Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 4

 

    "అయితే ఇంక ప్రాక్టీస్ చేయదలుచుకోలేదా?"
    "ఊహూఁ."
    "నీకు ప్రాక్టీస్ చెయ్యాలని లేకపోతే మానెయ్యవచ్చుగాని, ఇంతకంటే మంచి ఉద్యోగమే దొరకలేదా నీకు?"
    "ఏం? దీనికేం వచ్చింది? నాకు ఇక్కడ బాగానే ఉంది."
    "మీ అమ్మగారికి నువ్విక్కడున్నట్లు రాశావా?"
    "లేదు."
    "ఎందుకని?"
    "ఊరికనే. ఒకటి రెండు రోజుల్లో రాస్తాను."
    "నీ వ్యక్తిగత విషయాలలో జోక్యం కలిగించుకోవడం తప్పేగాని....మీ అమ్మగారికి నువ్వు ఇక్కడ ఉన్నట్లు తెలుసు." సూటిగా చూచాడు.
    "నువ్వు రాశావా?"
    "లేదు. ఈమధ్య గుంటూరు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు చూడటానికి వెళ్ళాను."
    ".........................."
    "అయామ్ సారీ. చెప్పక తప్పలేదు. చూడటానికి వెళ్ళినప్పుడు ఆవిడ నిన్నుగురించి విపరీతంగా ఆందోళన కనపరిచారు. ఆవిడ బాధ చూచాక చెప్పకుండా ఉండటం కుదరలేదు."
    "అసలు నువ్వక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏం వచ్చింది?" అన్నారు విసుగ్గా.
    "ఆ ఊరు వెళ్ళాను. రెండేళ్ళుగా మీ ఇంట్లో ఉండి, ఆవిడ చేతి భోజనం చేసి, కనీసం మొహం చూపించి యోగక్షేమాలు కనుక్కోకుండా ఎలా రాగలను చెప్పు?"
    "అమ్మ ఎలా ఉంది?" అన్నాడు కొంచెంసేపయ్యాక. కోపంతాలూకు తీవ్రత తగ్గింది గొంతుకలో.
    "బాగానే ఉంది. ఎన్నాళ్ళిలా? కనీసం ఆవిడకైనా తెలియపరచకూడదూ!"
    "ఏమో...ఎన్నాళ్ళో నాకు తెలిస్తే కదా? ఎందుకో ఆ ఊరు వెళ్ళాలని లేదు, కొన్నాళ్ళదాకా. ఇక్కడ ఉన్నానని నేనే రాద్దామనుకున్నాను. నువ్వు చెప్పి వచ్చావు. ఇంక ఆ అవసరంకూడా లేదు."
    "అదేమిటి? నువ్వు రాయి. నన్నడిగితే ఒక్కసారి వెళ్ళి చూచి రమ్మంటాను."
    "అబ్బ. ఇంక ఆ సంగతి వదిలెయ్యి" అన్నాడు విసుగ్గా.
    "....."
    "ఇంతకీ నువ్వు గుంటూరు వెళ్ళవలసిన పనేమిటి?" అడిగాడు మాట మార్చాలని ప్రయత్నిస్తూ.
    "పెళ్ళిచూపులు."
    "ఓ.....నిశ్చయమయిందా?"
    "....."
    "ఏం? అమ్మాయి నచ్చలేదా?"
    "అమ్మాయి కాదు. కట్నం."
    "కట్నం చాల్లేదా?"
    "చాలక కాదు." నసిగాడు.
    "అదేమిటి?" నవ్వాడు.
    కట్నం తీసుకుని పెళ్ళి చేసుకోదలుచుకోలేదు."
    "అమ్మాయి నచ్చినప్పుడు కట్నం అక్కర్లేదని చెప్పలేకపోయావా?"
    "అబ్బే. అదేం కుదిరేరకంగా లేదులే. కట్నం ఇవ్వకుండా పిల్లనివ్వడం ఆయనకు పరువు తక్కువట. తీసుకోకుండా చేసుకోవడం మా నాన్నకు పరువు తక్కువట. తీసుకొని చేసుకోవడం నా ఆదర్శానికి పరువు తక్కువ. అందుకని అందరి పరువులు పోకుండా ఉండే అవకాశంకోసం పెళ్ళి ఇంకో సంవంత్సరం వాయిదా వేశాం" అన్నాడు నవ్వుతూ.
    "ఆదర్శమన్నమాట!" నవ్వాడు. నవ్వుతూన్న శ్రీనివాస్ ఏదో గుర్తుక వచ్చినవాడిలా పక్కున నవ్వాడు.
    "ఏమిటంత నవ్వుతున్నావు? నా పెళ్ళి సంగతికేనా?"
    "నిన్నుగురించి కాదు. మా క్లాస్ మేట్ ఒకడుండేవాడులే. వాడికీ నీలాగే కట్నం తీసుకోకూడదని ఉన్నట్లుండి ఓ అర్ధరాత్రి ఆదర్శం పేరుతో ఆవేశం ఆవరించింది. కాలేజీలో ఉన్నన్నాళ్ళు కట్నం మీద ఉపన్యాసాలు అంతులేకుండా దంచేవాడు. చివరికి చదువు పూర్తయి పెళ్ళి సమయం వచ్చేసరికి ఆదర్శాలు, ఆవేశం కొంచం చల్లారింది. పోనీ, కట్నం తీసుకుందామంటే బొత్తిగా స్నేహితులు వెక్కి రిస్తారని భయం. దానికితోడు, వాళ్ళ నాన్న 'నీ చదువుకు ఇంత ఖర్చుపెట్టా. ఇప్పుడు కట్నం తీసుకోకపోవడమేమి' టని గొడవ. మొత్తానికి ఆంద్రరాష్ట్ర మంతా వెతికి ఓ పిల్లను ఏరుకున్నాడు. క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసా? కాబోయే మామగారికి కావలసినంత ఆస్తి ఉందిట. ఒక్కతే కూతురు. ఇప్పుడు కట్నం పుచ్చుకోకపోయినా, ఆస్తి అంతా తనకే అని ఠకీమని ఒప్పుకున్నాడుట. పాపం, వీడి పెళ్ళయిన సంవత్సరానికి వాళ్ళ మామగారికి లేకలేక కొడుకు పుట్టాడుట. వాళ్ళం దరూ లేకలేక కలిగిన కొడుకును చూచి సంతోషిస్తూ ఉంటే, పాపం, వీడి అవస్థ చూడాలి!" అన్నాడు నవ్వుతూ.
    "కొంపతీసి....నన్ను అంతే ననుకునేవు!" అన్నాడు అతనితోపాటు నవ్వుతూ రామకృష్ణ.
    "నిన్నుగురించి కాదులే!"
    ఆ రాత్రి స్నానంచేసి వచ్చి మంచంమీద వాలాడు శ్రీనివాస్, పక్కనే ఉన్న పుస్తకం తిరగవేస్తూ. టేబిల్ ఫాన్ గాలికి పుస్తకంలో కాగితాలు నిలవకుండా ఎగురుతున్నాయి. దాన్ని పక్కకి పడేసి వెలకితలా పడుకుని తదేకంగా సీలింగ్ వంక చూస్తూన్న అతని దృష్టి అటూ, ఇటూ తిరిగి చివరికి గోడమీద ఉన్న కాలెండర్ మీదికి మళ్ళింది. చిన్న పసిపాప బొమ్మ. బట్టలు లేకుండా, నేలమీద వెల్లకిలా పడుకుని, కాలి బొటనవేలు ఓ చేత్తో పట్టుకున్నాడు. రెండోచెయ్యి ఆ కాలుకోసం పోట్లాటకు బయలుదేరుతున్నట్లుగా అందుకోబోతూంది. ఈ వింత అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాయి బుగ్గలతో పూడుకుపోయిన కళ్ళు. కళ్ళతోపాటు ఆశ్చర్యాన్నీ, చిరునవ్వునూ చిందిస్తూంది, కానికాసులో మధ్య చిల్లులా ఉన్న బుల్లినోరు. లైట్లు వేసి తీసిన ఫోటో కాబోలు చురకుగా చూస్తూన్న కళ్ళలో రెండు చిన్నచుక్కలు. రావి ఆకుమీద గోపాలకృష్ణుడులా ఉన్నాడు. చిన్నారికళ్ళలో తొంగిచూచే ముగ్ధత్వం చూస్తూ ఉంటే చటుక్కున అనూరాధ గుర్తుకు వచ్చింది. పసితనం తొంగిచూచే కళ్ళు. లేత తమలపాకుల్లాంటి చెంపలు. ఆమె రూపం కళ్ళముందు మెదిలింది. అతని ఆలోచనలు దారితప్పి రకరకాల మార్గాలలో విహరించి, చివరకు ఆమెమీద నిలిచిపోయాయి. వాళ్ళింటికి వెళ్ళి చాలారోజు లయింది అనుకున్నాడు.

                                   7

    మరునాడు సాయంత్రం రాజశేఖరం గారి ఇంటికి వెళ్ళేసరికి సన్నగా రేడియో లోనుంచి సంగీతం వినిపిస్తూంది. ముందున్న చిన్న దొడ్లో గులాబి చెట్లకు మట్టి తీస్తూంది అనూరాధ. గేటు చప్పుడవగానే తలఎత్తి చూచి, "రండి....రండి" అంటూ ఆహ్వానించింది. చేతులకున్న మట్టి దులుపుకుంటూ లోపలికి దారితీసింది. డ్రాయింగ్ రూమ్ లో కూర్చుంటూ అటూ, ఇటూ చూచాడు.
    "ఇవాళ మా నాన్నగారు ఇంట్లో లేరు, మీతో చెస్ ఆడటానికి. నాతో ఆడతారా?" అడిగింది నవ్వుతూ.
    "తప్పకుండా."
    "మీరు అలా పైకి వెళ్ళి కూర్చోండి. నేను చేతులు కడుక్కుని వస్తాను" అంటూ లోపలికి నడిచింది. పైకి వెళ్ళి వరండాలో నుంచున్నాడు, బయట గెలలతో నిండిన కొబ్బరిచెట్లను చూస్తూ,
    "క్రితంసారి మా ఇంటికి వచ్చినప్పుడు అందరూ మిమ్మల్ని ఎక్కడో చూచినట్లుగా ఉందనడం మీకు ఆశ్చర్యం కలిగించి ఉండాలి" అంది వరండాలోకి వస్తూ అనూరాధ.
    నవ్వుతూ ఆమెవంక చూచాడు.
    "మీరు వెళ్ళాక ఆరాత్రి అంతా మేమా విషయమే ఆలోచిస్తూ కూర్చున్నాం."
    "ఇంతకీ ఎక్కడ చూచారో జ్ఞాపకం వచ్చిందా?"
    "మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. మీలాంటివారే ఇంకొకరిని. మా డాక్టర్ కృష్ణమూర్తి గారని....ఆయనకూ మీకూ చాలా పోలికలున్నాయి."
    "నిజం?"
    "నిజంగానే! మీకు, ఆయనకు ఎన్ని పోలికలున్నాయో! ఆశ్చర్యంవేస్తుంది. తండ్రీకొడుకులకుండే అంత పోలిక ఉంది మీ ఇద్దరికి ..... మీకు ఏమయినా బంధువులేమో!"    
    "ఏమో! నాకీ ఊళ్ళో బంధువులు ఉన్నట్లు ఎప్పుడు వినలేదు."
    "కాని మీ పోలికలే తమాషా. మనిషిని పోలిన మనుష్యులు ఎలా ఉంటారో!"
    నవ్వి ఊరుకున్నాడు. కొద్ది క్షణాల తరవాత "నేనంతా మా అమ్మపోలిక అంటారు. మీ డాక్టర్ గారిని చూడవలిసిందే! చిత్రంగా ఉంది."
    "ఆయన ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. మీరు కలుసుకుందురుగాని."
    "మీ నాన్నగారు ఇప్పట్లో రారా ఇవాళ?"
    "ఉహూఁ. ఏదో మీటింగ్ ఉందిట ఇవాళ. చెస్ ఆడదామా? నాకు నేర్పండి."
    "తీసుకురండి."
    లోపలికి వెళ్ళింది అనూరాధ.
    అటూ, ఇటూ చూచాడు శ్రీనివాస్. పక్కగా ఉన్న టేబిల్ మీద ఏదో పుస్తకం, న్యూస్ పేపర్లు కనిపించాయి. రెండు భాగాలుగా బోర్లించి ఉన్న పుస్తకం తీసి చూచాడు. కథల సంపుటి. 'ది ఫోర్స్ ఆఫ్ ది సర్కమ్ స్టెన్సెస్'. దగ్గిర తెరిచిఉంది. పేజీలు తిప్పుతూంటే అనూరాధ లోపలికి వచ్చింది, ఒక చేత్తో కాఫీ కప్పు, మరోచేత్తో చెస్ బోర్డు పట్టుకుని. "ఆ పుస్తకం మీరు చెప్పాక సెకండ్ హాండ్ బుక్ స్టోర్సు లో వెదికితే దొరికింది" అంది కాఫీ కప్పు చేతికి అందిస్తూ.
    "ఇప్పుడే తాగివచ్చానండీ!"
    "ఫరవాలేదు. కాఫీ ఇంకొకసారి తీసుకోవచ్చు."
    "మీరు?" అన్నాడు కప్పు అందుకుంటూ.
    "ఇప్పుడే తీసుకున్నాను" అని అతను ఇచ్చిన సమాధానమే తనూ ఇవ్వవలసి వచ్చినందుకు నవ్వుకుంది. అది గమనించి నవ్వుతూ ఉండిపోయాడు.
    "నచ్చాయా కథలు?" అడిగాడు కప్పు టేబిల్ మీద ఉంచుతూ.
    "ఊఁ" అంది నుదురు చిట్లిస్తూ. "కొన్ని చాలా బావున్నాయి. కొన్ని ఏమిటో..." నాన్చేసింది.
    "అదేం?"
    "కొన్ని నాకు తృప్తిగా లేవు."
    "మీకు తృప్తి కలిగించనివాటిలో ఇదొకటి అనుకుంటాను." తెరిచిఉన్న చోట చూపుతూ అన్నాడు.
    "అది తృప్తి కలిగించడం ఏమిటి? నా కసలు నచ్చలేదు."
    "నా కది చాలా స్వాభావికంగా ఉన్నట్లనిపించింది. మీకు అసలే నచ్చలేదంటే ఆశ్చర్యం వేస్తూంది."
    "నాకేమిటో మనోనిగ్రహం లేనివాళ్ళ మీద సానుభూతి లేదు. అందుకే ఆ కథ నచ్చలేదు."
    "మనోనిగ్రహం లేనివాళ్ళ మీద లేకపోయినా, పరిస్థితుల ప్రవాహంలో కొట్టుకుపోయేవాళ్ళమీద అయినా ఉండి ఉండాలే!"
    "పరిస్థితుల కనుగుణంగానో, లొంగిపోయో జీవించవలసివస్తే సానుభూతి కలుగుతుంది. అంతేగాని పరిస్థితుల ఒత్తిడికి పక్కదోవలు వెదుక్కుంటే? తోనో సంబంధం ఏర్పరచుకున్నాడంటే, దానికి విలువేముంది?"
    "మనిషి విలవ మనోనిగ్రహంతో వెలకట్టడం ఎప్పుడూ అర్ధంలేనిది. పరిస్థితుల, పరిసరాల ప్రభావం ఎప్పుడూ మనుష్యులమీద ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ భవిష్యత్తునుగూర్చి చెప్పలేము. ఒక బలహీనమయిన క్షణం చాలు మనిషిని పతనంచెయ్యడానికి. జీవితంలో చేరాలనుకునే లక్ష్యం నిర్ణయించుకోవచ్సుగాని, దాన్ని చేరడానికి మార్గాలుమాత్రం ఊహించలేము. ఏ మార్గాలలో ఎవరు నడవవలసివస్తుందో ఎవ్వరికి తెలియదు. సుడిగాలిలో తెరచాప ఎటు ఊగుతుందో, మనిషి జీవితమూ అంతే. ఆ కథలో ఒక అమ్మాయితో సంబంధం ఏర్పరచుకున్నాడంటే, కారణం పరిస్థితులే."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS