మేటేడు బట్టలు కుట్టించారు. "జీతం చాలకపోతే నాకు రాయి" అన్నాడు. 'అలాగే నండి' అన్నాను. మర్నాడే నా ప్రయాణం. ఆ రోజంతా వ్యాపార విషయాలు నాతొ చర్చించారు. భోజనం అయ్యాక నా గదిలోకి వెళ్ళాను. గోడ మీద అమ్మ పటం వెళ్ళాడుతోంది. ఆమె గనుక బ్రతికి ఉంటె నాకు ఎంత సహాయం చేసునో..... నిజంగా తల్లి లేని లోటు తీర్చలేనిది.. ఆ బాధ మరొక "తల్లి లేనివాడే" అర్ధం చేసుకోగలడు.
రాత్రంతా పక్క మీద యమయాతన పడ్డాను. ప్రేమ కలలోకి వచ్చి "మీ నాన్న గారితో చెప్పి నన్ను వివాహం చేసుకోరా" అని జాలిగా అడిగినట్లయింది.
భళ్ళున తెల్లారింది.
నా అసమర్ధతకు సూర్యుడు ఫక్కుమని నవ్వాడు. బయల్దేరేముందు నాన్నగారు నాకో వంద రూపాయలు ఇచ్చి "డబ్బు విచ్చలవిడిగా దగ్గర ఉంటె మనస్సు పట్టు తప్పుతుందంటారు. జాగ్రత్త! ఎట్టి పరిస్థితిలో కూడా అప్పు చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తూ ఉండు" అన్నారు. నేను తలూపి వూర్కున్నాను.
చిరునామాదారుని కనుక్కోలేని ఉత్తరం లాగ వెనక్కు తిరిగి, గోపాల్ పూర్ చేరాను. పచ్చడి బండ పెట్టి బుర్ర పగలుకొట్టుకుందా మనిపించింది. అంత మంచి తండ్రి కూడా ఉండి నా కోర్కె బయటపెట్టలేక పోయాను. నే నేనందుకు పనికి వస్తాను? నిజంగా ధైర్యం ఉండి నాన్నగారి నడిగితే అయన వద్దనరు. కాని అడిగేదే ఎలా? నేను అడగలేను. చెప్పలేను. ఇలాంటివి రాయబారాల వల్ల జరుగుతాయంటారు. కానీ నాన్నగారితో బాగా చనువున్నవాళ్ళు ఎవరు? వాళ్ళతో నాకూ చనువుండాలి.
అలాంటి వాళ్ళెవరూ నాకూ లేరు.
ప్రేమని తలుచుకుంటూ వో వారం గడిపాను.
వారం తిరిగిన కాలం వోరోజు పొద్దున్న దగ్గర మేటేసుకుపోయింది. ఆరోజు పనిమనిషి రాలేదు. నాకు చిర్రెత్తింది. ఛీ, వెధవ జీవితం . -- అసలే వంట వండుకొని చావాలి . పైగా యీ ఇంట్లో గొడవ!! నన్ను, నా జీవితాన్ని దుమ్మెత్తి పోసుకుంటూ తప్పేది లేదు గనుక గిన్నెలు ముందేసుకుని , వో గోన్నేకు వోపిక కొద్దీ చింతపండు పట్టించాను. ఇంతలో నా వెనుక గాజులు శబ్దం అయ్యింది. వెనక్కి తిరిగి చూశాను.
"మీరేసేస్కుంటున్నారేటి? లేగుండి" అందో నల్లని, చక్కని చుక్క. వో క్షణం అలానే ఉండి, అనక లేచి నిలబడి, చింతపండు పారేస్తూ "ఎవరు నువ్వు" అన్నాను. ఆమె కిలకిల నవ్వింది. కారణం తెలియలేదు.
"వరాలమ్మ మా పిన్నమ్మ" అంది.
ఆమె అంట్ల ముందు కూర్చుంది. నేను చేతులు కడుక్కుని గడప నానుకుని నిలబడ్డాను. ఆమె అంట్లు తోముతూనే ఉంది. నల్లగా మిలమిలా మెరుస్తోందామె. చకచకా తోముతున్నందువల్ల ఆమె శరీరం లయబద్దంగా కదులుతోంది. తలలో వో మందార పువ్వు పెట్టుకుంది. తాళ యుక్తంగా కదులుతున్న ఆమె నడుము చూసేసరికి నాలో వింత కోర్కెలు పుట్టాయి. చక్కని అందం, అవయవ సౌష్టవం అన్నిటినీ మించిన యవ్వనం -- ఏమిటి? ఇదేం తెగులు నాకు? అనుకున్నాను. 'వయస్సు' అంది నా మనస్సు.
ఆమె అంట్లన్నీ తోమి, వంటింట్లో బోర్లించి, ఇల్లు చకచక తుడిచింది. నేను మంత్ర,ముగ్దుడిలా ఆమె వెంట వెంట తిరిగాను. చీపురు యధాస్థానంలో పెట్టి, ముఖం మీద పడిన ముంగుర్లు వెనక్కు తోసుకుంటూ, "మా పిన్నమ్మ కి వంట్లో బాగుండలేదు. ఇహ నుంచి నేనే వోత్తా" అంది. నేను కదలబారెను.
"మళ్ళీ ఎప్పుడోస్తావ్" అన్నాను.
"సందేళ" అందామె. చకచకా పనంతా చైడం వల్ల కాబోలు ఆయాస పడుతోంది. నేను నా దృష్టి ని అతి కష్టం మీద మరల్చుకున్నాను. ఆమె పైట చెంగు సరిచేసుకుని, కొంగు బొడ్లోదోపుకుంటూ, "నే నేల్లోత్తా " అంది.
"మాట" అన్నాను.
వెనక్కొచ్చి "ఏటి" అంది, "మీ పిన్నమ్మకి వంట్లో బాగులేదా' అన్నాను. తీరా పిలిచాక ఏమని మాట్లాడాలో బోధపడక.
"అవును బాబూ" అంది.
'ఆహా . నీపెరేమిటి?" అన్నాను.
"సిహసెలం" అంది తల్లోంచి కింద పడ్డ మందార పువ్వు తీసి, తిరిగి తలలో పెట్టుకుంటూ. నేనామె కేసి మరోసారి చూసి, "సరేలే వెళ్ళు. సాయంత్రం ఆరు దాటాక రా" అన్నాను. సింహాచలం వెళ్ళిపోంగానే పెట్టె తీసి, ప్రేమకు తీసిన ఫోటో చేత్తో పట్టుకుని కుర్చీలో కూర్చున్నాను. ఫోటోలో ప్రేమ- నన్ను మర్చిపోయావా అని దీనంగా నా వంక చూసినట్టు అనిపించింది. పనిమనిషిని చూసి అంత చలించి పొతే ఎలా? అని ప్రశ్నించినట్లనిపించింది. నాకి సిగ్గేసింది. ఏవిటో వెధవ వయస్సు -- మనం వెనక్కు లాగుదామనుకుంటే అది రెట్టింపు శక్తితో ముందుకు లాగుతుంది. ప్రేమను ప్రేమించినట్లు నాన్నగారికి ఉత్తరం రాస్తేనో-- అవును అది మంచి వూహ. అనుకున్నాను. వెంటనే రాయడం ప్రారంభించాను , కాని ఎలా రాయాలో కుదరలేదు. చాలా కాగితాలు పాడయ్యాయి. చాలా రోజులు ఆలోచించినా రాసే విధానం కుదరలేదు.
నేనో పనికిమాలిన వెధవను అని తిట్టుకున్నాను. మరో వారం తిరిగేసరికి వోనాడు రామనాధం గారు వచ్చి "మా మేనగోడలు పెళ్ళి. నీ శిష్యురాలేనయ్యా. వైజాగ్ లో యీ నెలఖర్నే..... తప్పక రావాలిస్మి." అని "వస్తా! చాలామందిని కల్సుకోవాలి' అనేసి వెళ్ళిపోయారు. భూమి బొంగరంలా తిరిగినట్లయ్యింది. కుర్చీలో కూర్చోబోయి క్రింద పడ్డాను. లేచి మంచం మీద కూర్చున్నాను. శుభలేక తీసి చూశాను. వరుడు మోహన్ - మోహన్-- నా స్నేహితుడు -- చదువుకునే రోజులో పైకి పెళ్లి వద్దు బాబోయ్ అని గోల పెట్టేవాడు.
ప్రేమలాంటి అందమైన పిల్ల కనుపిస్తే వద్దనేవాడెవడు? మోహన్ చాలా అదృష్ట వంతుడు.
ఆ రాత్రి నేను భోజనమే చెయ్యలేదు.తెల్లారుతూనే పనికి వచ్చిన సింహాచలం తోమాల్సిన గిన్నెలు లేకపోవడం వల్ల ఆశ్చర్య పోయి "రేత్రి వంట వండుకోలేదేటి" అంది. "లేదు" అన్నాను.
"ఏం? వొంట్లో బాగుండ్లెదేటి" అంది.
"అవును-- కాదు-- ఆకలిగా లేదు."
సింహాచలం ఫక్కుమంది. "పరాగ్గా ఉన్నారు. డాక్టరు దగ్గర కేల్లండి" అంది మరోసారి నవ్వుతూ. నా చూపులు సింహాచలం మీదికి వెళ్ళాయి. నా కంటికి సింహాచలం వనలక్ష్మీ లా కనుపించింది. ఎర్ర పరికిణీ, నల్లవోణి , తెల్లటి రవిక -- తలలో గన్నేరు పువ్వులు , చేతులకు నీలం గాజులు....
"సింహాచలం మాట" అన్నాను.
"ఏటి బాబూ' అంది.
"ఏటి బాబూ అనకు. ఏటీ లేదు పూటే లేదు. ఏమిటీ అనలేవూ.... కాస్త కాఫీ కాచి ఇవ్వగలవా-- తలనొప్పిగా ఉంది కానీ" అన్నాను.
"వో యస్సుగా" అంది . చీపురు గోడ కానించి , వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేనుస్సురుమన్నాను. టేబులు మీది శుభలేక మళ్ళీ చూశాను.
సింహాచలం చక్కని కాఫీ తెచ్చిచ్చింది. నాకో గ్లాసుడు యిచ్చి తనో గ్లాసున్నర తాగి "కాఫీ శానా బాగు....
"శానా అనకూడదు చాలా అను" అన్నాను.
"నాకు తెల్దు బా.....
"తెల్దు కాదు. తెలీదు అనాలి."
సింహాచలం విరగబడి నవ్వుతూ, "నాకు సదువు సేపారేటి" అంది. అని మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఉస్సురు మంటూ కుర్చీలో కూలబడ్డాను.
