. పాప అదృష్టం , మన అదృష్టం బాబాయ్' అన్నది రాజేశ్వరి.
    'నిజమేనమ్మా. మంచి తెలివైన నెమ్మదైన పిల్ల. ఆరోజున చూసినప్పుడే అనుకున్నా.' అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS