3
బెట్టుగా కీచుమన్న చప్పుడుతోపాటు, ఘల్లుమన్న శ్రావ్యధ్వనికూడా వినిపించడంతో హాల్లో పడక కుర్చీలో విశ్రాంతి తీసుకుంటూన్న రాఘవయ్య. భారంగా నిట్టూర్చాడు. అలాంటి చప్పుడు వినిపించినప్పుడల్లా లోపల ఏం జరుగుతుందో అతనికి తెలుసు.
భార్య కాంతమ్మ ఇంటిపనులన్నీ ముగించుకుని సావకాశంగా బీరువా దగ్గరికివచ్చి కూచుని బరువుగా ఉన్న అడుగుసొరుగు లాగుతుంది. అది బద్ధకంగా కీచుమంటూ తెరుచుకుంటుంది. దాని తెరుచుకున్న నోటిలోంచి, ఘల్లుమని తెల్లగా నవ్వుతూ, సునంద పెళ్ళికి వచ్చిన వెండి సామాన్లు కాంతమ్మని పలకరిస్తాయి. ఆ పలకరింపుకి పరవశించిపోయి కూతురు సునందని చూసినట్లే సంబరపడిపోతుంది కాంతమ్మ. ఆ తర్వాత ఈ వస్తువు ఎవరిచ్చారు ఈ వస్తువెవరిచ్చారు అని తనలో తను అనుకుంటూ, ఒక్కొక్కటే జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నిస్తుంది. ఏ పన్నీరుబుద్ది లాంటిదో, అగరు వత్తుల పెట్టో పువ్వుల సజ్జో మిగిలిపోతాయి కాంతమ్మ జ్ఞాపక శక్తిని వెక్కిరిస్తూ ఎంత ప్రయత్నించినా అవి ఎవరు ఇచ్చారో జ్ఞాపకం రాదు. ఇంక దాంతో ఆ సంగతి వదిలేసి సునంద పసితనం గురించీ, శివరాంని తప్ప ఇంకెవర్నీ పెళ్ళి చేసుకోనని ఆమె పెట్టిన పేచీ గురించీ, వైభవోపేతంగా జరిగిన సునంద పెళ్ళీ ఆ తర్వాత సునందా, శివరాంలు రెండు మూడేళ్ళు అన్యోన్యంగా కాపురం చెయ్యడం ఆ మీదట శివరాం కి క్షయవ్యాధి రావడం వీటన్నిటి గురించీ ఆలోచించడం మొదలెడుతుంది. ఆ ఆలోచనల ప్రవాహంలో. సునందా శివరాం ల గురించి రాఘవయ్య విసుక్కున్న ఘట్టం దగ్గరికి వచ్చి కాంతమ్మ మనస్సు చటుక్కున ఆగిపోతుంది. ఆగిపోయి ఆ మట్టున. ఆ రోజున జరిగినదంతా ఒక్కసారిగా ఆమె మనోనేత్రం ముందు మళ్ళీ కదులుతుంది.
అప్పటికి శివరాం కి టి.బి. వచ్చి హాస్పిటల్ లో చేర్పించి నాలుగు నెలలైంది. బెంగతో, మానసికమైన ఆందోళనతో, ఇంటికి హాస్పిటల్ కీ మధ్య తిరుగుతూ మనిషి అంతా చిక్కిపోయి, అతిదీనంగా, జాలిగా, తయారైంది సునంద. చిన్నప్పటి నుంచీ అల్లారు ముద్దుగా పెరిగిన ఒక్కగానొక్క కూతురు బతుకు ఇలా అయి పోయిందేవిటి భగవంతుడా అనుకుంటూ, ఆపుకోలేని దుఃఖాన్ని మనస్సులో దాచుకుంటూ, ప్రతి సెకనూ పడుతూన్న రంపపు కోతని భరిస్తున్నారు కాంతమ్మా రాఘవయ్యలు, పరిస్థితి అంతా దట్టంగా, చీకటిగా, భీతిగా, భయాందోళనలతో ఉంది.
మదనపల్లి నుంచి ఆ ఉదయమే వచ్చింది సునంద, మూర్తీ భవించిన శోకదేవతలా కనిపించిన కూతుర్ని చూసేసరికి కడుపు తరుక్కు పోయింది కాంతమ్మకి. చిక్కి శల్యం అయిన కన్న కూతుర్ని చూసి కళ్ళనీళ్ళు తిరిగి ముఖం అటు తిప్పుకుని కళ్ళు తుడుచుకున్నాడు రాఘవయ్య, మధ్యాహ్నం భోజనాలదగ్గర సునంద అసలు సంగతి ఎత్తింది. శివరాం కి డిపార్ట్ మెంటు వారు ఇస్తూన్న అర్ధ జీతం మీద సెలవు కూడా నెలతో అయిపోయిందనీ. అక్కడ నుంచి శలవు పూర్తి జీతం నష్టంమీదే అనీ. అసలే జీతం అంతంతమాత్రంగా ఉండి అందులో కొత్తగా పెళ్ళయి సరదాగా కాపురం చేసుకుంటూన్న గోపాలాన్ని డబ్బుసర్దుబాటు చెయ్యమానడం శివరాం కి ఇష్టంలేదనీ, అందువల్ల టి.బి. తగ్గే వరకూ శివరాంకి రాఘవయ్యే సహాయం చేయవలసి ఉంటుందనీను.
అల్లుడి ప్రాణం కోసం ఎన్ని వేలయినా గుమ్మరించడానికి రాఘవయ్య సిద్ధంగానే ఉన్నాడు. అందుకు తగ్గ తాహతుకూడా ఉంది అతనికి. కన్న కూతురు కలకల్లాడుతూ పచ్చగా పది కాలాలపాటు వుండడానికి డబ్బేవిటి. అవసరం అయితే ప్రాణం కూడా అర్పించేవాడు. కాని అతనికి ఒక్క విషయం పట్టుకుంది, ఈ శివరాంని తప్ప ఇంకెవరినీ ససేమిరా చేసుకోను అని ఆ రోజున సునంద అలా పట్టుపట్టకపోతే ఈ రోజున ఈ స్థితి ఉండేది కాదు కదా అని, ఆ మాటే అన్నాడు.
"చూడమ్మా ఆ రోజున నేను చిలక్కి చెప్పినట్లు చెప్పాను, కుర్రాడి అందమూ తెలివీ చూస్తున్నావు, ఇవాళ పోలీసు ఇన్ స్పెక్టరు ఉద్యోగం ఉంది అతనికి వెనకాల కొంచెం ఆస్తీ. ఇల్లూ వగైరాలు లేకపోతే ఆనక అవస్థ అవుతుందని - విన్నావా?..... చూడు ఇప్పుడు ఏ వైందో, ఆస్తి ఉంటే ఇలాంటి సమయంలో ఆదుకున్నా?"
"నాన్నా దెప్పడానికి ఇదా సమయం?" గుండెతరుక్కు పోయేలా అడిగింది సునంద.
"దెప్పడం కాదమ్మా ఉన్న విషయం అంటున్నాను, అప్పుడీ సంబంధం చేసేదాకా నువ్వూ మీ అమ్మా నా కాళ్ళకింద నిప్పులు పోసేశారు. నన్ను స్థిమితంగా ఆలోచించుకొనిచ్చారా? తొందరపడి మనం గోతిలో దూకాం తల్లీ" అన్నాడు రాఘవయ్య డగ్గుత్తికతో.
"అదేం మాటలు నాన్నా? ఇవాళేదో ఖర్మం చాలక ఆయనకి జబ్బుచేస్తే ఏం చేస్తాం? ఈ రెండు మూడేళ్ళ నుంచీ పడిన సుఖం అంతాదీంతో పోయినట్టే?"
"సుఖం హుఁ! చిన్నప్పటి నుండీ జమీందారీ బిడ్డలాగ పెరిగావు ఇక్కడ అటువంటిది రెండు మూడు వందల కాలబత్తెం జీతం తెస్తూన్న ఆ శివరాంతో నువ్వేం సుఖపడ్డావు తల్లీ"
"అదేవిటండీ మనం అవసరం అయినప్పుడల్లా రెండు వందలూ సాయం చెయ్యడం లేదూ? అమ్మాయిని ఆ మట్టున వదిలేశామా? అంది కాంతమ్మ.

"పూర్వంలాగా అలా ఒకటీ రెండూ వందలతో అవుతుందిలే, ఇంకా ఇక్కడినుంచి వేలు కుమ్మరించాలి ఆ క్షయనుంచి ఆయనగారిని తప్పించి మన సునంద ముఖంలో ఆనందం పండించాలంటే."
రాఘవయ్య మాటలు వింటే పౌరుషంతో సునంద ముఖం ఎర్రబడింది ధనసహాయం అడగడానికి వచ్చిందనేకదూ నాన్న ఇంత ఈసడింపుగా మాట్లాడుతున్నారు. తండ్రి ముఖంలోకి తీక్షణంగా చూసి "మీరు వేలు మాకేం ఊరికే ఇవ్వక్కర్లేదు నాన్నా అప్పుగా ఇవ్వండి ఆయనకి జబ్బు తగ్గాక తీర్చుకుంటాం" అంది.
"అప్పా? ..మా తర్వాత ఈ ఆస్తిఅంతానీదే కదా. నీ ఆస్తిలోంచి నీకు అప్పు ఏవిటే పిచ్చి తల్లీ! కళపళపడుతూ అంది శాంతమ్మ.
అప్పు ఇస్తే మీ ఆయన అసలు మాట అలా ఉంచు, అధమం వడ్డీ అయినా తీర్చగలడుటే అమ్మాయ్!" హేళనగా అన్నాడు రాఘవయ్య.
ఒళ్ళంతా కోపంతో భగభగమండిపోతోంది సునందకి. తింటూన్న అన్నం ఆ మట్టునే నోట్లో పెట్టుకోకుండా ఆగిపోయింది.
రాఘవయ్య ఏదో ఆలోచిస్తూన్నట్లు అక్షరాలు దీర్ఘంగా సాగదీస్తూ అన్నాడు. "అసలు నా అనుమానం ఇతనికి పెళ్ళినాటికే టి.బి లక్షణాలు ఉన్నాయేమో అని. తొందరపడి ఈ దౌర్భాగ్యం సంబంధం చేశాం. మనల్ని మోసం చేసి బంగారంలాంటి పిల్ల బతుకుని...."
"నాన్నా! భయంకరంగా ఒక్క కేకవేసి తింటూ తింటూన్న అన్నం కంచం తోసేసి. లేచి నిలబడింది సునంద కోపంతో ఆమె కళ్ళు ఎర్రగా మందారాల్లా అయిపోయాయి. "నా ఎదురుగుండా ఆయన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్లు అవమానపరిస్తే నేను సహించేది లేదు అయినా మీ సహాయం అర్ధించి వచ్చాను కనకే కదా నేనూ. ఆయనాను కింత చులకన అయాం? మీ డబ్బు ఎవరికీ అవసరంలేదు. మీ దగ్గరే ఉంచుకోండి. ముష్టిఎత్తి అయినా సరే డబ్బు సంపాదించి ఆయన్ను బతికించుకుంటాను. చచ్చినా మీ డబ్బు ముట్టుకోను. వస్తా" అంటూ వెళ్ళిపోయింది సునంద. ఏడుస్తూ అడ్డువచ్చిన కాంతమ్మని తోసేసి, "నీ బాధ చూడలేక అన్నాను కాని నీకింత కోపం వస్తుందంటే అందునా?" అంటూ నోట్ల కట్టలు అందించబోయిన రాఘవయ్య చేతిని విరుసుగా విదిల్చి పారేస్తూ.
అలా కోపగించి సునంద వెళ్ళిపోయాక ఎన్నో నెలలు గడిచిపోయాయి ఈ సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కాంతమ్మ కళ్ళు చెరువులవుతాయి. ఇలా కాంతమ్మ నిత్యం బాధపడటం, తన మనస్సులో గుప్తంగా దాచుకున్న బాధకి తోడు ఆమె బాధని కూడా చూడలేక రాఘవయ్య నిట్టూర్చడం. పరిపాటి అయిపోయింది. అందుకే కాంతమ్మ బీరువా సొరుగుతీసి సునంద పెళ్ళికి వచ్చిన వెండి సామాను తీస్తోందని తెలిసి. నిస్సహాయంగా నిట్టూర్చి ఊరుకున్నాడు రాఘవయ్య. అతనికి నిత్యం అనుభవంవల్ల తెలుసు. సామాన్లు చూడడంతో ప్రారంభం అయిన ఈ తతంగం. కన్నీళ్ళతో సమాప్తం అవుతుందని.
కాస్సేపు ఆగి, ఇంకు ఆగలేక హాలు దాటి గదిలోకి వెళ్ళి. భార్య పక్కనే నిలబడి తను కూడా ఆ వెండి సామాను వైపు దీనంగా చూడసాగాడు రాఘవయ్య. ఒక్కొక్క వస్తువే తీసి వరసగా పేరుస్తూ. ఏవో జ్ఞాపకాలు తరుముతూంటే, తనలో తను మాట్లాడుకాసాగింది కాంతమ్మ.
"ఏవిటే అలా గొణుక్కుంటున్నావు?" అంటూ నవ్వుతూ అడిగాడు రాఘవయ్య. కాంతమ్మ సమాధానం చెప్పలేదు అధమం అటువైపు తిరిగనైనా లేదు. కాస్సేపు ఆగిమళ్ళీ ఆనాడు "ఏవిటి ఈ బొమ్మల కొలువు? మళ్ళీ పెట్టావా? ఎన్నాళ్ళు చూస్తే కడుపు నిండుతుంది?" అని.
"ఏం చెయ్యను?" ఇవే మిగిలాయి నాకు. వెన్న పడేసి వేలు నాక్కున్నట్లు అమ్మాయి బదులు అమ్మాయి వస్తువులు చూసుకొని బతకవలసిన స్థితి వచ్చింది.
"ఏం చెప్తాం? దాని పట్టుదల అలా ఉంది. ఎన్నాళ్ళయిందో రాకపోవడం అల్లా పోయి, ఆఖరికి ఒక్క కార్డు ముక్కయినా రాయడం లేదు చూడు. ఏం అంత కానివాళ్ళం అయ్యామా?"
"రాదండీ అది ఇంక మనింటికి రాదు" అంది కాంతమ్మ వస్తూన్న దుఃఖాన్ని ఆపుకుంటూ.
"అయినా నిన్న మొన్నటి పిల్ల దానికి అంత పట్టుదల ఏమిటి? అల్లారుముద్దుగా పెంచుకొన్నాం. ఆ మాత్రం మాట అన తగమా? అయ్యో బంగారంలాంటి పిల్లకి ఇలాంటి రోగిష్టి మొగుడు సంప్రాప్తం అయ్యాడే అన్న బాధవల్ల ఏదైనా అంటే, ఇంక అంతే? ఇంకా మనింటికి రాదూ? మనతో మాట్లాడదూ? మనం పంపించిన మణిఆర్డరు తిరగకొట్టేస్తుందా? మన మీద కక్షకట్టి రాత్రింబగళ్ళు శ్రమపడి ఉద్యోగం చేసి ఆ మొగ్దికి మందు ఇప్పించుకుంటుందా? ఎవంత ఖర్మం వచ్చిందని తనకి? ఇక్కడ తండ్రి ముండాకొడుకు ఇంకా బతికి ఉన్నాడుగా? నన్ను అవమానపర్చి ఏడిపించడానికి కాకపోతే ఎందుకిదంతా? పోనీ నా సంగతి వదిలెయ్యి. నీకేనా గౌరవం ఉంచిందా?" ఇలా రాఘవయ్య ఆవేదన పట్టలేక గట్టిగా అంటూంటే. కాంతమ్మ బాధగా అతని కేసి చూసింది.
"అయ్యో ఏం అవస్థపడుతోందో అని ఉండబట్టలేక ఆ మధ్య నువ్వు వెళితే ఏం గౌరవం చూపించింది? మాటి మాటికీ నా ఆరోగ్యం. అవస్థా గురించి మాట్లాడకు అంది. అవునా? నువ్వు డబ్బు ఇయ్యబోతే విసిరి కొట్టింది. మెడలో గొలుసూ నెక్లసూ ఇదే అంటే. వాటి సంగతి నీకు అనవసరం అంది. ఇలా తల్లిని అయిన నిన్నే అంది అంటే..."
రాఘవయ్య కేసి నిస్సహాయంగా చూసింది కాంతమ్మ!
"మన డబ్బు తీసుకోడానికి అంత పౌరుషపడుతోందే. ఆ గొలుసూ నెక్లసూ ఎవరివి? మనవి కావూ? ఆ మాట కొస్తే తను మాత్రం? పిచ్చిపిల్ల? తనువేరూ మనం వేరూనా? అర్ధం లేని పట్టుదలకాకపోతే?"
"ఆ.... పట్టుదలల్లో తక్కువ వాళ్ళెవరు లెండి? అందరికి అందరే - ఒక్క మాటు అమ్మాయిని చూసి వద్దాం అంటే అప్పుడు నాతో మీరు వచ్చారా?
"ఊ ...ఎందుకు రావడం? నీకు చూపించగా మిగిలిన గౌరవం ఏదైనా ఉంటేనే కూడా కొంత పంచుకోడానికా.....
"అసలు దీనికంతకీ మీరండీ కారణం? అప్పుడు మీరు దాన్ని అంతలేసి మాటలు అనకపోతే దానికి ఇంత కోపం రాకపోను"
"మాటలో, మాటలో, అంటావు - నేను దాన్ని ఏం అన్నానే? పెళ్ళికి ముందు నుంచే మీ ఆయనకి టి.బి. టింజ్ ఉందేమోనే అన్నా. అంతేగా.
"అది చాలదేవిటి దాని మనస్సు కష్టపెట్టుకో డానికి?"
ఆ మాటకే "కష్టం వచ్చేసిందా" ఆహా! అసలునన్నడిగితే నీమూలానే అది ఇలా తయారయింది. చిన్నప్పటి నుంచీ గారం మప్పి, ఏది కావాలంటే అది చేస్తూ వచ్చావు...."
"నేనా, మీరా గారం చేసింది? ప్రతి చిన్న విషయంలోనూ నా సలహా పాటించకుండా అది ఎలా అంటే అలా కొనిచ్చారు. ఆడపిల్లకి చదువెందుకండోయ్! "అంటూ నేను నెత్తి నోరూ కొట్టుకుంటే విన్నారా? అది చదువు కుంటా నంటోంది చదుకోనీ అంటూ కాలేజీలో చేర్పించారు.
చదువు వల్ల ఏం వచ్చిందే నష్టం? ఆ చదువు వల్ల ఈ పెంకితనం బయలుదేరింది అంటావా?"
"ఆ చదువే ఇప్పుడు దానికి ఆయిధంగా తయారయింది మనమీద ప్రయోగించడానికి. అప్పుడా చదువు చెప్పించకపోతే ఇప్పుడీ ఉద్యోగంలో అంటూ చేరి, డబ్బు సంపాదించి అతనికి మందు ఇప్పించుకోగలిగేదా? మన యింటికి రాకుండా మాన్ సహాయం పొందకుండా ఇలా మొండిగా ఉండగలిగేదా? ఇప్పుడు దానికి ఎవళ్ళం అక్కర్లేకపోయింది.
భార్య మాటల్లో నిజం ఉన్నట్లు అనిపించింది. నిజమే సునందకి కాలేజీ చదువు చెప్పించి తను ఈ ఆవేదన కొనితెచ్చుకున్నాడేమో-సునందకి చదువు రాకపోతే పరిస్థితులు ఇలా ఉండి ఉండకపోను - చదువే అనర్ధదాయకమేమో ఆడపిల్లలకి?" ఛ....ఇలా ఆలోచిస్తున్నావేమిటి? నాన్సెన్స్ - దీని చవట కబుర్లతో నా జ్ఞానం కూడా మసిబారుతోంది. వెంటనే రాఘవయ్య కస్సుమంటూనే లేచాడు కాంతమ్మ మీదకి. "ఒక్కమనిషి మూర్ఖం వందమందిని మూర్ఖుల్ని చేస్తుందట. నీ తెలివితక్కువ నీతో ఆగకుండా నన్ను కూడా చుట్టుకుంటోంది. ఇంక చాలుకాని వస్తుప్రదర్శన, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకో ఇదిగో నీకు ఇదే చెప్తున్నా. ఇంకీ ఇంట్లో ఆ సునంద ప్రస్తావన కాని. దాని జ్ఞాపకాలు రేపే వస్తువులు చూడడంకాని జరగడానికి వీలులేదు. ఆ వెండిసామానంతా సొరుగులో పడేసి ఆ సొరుగు మూసేసి వెళ్ళు. ఊ.....వెళ్ళమంటూంటే నిన్నే "భయంకరంగా గర్జించాడు రాఘవయ్య.
