Previous Page Next Page 
ముద్ద మందార పేజి 6

 

    ఆ వూళ్ళో అయితే బాగుండదని , ఆఫీసుకు సెలవు పెట్టి, విశాఖపట్టణం వెళ్ళి సింహాచలం ఫోటోలు కదిగించా. నే నూహించిన కన్నా అందంగా వచ్చాయి. ఫొటోలతో యింటికి వస్తుండటం పక్కింట్లోంచి చూసిన సింహాచలం నేను లోపలకు వెళ్ళే సరికల్లా నా వెనకాలే వచ్చి "ఫోటోలు తెచ్చారా" అనడుగుతూ వంటింట్లోకి వెళ్ళి స్టౌ ముట్టించింది.
    నేను వీధి తలుపు గడియ వేశాను.
    నాలో అణిగిమణిగి ఉన్న కోర్కె విజ్రుంభించింది. చేతిలోని సింహాచలం ఫోటో వైపు చూశాను. నోట్లో గడ్డి పరకతో కిలకిల నవ్వుతున్న ఆ అందం -- ఆ ఆయవసౌష్టవం -- నాకు పిచ్చెత్తినట్టయింది. ఇంతలో, "ఏవీ ఫోటోలు " అంటూ సింహాచలం వచ్చింది. "ఇవిగో" అన్నాను.
    "ఏవీ" అంటూ తడి చేతులు పైట కొంగుకు తుడుచుకుంటూ దగ్గరకు వచ్చింది. "చూపించను" అన్నాను.
    "లాక్కుంటా" అంది నవ్వుతూ.
    "లాక్కోచూస్తాను" అన్నాను ఫోటోలు గుండె కానించుకుంటూ.
    "చూపించండి" అంటూ యింకా, మీదకు వచ్చింది. వెంటనే ఆమెను నా హృదయానికి హత్తుకుని, రెండు చేతులతో ఆమెను బంధించాను.
    ఆమె వారించలేదు.

                             *    *    *    *
    మొదటిసారి చేసిన తప్పును తప్పు కాదని సమర్ధించుకుంటే అది అలవాటయేప్రమాద ముందని పెద్దలంటారు. నాపట్ల అది అక్షరాలా నిజమయ్యింది. వాళ వాళ్ళతో చెప్పి సింహాచలం నా చర్మాన్ని, వలిపించక పొడమే గాకుండా, నా వూహకు దోహద మిచ్చింది.
    సింహాచలం నా కోర్కెను తన కోర్కెగా చేసుకుంది.
    ఇలా కొన్ని నెలలు జరిగింది.
    గోపాలపురంలో నన్నెవరూ కించిత్ అయినా అనుమానించే వారు కాదు. నా స్థానిక గౌరవం కొన్ని రెట్లు అధికం గూడా అయ్యింది. చిన్నా పెద్దా, అడా మగా అంతా నాతొ చాలా చనువుగా మాట్లాడుతుండేవారు. స్కూలు ఫైనలు చదివే ఆడపిల్లలు కూడా నా దగ్గరకు వచ్చి పాఠాలు నేర్చుకునేవారు. ఇంట్లో వున్న సమయాల్లో యిల్లంతా పిల్లలతోనే కలకలాడేది.
    ఒకనాడు పొద్దున్నే సింహాచలం హడావుడిగా వచ్చింది. వస్తూనే "మీరీ  వూరు వదిలేట్టి పోవాల" అంది. చాలా ఆయాస పడుతూ. నేను ఆశ్చత్యంగా దానికేసి చూశాను. కళ్ళనిండా నీరు నిలిచి వుంది. "ఏం! నే వెళ్ళను" అన్నాను.
    "నా మాటినండి. మీ కాళ్ళకు మొక్కుతా" అంది.
    విషయం హాస్యానికి సంబంధించినది కాదనిపించింది.
    "నే నుత్త,మనిషిని కానట. మాయమ్మ కనిబెట్టింది. నిల్దీసడిగింది" అంది రొప్పుతూ.
    నేను వులిక్కిపడ్డాను.
    నా పాపం ఫలించింది.
    ఎవని మాట్లాడాలో తెలీలేదు. మళ్ళీ సింహాచలమే ప్రారంభించింది.
    "ఎవరో చెప్పమని నిల్దీసింది. నే చెప్పలేదు. కులపాళ్ళతో చెప్తానంది. ఇదంతా రేత్రి జరిగింది. సాయంత్రం పంచాయితీ పెట్టుందేమో. వాళ్ళేలాగయినా అరా తీస్తారు. తెలిసిందంటే మీ ప్రాణాలు నిలువునా దీస్తారు. నా మాటినండి వంటా వద్దు పాడూ వద్దు. ఉన్న పళంగా ఎల్లిపొండి" అంది.
    "తెలీనియ్. భయమెందుకు" అన్నా కుర్చీలో కూర్చుంటూ. ఆ మాట అనే ధైర్యం నాకు ఎన్నడ్నించి వచ్చిందో తెలీదు. సింహాచలం నాకేసి భయంగా చూసి, "చంపేస్తారు బాబోయ్" అంది గుండె బాదుకుంటూ.
    "చంపనీ. చస్తే నీకేం!" అన్నాను.
    ఆ మాటతో సింహాచలం వెక్కివెక్కి ఏడ్వడం ప్రారంభించింది. గమ్మున కుర్చీ లోంచి లేచి, సింహచలాన్ని నా బాహువుల్లోకి తీసుకుని, కన్నీళ్లు తుడుస్తూ "ఛీ ఏడవకు. ఉత్తినే అన్నాను" అన్నాను.
    "బాబూ, మీ రెల్లిపొండి. ఇయ్యాల కాపోతే రేపైనా మీ పేరు బయటికొస్తది. వాళ్ళూరు కోరు." అంది.
    "మరి నేవెళ్ళేక నిన్ను వాళ్ళు నిలిదీస్తే " అన్నాను.
    సింహాచలం కన్నీళ్ళల్లోంచి నాకేసి జాలిగా చూసి, "వుసురు పోయినా చెప్పేది లేదు." అంది.
    నా గుండెల్లోంచి బరువు దింపినట్లయ్యింది.
    "అది కాదు. నిన్ను పెళ్ళి చేసేసుకుంటా. అలాగయితే మీ వాళ్ళకి అభ్యంతరం ఏవుంటుంది!" అన్నాను కుర్చీలో కూర్చుంటూ. సింహాచలం ఆశ్చర్యంగా నాకేసి చూసి, "అంతమాటన్నారదే పది వేలు. మీ పక్కన్నుంచొడానికి కూడా పనికి రాను. మీకు సక్కగా ఇంగ్లీషు సదివినమ్మ రావాలి. మీ పంచన నాకు పని మనిషిగా చోటిస్తే చాలు బాబూ" అంది.
    "ఛీ. అదేం మాట" అన్నాను నేను.
    "అంతే బాబూ. నా మాటినండి. ఆ సిహాద్రప్పన్న మీదోట్టేసి సెప్తున్నా. నాకు కొడుకు పుడ్తాడు. ఆడు అచ్చం మీ పోలికే వుంటాడు. వాడిని మాత్రం మీరు పెంచి పెద్ద చేయాలి. డాక్టరీ చెప్పించాల. వాడు మీ కొడుకని చెప్పక పోయినా పరవాలేదు. కానీ వాడిని మీ రాదరించాలి. నా ప్రాణం పోయినా మీ పేరు బయట పెట్టను. సిహద్రప్పన్న పాదాల మీద ప్రమాణం సేసినట్టే కానీ, నాకు మీరోట్టేసి సెప్పాలి. నా కొడుకుని మీరే తీసుకోవాలి. వాడి కప్పన్ననే పెరేడుతా. మూడేళ్ళు వచ్చేక మీ కిస్తా...." సింహాచలం ఆయాసంతో చెప్పుపోతోంది.
    "కొడుకే పుడ్తాడని నీకేం తెలుసు" అన్నాను. అలాటి సమయంలో అలాటి చచ్చు ప్రశ్న వేసినందుకున సిగ్గేసింది. సింహాచలం రెండు చేతులూ గుండె మీదేసుకుని "నాకు కలొచ్చింది. సిహద్రప్పన్న తన పెరేట్టాలని చెప్పాడు. నాకు తెల్సు మగపిల్లాడే నాకు. కొడుకే.... మీ పోలికలతో వుంటాడు. వో ఏడాది పోయాక యీ వూర్రండి. అబ్బాయిని చూడండి. పెళ్ళి చేసుకుని మరీ రండి. నా మాటివండి. మీకు మొక్కుతా" అంటూ సింహాచలం ఆయాసంతో ఆగింది.
    నాకు జాలి వేసింది. "ఏవిటి! పిచ్చి పట్టిందా నీకు! అంత భయం దేనికి! మీ వాళ్ళు నన్ను ఏమీ అనరు. నాకు అమ్మ లేదు. మా నాన్న నా మాట కాదనరు. నిన్ను పెళ్ళి చేసుకుంటాను. భయపడకు! అంటూ సింహచలాన్ని నా గుండెకు హత్తుకున్నాను. ఆమె వెంటనే విడిపోయి, "ఛీ అది వద్దు. ఆఫీసుల కెళ్ళేవారు. మీకు మంచి దొరలాటమ్మ రావాలి. ఏడాదిలో పెళ్ళి చేసుకుని పిల్లాణ్ణి ఎత్తుకుని నా కొడుకును చూడానికి రావాలి." అంది.
    "పోనీ అలాగేలే" అన్నానేవనాలో తెలీక.
    సింహాచలం మౌనంగా కన్నీరు తుడుచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ కుర్చీలో కూలబడ్డాను. సింహాచలాన్ని వివాహం చేసుకుంటానని ఆవేశంలో అన్నానే గాని, నిజంగా నేను చేగాలిగిన పనా అది! నాకా మాత్రం ధైర్యమే వుంటేనా జీవితం యిలాటి మలుపు తిరిగేదా! నా మీద నాకే అసహ్యం వేసింది.
    సింహాచలం పని వూర్తి చేసుకుని నా దగ్గరకు వచ్చి, నేల మీద కూర్చుని "మదే ణం- మధ్యాహ్నం లోగా వెళ్ళిపొండి. సాయంత్రం మాయమ్మ పంచాయితీ పెట్టె లావుంది. కానీ, వో సంవత్సరం అయ్యేసరికి మీరు పెళ్ళి చేసుకుని, అమ్మగారితో యీ వూరోచ్చి , నా కొడుకును చూడాలి. నాలుగేళ్ళు వెళ్ళి ఐదో ఏడో చ్చాక మీకిచ్చేస్తా. వద్దంటే యీ యిస్కూల్లోనే వున్న సదువుచేప్పిస్తాను. ఇంగ్లీషు చదువులకు మీరు పట్నం తీసుకు వెళ్ళాలి. నా బుర్ర మీద చై వేసి ప్రమాణం చెయ్యండి. నా కొడుక్కి అన్యాయం చేయనని ప్రమాణం చెయ్యండి. ఆ సిహద్రప్పన్న మీదోట్టేసి చెప్పండి. నా పీకలో ప్రాణం పోయినా మీ పేరు బయట్టేను." అంది. నా రక్తం వేడేక్కింది. యాంత్రికంగా సింహాచలం నెత్తిమీద చెవేసి , "నువ్వు చెప్పినట్లే చేస్తాను. మధ్యాహ్నం లోగా యీ వూరువదిలి వెళ్ళి పోతాను. ఏడాది లోగా పెళ్ళి చేసుకుని వస్తాను. ఆ పైన నువ్వు ఎలా చైమంటే అలాగే చేస్తాను. సరేనా' అన్నాను. సింహాచలం దీర్ఘంగా నిట్టూర్చి , కన్నీళ్లు తుడ్చుకుని, లేచి నిలబడుతూ, "హమ్మయ్య, నాకిప్పుడానందంగా వుంది. కొండంత బలంతో బతుకుతా" అంది. నేను ఆఖరి సారిగా సింహచలాన్ని నా హృదయానికి  హత్తుకున్నాను. ఆమె నన్ను పెనవేసుకు పోయింది.
    పెట్టెలోంచి వంద రూపాయలు, పది పదులు లెక్కపెట్టి, సింహాచలా]ని కిచ్చి "ఈ డబ్బు దాచుకో. మళ్ళీ కొంత పంపిస్తా." అన్నాను. ఆ డబ్బులు చూసి సింహాచలం పామును చూసి బెదిరినట్లు బెదిరింది. "ఛీ డబ్బెందుకు నాకు" అంది చీత్కారం చేస్తూ.
    "నీకు కాదు. మన బాబుకి. దాచు" అన్నాను. సింహాచలం నాకేసి  దీనంగా చూసి, "యీ వందతోనే నా చర వదిలించుకుందామనుకుంటున్నారా." అంది. కొరడా దేబ్బలాగ తగిలిందా మాట నాకు. "ఛీ ఛీ అవెం మాటలు? సింహాద్రి అప్పన్నసాక్షిగా నువ్వు చెప్పినట్లే చేస్తాను. నన్ను నమ్ము" అంటూ డబ్బు ఆమె చేతిలో పెట్టాను. ఆమె డబ్బు కేసి చూస్తూ "ఈ డబ్బు ఎలాగైనా మాయమ్మ కంట పడకమానదు. దీంతో మరింత గల్లంతవుతుంది. నా మాటినండి. ఈ డబ్బుతోనే పిల్లాడిని పెంచగలనా? మళ్ళీ మీరు ఎలా పంపుతారు? ఇయన్నీ అయ్యేది కాదు. నారేక్కలో శక్తి వుంది. పనిచేసి మరీ నా పిల్లాడిని పెంచుతాను." అంది.
    "మరి.... మరి నువ్వు పెళ్ళి చేస్కోవా" అన్నాను. తీరా అనేశాక అలాటి ప్రశ్న వేసినందుకు బాధపడ్డాను. సింహాచలం కళ్ళ వెంట నీరు ధారగా కారింది. "నన్ను హేళన చేస్తున్నావా బాబూ. ఇక నాకు పెల్లెవిటి? అరిటి చెట్లు నాకు దైవం. కుక్క ముట్టుకున్న కుండకు మద్డుండదని గుళ్ళో శాస్త్రులు గారు చెప్పారు. నా బతుకింతే-- ఇక నేనిలా పోవాల్సిందే. నా బాబు కోసం బతకాల్సిందే -- మీ పంచన కూడా వుణిమ్మని కోరను. కానీ, నా బాబుని పెంచి పెద్దాడ్ని చేయాలి. చాలా పెద్దాడ్ని చేయాలి." అంది వెక్కివెక్కి ఏడుస్తూ. నేను సింహాచలం కన్నీళ్లు తుడిచి , "నువ్వెలా చైమంటే అలాగే చేస్తాను. ధైర్యంగా వుండు" అన్నాను. సింహాచలం వేదాంతిలా నవ్వింది. "నాకు ధైర్యమే బాబూ. మీరు నా బిడ్డని మోసం చైరు. నాకు తెలుసు -- ఇక నేనేల్తా. మద్దిణానికి మీరెళ్ళిపొండి. పైయ్యేడు అమ్మగారితో రావాలి. అన్నట్లు ఇదిగో మందార పువ్వు . నన్ను గుర్తెట్టు కొకపోయినా , యీ పువ్వును గుర్తెట్టుకొండి" అంటూ తలొంచి మందార పువ్వు తీసి, నా చేతిలో పెట్టి నాకేసి ఆఖరిసారి చూసి వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS