Previous Page Next Page 
ముద్ద మందార పేజి 5

 

                                   3

 

   

    రోజులు మరీ పొడిగా దొర్లిపోతున్నాయి. ఓ నెల గడిచింది. సింహాచలం నా దగ్గర బాగా చదువు నేర్చుకుంది. యాసగా మాట్లాడుతుండడం వీలైనంత వరకూ మాన్పించాను. శుచీ శుభ్రం దాని దగ్గరే నేర్చుకోవాల్సి వచ్చినందు వల్ల అది దానికి నేర్పనవసరం లేకపోయింది. నాతొ చాలా కులాసాగా, చనువుగా మెసిలేది.
    ఆరోజు ఆదివారం.
    `తీరుబడిగా పడక కుర్చీలో పడుకుని నా అసమర్ధతను , పిరికితనాన్ని విమర్శించుకోడం ప్రారంభించాను. ఆత్మవిమర్శ న మంచి దన్నాడు వో జ్ఞాని. నా మనోగతాన్ని తెలియజేయలేక పోవడం వల్ల జరిగిన అనర్ధాన్ని వూహించుకుంటున్నాను. ఇంతలో గాజుల శబ్దం చేసుకుంటూ సింహాచలం వచ్చింది. ఆమె పచ్చ చీర కట్టింది. ఎరుపు మీద తెల్లటి మచ్చలున్న రవిక తొడిగింది. తలలో రెండు ముద్దా మందార పువ్వులు పెట్టుకుంది. చెవులకు కొత్తగా జూకీలు పెట్టుకుంది. తలంటి పోసుకుందేమో జుట్టు స్వేచ్చగా ముఖం మీద పడుతోంది. అది చీర కట్టడం అదే మొదటిసారి అనుకుంటాను. "ఏమిటి విశేషం" అన్నాను మనస్సుని అదుపులో కి తెచ్చుకుంటూ.
    "ఈవేళ నే పుట్టా" అంది పట్టి పట్టి.
    "వొహ్! వెరీ గుడ్! నీ పుట్టిన రోజుకి మరి నాకేం పిండి వంటలు పట్రాలేదేం" అన్నాను. సింహాచలం ముచ్చటగా నవ్వి "మా యింట్లో చేసినవి మీలాటో.....మీలాంటి వాళ్ళు తింటారే.....తింటారేమిటి" అని తన భాషను సవరించుకుంటూ చెప్పింది.
    "నువ్వు పెడితే తిననా" అన్నాను. అంతే, సింహాచలం చంగున వెనక్కి పరుగెట్టు కెళ్ళి నాలుగు వేరుశనగ ఉండలు పట్టుకొచ్చింది. అవి నా టేబిలు మీద పెడుతూ "మిగతావన్నీ మీరు తినడానికి బాగో....బాగుండవు" అంది.
    "ఇల్లాతే ' అంటూ చే జాపాను. ఆ ఉండలు చేతిలో పెట్టింది. 'అయితే మనిద్దరికీ మంచికాఫీ పెట్టు. నే నింతలో స్నానం చేస్తాను" అన్నాను. సింహాచలం తలూపి వెళ్ళిపోయింది. నేను ఆ వుండలు తిని చెంబుడు మంచినీళ్ళు త్రాగి వీధి తలుపు వేసి స్నానానికి వెళ్ళిపోయాను.
    స్నానం చేసి బట్టలు మర్చుకునేసరికి సింహాచలం కాఫీ పట్టుకు వచ్చి "కాప్జీ రెడీ' అంటూ టేబుల్ మీద పెట్టింది. కుర్చీలో కూర్చుని కాఫీ త్రాగాను. ఇంతలో వో వూహ తట్టింది. లేచి అలమారాలో ఉన్న కెమెరాను తీశాను. స్పులులో కొంతభాగం దైవికంగా మిగిలి ఉంది. ఇంతలో సింహాచలం పని పూర్తీ చేసుకుని, వో గడ్డి పరక నోట్లో పెట్టుకుని వచ్చింది. వస్తూనే "అదేటి బాబూ ఆ డబ్బా ఏవిటి" అంది. అంతలో దీన్ని గుర్తుపట్టి , "ఫోటో డబ్బా కదూ" అంది.
    "అవును' అన్నాను.
    "నాకోటి తీరా" అంది.
    'అయితే సరిగా నుంచో. లే.... ఆ గడ్డిపరక నోట్లోంచి తీసి పారెయ్. సరిగా నిలబడు" అన్నాను. సింహాచలం ఫక్కున నవ్వుతూ , "ఏం? యిదుంటే బొమ్మ రాదా.... నే నిది ఉంటేనే నించుంటా: అంది గడ్డి పరక తిరిగి నోట్లోనే పెట్టుకుంటూ. "సరేలే, అలానే నుంచో" అంటూ మూడు ఫోటోలు తీశాను. కెమెరా దాచబోతుంటే , "ఏదీ నా బొమ్మ" అంది.
    "ఇందులో ఉంది." అన్నాను.
    "ఏదీ చూపెట్టండి" అంది దగ్గరకు వస్తూ.
    "లోపలుంటుంది " అన్నాను.
    "ఏదేది?" అంది ఆత్రంతో. నేను తటాలున కెమెరా ఉన్న చేతిని వెనక్కు పెట్టేసుకున్నాను. ఆ వూపులో సింహాచలం నా మీద పడిపోయింది. నా శరీరం జివ్వుమంది.
    ఆపాదమస్తకం విద్యుత్తూ ప్రవహించింది. నేను నిగ్రహం కోల్పోయాను.
    కెమెరా మంచం మీద పడిపోయింది.
    ఆమె పెనుగులాడింది.
    నాలో చైతన్యం కలిగేసరికి సింహాచలం రుద్రకాళి అయింది. పెనుగులాడి దూరంగా తొలగిపోయింది.
    నా స్థితి అర్ధమయ్యింది.
    సింహాచలం కేసి చూశాను. ముఖం మీద పడ్డ జుట్టు సరిచేసుకుని, విడిపోయిన కొప్పు తిరిగి చుట్టుకుంది. "అయ్! వంటరిగా ఆడదాని మీదడతావా! మా జాతోళ్ళతో సెప్పి నీతో లోలిపిస్తా కీలుకీ లూడదీయిస్తా" అంది ఆయాసంతో.
    నా గుండె లవిసి పోయాయి.
    సింహాచలం శపథం చేసి వెళ్ళిపోయింది. భయంతో నా ప్రాణం గిలగిల్లాడి పోయింది. శరీరం నీరు కారిపోయింది. కాళ్ళు, వళ్ళూ వణకడం ప్రారంభించాయి. మంచం మీద కూలబడ్డాను.
    తిరిగి లేచి తలుపు గడియ వేసి, మళ్ళీ మంచం మీద కూర్చున్నాను. సింహాచలం వాళ్ళ జాతి వాళ్ళకు చెప్తే!
    వాళ్ళు నా ఎముకలు ఎరేస్తారు.
    ఆ వూహతోనే నా ప్రాణం పోయినట్లని పించింది. నా తొందర పాటుకు, నిగ్రహ శక్తి లేకపోడానికి అలాటి శిక్ష పడాల్సిందే అనిపించింది.
    నా మనస్సు ఎదురు తిరిగింది.
    ఎందుకు పడాల్సింది? నే నింతవరకూ ఎలాంటి చెడ్డపనీ చేయలేదు. మనస్సులో వెయ్యి వూహించుకుంటాను. ఆ మాట వస్తే ప్రతీ మనిషి మనస్సులో ఊహించుకుంటాడు. నేనూ అంతే- ఇది లోక న్యాయం. యవ్వనమే అలాటిది. కన్నెపడుచు కిలకిల్లాడుతూ మాట్లాడితే ఏ మగడయినా నాలా ప్రవర్తించాల్సిందే-- అవును-- తప్పు నాది కానే కాదు. అంతవరకు పరిస్థితి వస్తే ఎవడూ నిగ్రహించుకోలేదు.
    నాకు దైర్యం వచ్చింది.
    కానీ ధైర్యంతో అప్పుడు పనేమిటి? అవతల ఇంకో క్షణంలో సింహాచలం పెద్ద పటాలంతో వచ్చేస్తుంది. వాళ్ళు నా ఎముకలు విరగదీస్తారు. ఎలాగ యీ ఆపద నుంచీ బయట పడేది? మంచం మీంచి లేచి పెరటి తలుపు గడియ వేసి వచ్చి కుర్చీలో కూర్చున్నాను.
    కాలం ఎంతసేపు గడిచిందో.
    ఉన్నట్టుండి తలుపులు కటకటాలాడింది.
    నా శరీరం భయంతో భగ్గుమంది.
    శబ్దం మరింత ఎక్కువయ్యింది.
    యాంత్రికంగా కుర్చీలోంచి లేచాను. నెమ్మదిగా తలుపు తీసి, ఎదుట వచ్చిన వాడిని ముక్కు పగులగోడ్తెనో .....ఎంతమందినని కొట్టగలను? ఒక్కసారి నా శరీరం కేసి చూసుకున్నాను,. దేహబలం ఫరవాలేదు. ఇద్దర్నయితే చాలా సునాయాంగా పట్టేయ్యచ్చు. కానీ యిద్దరే వస్తారనేముంది? అసలు నాకేమీ తెలీదనీ, సింహాచలం అబద్దమాడుతోందనీ చెప్పి బుకాయిస్తేనో? -- అవును . అదీ మంచి ఉపాయమే. పైగా వూళ్ళో నాకు చాలా పలుకుబడి కూడా ఉంది.
    తలుపు మరోసారి కటకటలాడింది.
    మొండి దైర్యంతో తలుపు తీశాను.
    సింహాచలం తలొంచుకొని లోపలకు వచ్చి, తిన్నగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. దాని వెనకేవరూ లేరు. ఆశ్చర్యంతో బయటకు తొంగి చూశాను. ఎవ్వరూ లేరు.
    అయితే సింహాచలం వాళ్ళ జాతి వాళ్ళతో చెప్పలేదన్న మాట! నా శరీరం తెలికయినట్లయింది. ఎందుకైనా మంచిదని తలుపు గడియ వేసి, కుర్చీలో కూర్చున్నాను. సింహాచలం గిన్నెలు, తోమి, ఇల్లు వూడ్చి వెళ్ళిపోయింది. నేను తలుపు మళ్ళీ గడియ వేసి , మంచం మీద  వాలిపోయాను. అన్నం వండుకుని తినాలి. అసలు తినాలనే కోర్కె చచ్చిపోయింది. ప్రతిజ్ఞ చేసిన సింహాచలం  వాళ్ళ వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? అవే తేలని విషయం ఆలోచిస్తూ నిద్రాదేవత వడిలోకి జారిపడ్డాను. తలుపు బాదడం వల్ల మెలకువ వచ్చింది. భళ్ళున తెల్లారింది. లేచి వెళ్ళి తలుపు తీశాను.
    "ఇంకా నిద్రేనా" అంటూ సింహాచలం ప్రవేశించింది.
    నా నిద్ర-- నిద్రమత్తు వదిలిపోయింది. బుర్ర గోక్కుంటూ లోపలకు వెళ్ళిపోతున్న సింహాచలం కేసి ఆశ్చర్యంగా చూశాను. కాస్సేపటికి సింహాచలం వంటింట్లోంచి తిరిగొచ్చి 'గిన్నేల్లెవే? వంట వండుకోలేదా" అంది ఆశ్చర్యంతో.
    "లేదు ." అన్నాను వీధి తలుపు గడియ వేస్తూ.
    "ఏం?"
    "మీజాతి వాళ్ళతో చెప్పి కీళ్ళూడదీయిస్తానని బెదిరించి పోయావు గదా రాత్రి - వచ్చే దేలాగూ తప్పనప్పుడు వెధవ వంట, తింటి ఎందుకనీ వండుకోలేదు" అన్నాను. సింహాచలం చిన్నగా నవ్వింది.
    "ఏం ఎందుకు నవ్వుతావు" అన్నాను మంచం మీద కూర్చుంటూ. సింహాచలం మారు మాట్లాడకుండా చీపురు తీసుకుని, యిల్లూడవడం ప్రారంభించింది. వాళ్ళ జాతి వాళ్లతో ఎందుకు చెప్పలేదో అడగాలనిపించి, "మీ జాతి వాళ్లతో ఎందుకు చెప్పలేదు" అనడిగాను.
    ఇల్లూడుస్తున్న సింహాచలం అలాగే లేచి నిలబడకుండానే ఎడమ భుజం మీంచి నాకేసి చూసింది. అనక లేచి నిలబడి "చెపితే మిమ్మల్ని చంపైరూ" అంది. దాని ముఖంలో భయం స్పష్టంగా కనుపించింది.
    "ముందు ఎందుకు చెప్తావని బెదిరించావు" అన్నాను.
    సింహాచలం చూపులు దించుకుని 'అప్పుడు ఆవేశం వచ్చింది. మీ యిల్లు దాటి బయటి కెళ్ళాక జాలేసింది. తీరా చెప్పాక, మళ్ళీ వద్దన్నా వాళ్లినరు. అందులో గూడెం రాముడికి తెలిసిందో, యిహ మనిషి నెత్తురు తాగుతాడు వాడు. మిమ్మల్ని చంపెస్తాడని భయం వేసింది" అంది.
    "చంపేస్తే నీకేం" అన్నాను.
    సింహాచలం నాకేసో అదోలా చూసి నవ్వు దాచుకుంది.
    "ఏమో నాకు తెల్దు" అంది.
    "అంటే".
    "సేప్పెద్దనుకున్నాను. సెప్పలే."
    "అయితే మరెప్పుడు కూడా సేప్పవా"
    సింహాచలం తల అడ్డంగా వూపింది.
    "నేను మళ్ళీ రాత్రిలా ప్రవర్తిస్తే" అన్నాను. ఆ ప్రశ్న వేశాక, ఎందుకు వేశానా అనిపించింది. సింహాచలం మాత్రం ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. సిగ్గు పడి, నవ్వుని మునిపళ్ళతో బిగపట్టి, తన పని ప్రారంభించింది.

                                *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS